ట్రంప్‌తో విభేదాలున్న అమెరికా ఇంటలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్స్ రాజీనామా

  • 29 జూలై 2019
డాన్ కోట్స్ Image copyright Reuters
చిత్రం శీర్షిక డాన్ కోట్స్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ బృందం నుంచి మరో కీలక ఉన్నతాధికారి వైదొలగారు. జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ బాధ్యతల నుంచి డాన్ కోట్స్ తప్పుకున్నారు.

కోట్స్ ఆగస్టు 15న వైదొలగుతారని, ఆయన స్థానంలో టెక్సాస్‌కు చెందిన కాంగ్రెస్ సభ్యుడు జాన్ రాట్‌క్లిఫ్‌ను తాను నామినేట్ చేస్తున్నానని ట్రంప్ ట్విటర్‌లో తెలిపారు.

రష్యా, ఉత్తర కొరియా అంశాల్లో కోట్స్, ట్రంప్ మధ్య తరచూ విభేదాలు పొడసూపాయి.

జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌గా కోట్స్ ప్రస్తుతం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ) సహా 17 అమెరికా నిఘా సంస్థల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు.

Image copyright AFP

2017 మార్చి నుంచి దాదాపు రెండున్నరేళ్లుగా ఆయన ఈ పోస్టులో ఉన్నారు. కోట్స్ విశ్లేషణ, అంచనాలతో ట్రంప్ తరచూ విభేదించారు.

అమెరికా నిఘా సంస్థలను అధ్యక్షుడు తప్పుబడుతూ వస్తున్నారు.

ఇరాన్ ముప్పును అంచనా వేసే విషయంలో తమ నిఘా సంస్థల అధిపతులు నిర్లిప్తంగా, అమాయకంగా వ్యవహరిస్తున్నారని ఆయన జనవరిలో విమర్శించారు.

ట్రంప్ అధికార బృందం నుంచి ఇంతకుముందు రక్షణశాఖ మంత్రిగా ఉన్న జేమ్స్ మాటిస్, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్న రెక్స్ టిలర్‌సన్, మరికొందరు తప్పుకొన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కోట్స్ చేరారు.

కోట్స్ రాజీనామాకు కారణం?

తన హయాంలో అమెరికా నిఘా వ్యవస్థ ముందెన్నడూ లేనంతగా బలోపేతమైందని, ఇక తాను జీవితంలో మరో అధ్యాయంలోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని అధ్యక్షుడికి పంపిన రాజీనామా లేఖలో కోట్స్ చెప్పారు.

పదవిలో కొనసాగాలని అధ్యక్షుడు తనను కోరారని కోట్స్ ఫిబ్రవరిలో చెప్పారు.

విదేశాంగ విధానంపై వీరిద్దరి విభేదాలు కొన్నిసార్లు పరిష్కరించుకోలేనంతగా ఉన్నాయి.

ముఖ్యంగా- 2016 అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం, ఇరాన్ అణు ఒప్పందం, ఉత్తర కొరియాతో సయోధ్యకు ట్రంప్ ప్రయత్నాలపై వీరిద్దరి మధ్య తీవ్రస్థాయి విభేదాలు ఏర్పడ్డాయి.

ట్రంప్‌తో సంబంధాలు దెబ్బతినడం వల్ల తన నిష్క్రమణ తప్పదని కోట్స్ అనుకున్నారని ఒక సీనియర్ నిఘా అధికారిని ఉటంకిస్తూ ద వాషింగ్టన్ పోస్ట్ పత్రిక రాసింది.

జాతీయ భద్రత అంశాల్లో తన ప్రాధాన్యాన్ని అధ్యక్షుడు తగ్గిస్తున్నారని కోట్స్ భావించారని సదరు అధికారి చెప్పారు.

ఫిన్‌లాండ్‌లోని హెల్సింకీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిపిన ఆంతరంగిక సమావేశం గురించి ట్రంప్ తనకు ముందస్తుగా చెప్పలేదని గత ఏడాది కోట్స్ వెల్లడించారు.

ఆ భేటీ ఎలా నిర్వహించాలో తనను అధ్యక్షుడు అడిగి ఉంటే, దానిని మరో విధంగా ఏర్పాటు చేసి ఉండేవాడినని ఆయన వ్యాఖ్యానించారు.

ఉత్తర కొరియా విషయంలోనైతే ట్రంప్, కోట్స్ వైఖరుల్లో వైరుద్ధ్యాలు ప్రస్ఫుటంగా వెల్లడయ్యాయి. ఉత్తర కొరియా అణ్వాయుధాలను వదులుకొనే అవకాశాలు లేవని జనవరిలో చట్టసభ కాంగ్రెస్‌లో కోట్స్ చెప్పారు. ఉత్తర కొరియా నుంచి ముప్పు లేదన్న ట్రంప్ ప్రకటనకు ఇది విరుద్ధమైనది.

Image copyright AFP

కోట్స్ నేపథ్యం ఇదీ

మిచిగాన్‌లోని జాక్సన్‌లో జన్మించిన కోట్స్- 1989 నుంచి 1999 వరకు, 2011 నుంచి 2017 వరకు రెండు పర్యాయాలు ఇండియానా సెనేటర్‌గా సేవలందించారు.

2001 నుంచి 2005 మధ్య ఆయన జర్మనీ రాయబారిగా పనిచేశారు.

రాట్‌క్లిఫ్ నేపథ్యం ఇదీ

కోట్స్ స్థానంలో నిఘా విభాగ సారథిగా నామినేట్ అయిన రాట్‌క్లిఫ్ 2015 నుంచి టెక్సాస్ నాలుగో డిస్ట్రిక్ట్ ప్రతినిధుల సభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన మాజీ న్యాయవాది.

ట్రంప్, ఆయన విధానాలకు రాట్‌క్లిఫ్ మద్దతుదారు.

రాట్‌క్లిఫ్ నామినేషన్‌కు ఆమోదం లభిస్తే, విదేశాంగ విధానంలో ట్రంప్‌కు అత్యధిక సందర్భాల్లో ఆయన బాసటగా నిలిచే అవకాశముంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక డాన్ కోట్స్ స్థానంలో జాన్ రాట్‌క్లిఫ్‌ను నామినేట్ చేసిన ట్రంప్

అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ జరిపిన మాజీ ప్రత్యేక న్యాయవాది, ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ విచారణ(టెస్టిమనీ) సందర్భంగా ట్రంప్ తరపున రాట్‌క్లిఫ్ వాదించారు. ఇది బుధవారం జరిగింది.

న్యాయప్రక్రియకు ఆటంకం కలిగించారనే ఆరోపణల నుంచి ట్రంప్‌కు తాను విముక్తి కల్పించలేదని ముల్లర్ చెప్పారు.

ట్రంప్ నిర్దోషిత్వాన్ని నిర్ధరించేందుకుగాని, ఆయనకు విముక్తి కల్పించేందుకుగాని ముల్లర్‌కు అధికారం లేదని రాట్‌క్లిఫ్ వ్యాఖ్యానించారు.

రాట్‌క్లిఫ్ నామినేషన్‌ను సెనేట్ డెమొక్రటిక్ పార్టీ నాయకుడు చక్ షూమర్ విమర్శించారు. ముల్లర్‌ను ఉద్వేగభరితంగా ప్రశ్నించి ట్రంప్ పట్ల మూఢ విధేయతను చాటుకొన్నందుకే రాట్‌క్లిఫ్‌ను ఈ పదవికి ఎంపిక చేశారని ఆయన ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)