ఫ్లైబోర్డుతో గాల్లో ఎగురుతూ సముద్రాన్ని దాటేశాడు

  • 4 ఆగస్టు 2019
ఫ్లైబోర్డింగ్ Image copyright AFP

జెట్ పవర్డ్ ఫ్లైబోర్డుపై ఇంగ్లిష్ చానల్ దాటిన మొదటి వ్యక్తిగా ఫ్రెంచ్ ఆవిష్కర్త ఫ్రాంకీ జపటా రికార్డులకెక్కారు.

మాజీ జెట్-స్కీ చాంపియన్ అయిన జపటా తను తయారు చేసిన ఫ్లైబోర్డుపై స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.17 గంటలకు కాలిస్ సమీపంలోని శాన్‌గెట్టె నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. కాసేపటి తర్వాత డోవర్ వద్ద సెయింట్ మార్గరెట్ తీరంలో కిందకి దిగారు.

ఫ్లై బోర్డుకు అమర్చిన ఐదు టర్బైన్లు కిరోసిన్‌ ఇంధనంగా వాడుకుని పనిచేస్తాయి. జపటా ప్రయాణంలో ఇది గంటకు 190 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.

Image copyright AFP

అయితే, ఇంగ్లిష్ చానల్‌ను ఫ్లై బోర్డు ద్వారా దాటాలని జులై 25న జపటా చేసిన మొదటి ప్రయత్నం విఫలమైంది. సగం దూరం వెళ్లిన తర్వాత మళ్లీ ఇంధనం నింపుకోడానికి ఒక పడవపై దిగే ప్రయత్నం చేస్తుండగా ఆయన నీళ్లలో పడిపోయారు.

నీళ్లలో పడ్డ జపటాకు ఎలాంటి గాయం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎగిరిన కాసేపటికే నీళ్లలో పడిపోవడంతో జపటా బృందం నిరుత్సాహపడింది.

35.4 కిలోమీటర్ల ప్రయాణించడానికి చేసిన తాజా ప్రయత్నంలో ఇంధనం నింపుకోవడానికి పెద్ద పడవను ఉపయోగించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionగతంలో జెట్ పవర్ ఫ్లైబోర్డుపై ఎగురుతున్న ఫ్రాంకీ జపటా

చాలాసార్లు ప్రాక్టీస్ చేశారు

"మేమంతా ఇంతకు ముందు చాలాసార్లు సముద్రాలపై ప్రాక్టీస్ చేశాం" అని ప్రయోగం తర్వాత జపాటా సహచరులు చెప్పారు.

1909లో లూయిస్ బ్లెరియట్ గాల్లో మొదటి సారి ఇంగ్లిష్ చానల్‌ను దాటారు. ఆ తర్వాత సరిగ్గా 110 సంవత్సరాలకు జపటా తన ఫ్లైబోర్డుపై అదే సాహసం చేశారు.

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయాన్ని ఎంచుకుని మరీ ఫ్లైబోర్డ్‌పై ప్రయాణించిన జపటా తన లక్ష్యాన్ని చేరుకోగలిగారు.

చిన్ననాటి కల

ఆయన ఫ్లైబోర్డ్ విన్యాసాన్ని చూసేందుకు తీరంలో జనం భారీగా గుమిగూడారు.

"మేం కొత్తరకంగా ఎగిరే సాధనాన్ని సృష్టించాం. మేం రెక్కలు ఉపయోగించడం లేదు. మన శరీరమే ఆకాశంలో పక్షిలా ఎగురుతుంది. ఇది నా చిన్ననాటి కల" అని జపాటా మీడియాకు చెప్పారు.

గత నెలలో పారిస్‌లో జరిగిన బాస్టిల్ డే పరేడ్‌ మిలిటరీ ప్రదర్శనలో జపాటా తన ఫ్లైబోర్డుతో పాల్గొన్నారు. అది అప్పుడు అందరినీ ఆకట్టుకుంది.

జపాటా కనిపెట్టిన ఫ్లైబోర్డు స్కేట్‌బోర్డు సైజులో ఉంటుంది. దీనికి ఉన్న చిన్న ఐదు జెట్ ఇంజన్లు ఆయన వీపుకు ఉన్న బ్యాక్‌పాక్‌లోని కిరోసిన్‌తో పనిచేస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు