ఈ యువతి తన ముఖంపై 'పీరియడ్స్ బ్లడ్' ఎందుకు రాసుకుంటున్నారు

  • 26 జూలై 2019
Image copyright LAURA MOCELLIN TEIXEIRA

గమనిక: ఈ కథనంలోని కొన్ని ఫొటోలు కొందరికి ఇబ్బందిగా అనిపించొచ్చు

27 ఏళ్ల లారా టెక్సిరియా ప్రతి నెలా రుతుస్రావం సమయంలో వచ్చే రక్తాన్ని సేకరించి దానిని తన ముఖంపై పూసుకుంటారు.

ఆ తర్వాత మిగిలిన రక్తంలో నీళ్లు కలిపి తన మొక్కలకు పోస్తుంటారు.

'సీడింగ్ ద మూన్' అనే ఈ ఆచారం చాలా పురాతన అపోహలతో ప్రేరేపితమైంది. ఇందులో నెలసరి రక్తాన్ని ఫలదీకరణకు ప్రతీకగా చూస్తారు.

ఈ ఆచారాన్ని పాటించే మహిళలు తమ పీరియడ్ సమయంలో తమదైన శైలిలో జీవిస్తుంటారు.

"నేను నా మొక్కలకు ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఒక మంత్రం జపిస్తాను. దానికి 'నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు చాలా కృతజ్ఞురాలిని అనే అర్థం ఉంది" అని లారా బీబీసీతో చెప్పారు.

లారా తన నెలసరి రక్తాన్ని ముఖంపై, శరీరమంతా రాసుకున్నప్పుడు, కళ్లు మూసుకుని మనసులోనే దానికి ధన్యవాదాలు చెబుతారు. తన లోలోపల ఒక అద్భుత శక్తి సంచరిస్తున్న అనుభూతి పొందుతారు.

Image copyright RENATA CHEBEL PARA DANZAMEDICINA

శక్తినిచ్చే ఆచారం

ఈ ఆచారానికి మహిళల గర్భధారణతో సంబంధం ఉందని లారా భావిస్తున్నారు.

"సమాజంలో చాలా ఎక్కువ భేదభావాలు నెలసరికి సంబంధించనవే. సమాజం దీనిని అపవిత్రంగా భావిస్తుంది. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే మహిళలు తమ పిరియడ్స్ సమయంలో చాలా ఎక్కువ అవమానంగా ఫీలవుతారు" అంటారు లారా

2018లో 'వరల్డ్ సీడ్ యువర్ మూన్ డే' ఈవెంట్ ప్రారంభించిన బాడీ-సైకోథెరపిస్ట్, డాన్సర్, రచయిత్రి మొరేనా కార్డోసో "మహిళలకు 'సీడింగ్ ద మూన్' అనేది చాలా సరళమైన, మనసుకు శక్తినిచ్చే ఒక పద్ధతి" అని చెప్పారు.

గతేడాది ఈ ఈవెంట్ జరిగినప్పుడు వేలాది మంది తమ నెలసరి సమయంలో వచ్చిన రక్తాన్ని నీళ్లలో కలిపి చెట్లకు పోశారు.

Image copyright LAURA MOCELLIN TEIXEIRA

మహిళల ఆధ్యాత్మిక విధి

"నెలసరి సమయంలో వచ్చే రక్తం సిగ్గుపడాల్సిన విషయం కాదు, అది గౌరవానికి, మహిళా శక్తికి ప్రతీక అని చెప్పడమే మా కార్యక్రమం ఉద్దేశం" అని మొరేనా చెప్పారు.

"ఉత్తర అమెరికా(మెక్సికో సహా), పెరూలోని కొన్ని భూముల్లో పంటలు బాగా పండేందుకు నెలసరి సమయంలో వచ్చే రక్తాన్ని ఆ నేలపై పోశారు" అన్నారు.

బ్రెజిల్ యునిక్యాంప్ యూనివర్సిటీలో 20 ఏళ్ల నుంచీ ఈ అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి.

"మిగతా సమాజాల్లో పీరియడ్ సమయంలో వచ్చే రక్తం గురించి చాలా వ్యతిరేక వైఖరి ఉందని" పురాతత్వవేత్త డానియెలా టోనెలీ మనికా చెప్పారు.

Image copyright MEL MELISSA PARA DANZAMEDICINA

భారీ గర్భాశయం

నెలసరిలో చెడు రక్తం బయటికి వస్తుందని చాలామంది భావిస్తారు. దానిని కూడా మలమూత్రాల్లాగే చూస్తారు. ఆ రక్తం ఎవరికీ కనిపించకుండా ఉండాలంటారు.

1960లో స్త్రీవాద ఉద్యమాలు ఈ ఆలోచనలను మార్చాలని ప్రయత్నించాయి. మహిళలు తమ శరీరం గురించి బహిరంగంగా మాట్లాడుకోవడాన్ని ఇవి ప్రోత్సహించాయి.

ఆ తర్వాత చాలా మంది కళాకారులు తమ రాజకీయ, పర్యావరణ, లైంగిక అభిప్రాయాలను అందరితో పంచుకోడానికి నెలసరి సమయంలో వచ్చే రక్తం చిహ్నాన్ని ఉపయోగించారు.

ఇంటర్నెట్‌లో ఈ ఆచారం గురించి సమాచారం సేకరించిన రెనెటా రిబెరియో "సీడింగ్ మై మూన్ ఆచారం నాకు భూమిని ఒక భారీ గర్భాశయంలా చూసేందుకు సాయం చేసింది. మన గర్భాశయంలో లాగే ఈ విశాల యోనిలో కూడా అంకురోత్పత్తి జరుగుతుంది" అన్నారు.

Image copyright ANA OLIVEIRA

చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నిషేధం

ప్రపంచవ్యాప్తంగా 14 నుంచి 24 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 1500 మంది యువతులపై చేసిన ఒక సర్వేలో చాలా సమాజాల్లో పీరియడ్స్ గురించి మాట్లాడటంపై ఇప్పటికీ నిషేధం లాంటి స్థితి ఉందనే విషయం వెల్లడైంది.

బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, ఫిలిప్పీన్స్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ ఈ సర్వేను చేపట్టింది.

ఈ అధ్యయనంలో మహిళలు శానిటరీ నాప్‌కిన్ కొనడానికి కూడా సిగ్గు పడుతున్నట్లు తేలింది. అంతే కాదు, పీరియడ్ సమయంలో మహిళలు తమ సీటు నుంచి లేవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారని తెలిసింది.

ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ బహియాలోని 71 ఏళ్ల సామాజిక మానవ శాస్త్రవేత్త శార్డెన్‌బర్గ్ "అందరూ దాని గురించి మాట్లాడడమే కష్టంగా ఉన్న సమయంలో తనకు తొలి పీరియడ్ వచ్చింది" అని చెబుతారు.

ఈ విషయంలో సిగ్గును దూరం చేసుకోడానికి మహిళలు దాని గురించి మాట్లాడుకోవాలి. ఈమధ్య మహిళలు తమ నెలసరి గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా భావించడం లేదు.

Image copyright SOFIA RIBEIRO

వివాదం ఎందుకు

ఈ ఆచారం కోసం అందరూ సిద్ధంగా లేరని లారా చెబుతారు.

తన అనుభవాలను పంచుకున్న ఆమె "ఇన్‌స్టాగ్రాంలో 300 మంది మాత్రమే నన్ను ఫాలో అవుతారు. నేను ఈ ఆచారం అనుసరించిన తర్వాత ఒక ఫొటో పోస్ట్ చేశాను. కానీ దానిపై చాలా వ్యతిరేకత వచ్చింది" అన్నారు.

ఫొటో పోస్ట్ చేసిన నాలుగు రోజుల తర్వాత ఇన్‌స్టాగ్రాంలో ఆమెను చాలా మంది వేళాకోళం చేస్తూ కామెంట్లు పెట్టారు.

బ్రెజిల్‌ వివాదాస్పద కమెడియన్ డెనిలో జెంటిల్ ఆమె ఫొటోను తన 16 మిలియన్ల ఫాలోయర్స్‌కు షేర్ చేశాడు.

కానీ అందులో "పీరియడ్ సమయంలో వచ్చే రక్తం సాధారణమే. కానీ దానిని మన ముఖంపై రాసుకోవడం అసాధారణం" అని కామెంట్ పెట్టాడు.

Image copyright MORENA CARDOSO

ఇది ఆపేది అప్పుడే

కానీ ఈ పోస్ట్ తర్వాత 2300కు పైగా కామెంట్స్ వచ్చాయి. వాటిలో ఎక్కువ ఫొటోకు నెగటివ్ కామెంట్సే ఉన్నాయి.

నెలసరి గురించి ప్రజల్లో ఇప్పటికీ ఎలాంటి భావన ఉందనడానికి ఇదే ఉదాహరణ అని లారా చెబుతారు.

"జనానికి ఏదైనా మామూలుగా అనిపించకపోతే, అది కచ్చితంగా తప్పే అని చాలామంది అనుకుంటారు. వాళ్లు తమ మొబైల్ ఫోన్ల వెనుక దాక్కుని ఎవరినైనా తిట్టగలరు" అంటారు లారా.

"ఇది నా శరీరం నుంచి వచ్చిన ద్రవ పదార్థం. ఏది అసాధారణం, ఏది కాదు అనేది నేనే నిర్ణయించుకుంటా. నేను వేరే వారి జీవితాల్లో జోక్యం చేసుకోవడం లేదు" అన్నారు.

జనాలు తిట్టడం అనేది అసాధారణం అనిపించాలి. పీరియడ్ సమయంలో వచ్చే రక్తాన్ని అందరూ ఒక సహజ వస్తువుగా ఎప్పుడు చూడ్డం మొదలెడతారో, అప్పుడు నేను ఇలా చేయడం ఆపేస్తా" అన్నారు లారా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)