ఫ్రాన్స్‌లో బయటపడ్డ భారీ డైనోసార్ తొడ ఎముక.. పొడవు ఆరు అడుగుల పైమాటే..

  • 27 జూలై 2019
డైనోసార్ ఎముక Image copyright AFP

ఫ్రాన్స్‌లో ఓ భారీ డైనోసార్ ఎముక బయటపడింది. ఆంగియక్ అనే ప్రాంతంలో పరిశోధకులు తవ్వకాలు జరుపుతుండగా ఇది వెలుగుచూసింది.

దాదాపు పదేళ్లుగా ఈ ప్రాంతంలో పరిశోధకులు అన్వేషిస్తూ శిలాజాలు వెలికితీస్తున్నారు.

ప్రస్తుతం బయపడ్డ డైనోసార్ ఎముక 6.6 అడుగుల (2 మీటర్లు) పొడవు ఉంది. ఇది శాకాహార సారోపాడ్ జాతి డైనోసార్ తొడ ఎముక కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

సారోపాడ్‌లు పొడవైన మెడ, తోకతో ఉండేవి. భూమిపై జీవించిన అత్యంత భారీ జంతువుల్లో ఇవి కూడా ఒకటి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionదీన్ని క్షేమంగా వెలికితీసేందుకు ఓ వారం సమయం పట్టొచ్చని పరిశోధకులు అంటున్నారు

ఇప్పటికీ ఆ ఎముక అంత సురక్షితంగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందని పాలియాంథాలజిస్ట్‌లు అంటున్నారు.

''భారీ ఎముకలు సాధారణంగా కృశించుకుపోతాయి. ముక్కలైపోతుంటాయి. ఇలాంటి స్థితిలో లభ్యమవడం చాలా అరుదు. ఆ ఎముకలో కండరాల తాలూకు ఆనవాళ్లు, మచ్చలు ఇంకా కనిపిస్తున్నాయి'' అని పారిస్‌లోని నేషనల్ హిస్టరీ మ్యూజియానికి చెందిన రోనన్ అలెయిన్ ఓ వార్తా పత్రికతో చెప్పారు.

Image copyright AFP

ఆ డైనోసార్లు ఎంత పెద్దవంటే..

ఇలాంటి ఎముకలు కలిగిన డైనోసార్లు 14 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవించాయని, వాటి బరువు 40 నుంచి 50 టన్నుల దాకా ఉండేదని అలెయిన్ అన్నారు.

2010లో ఇదే ప్రాంతంలో ఒక సారోపాడ్ తొడ ఎముక దొరికిందని, దాని పొడవు 7.2 అడుగులు (2.2 మీ.), బరువు 500 కిలోలని స్థానిక వార్తాపత్రిక తెలిపింది.

ప్రస్తుతం దొరికిన ఎముక కూడా అంతే బరువు తూగొచ్చని పరిశోధకులు అంటున్నారు. దాన్ని ఇంకా వారు నేల నుంచి పూర్తిగా బయటకు తీయలేదు. దాన్ని క్షేమంగా వెలికితీసేందుకు ఓ వారం సమయం పట్టొచ్చని చెబుతున్నారు.

కాగ్నాక్ పట్టణానికి సమీపంలో ఉన్న ఆంగియక్‌లో 2010 నుంచి దాదాపు 40 జీవ జాతులకు చెందిన 7,500కుపైగా శిలాజాలు బయటపడ్డాయి. ఈ వేసవిలో 70 మందికిపైగా పరిశోధకులు ఇక్కడ అన్వేషణల్లో పాల్గొంటున్నారు.

స్టెగోసారస్ డైనోసార్ ఎముకలు, నిప్పుకోడిలా ఉండే డైనోసార్ల మంద అవశేషాలు కూడా ఆంగియక్‌లో దొరికాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)