చార్లెస్ డార్విన్‌కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'

  • 1 ఆగస్టు 2019
అడవి Image copyright Getty Images
చిత్రం శీర్షిక వృక్ష సామ్రాజ్యం 13 కోట్ల సంవత్సరాల కిందట నాటకీయ మార్పుకు లోనై.. 3.5 లక్షల రకాల కొత్త జాతులు పుట్టుకొచ్చాయి

ప్రఖ్యాత ప్రకృతివాది చార్లెస్ డార్విన్ తన జీవితం చివరి సంవత్సరాలు.. ఓ నిగూఢ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నాల్లో గడిపాడు.

ఆయన మాటల్లోనే చెప్తే.. ''అత్యంత కలవరపరిచే ఈ దృగ్విషయం'' తన ప్రధాన శాస్త్రీయ కృషి.. జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించింది.

డార్విన్ 1859లో ప్రచురించిన తన పుస్తకం ఆరిజన్ ఆఫ్ స్పెసీస్‌లో.. ప్రకృతి వరణం - అంటే సహజ ఎంపిక ద్వారా జరిగే జీవపరిణామ సిద్ధాంతాన్ని వివరించాడు.

''సంరక్షిత జీవికి ప్రయోజనకరమైన.. వారసత్వంగా వచ్చిన చిన్న చిన్న మార్పులను సంరక్షించుకోవటం పెంపొందించుకోవటం ద్వారా మాత్రమే'' ఈ జీవపరిణామం జరుగుతుందని చెప్పాడు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఒకేసారి సంభవించే భారీ మార్పుల వల్ల కానీ, అకస్మాత్తుగా వచ్చే విప్లవాత్మక మార్పుల వల్ల కానీ జీవపరిణామం సంభవిస్తుందని ఆయన నమ్మలేదు.

''నూతన జీవుల సృష్టి నిరంతరం కొనసాగుతుందనే విశ్వాసాన్ని, లేదంటే వాటి నిర్మాణంలో ఏదైనా భారీ లేదా ఆకస్మిక మార్పు గానీ జరుగుతుందనే నమ్మకాన్ని ప్రకృతి వరణం నిర్మూలిస్తుంది'' అని ఆయన రాశాడు.

కానీ.. ఆ తర్వాత ఆయన చేపట్టిన పరిశోధనలు - ప్రధానంగా వృక్షశాస్త్రం మీద చేసిన అధ్యయనాలు - ఆయన రచించిన అతిగొప్ప సిద్ధాంతాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ఇది ఆ తర్వాత ఇరవై ఏళ్ల పాటు.. మరణించే వరకూ డార్విన్‌ను వేధించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పుష్పించే మొక్కలకు సంబంధించిన శిలాజాల లభ్యత గురించి తన ఆలోచనలు, నిరాశల గురించి డార్విన్ విస్తృతంగా రాశాడు

జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పు

జీవపరిణామం పెద్ద 'గెంతులతో ముందుకు సాగద'నే డార్విన్ సిద్ధాంతాన్ని.. ఆయన తాజాగా గుర్తించిన అంశాలే ప్రశ్నిస్తున్నపుడు.. కొందరు నమ్మకస్తులైన సహచరులకు ఆ విషయం గురించి రాశాడు డార్విన్.

ఈ అంశంపై డార్విన్ 1875 నుంచి 1882లో చనిపోయేవరకూ లేఖల ద్వారా చురుకైన చర్చను కొనసాగించాడు. అది.. ఒకటిన్నర శతాబ్దం తర్వాత ఇప్పుడు కూడా జీవశాస్త్రవేత్తలకు స్ఫూర్తినిస్తోంది.

యూరోపియన్ ఆల్ప్స్ పర్వతాల వృక్ష సంపద మీద అధ్యయనం చేసిన ఐర్లండ్ ప్రకృతి శాస్త్రవేత్త జాన్ బాల్.. పుష్పించే మొక్కల్లో ఆవృతబీజాలు అకస్మాత్తుగా కనిపించటం గురించి రాసిన వ్యాసం చదివిన డార్విన్‌ దిగ్భ్రాంతికి లోనయ్యాడు.

1879 జూలై 22న బ్రిటిష్ వృక్ష పరిశోధన, విద్యా సంస్థ క్యూ గార్డెన్స్ డైరెక్టర్ జోసెఫ్ హుకర్‌కు ఒక లేఖ రాశాడు.

''ఇటీవలి భూవిజ్ఞాన కాలంలో ఉన్నతశ్రేణి మొక్కలన్నిటి గురించి మనం ఆలోచిస్తే.. ఈ వేగవంతమైన పరిణామం విసుగుపుట్టించే రహస్యం'' అని అందులో పేర్కొన్నాడు.

అంటే.. జీవపరిణామం ఒకేసారి వేగంగానూ, గొప్ప మార్పుతోనూ సంభవించగలదని.. పుష్పించే మొక్కల్లో ఆవృతబీజాలు అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతున్నట్లు సూచించటం డార్విన్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.

డార్విన్ మేధో నిజాయితీ

డార్విన్ - హుకర్ మధ్య లేఖల్లోని అంశాన్ని విశ్లేషిస్తూ అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్గానిస్మిక్ అండ్ ఎవల్యూషనరీ బయాలజీ ప్రొఫెసర్ విలియం ఫ్రీడ్‌మాన్ 2009లో ఒక వ్యాసం రాశారు.

''ఈ ఆవృతబీజాల ఆవిర్భావం.. సున్నపురాతి యుగం మధ్యకాలంలో ఒక ఆకస్మిక పుట్టుకగా, విభిన్న పుష్పజాతులుగా అత్యంత వేగవంతమైన విస్తరణగా భావించిన డార్విన్.. ఇదెలా జరిగిందనే అంశం మీద చాలా కలతచెందాడు'' అని అందులో పేర్కొన్నాడు.

ఎందుకంటే.. భూమి చరిత్రలో అత్యధిక కాలం ఆవృతబీజాలు అసలు మనుగడలోనే లేవు. కానీ అకస్మాత్తుగా ఇవి ఆవిర్భవించాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి అంతకుముందు ఉన్న.. మరింత పురాతన మొక్కల నుంచి పరిణామం చెందాయనటానికి ఆధారం ఏది?

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మన ఆహారానికి పండ్లు, కూరగాయల రూపంలో పుష్పించే మొక్కలే ప్రధాన ఆధారంగా ఉన్నాయి

''డార్విన్‌లో చాలా సుగుణం ఏమిటంటే.. అతడి మేధో నిజాయితీ'' అంటారు ఫ్రీడ్‌మాన్. ''ఈ రహస్యం తనకు పిచ్చెక్కిస్తున్నా కానీ.. దీనిని చాప కింద దాచేయబోనని డార్విన్ తన లేఖల్లో రాశాడు'' అని ప్రశంసించారు.

డార్విన్ దృష్టిని ఇంతగా పట్టినిలిపిన ఇతర జీవ బృందం మరేదీ ఉండకపోవచ్చునని ఫ్రీడ్‌మాన్ బీబీసీతో పేర్కొన్నారు.

''మొక్కల్లోని గొప్ప జాతులన్నిటిలోకీ.. భూమి మీద చాలా ఆలస్యంగా ఆవిర్భవించిన బృందం.. పుష్పించే మొక్కల జాతి'' అని ఆయన చెప్పారు.

కానీ.. బాల్ పరిశోధనలో గుర్తించిన దాని ప్రకారం.. ఈ ఆవిర్భావం అకస్మాత్తుగా సంభవించింది. వివిధ రూపాలలోకి మారటం వంటి కొన్ని పరిణామ దశలు తప్పినట్లు కనిపిస్తోంది.

భూమి మీద సుమారు 13 కోట్ల సంవత్సరాల కిందట ఆవృతబీజాలు ఆవిర్భవించాయి. అతి తక్కువ కాలంలోనే 3.50 లక్షల విభిన్న జాతులుగా విస్తరించగలిగాయి. మొత్తం వృక్ష రాజ్యంలో అత్యధిక భిన్నత్వం గల బృందంగా అవతరించాయి.

''ఒక తోట గురించి ఆలోచించినపుడు.. అందులో ఎక్కువ మొక్కలు పుష్పించే మొక్కలే ఉంటాయి. మనం తినే పండ్లు, కూరగాయలు కూడా అత్యధికంగా పుష్పించే మొక్కల నుంచే వస్తాయి'' అని ఫ్రీడ్‌మాన్ పేర్కొన్నారు.

నిజానికి.. మన ఆహార వ్యవస్థకు మూలాధారంగా ఉండటమే కాదు.. నేడు మనకు కనిపించే విభిన్న జంతుజాతుల ఉనికికి ఇంధనంగా ఉన్న ఈ ఆవృతబీజాల అద్భుత భిన్నత్వం, విజయం గురించి శాస్త్రవేత్తలు 200 సంవత్సరాల పాటు చాలా ఊహాగానాలు చేశారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ‘‘వారసత్వంగా వచ్చిన చిన్న చిన్న మార్పులను సంరక్షించుకోవటం పెంపొందించుకోవటం ద్వారా మాత్రమే ప్రకృతి వరణం జరుగుతుంది’’ అని డార్విన్ చెప్పాడు

''డైజీలు పుట్టుగాక''

పుష్పించే మొక్కల ఆకస్మిక పుట్టుక గురించి కానీ, అవి లెక్కలేని సంఖ్యలో భిన్నరూపాల్లో విస్తరించటం గురించి కానీ డార్విన్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ''ప్రకృతిలో ఒక్కసారిగా పెను మార్పు రాబోదని తను బలంగా నమ్మిన దానికి చాలా తీవ్రమైన మినహాయింపుగా ఉన్న ఆవృతబీజాల ఆవిర్భావం గురించి మాత్రమే ఆయన ఆందోళన'' అని ఫ్రీడ్‌మాన్ చెప్పారు.

''ఒక సంభావ్య సిద్ధాంతం ఏమిటంటే.. ఈ పుష్పించే మొక్కలు సృష్టించబడి ఉండొచ్చు'' అంటూ సృష్టి సిద్ధాంతాన్ని ఉటంకించారు ఫ్రీడ్‌మ్యాన్. సృష్టి సిద్ధాంతం అంటే.. దేవుడు లేదా మానవాతీత శక్తి ఈ ప్రపంచాన్ని సృష్టించిందనే విశ్వాసం.

''మరో రకంగా చెప్తే.. ఆవృతబీజాలు పరిణామ ఫలితం కాదు. దేవుడు వాటిని తయారు చేసి ఉంటాడు.. ఒక రోజు 'బూమ్! డైజీలు పుట్టుగాక' అనుండాలి. ఆ తర్వాత.. 'బూమ్! చంపకం చెట్లు పుట్టుగాక' అని, మళ్లీ 'బూమ్! గడ్డి పుట్టుగాక' అని.. అలా వరుసగా అనుండాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

13 కోట్ల సంవత్సరాల కిందటి శిలాజాల చరిత్ర ప్రకారం.. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరిగినట్లు కనిపించింది.

కానీ.. డార్విన్ మరొక వివరణ ప్రతిపాదించాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చార్లెస్ డార్విన్ హెచ్‌ఎంఎస్ బీగిల్ ఓడలో ప్రపంచమంతా పర్యటించాడు

మాయమైన భూ ఖండం

''బహుశా చాలా చాలా కాలం కిందట దక్షిణార్థ గోళంలో ఒక చిన్న మారుమూల ఏకాంత ఖండం ఉండి ఉండొచ్చునని.. ఈ ఉన్నతస్థాయి మొక్కలకు (ఆవృతబీజాలకు) అది జన్మస్థానంగా ఉపకరించి ఉండవచ్చునని నేను అనుకుంటున్నా'' అని జోసెఫ్ హుకర్‌కు రాసిన లేఖలో డార్విన్ రాశాడు.

అయితే.. ''ఇది చాలా దిక్కుమాలిన అల్పమైన ఊహ'' అని డార్విన్ స్వయంగా అంగీకరించాడు. అయితే.. 1831-1836 సంవత్సరాల మధ్య హెచ్‌ఎంఎస్ బీగిల్ మీద ప్రయాణిస్తూ.. దక్షిణ అమెరికా తీర ప్రాంతాన్ని పరిశోధిస్తూ.. తను తెలుసుకున్న ప్రపంచం చుట్టూ సముద్రయానం చేస్తూ నేర్చుకున్న అంశాల ప్రాతిపదిగా ఆయన ఈ ఊహ చేశాడు. ఐదేళ్ల సముద్రయానం అనంతరం 27 ఏళ్ల వయసులో ఇంటికి తిరిగివచ్చాడు డార్విన్.

మరొక సంభావ్యత గురించి కూడా డార్విన్ ఊహించాడు.

పుష్పించే మొక్కల పరిణామక్రమంలో ప్రతి దశనూ వివరించే శిలాజాలు ఎక్కడో ఉండి ఉండొచ్చునని.. వాటిని మనం ఇంకా కనిపెట్టి ఉండకపోవచ్చుననేది ఆ ఊహ.

మొత్తానికి ఈ రహస్యాన్ని డార్విన్ పరిష్కరించలేదని ఫ్రీడ్‌మాన్ పేర్కొన్నారు. అదేసమయంలో ''అద్భుతాలను నమ్మటానికి ఆయన తిరస్కరించాడు. దానికి బదులుగా హేతుబద్ధ ఆలోచనలను, ప్రకృతి సార్వజనీన నియమాలను అనుసరించాడు'' అని వివరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆవృతబీజాల పుట్టుక ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని మిస్టరీగానే ఉంది

నేటి విసుగు పుట్టించే రహస్యం

''ఈ సమస్య అంతా పరిష్కారమవటం చూడాలని నేను అనుకుంటున్నా'' అని హుకర్‌కు రాసిన లేఖలో డార్విన్ పేర్కొన్నాడు.

కానీ.. ''ఆ పరిష్కారాన్ని చూడటానికి డార్విన్ ఎక్కువ కాలం జీవించలేదు'' అని ఫ్రీడ్‌మాన్ వ్యాఖ్యానించారు.

ఆవృతబీజాల పుట్టుక, విభిన్న జాతులుగా విస్తరించటం మీదే ఫ్రీడ్‌మాన్ పరిశోధన కేంద్రీకృతమై ఉంది.

''పుష్పించే మొక్కలు విభిన్న జాతులుగా రూపాంతరం చెందిన తొలి దశలను అర్థం చేసుకోవటానికి తోడ్పడిన విలువైన శిలాజాలను మేం వెలికితీశాం. నిజానికి ఈ పరిశోధనలో గత 30 ఏళ్లలో చాలా పురోగతి ఉంది'' అని ఆయన వెల్లడించారు.

ఆవృతబీజాలు ఆకస్మికంగా ఆవిర్భంచలేదని.. అవి కూడా నెమ్మదిగా పరిణామం చెందుతూ వచ్చాయని ఇటీవల ప్రచురించిన పరిశోధన ఫలితాలు బహిర్గతం చేశాయి.

భూమి మీద సజీవంగా ఉన్న మొక్క జాతుల్లో దాదాపు 90 శాతం 3.50 లక్షల పుష్పించే మొక్కల జాతులే ఉన్నాయి. అవి లేకపోతే.. మన ప్రధాన పంటలేవీ లేవు, పశువుల పోషణకు ఉపయోగించే పంటలూ లేవు, మన బొగ్గుపులుసు వాయువులను పీల్చుకుని శుభ్రం చేసే అత్యంత ముఖ్యమైన వృక్ష సంపదా ఉండదు.

అయినా.. కొన్ని కీలక ప్రశ్నలకు ఇంకా జవాబులు దొరకలేదు: పువ్వులు ఎలా పుట్టాయి? పువ్వుల ప్రాధమిక నిర్మాణం ఎక్కడి నుంచి వచ్చింది? పుష్పించే మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి అంత అద్భుతంగా విజయం సాధించటానికి కారణం ఏమిటి?

''విసుగుపుట్టించే ఈ రహస్యం కొనసాగుతూనే ఉంది'' అంటారు ఫ్రీడ్‌మాన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు