పాకిస్తాన్‌లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’

  • 1 ఆగస్టు 2019
శివాలా తేజా సింగ్ Image copyright RANA USMAN KHAN

పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో ఓ హిందూ మందిరం తెరుచుకుందన్న వార్త భారత మీడియాలో బాగా ప్రచారమైంది. అది శివాలా తేజా సింగ్ మందిరమని, 72 ఏళ్ల తర్వాత మళ్లీ సోమవారమే అందులో పూజలు, అర్చనలు మొదలయ్యాయని చాలా కథనాలు వచ్చాయి.

దివంగత చరిత్రకారుడు రషీద్ నియాజ్ రచించిన 'హిస్టరీ ఆఫ్ సియాల్‌కోట్' పుస్తకం ప్రకారం ఆ మందిరం దాదాపు 1000 ఏళ్ల పురాతనమైంది.

అయితే, గత మే లోనే ఆ గుడి తెరుచుకుందని పాకిస్తాన్ పాత్రికేయులు చెబుతున్నారు.

Image copyright RANA USMAN KHAn

పాకిస్తాన్‌లోని అల్పాసంఖ్యాక వర్గాల్లో హిందువులే అతిపెద్ద వర్గం. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 75 లక్షల మంది హిందువులు పాక్‌లో ఉన్నారు.

భారత్-పాక్ విభజన సమయంలో, బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత పాక్‌లోని హిందువుల గుళ్లు, ఇతర ప్రార్థన స్థలాలకు చాలా నష్టం జరిగింది.

గత మే లోనే ఈ మందిరం తెరుచుకుందని, అప్పటి నుంచే పూజలు కూడా జరుగుతున్నాయని సియాల్‌కోట్‌లోని పాక్ న్యూస్ ఛానెల్ జియో టీవీ ప్రతినిధి ఒమర్ ఎజాజ్‌ అన్నారు.

సియాల్‌కోట్‌లో దాదాపు 150 హిందూ కుటుంబాలు ఉన్నాయని, వాళ్లు అభ్యర్థన ఇచ్చిన తర్వాత చాలా త్వరగా ఈ గుడిని ప్రభుత్వం తెరిచిందని వివరించారు.

Image copyright ANI

72 ఏళ్ల తర్వాత ఆ మందిరం తెరుచుకోవడం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు.

1992లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగినప్పుడు ఈ గుడిపై దాడి జరిగిందని, అప్పుడు మందిరం పాక్షికంగా ధ్వంసమైందని పేర్కొన్నారు.

''జిల్లా ప్రభుత్వ అధికారులు వచ్చి ఆ గుడిని తెరిచారు. మందిర పునర్నిర్మాణం కోసం నిధుల సేకరణ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందువుల పండుగలు, ఉత్సవాలను కవర్ చేసేందుకు మేం అక్కడికి వెళ్తేండేవాళ్లం. అక్కడ హిందువులకు అన్ని రకాల భద్రత ఏర్పాట్లూ ఉంటాయి'' అని ఎజాజ్ చెప్పారు.

ఆ గుడి ఏయే దేవతలదో తనకు తెలియదని, అయితే లోపల విగ్రహాలు మాత్రం ఉన్నాయని ఆయన అన్నారు. ఆలయ గోడలపైనా చిత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Image copyright RANA USMAN KHAN

ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతమైనా, తమ గుడిని తెరిచినందుకు హిందువులు సంతోషంగా ఉన్నారని ఎజాజ్ అన్నారు.

శివాలా తేజా సింగ్ లాంటి చాలా మందిరాలు, పురాతన గురుద్వారాలు ఇంకా మూతపడే ఉన్నాయని పాక్ అధికార పార్టీ పీటీఐ ఎంపీ రమేశ్ కుమార్ వాంక్వానీ బీబీసీతో అన్నారు.

భారత్-పాక్ విభజన తర్వాత హిందువులు చాలా మంది భారత్‌కు వెళ్లడంతో ఆలయాల బాగోగులు చూసేవారు కరువయ్యారని, చాలా గుళ్లు కమర్షియల్ కాంప్లెక్స్‌లుగా మారిపోయాయని ఆయన చెప్పారు.

చిత్రం శీర్షిక పాక్ ఎంపీ రమేశ్ కుమార్ వాంక్వానీ

''ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ఐటీపీబీ) ఆధ్వర్యంలో 1130 గుళ్లు, 517 గురుద్వారాలు ఉండేవి. వాటిలో 30 గుళ్లు, 17 గురుద్వారాలు మాత్రమే ఇప్పుడు నడుస్తున్నాయి'' అని రమేశ్ కుమార్ వివరించారు.

''భారత్‌లో ఇస్లామిక్ సంస్థలకు అధ్యక్ష పదవుల్లో ముస్లింలే ఉంటారు. అలాగే, ఐటీపీబీకి హిందువే అధ్యక్షుడిగా ఉండాలని భారత ప్రధానిగా నెహ్రూ, పాక్ ప్రధానిగా లియాకత్ ఖాన్‌ ఉన్నప్పుడు అంగీకారం కుదిరింది. కానీ, ఇంతవరకూ ఆ అవకాశం హిందువులకు దక్కలేదు. ఐటీపీబీ అధ్యక్ష పదవిలో హిందువు ఉంటేనే, ఆ గుళ్లూ, గురుద్వారాలు తెరుచుకుంటాయి. లేకపోతే ఏడాదికి ఒక్కొక్కటి చొప్పున తెరుచుకోవాలంటే.. 1100 మందిరాలకు ఎన్నేళ్ల సమయం పడుతుంది'' అని రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)