తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువ తెలివితేటలు ఉంటాయా... పాలిచ్చే తల్లి మద్యం తాగవచ్చా?

  • 4 ఆగస్టు 2019
తల్లీబిడ్డలు Image copyright Getty Images

పిల్లల పెంపకం గురించి ఓ ఆర్థికవేత్త మనకు నేర్పగలిగేది ఏముందంటారా? అయితే, పేరెంటింగ్ సమస్యలపై ఎమిలీ ఓస్టర్ అనే ఆర్థికవేత్త, వందలాది అధ్యయనాలను విశ్లేషించి ఓ 13 సూత్రాలను నిర్ధరించారు.

తల్లిదండ్రులకు ప్రతి రోజూ ఆందోళనే. చాలా ప్రశ్నలు వేధిస్తుంటాయి. పసిపిల్లలు కదలకుండా బట్టల్లో చుట్టేయవచ్చా? చనుబాలు ఇస్తున్నపుడు మద్యం సేవించవచ్చా? పిల్లలు టీవీ కానీ, ఫోన్ కానీ ఎంతసేపు చూడనివ్వొచ్చు?

డాక్టర్లు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, పుస్తకాలు, ఇంటర్నెట్... కొన్నిసార్లు అపరిచితుల నుంచి కూడా ఎన్నో సలహాలు వస్తుంటాయి. ఒకదానికొకటి పొంతన ఉండదు. దేనిని నమ్మాలో తెలియదు. ఏం చేయాలో అర్థంకాదు.

అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో అర్థశాస్త్రం విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఎమిలీ ఓస్టర్ కూడా.. గర్భవతిగా ఉన్నపుడు తనకు ఎదురైన పరస్పర విరుద్ధ సలహాలతో గందరగోళానికి గురయ్యారు.

అయితే, గణాంకాల విశ్లేషణలో తనకున్న శిక్షణను, అనుభవాన్ని ఉపయోగించుకుంటూ వైద్య రచనలను స్వయంగా సమీక్షించి తనే ఒక పుస్తకం రాశారు. గర్భవతిగా ఉన్నపుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది వివరిస్తూ 'ఎక్స్‌పెక్టింగ్ బెటర్' అనే శీర్షికతో తన తొలి రచనను ప్రచురించారు.

ఇప్పుడు ఆమె తల్లి అయ్యారు. అదే పద్ధతిలో.. పిల్లల పెంపకానికి సంబంధించి వందలాది అధ్యయనాలను విశ్లేషించి 'క్రిబ్‌షీట్' అనే శీర్షికతో తాజా పుస్తకాన్ని ప్రచురించారు. సులభంగా ఆందోళనలేమీ లేకుండా పిల్లల పెంపకం, సంరక్షణ ఎలా సాగించవచ్చో అందులో వివరించారు.

తల్లిదండ్రులకు ఆమె ఇస్తున్న సలహాలు ఇవీ:

1. తల్లిపాలు తాగించటం సర్వరోగనివారిణి కాదు

''తల్లిపాలు తాగించటం వల్ల చిన్నారి ఆరోగ్యానికి స్వల్పకాలికంగా కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయనే విషయాన్ని సమర్థించే సమాచారం ఉంది. కొన్ని ఎలర్జీ ర్యాషెస్, పేగుల్లో సమస్యలు, చెవుల్లో ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలకు తల్లిపాలు పరిష్కారమవుతాయి. కానీ.. తల్లిపాలతో పిల్లలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయనే అంశాన్ని బలపరిచే సమాచారం లేదు. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువ తెలివితేటలు ఉంటాయని, ఊబకాయం, క్యాన్సర్, డయాబెటిస్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఏ అధ్యయనమూ చెప్పటం లేదు.

అయితే, పిల్లలకు చనుబాలు తాగించటం వల్ల తల్లికి కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందనేది వాస్తవం. అనేక ప్రాంతాల్లో నిర్వహించిన అనేక అధ్యయనాలు.. పిల్లలకు చనుబాలు పట్టే తల్లికి రొమ్ము క్యాన్సర్ ప్రమాదం 20 నుంచి 30 శాతం తగ్గుతుందని సూచిస్తున్నాయి'' అని ఎమిలీ వివరించారు.

2. చనుబాలు పట్టేటపుడు కొంత మద్యం సేవించవచ్చు

''మద్యం సేవించినపుడు.. చనుబాలలో ఉండే ఆల్కహాల్ స్థాయి.. మన రక్తంలో సాధారణంగా ఉండే ఆల్కహాల్ స్థాయిలోనే ఉంటుంది'' అని ఆమె పేర్కొన్నారు.

''చిన్నారి పాలు తాగుతుంది కానీ నేరుగా మద్యం తాగదు. కాబట్టి.. వారి కడుపులోకి వెళ్లే ఆల్కహాల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అతిగా మద్యం తాగటం వాంఛనీయం కాదు. కానీ ఒక గ్లాసు వైన్ లేదా బీరు తాగిన తర్వాత చనుబాలు పిల్లలకు తాపకుండా పిండి పారబోయాల్సిన అవసరం లేదు'' అని చెప్పారు.

అలాగే.. పిల్లలకు అసలు ఆల్కహాల్ పొడే తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే.. ఒక గ్లాసు మద్యం తాగిన రెండు గంటల వరకూ పిల్లలకు చనుబాలు ఇవ్వకుండా ఉండొచ్చని.. ఈలోగా మద్యం జీర్ణమైపోతుందని ఆమె చెప్పారు. ఒకవేళ రెండు గ్లాసుల మద్యం తాగితే నాలుగు గంటల వేచి ఉండాలని సూచించారు.

Image copyright Getty Images

3. డాక్టర్ రాసిస్తే.. కుంగుబాటు తగ్గించే మందులు వాడొచ్చు

''డిప్రెషన్ అంటే కుంగుబాటును తగ్గించటానికి వాడే మందులు అన్నీ చనుబాలలోకి వస్తాయి.. కానీ ఆ పాలు తాగిన పిల్లల మీద ఆ మందులు ప్రతికూల ప్రభావం చూపుతాయనేందుకు ఆధారాలు లేవు'' అని ఎమిలీ వివరించారు.

ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ చాలా తీవ్రమైనదని.. దానికి చికిత్స ముఖ్యమని అంటారామె. అయితే.. ఆరోగ్య సమస్యలు ఏవైనా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

4. పసిపిల్లలను తొలి నెలల్లోనే వేరే గదిలో పడుకోపెట్టవచ్చా...

పసిపిల్లలను ఆకస్మిక మరణం సంభవించే పరిస్థితి (సడన్ ఇన్‌ఫాంట్ డెత్ సిండ్రోమ్) నుంచి రక్షణగా.. కనీసం పుట్టిన మొదటి ఆరు నెలల పాటు.. వీలైతే సంవత్సరం నిండే వరకూ.. తల్లితో ఒకే గదిలో ఉంచటం మంచిదని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సిఫారసు చేస్తోంది.

అయితే.. తల్లీ బిడ్డలు తొలి నెలల్లోనే వేర్వేరు గదుల్లో నిద్రించటం వల్ల ప్రయోజనాలున్నాయని అంటున్నారు ఎమిలీ.

''మీ చిన్నారి, మీరూ ఒకే గదిలో ఉండాలనుకుంటే నిరభ్యంతరంగా ఉండొచ్చు. తొలి రోజుల్లో తల్లీబిడ్డలు ఒకే గదిలో ఉండటం మంచిదని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. కానీ.. ఏడాది పాటు తల్లీబిడ్డలను ఒకే గదిలో ఉంచటం వల్ల స్పష్టమైన ప్రయోజనాలేమీ కనిపించటం లేదు. పైగా, ఇరువురూ తక్షణమే కాదు, దీర్ఘకాలంలోనూ నిద్రను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది'' అని ఆమె పేర్కొన్నారు.

5. పిల్లలు, పెద్దవాళ్లు పక్కపక్కన సోఫా మీద పడుకోవటం చాలా ప్రమాదం

''పిల్లలు పడుకునే ప్రదేశాలన్నిటిలోకీ, ఒకటి చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది: పెద్ద వాళ్లతో కలిసి పిల్లలు కూడా ఒకే సోఫా మీద పడుకోవటం. ఇది సాధారణ రిస్కు కన్నా దీనివల్ల మరణాల రేటు 20 నుంచి 60 రెట్లు ఎక్కువగా ఉంది. కాబట్టి అలా చేయవద్దు.''

6. పిల్లలను దుప్పట్లలో చుట్టాలా? వద్దా?

పిల్లలను దుప్పటితో చుట్టవచ్చు. పిల్లల తొలి నెలల్లో దుప్పట్లలో చుట్టటం వల్ల వారు ఏడవటం తగ్గటంతో పాటు నిద్ర పెరుగుతుందని చాలా అధ్యయనాలు చెప్పాయి. అయితే, ఇలా దుప్పటి చుట్టినపుడు చిన్నారి కాళ్లూ, పిరుదులు కదలించటానికి వీలు ఉండేలా చూడటం చాలా ముఖ్యం.

Image copyright Getty Images

7. ప్రసవం తర్వాత శృంగారానికి ఎంత కాలం వేచివుండాలి?

''సాధారణంగా, ప్రసవం తర్వాత ఆరు వారాల వరకూ సెక్స్ వద్దన్న నిబంధనను అందరూ అంగీకరించిన నిబంధన. ఈ నిబంధనకు ఆధారాలు ఉండి ఉంటాయని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా కల్పితం'' అంటారు ఎమిలీ.

ప్రసవం తర్వాత సెక్స్ ప్రారంభించటానికి ఇంత కాలం విరామం ఇవ్వాలన్న నిబంధనేమీ లేదు. అయితే.. శారీరకంగా ప్రసవ సమయంలో చీలిక ఏర్పడినట్లయితే అది మానే వరకూ వేచి ఉండటం ముఖ్యంమని ఆమె పేర్కొన్నారు.

8. టీకాలు.. వేయించాలి

బాల్యంలో టీకాలు వేయించటం చాలా సురక్షితం. అది ఆ పిల్లలతో పాటు, ఇతరుల్లోనూ వ్యాధులను నిరోధిస్తాయి.

9. పిల్లలను ఏడ్చిన తర్వాత నిద్రపుచ్చే శిక్షణ పనిచేస్తుంది

ఈ పద్ధతులు ప్రభావవంతంగా ఉంటాయని ఎమిలీ నిర్ధారించారు. ఇది చిన్నారికి ఎటువంటి చేటూ చేయదని.. పైగా తల్లి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుతుందని చెప్పారు. ఇలా చేయటం వల్ల అపరాధన భావన అవసరం లేదన్నారు.

10. పిల్లల కోసం తల్లి ఇంట్లోనే ఉండాలా? వద్దా?

తల్లులు మాతృత్వ సెలవు తీసుకోవటం వల్ల పిల్లకు ప్రయోజనం. అయితే.. ఇంట్లోనే ఉండే తల్లి లేదా తండ్రి వల్ల పిల్లల మీద సానుకూలమైన లేదా ప్రతికూలమైన ప్రభావం ఏదైనా ఉంటుందా అనే దానికి ఏ ఆధారాలూ లేవు.

11. డే కేర్ సంరక్షణలో ఉండే పిల్లలకు తల్లితో అనుబంధం తక్కువా?

ఈ విషయంలో పిల్లల పెంపకంలో నాణ్యత ముఖ్య పాత్ర పోషిస్తుంది. పిల్లు డే-కేర్‌లో ఉండే సమయం వల్ల తల్లితో అనుబంధం విషయంలో ఎటువంటి మార్పూ ఉండదు.

Image copyright Getty Images

12. రెండేళ్ల వయసు లోపు పిల్లలు టీవీ ద్వారా నేర్చుకుంటారా?

నేర్చుకోలేరు. అయితే, మూడు నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలు టీవీ చూసి నేర్చుకోగలరు. సెసేమ్ స్ట్రీట్ వంటి కార్యక్రమాలను వీక్షించటం ద్వారా పదాలు, వాటి వినియోగం వంటి వాటిపై అవగాహన పెంచుకోగలరు.

అయితే.. టీవీ చూడటం వారు పరీక్షల్లో సాధించే మార్కుల మీద ప్రభావం చూపదు. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు వంటివి వీక్షించటం గురించిన సమాచారం ఇంకా తెలియదు.

13. పిల్లలతో సంభాషిస్తూ చదవటం ఉత్తమం

పిల్లలకు పుస్తకం చదివి వినిపించటం కన్నా.. 'ఆ పక్షి అమ్మ ఎక్కడుందని అనుకుంటున్నావు?' 'హ్యాట్‌లో ఉన్న క్యాట్ ఇప్పుడు ఏమనుకుంటుందో చెప్తావా?' అనే తరహా ప్రశ్నలు అడుగుతూ ఉండాలి.

ప్రొఫెసర్ ఎమిలీ ఓస్టర్ బీబీసీ రేడియో 4 కార్యక్రమం 'విమెన్స్ అవర్'తో మాట్లాడారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)