సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే?

  • 28 జూలై 2019
అత్యాచారం Image copyright Getty Images

ఒక పురుషుడు, స్త్రీ అంగీకారం లేకుండా ఆమెతో బలవంతంగా సెక్స్ చేస్తే అది అత్యాచారం అవుతుంది. కానీ, అదే పని ఒక స్త్రీ చేస్తే కూడా అది రేప్ అవుతుందా?

అది అత్యాచారం కిందకు రాదని ఇంగ్లండ్, వేల్స్‌లోని చట్టాలు చెబుతున్నాయి. అయితే, ఇలాంటి పని ఎవరు చేసిన శిక్ష కిందకే రావాలని ఇలాంటి ఘటనలపై అధ్యయనం చేసిన ఒక రచయిత్రి వాదిస్తున్నారు.

లాంకాస్టర్ యూనివర్సిటీ లా స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ సియోభన్ వేర్ 2016-17లో యూకేలో జరిగిన అత్యాచార కేసులను అధ్యయనం చేశారు. ఆన్‌లైన్‌ సర్వేలో 200 మంది పురుషుల నుంచి వివరాలు సేకరించారు.

మే 2018 నుంచి జూలై 2019 మధ్య 30 మంది పురుషులతో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా ఆమె చేసిన ఒక అధ్యయనం ఇటీవల ప్రచురితమైంది.

ఇందులో పురుషులపై బలత్కార ఘటనలు, దాని పర్యవసానాలు, న్యాయ వ్యవస్థ ప్రతిస్పందన గురించి ఆమె ఇందులో మరింత వివరంగా చెప్పారు.

Image copyright Getty Images

ఆమె తన ఇంటర్వ్యూలు, సర్వేలో పాల్గొన్నవారి వివరాలు గోప్యంగా ఉంచారు. కానీ, అందులో ఒకరి పేరును జాన్‌గా చెప్పారు.

తన భాగస్వామి తననుతాను హింసించుకోవడం మొదటిసారి చూసినప్పుడు ఏదో తప్పు జరిగిందని భావించినట్లు జాన్ చెప్పారు. ఈ ఘటన తర్వాత జాన్ తన భాగస్వామిని ఆసుప్రతికి తీసుకెళ్లారు. అక్కడ మానసిక సమస్య గురించి ఆ జంట కొన్ని గంటలపాటు చర్చించుకుంది.

ఆరునెలల తర్వాత ఆమె తననుతాను హింసించుకోవడం మానేసి జాన్‌ను కొట్టడం మొదలుపెట్టింది.

''నేను అప్పుడు లివింగ్ రూంలో ఉన్నాను. ఆమె వంటగది నుంచి వచ్చి నా ముఖంపై పిడిగుద్దులు గుద్దింది. ఇలా చాలా సార్లు జరిగింది'' అని జాన్ చెప్పారు.

''ఆమెను ఒక సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు. కానీ, ఆమె రాలేదు. ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే సెక్స్ కావాలని అడిగేది. చాలా కోపంగా ఉండేది. ఉద్యోగం నుంచి ఆమె తిరిగి రాకపోతే బాగుండునని అనిపించేది'' అని జాన్ తెలిపారు.

ఒక రోజు జాన్ లేవగానే భయంకర దృశ్యం కనిపించింది. ఆమె అతడి చేతులను మంచానికి కట్టేసింది. తర్వాత గట్టిగా అరుస్తూ తలపై కొట్టింది. కాళ్లను నైలాన్ తాడుతో కట్టేసి సెక్స్ చేయడానికి ప్రయత్నించింది.

గాయాలతో భయపడిన జాన్ ఆమె కోరికను తీర్చలేకపోయారు. దీంతో ఆమె అతడిపై దాడికి దిగింది. తర్వాత ఈ ఘటన గురించి ఆమె జాన్‌తో మాట్లాడటానికి నిరాకరించింది.

Image copyright iStock

కొన్నాళ్ల తర్వాత ఆమె గర్భవతి అయింది. జాన్‌కు కొన్ని రోజులు ఈ హింస తప్పింది. ఓ బిడ్డ పుట్టాక జాన్‌కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. రాత్రిళ్లు ఆమె జాన్ చేతులు కట్టేసి బలవంతం చేసేది.

''నా చేత బలవంతంగా వయాగ్రా వాడేటట్లు చేసి ఉద్రేకపరిచేది. దీంతో నేను ఆమె చెప్పినట్లు చేసేవాడిని'' అని జాన్ చెప్పారు.

''ఆ తర్వాత నేను స్నానపు గదిలోకి వెళ్లి గంటల తరబడి షవర్ కిందే ఉండేవాడ్ని'' అని చెప్పారు.

ఈ ఘటనను జాన్ తెలిసిన వాళ్లకు చెబితే ఎవరూ నమ్మలేదు.

జాన్‌కు ఎదురైన అనుభవాలే డాక్టర్ వేర్ ఇంటర్వ్యూ చేసిన మరికొంత మంది మగాళ్లు ఎదుర్కొన్నారు.

జాన్ లాంటి అనుభవాలే ఎదుర్కొన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ, ''నువ్వు ఆ సమయాన్ని ఆనందించైనా ఉండాలి లేదా వెంటనే దానిపై మాకు ఫిర్యాదైనా చేసి ఉండాలి'' అని ఒక పోలీసు అధికారి తనతో అన్నారని చెప్పారు.

''ఆ ఘటనను బయటకు చెప్పడానికి ఇబ్బంది పడటమే కాదు భయపడ్డాను కూడా. మేం దాని గురించి మాట్లాడితే ఎవరూ నమ్మరు. ఎందకంటే మేం పురుషులం'' అని మరో వ్యక్తి చెప్పారు.

''ఇలాంటి ఘటనలను ఎవరూ నమ్మకపోవడానికి రెండు అపోహలు కారణం. ఒకటి, స్త్రీ కంటే పురుషుడు బలవంతుడవడం వల్ల వారి అంగీకారం లేకుండా సెక్స్ చేయడం సాధ్యం కాదని భావించడం. రెండోది మహిళలతో లైంగిక అవకాశాలను పురుషులు సానుకూలంగా చూస్తారని అనుకోవడం.

మూడో అపోహ ఏమంటే, పురుషుడికి స్తంభన కలిగితే సెక్స్ కోరుకుంటారని భావించడం. కానీ, వాస్తవానికి స్తంభన అనేది పూర్తిగా మానసిక ప్రతిస్పందన మాత్రమే'' అని డాక్టర్ వేర్ తెలిపారు.

భయం, కోపం, దిగ్భ్రాంతి కలిగినప్పుడు కూడా పురుషుడిలో స్తంభన ఉంటుందని ఆమె గుర్తు చేశారు.

Image copyright Getty Images

డేట్ రేప్ డ్రగ్ ఇచ్చి తనను బలవంతం చేశారని ఒకరు, వేసవిలో క్యాంపుకు వెళ్లినప్పుడు తనపై అత్యాచారం చేశారని మరొకరు తమ అనుభవాలను డాక్టర్ వేర్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

తన తాజా అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తమపై అత్యాచారం జరిగిందని భావించినట్లు చెప్పారని, ఇంగ్లాండ్, వేల్స్ చట్టం ప్రకారం ఇలాంటి ఘటనలు అత్యాచారం కిందకు రాకపోవడం వారిలో నిరాశ కలిగించిందని డాక్టర్ వేర్ తెలిపారు.

డాక్టర్ వేర్ తన తాజా అధ్యయనంలో రేప్ చట్టాలను మార్చడంపై సీరియస్‌గా పరిశీలన జరపాలని సిఫారసు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)