మలేషియా అడవుల్లో అదృశ్యమైన బ్రిటిష్ టీనేజర్ నోరా ఖ్వోయిరిన్ మృతదేహం లభ్యం

  • 14 ఆగస్టు 2019
నోరా Image copyright LUCIE BLACKMAN TRUST/FAMILY HANDOUT/PA MEDIA

మలేషియాలోని అడవుల్లో పది రోజుల క్రితం అదృశ్యమైన బ్రిటిష్ టీనేజి అమ్మాయి నోరా ఖ్వోయిరిన్ మృతదేహం ఆ కుటుంబం బస చేసిన డుసన్ రిసార్ట్ సమీపంలోనే లభ్యమైంది. ఆమె మృత దేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు.

ఆ మృతదేహం అదృశ్యమైన 15 ఏళ్ళ నోరా ఖ్వోరిన్‌దేనని ఆమె తల్లిదండ్రులు ధ్రువీకరించినట్లు పోలీసులు తెలిపారు.

బుధవారంనాడు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తారు.

మృతదేహం దొరికిన ప్రదేశం రిసార్టుకు రెండు కిలోమీటర్ల దూరం లోపే ఉందని బీబీసీ ప్రతినిధి హోవర్డ్ జాన్సన్ చెప్పారు.

లండన్ నుంచి మలేషియాకు విహారయాత్రకు వచ్చిన నోరా కుటుంబం ఈ నెల 3న డసన్ రిసార్టులో దిగింది. మరుసటి రోజు నోరా అదృశ్యమైంది.

ఆమె జాడ కోసం దట్టమైన అడవుల్లో దాదాపు 350 మంది గాలించారు.

ప్రత్యేక అవసరాలున్న తమ బిడ్డ నోరా ఆచూకీ చెబితే 10 వేల పౌండ్లు (సుమారు 8.6 లక్షల రూపాయలు) ఇస్తామని తల్లిదండ్రులు నిన్న ప్రకటించారు.

ఆమె అన్వేషణలో మలేషియా పోలీసులకు ఉత్తర ఐర్లాండ్, ఫ్రాన్స్ పోలీసులు కూడా సహకారం అందించారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక నోరా అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదైంది.

నోరా అదృశ్యం, అన్వేషణపై ఆగస్టు 8న బీబీసీ ఇచ్చిన కథనంలోని అంశాలు...

డసన్ రిసార్టులో ఈ నెల 4న ఆదివారం ఉదయం తల్లిదండ్రులు నిద్రలేచి చూడగా నోరా ఆమె పడకగదిలో కనిపించలేదు. గది కిటికీ తెరిచి ఉంది.

అదృశ్యం కేసుగా పరిగణిస్తున్న మలేషియా పోలీసులు, నోరా ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

తమ కుమార్తె అపహరణకు గురై ఉండొచ్చని తల్లిదండ్రులు ఒక ప్రకటనలో చెప్పారు.

నోరా ఎన్నడూ ఒంటరిగా ఎక్కడకీ వెళ్లదని, ఆమె తప్పిపోయిందనుకొనేందుకు అవకాశమే లేదని తెలిపారు.

Image copyright EPA/STR MALAYSIA OUT

ఉత్తర ఐర్లాండ్, ఫ్రాన్స్‌లకు చెందిన నోరా తల్లిదండ్రులు దాదాపు 20 ఏళ్లుగా లండన్‌లో ఉంటున్నారు. రెండు వారాల పర్యటన కోసం ఈ నెల 3న నోరా కుటుంబం మలేషియాలోని సెరెంబన్ సమీపాన ఉన్న అటవీ ప్రాంతంలోని రిసార్టుకు వచ్చింది. ఇది మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు దాదాపు 63 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కూతురు కనిపించడం లేదని ఈ నెల 4న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకు ఆమె తండ్రి గుర్తించారు.

తమ కుమార్తె ఆమె వయసున్న ఇతర టీనేజర్ల మాదిరి కాదని కుటుంబం తెలిపింది. అంతకన్నా తక్కువ వయసున్న బాలికలా కనిపిస్తుందని, తన పనులు తాను చక్కబెట్టుకోలేదని, జరిగే వాటిని అర్థం చేసుకోలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారు.

Image copyright The Dusun
చిత్రం శీర్షిక ఈ రిసార్టులో గరిష్ఠంగా 20 మంది ఉండొచ్చు.

రిసార్టుకు చుట్టుపక్కలున్న అటవీ ప్రాంతాల్లోనూ, దగ్గర్లోని నది వెంబడి కూడా పోలీసులు, అగ్నిమాపక విభాగం, ఇతర విభాగాల సిబ్బంది గాలింపు జరుపుతున్నారు. గ్రామస్థులనూ ప్రశ్నిస్తున్నారు.

అన్వేషణలో హెలికాప్టర్లు కూడా వాడుతున్నారు.

దట్టమైన ఈ అటవీ ప్రాంతంపై స్థానిక 'ఒరంగ్ అస్లీ' ప్రజలకు బాగా అవగాహన ఉంటుంది.

గాలింపు బృందాలు వీరి సహాయం తీసుకొంటున్నాయి. దాదాపు 180 మంది గాలింపులో పాల్గొంటున్నారు.

Image copyright Other
చిత్రం శీర్షిక నోరా

నోరా పాస్‌పోర్టు, ఇతర వస్తువులు కుటుంబ సభ్యుల వద్దే ఉన్నాయని పోలీసు అధికారి చే జకారియా ఓథ్‌మాన్ చెప్పారు.

రిసార్టు వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు కొంత పరిధి వరకే పనిచేస్తాయి.

నోరా తప్పిపోయి ఉంటుందని, ఎంతో దూరం వెళ్లి ఉండదని పోలీసులు భావిస్తున్నారని బీబీసీ ఆగ్నేయాసియా ప్రతినిధి జొనాథన్ హెడ్ తెలిపారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక నోరా అన్వేషణలో మలేషియా పోలీసులు హెలికాప్టర్లు కూడా వాడుతున్నారు.

ఈ అటవీ ప్రాంతంలో ఎలా వెళ్లాలో కొత్తవాళ్లకు తెలియదని, అందువల్ల నోరా ఆచూకీ గురించి ఆందోళన కలుగుతోందని గాలింపులో పాల్గొంటున్న గ్రామస్థుడు బాలి అనక్ అకావు చెప్పారు.

నోరా అదృశ్యం రిసార్టు యాజమాన్యానికి అంతుచిక్కడం లేదని అధికార ప్రతినిధి హానిమ్ బమధాజ్ తెలిపారు.

తమ రిసార్టు పదేళ్లుగా నడుస్తోందని, ఎన్నడూ దొంగతనం కూడా జరగలేదని ఆమె చెప్పారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక పోలీసు, అగ్నిమాపక, ఇతర విభాగాల సిబ్బంది గాలింపులో పాల్గొంటున్నారు.

తితివాంగ్సా పర్వతాలకు దగ్గర్లో, నాలుగు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బెరంబన్ ఫారెస్ట్ రిజర్వ్‌ను ఆనుకొని 12 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల తోటల మధ్య తమ రిసార్టు ఉందని రిసార్టు వెబ్‌సైబ్ చెబుతోంది.

ఇందులో మొత్తం ఏడు నివాసాల్లో కలిపి గరిష్ఠంగా 20 మంది ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)