వాట్సాప్‌లో కొత్త సమస్య.. మీ మెసేజ్‌లను వక్రీకరించి పంపొచ్చు

  • 8 ఆగస్టు 2019
వాట్సాప్ Image copyright Reuters

ఒక టూల్‌తో వాట్సాప్‌లో మీరు పంపే మెసేజ్‌లను వక్రీకరించే అవకాశం ఉంది. వాట్సాప్‌లోని ఈ లోపాన్ని పరిశోధకులు బయటపెట్టారు.

ఒక వ్యక్తి చెప్పని పదాలను చెప్పినట్లుగా వారి మెసేజ్‌ను మార్చడానికి ఈ టూల్‌ను ఎలా ఉపయోగించవచ్చో సైబర్‌ సెక్యూరిటీ సంస్థ చెక్‌పాయింట్ బృందం ప్రదర్శించింది.

ఈ టూల్‌తో మన మేసేజ్‌లను వక్రీకరించడం సాధ్యమేనని పరిశోధకులు ఓడెడ్ వనును బీబీసీకి చెప్పారు.

అయితే, దీనిపై వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

లాస్ వేగాస్‌లోని బ్లాక్ హాట్‌లో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఈ బృందం టూల్‌పై ప్రదర్శన ఇచ్చింది. గతేడాది చెక్‌పాయింట్ ప్రచురించిన పరిశోధనా పత్రానికి కొనసాగింపుగా ఈ సమావేశం నిర్వహించింది.

Image copyright EPA

'వాట్సాప్ యూజర్ ఫేక్ న్యూస్‌ను సృష్టించడానికి, మోసం చేయడానికి అనుమతించే దుర్బలత్వం ఇది' అని వనును వివరించారు.

ఈ టూల్ ఒక యూజర్ వాట్సాప్‌లో చెప్పని అంశాన్ని చెప్పినట్లుగా మార్చడానికి అవకాశం కల్పిస్తుంది.

''ఒక వ్యక్తి పంపిన మెసేజ్‌ను పూర్తిగా మార్చేయవచ్చు. ఒక వ్యక్తి కోట్ చేసిన పదాలను పూర్తిగా వక్రీకరించవచ్చు'' అని వనును చెప్పారు.

మెసేజ్ పంపినవారిని గుర్తించడానికి, అతని మెసేజ్‌ను వక్రీకరించడానికి మరో వ్యక్తికి ఈ టూల్ అవకాశం కల్పిస్తుంది.

గతంలో పరిశోధకులు గుర్తించిన ఒక లోపాన్ని ఫేస్‌బుక్ విజయవంతంగా పరిష్కరించింది.

ఆ లోపం ఏంటంటే, యూజర్ తాను ఒక వ్యక్తికే మెసేజ్ పెడుతున్నట్లు నమ్మేట్టు చేసి ఆ మెసేజ్‌ను పబ్లిక్ గ్రూప్‌లోకి పంపించడం.

అయితే, వాట్సాప్‌కు సంబంధించి 'మౌలిక సదుపాయాల పరిమితులు' వల్ల కొన్ని సమస్యలను పరిష్కరించలేక పోయామని ఫేస్‌బుక్ తమకు చెప్పినట్లు వనును తెలిపారు.

Image copyright Reuters

ముఖ్యంగా, వాట్సాప్ ఉపయోగించే ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీని చేధించడం చాలా కష్టమని, యూజర్లు పంపే మెసేజ్‌ల ప్రామాణికతను పర్యవేక్షించడం, ధ్రువీకరించడం కంపెనీకు కూడా సాధ్యం కాదని పరిశోధకులు చెబుతున్నారు.

ఒక యాప్‌లోని లోపాలను ఉపయోగించుకునే టూల్స్‌ను మీ బృందం ఎందుకు విడుదల చేస్తుందని బీబీసీ అడిగినప్పుడు, తమ పనిని వనును వెనకేసుకొచ్చారు. ఇది చర్చకు దారితీస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

'వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది ప్రజలు వినియోగిస్తున్నారు. ఇది మా బాధ్యత. వక్రీకరణలు, ఫేక్ న్యూస్‌తో చాలా సమస్యలున్నాయి' అని ఆయన చెప్పారు.

''దాదాపు 150 కోట్ల మందికి వాట్సాప్ సేవలు అందిస్తోంది. ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా ఉండలేం. వాట్సాప్‌లో సమాచారాన్ని వక్రీకరించి వ్యాప్తి చేయడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా ఇండియా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో ఫేక్‌న్యూస్ వ్యాప్తి వల్ల హింస, మూకదాడులు జరుగుతున్నాయి'' అని వనును తెలిపారు.

ఫేక్‌న్యూస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు వాట్సాప్ ఇటీవల మెసేజ్‌ను ఫార్వార్డ్ చేయడంపై పరిమితి విధించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)