అసలైన సూపర్‌ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు

  • 27 జూలై 2019
సూపర్ హీరోలకు శక్తులు ఎవరిచ్చారు Image copyright Getty Images

సూపర్ మ్యాన్‌‌ ఆకాశంలో దూసుకెళ్తుంటే, థోర్‌ సమ్మెటతో శత్రువుల భరతం పట్టడం చూస్తుంటే, అలాంటి శక్తులు మనకూ ఉంటే బావుండని అనిపించడం సహజం.

ఇప్పుడు సినిమాలు చూస్తున్న మనమే కాదు, ప్రాచీన మానవులు కూడా అలాంటి కోరికలతోనే జీవించారనిపిస్తోంది.

కానీ వారికి సూపర్ హీరోలంటే సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, వండర్ ఉమన్ లాంటివాళ్లు కాదు.

వేల ఏళ్ల క్రితమే ప్రాచీన గ్రీకులు, రోమన్లు, నార్స్ తమ కోసం అప్పుడే మహా శక్తులున్న సొంత సూపర్ హీరోలను సృష్టించుకున్నారు.

నిజానికి, మనకు ఇప్పుడు ఆధునిక సూపర్ హీరోల్లో కనిపిస్తున్న ఈ లక్షణాలు, నైపుణ్యాలన్నీ ఆ పాతకాలం సూపర్ హీరోల పాత్రల నుంచే పుట్టుకొచ్చాయి.

లక్షణాలు, శక్తులే కాదు.. కొన్ని సందర్భాల్లో పురాతన సూపర్ హీరోల పేర్లనే కొత్తవారికి కూడా పెట్టేశారు.

ఇప్పుడు మార్వెల్, డీసీ కామిక్స్, సినిమాల్లో సూపర్ హీరోలు ప్రదర్శిస్తున్న సూపర్ పవర్స్ ఇవే..

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హెర్కులెస్

మహా మానవ శక్తి (హల్క్ లాంటి పాత్రలు)

సూపర్ హీరోలకు మనుషులకు లేని మహా శక్తి ఉంటుంది.

హెర్కులెస్ పేరుతో మార్వెల్ కామిక్స్‌లో, డిస్నీ యానిమేషన్ మూవీలో భారీకాయం ఉన్న ఒక సూపర్ హీరో కనిపిస్తాడు. కానీ ఈ హెర్కులెస్ కథలన్నీ నిజానికి వేల సంవత్సరాల పురాణాల్లోవి.

హెర్కలెస్ అనే ప్రాచీన గ్రీకు డెమి-గాడ్ పేరునే రోమన్లు హెర్కులెస్ అని మార్చారు.

జ్యూస్ కొడుకైన హెర్కులెస్ అందమైన మానవమాత్రుడుగా, మహా శక్తి సామర్థ్యాలతో పుట్టాడు.

ఎన్నో సాహసాలు చేసిన హెర్కులెస్ 12 అసాధ్యమైన లక్ష్యాలను పూర్తి చేశాడు. ఎంతోమంది రాక్షసులను చంపాడు.

మొదటి ఒలింపిక్ క్రీడల్లో అన్ని పోటీల్లో విజేతగా నిలిచి, కుస్తీపోటీల్లో మృత్యువునే ఓడించాడు.

ఆయన స్ఫూర్తితోనే ఆ తర్వాత వచ్చిన హల్క్ లాంటి సూపర్ హీరోలందరినీ అలాగే మహా శక్తివంతులుగా సృష్టించారు.

భారత పురాణాల్లో భారీగా ఉండే ఘటోత్కచుడు లాంటి వారు కూడా సూపర్ హీరోల కోవలోకి వస్తారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అఖిలిస్

ప్రాణాంతక బలహీనత( క్రిప్టొనైట్ లాంటివి)

సూపర్ హీరోస్ అంటే బలాలే కాదు, బలహీనతలూ ఉంటాయి.

సూపర్‌ మ్యాన్‌కు క్రిప్టొనైట్, వోల్వరిన్‌కు మురసమా బ్లేడ్ బలహీనత అయితే, వండర్ వుమన్‌ బ్రేస్‌లెట్లను ఎవరైనా మగాళ్లు కలిపి కట్టేస్తే, అమె సూపర్ పవర్స్ అన్నీ కోల్పోతుంది.

గ్రీకు పురాణాల్లోని అఖిలిస్ కూడా అలాంటి సూపర్ హీరోనే. ఇతడు గ్రీకు రాజు పెలూస్, సముద్ర-వనదేవత థెటిస్ కొడుకు. అఖిలిస్ తరానికి ఒక సూపర్ హీరో. అయితే ఈ సూపర్ హీరోకు కూడా ఒక బలహీనత ఉంటుంది. అది అతడి మడమ.

అఖిలిస్ పుట్టినపుడు చిన్న వయసులోనే చనిపోతాడని జోస్యం చెప్పారు. దీంతో భయపడిన తల్లి అఖిలి‌స్‌ను స్టిక్స్ నదిలో ముంచింది. దానిలో మునిగితే అమితమైన శక్తులు వస్తాయని భావిస్తారు.

కానీ ఆమె అఖిలిస్ మడమ పట్టుకుని నీళ్లలో ముంచింది. దాంతో అతడి శరీరం బలంగా మారినా తల్లి పట్టుకున్న మడమ నీటి బయటే ఉండిపోవడంతో అది అతడి బలహీనత అయ్యింది.

ఇది మన మహాభారతంలో గాంధారి కొడుకు దుర్యోధనుడికి తన దృష్టితో బలం ఇచ్చిన కథను గుర్తుచేస్తుంది.

తర్వాత అంత బలవంతుడైన అఖిలిస్‌ను అతడి మడమలో బాణం వేసి చంపేశారని ఆ కథలో చెబుతారు.

అందుకే, అంత బలవంతుడైనప్పటికీ శరీరంలో ఎక్కడైనా ఒక దగ్గర బలహీనత ఉంటే దానిని 'అఖిలిస్ హీల్' అంటుంటారు.

Image copyright Lefteris
చిత్రం శీర్షిక ఒడిస్సిస్

వీధిహీరోలు (బ్యాట్ మాన్ లాంటి పాత్రలు)

కొంతమంది సూపర్ హీరోలు వీధుల్లో పోరాటాలు చేస్తుంటారు. తెలివిగా తప్పించుకుంటుంటారు.

ఓడిస్సిస్ అనే గ్రీకు రాజు అలాంటివాడే. ఆయన్ను హీరో ఆఫ్ ఒడిస్సీ అంటారు. ట్రోజన్ వార్ ముగిసిన తర్వాత ఒడిస్సిస్ చాలా కష్టాలు, సవాళ్లు ఎదుర్కున్నాడని చెబుతారు.

కానీ అతడు చాలావరకూ ఇప్పటి బ్యాట్‌ మ్యాన్‌లాగే ఉంటాడు. శత్రువులపై పైచేయి సాధించడానికి తన తెలివి, మేధస్సు, వంచన ఉపయోగిస్తాడు.

ఒంటికన్ను రాక్షసుడు సైక్లోప్స్ పాలీఫెమస్ పట్టుకున్నప్పుడు కూడా ఒడిస్సిస్ అతడి నుంచి తెలివిగా తప్పించుకుంటాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సర్సీ

మాయమంత్రాలు ( విచ్‌ఫైర్ లాంటి పాత్రలు)

ఆధునిక సూపర్ హీరోల్లో చాలా మందికి మాయా శక్తులు కూడా ఉంటాయి.

డీసీ కామిక్స్‌లో విచ్‌ఫైర్ అనే పాత్ర ఉంటుంది. అందమైన మోడల్, అద్భుతమైన నటి, గాయని అయిన రావెన్ ఒక భయంకరమైన మంత్రగత్తె కూడా.

రావెన్ ఇతరుల మనోభావాలు చదవగలదు. శత్రువులపై దాడి చేసేందుకు వారి నీడపై కూడా పైచేయి సాధించగలదు.

ఇక మార్వెల్ కామిక్స్‌ విషయానికి వస్తే డాక్టర్ స్ట్రేంజ్. ఈ మాజీ సర్జన్ కారు ప్రమాదంలో తన చేతులకు తీవ్రంగా గాయాలు కావడంతో మాయా శక్తులు నేర్చుకుంటాడు.

కానీ కామిక్స్‌లో కనిపించిన ఈ పాత్రలకు ముందు పురాణాల్లోనే ఇలాంటి పాత్ర ఉంది.

గ్రీకు పురాణాల్లో చాలా ప్రముఖమైన సర్సీ అనే ఒక వశీకరణ దేవత కథ ఉంది.

సర్సీని బహిష్కరించి ఒక ద్వీపానికి పంపించేస్తారు. అక్కడ ఆమెకు చాలా మంది వనదేవతలు తోడుంటారు. అక్కడ ఆమె రూపం మార్చుకోవడం, భ్రమలు కలిగించే మాయలు నేర్చుకుంటుంది.

ఆ శక్తులు ఉపయోగించి తనకు నచ్చనివారిని, శత్రువులను జంతువుల్లా, రాక్షసుల్లా మార్చేసేది.

ఆధునిక సూపర్ హీరోలకు కూడా అలాంటి శక్తులే ఉన్నాయి. వాళ్లు వాటిని మంచికి ఉపయోగిస్తుంటారు.

Image copyright Getty Images

వీర వనితలు ( వండర్ మన్ లాంటి పాత్రలు)

గ్రీకు పురాణాల్లో అమెజాన్లు క్రూరమైన వీర వనితలు. వారిని యోధులుగా వర్ణించారు.

ప్రత్యర్థులు పురుషులైనా సరే, ధైర్యంలో, బలంలో వారిపై పైచేయి సాధించేవారు.

డీసీ కామిక్స్‌లో వండర్ ఉమన్ లాంటి పాత్రను సృష్టించడానికి ఇలాంటి శక్తులే కారణం.

మొదటి ఎడిషన్లలో వండర్ ఉమన్‌ను వాళ్ల అమ్మ క్వీన్ హిప్పోలిటా మట్టితో తయారు చేస్తుంది. గ్రీకు దేవుళ్ల నుంచి వండర్ ఉమన్‌ శక్తుల్ని పొందుతుంది.

కానీ తాజా వెర్షన్లలో డీసీ ఆ కథను మార్చేసింది. ఆమెను జ్యూస్ కూతురుగా చెప్పారు. అందుకే ఇప్పుడు ఆమె పురాణాల్లోని అమెజాన్ మహిళే కాదు, దేవుడి కూతురు కూడా.

Image copyright track5
చిత్రం శీర్షిక కుపిడ్/ఈరోస్ విగ్రహం

గుర్తింపు దాచుకోవడం( సూపర్ మ్యాన్ లాంటి పాత్రలు)

రోమన్ దేవుడు కుపిడ్. ప్రాచీన గ్రీకు చరిత్రలో ఈయన్నే ఈరోస్ అని పిలిచేవారు.

కుపిడ్ అనగానే రెక్కలతో విల్లు పట్టుకున్న ఒక ముద్దొచ్చే పిల్లాడు కనిపిస్తాడు. మన పురాణాల్లోని మన్మథుడులాగే ఈ గ్రీకు దేవుడు జంటల్లో ప్రేమను పుట్టిస్తాడు.

కానీ కుపిడ్ కూడా తన అద్భుత శక్తులను(రెక్కలను) తన జీవితంలో రహస్యంగా ఉంచేశాడు. భార్యకు కూడా తెలియనివ్వలేదు.

మన ఆధునిక సూపర్ హీరోల్లో కూడా కుపిడ్‌లాగే గుర్తింపు దాచుకునేవాళ్లు ఉన్నారు.

బ్యాట్‌ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి వాళ్లు ఆ సూట్లు వేసుకుని తాము ఎవరనే విషయం బయటపడకుండా చూసుకుంటారు.

అలాగే, కళ్లజోడు పెట్టుకుని సాదాసీదాగా కనిపించే ఒక జర్నలిస్ట్, ఏదైనా ముప్పు ముంచుకొస్తోందని తెలీగానే సూపర్ మ్యాన్ సూట్‌లో ఆకాశంలోకి దూసుకెళ్తాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మెడూసా తల నరుకుతున్న పెర్సియస్

మాయమైపోవడం ( ఇన్విజబుల్ వుమన్ లాంటి పాత్రలు )

కొంతమంది సూపర్ హీరోలు హఠాత్తుగా మాయమైపోతుంటారు. ఇది వాళ్లకుండే మరో మహా శక్తి.

ఫెంటాస్టిక్ ఫోర్ లో ఇన్విజబుల్ వుమన్(అదృశ్య మహిళ) పాత్ర ఉంటుంది.

గ్రీకు పురాణాల్లో కూడా ఇలాంటి కథలున్నాయి. డెమీ-గాడ్ పెర్సియస్ ఒక భయంకరమైన రాక్షసుడి నుంచి తప్పించుకోడానికి ఇలాంటి మాయమైపోయే శక్తులే ఉపయోగించాడు.

మనుషులను కంటి చూపుతో శిలలుగా మార్చేసే మెడూసా తలను తీసుకురావడానికి వెళ్లిన పెర్సియస్ ఆమె కళ్లలో పడి శిలగా మారకుండా అదృశ్యం అయ్యే శక్తి ఉన్న శిరస్త్రాణం వేసుకున్నాడు.

అలా మెడూసా కళ్ల ముందుకు రాకుండా దాని తల నరికాడు.

Image copyright Google
చిత్రం శీర్షిక గ్రీకు పురాణాల్లో సమ్మెటతో థార్ చిత్రం

బలమైన సమ్మెట.. ఇంకా చాలా ( థోర్ లాంటి పాత్రలు)

యుద్ధాలు చేయడానికి వాతావరణానికే కళ్లెం వేస్తే ఎలా ఉంటుంది.

మన ఆధునిక సూపర్ హీరోలకు అలాంటి శక్తి కూడా ఉంది.

నార్స్ పురాణాల్లో థోర్ అనే ఉరుముల దేవుడి పాత్ర ఉంది.

అంటే ఉరుములతోపాటు మెరుపులు, పిడుగులు, తుపానులు కూడా వస్తుంటాయి.

థోర్ దగ్గర 'మియోనీర్' అనే ఒక శక్తివంతమైన సమ్మెట ఉంటుంది. దానితో యుద్ధం చేయడమే కాదు, ఎక్కడికైనా ఎగిరిపోగలడు కూడా.

ఈ సూపర్ పవర్ మనుషులను కాపాడేందుకు వాతావరణం పై కూడా పైచేయి సాధించేలా చేస్తుంది.

అలాంటి శక్తులతోనే మార్వెల్ కామిక్స్ థోర్ ఒడిన్సన్ అనే పాత్రను సృష్టించింది.

థోర్ అనే పేరే కాదు, ఈ పాత్ర నార్స్ పురాణాల్లో ఉన్న ఉరుముల దేవుడిని అచ్చుగుద్దినట్టు ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)