బ్రెజిల్ జైల్లో గ్యాంగ్‌వార్, 57 మంది ఖైదీల మృతి

  • 30 జూలై 2019
బ్రెజిల్ గ్యాంగ్ వార్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రెజిల్ జైల్లో సెక్యూరిటీ(ఫైల్)

బ్రెజిల్ పారా రాష్ట్రంలో ఒక జైల్లో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో 57 మంది ఖైదీలు మృతిచెందారు.

అల్టామీరా జైల్లో సుమారు దాదాపు ఐదు గంటలపాటు గ్యాంగ్‌వార్ కొనసాగిందని అధికారులు చెప్పారు.

స్థానిక మీడియాలో వచ్చిన వార్తలను బట్టి జైల్లో ఒక భాగంలో ఉన్న గ్యాంగ్, అదే జైల్లో మరో భాగంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది.

మృతుల్లో 16 మందికి తలలు నరికేశారని అధికారులు చెప్పారు. జైల్లోని ఒక భాగంలో మంటలు అంటుకోవడంతో, ఆ పొగ వల్ల చాలా మంది ఊపిరాడక చనిపోయారని కూడా రిపోర్టులో చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రెజిల్‌లోని చాలా జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారు (ఫైల్)

అధికారులను బంధించారు

ఖైదీలు జైల్లో ఉన్న ఇద్దరు అధికారులను బంధించారు. ప్రస్తుతం వారిని విడిపించామని రిపోర్టులో తెలిపారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు జైల్లో హింస మొదలైంది. దాదాపు మధ్యాహ్నానికి పోలీసులు దానిని అదుపు చేయగలిగారు.

బ్రెజిల్ మీడియాలో చూపిస్తున్న వీడియోల్లో జైల్లో ఒక భవనం నుంచి పొగలు రావడం కనిపిస్తోంది. మరో వీడియోలో ఖైదీలు జైలు భవనంపైన తిరుగుతూ కనిపిస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రెజిల్‌లోని ఒక జైల్లో ఉన్న ఖైదీలు బయట ఏం జరుగుతోందో చూడ్డానికి అద్దం ముక్కలు ఉపయోగిస్తారు (ఫైల్)

సామర్థ్యం కంటే ఎక్కువగా ఖైదీలు

జైల్లో జరిగిన ఈ గ్యాంగ్‌వార్‌లో ఎవరెవరు ఉన్నారో, జైలు అధికారులు ఇంకా సమాచారం ఇవ్వలేదు.

బ్రెజిల్ జీ1 వార్తా సంస్థ రిపోర్ట్ ప్రకారం అల్టామీరాలో హింస జరిగిన జైలు సామర్థ్యం 200 మంది ఖైదీలు మాత్రమే. కానీ అక్కడ 311 మంది ఖైదీలను ఉంచారు.

బ్రెజిల్ జైళ్లలో హింసాత్మక ఘటనలు సర్వసాధారణం. దేశంలోని జైళ్లలో సుమారు 7 లక్షల మంది ఉన్నారు. చాలా జైళ్లలో ఖైదీలు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నారు. జైల్లో రైవల్ గ్యాంగ్స్ మధ్య ఘర్షణలు జరిగాయనే వార్తలు ఇక్కడ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి.

మే నెలలో ఒకే రోజులో దేశంలోని నాలుగు వేర్వేరు జైళ్లలో ఘర్షణలు జరిగాయి. వీటిలో 40 మంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)