డైనోసార్ శిలాజాలను కొనడంలో తప్పేముంది?

  • 11 ఆగస్టు 2019
శిలాజాల వేలం పాట Image copyright Empics

ఇటీవల లండన్‌లోని క్రిస్టీ సంస్థ వేలంపాటలో చాలా మంది పాల్గొన్నారు. అందమైన పెయింటింగ్‌నో, బంగారు ఆభరణాలను కొనడానికో కాదు ఒక శిలాజాన్ని కొనడానికి వాళ్లంతా అక్కడికి వచ్చారు.

పురాతన అవశేషాలను కొనడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. చాలా మంది ప్రైవేట్ కొనుగోలుదారులు శిలాజాలను ఆన్‌లైన్‌లో జరిగే వేలంపాటలో కొనుగోలు చేస్తున్నారు.

లక్షల ఏళ్ల నాటి డైనోసార్ కొమ్ములు, దంతాలు అక్కడ వేలంలో ఉన్నాయి. కాలిఫోర్నియా, హంగరీ నుంచి కూడా కొందరు ఆన్‌లైన్ వేలంలో పాల్గొన్నారు.

వేలంపాటలో నిర్వాహకులు శిలాజ డైనోసార్, వాటి దంతాలు, సొర చేప గుడ్లను వేలం వేశారు.

''ప్రైవేట్ కొనుగోలుదారులు గత కొన్నేళ్లుగా పురాతన అవశేషాలను కొనడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఇలాంటి వేలం పాటలో దాదాపు 50 దేశాలకు చెందినవారు తరచుగా పాల్గొంటున్నారు'' అని క్రిస్టీ సైన్స్, హిస్టరీ అధిపతి జేమ్స్ హైస్లోప్ తెలిపారు.

Image copyright Getty Images

ప్రముఖుల ఆసక్తి

హాలీవుడ్ నటులు లియోనార్డో డికాప్రియో, రసెల్ క్రోవ్, నికోలస్ కేజ్‌లు పురావస్తు సంపదను కొనుగోలు చేసినట్లు తెలియడంతో ఇప్పుడు ఇదో ఫ్యాషన్‌గా మారింది.

ఇటువంటి శిలాజాలు అత్యంత ఖరీదైన పెయింటిగ్స్‌ స్థాయిలో పోటీపడకపోవచ్చు. కానీ, వేలంపాటకు ఎక్కువ మంది వస్తున్నారు. దీంతో వేలంపాట విలువ కూడా పెరుగుతుంది.

పదేళ్ల కిందట ఏనుగుపక్షి గుడ్లను రూ.18 లక్షలకు పైగా వెచ్చించి కొన్నారు. ఇప్పుడు వాటి ధర రూ. 86 లక్షల వరకు ఉంది.

అరుదైన జాతులకు సంబంధించిన అవశేషాలను వినియోగదారులు పెద్ద మొతం చెల్లించి కొనుగోలు చేస్తున్నారని హస్లోప్ తెలిపారు.

Image copyright Beth Timmins/ eBay

నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, ఏటా 50 కొత్త జాతుల డైనోసార్ల అవశేషాలను కనుగొంటున్నారు.

ఆన్‌లైన్ ట్రేడింగ్ సైట్లు ఈబే, మోసాసౌర్‌లో శిలాజాల అమ్మకాలు ప్రాచుర్యం పొందాయి. యూకేలో ప్రతి నెలా వేలంపాటలో సరీసృపాల అవశేషాల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి.

గతేడాదితో పోల్చితే వీటి అమ్మకాలు 42 శాతం పెరిగాయి.

70 మిలియన్ ఏళ్ల నాటి డైనోసార్ పుర్రెను 2012లో అమెరికా నటుడు నికోలస్ కేజ్ కొనుగోలు చేశారు. అయితే, తర్వాత అది తమదంటూ మంగోలియా ప్రభుత్వం కోర్టుకెక్కింది.

Image copyright Bolortsetseg Minjin
చిత్రం శీర్షిక శిలాజాల వేలం పాట

ఈ న్యాయపోరాటంలో గెలుపొందిన పురాతత్వ శాస్త్రవేత్త బోలోర్ట్‌సెట్గ్ మిన్జిన్ మాట్లాడుతూ, 'మంగోలియా ప్రభుత్వం ఇంకా ఇలాంటి అనేక కేసులపై పోరాడుతోంది. పురాతత్వ అవశేషాలను ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేయడం వల్ల అరుదైన జాతులకు ప్రమాదం పొంచి ఉంది'' అని తెలిపారు.

అరుదైన శిలాజాలను ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకోవడం వల్ల శాస్త్రీయ పరిశోధనలకు అవరోధంగా మారుతోందని ఆమె అన్నారు.

''శిలాజాలను సేకరించే వేటగాళ్లకు నైపుణ్యం ఉండదు. వారు డబ్బు కోసం కావాల్సిన భాగాలను తీసుకుంటారు. ఉదాహరణకు అస్థిపంజరాలను ధ్వంసం చేసి కేవలం పళ్లు తీసుకోవడం'' అని ఆమె తెలిపారు.

ఆమూల్యమైన శిలాజ సంపదను వారు కేవలం వస్తువులుగానే చూస్తారు అని పేర్కొన్నారు.

ప్రైవేటు వ్యక్తులు శిలాజాల గురించి పూర్తిగా తెలసుకోకుండా కొనేయడంతో బ్లాక్ మార్కెట్‌లో వాటి ధర అమాంతం పెరుగుతోందని చెప్పారు.

వృద్ధి చెందుతున్న ప్రైవేట్ మార్కెట్ చట్టబద్దంగా ఉన్నప్పటికీ కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ఎర్త్ సైన్సెస్ విభాగానికి చెందిన డాక్టర్ సుసన్నా మైడ్మెట్ తెలిపారు.

Image copyright BOLORTSETSEG MINJIN

''సమస్య ఏమిటంటే, ఇలాంటి శిలాజాలను భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. మ్యూజియాల కంటే చాలా ఎక్కువ ధరకు వీరు కొంటారు.''

''ఇలాంటి శిలాజాలు మాత్రమే కాకుండా, మొత్తం మ్యూజియంలోని ఇతర నమూనాలను కొనడానికే మాకు ఏడాదికి పదివేల పౌండ్లు కేటాయిస్తారు. కానీ ఈ పెద్ద డైనోసార్ నమూనాలు కోట్లకు అమ్ముడుబోతాయి'' అని వివరించారు.

శిలాజాలు ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నప్పుడు శాస్త్రీయ పరిశోధనలకు అవరోధంగా మారతాయి అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

''లండన్ నేచురల్ మ్యూజియంలో ఉన్న సోఫీ అనే డైనోసార్ శిలాజం లక్షల ఏళ్ల కిందటిది. దీన్ని మ్యూజియం తీసుకోడానికంటే ముందు ఈ శిలాజానికి ఎన్ని ఎముకలున్నాయో ఎవరికీ తెలియదు'' అని డాక్టర్ మైడ్మెట్ అన్నారు.

మ్యూజియాలు అలాగే, ఇతర శాస్త్రీయ సంస్థలు ప్రైవేటు యాజమాన్యంలోని శిలాజాలపై పరిశోధన చేయవు. ఎందుకంటే ప్రైవేటు యజమానులు తమ వద్దనున్న శిలాజాన్ని పరిశీలించడానికి అనుమతించరు.

మరోవైపు, శిలాజాల అన్వేషణ, వాటి వెలికితీత చాలా శ్రమతో కూడినది, ఖరీదైనది.

Image copyright DR SUSANNAH MAIDMENT

''ఇదో ఇబ్బందికర పరిస్థితి. శిలాజాలను సేకరించేందుకు కావాల్సిన వనరులు లేవు. ప్రైవేటు సంస్థలు తవ్వుకుంటూ తీసుకెళ్తే వాటి గురించి మాకు తెలియదు'' అని డాక్టర్ మైడ్మెట్ చెప్పారు.

''ప్రైవేటు సంస్థలు లాభాల కోసం తవ్వకాలు చేపడతాయి. కానీ, అవసరమైన డాటాను సేకరించడం విస్మరిస్తాయి'' అని ఆమె తెలిపారు.

చాలా మంది ప్రైవేట్ కొనుగోలుదారులు తమ వస్తువులను ప్రదర్శించి, వాటిపై అధ్యయనం చేసినందుకు సంతోషంగా ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

శిలాజాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం రాకపోవచ్చు అని డైనోసౌరియా క్యూరేటర్ డాక్టర్ మాథ్యూ కారానో చెప్పారు.

ప్రైవేటు సంస్థలు శిలాజాల అమ్మకాలకు సంబంధించి ఎవరికంటా పడకుండా ఉండేందుకు వాటిని ఎలాంటి కేటలాగ్, ఖాతాలోనే చేర్చకుండా జాగ్రత్తపడతారని తెలిపారు.

"కొన్ని శిలాజాలకు సంబంధించి ఎలాంటి ప్రచారం లేకుండా క్రయవిక్రయాలు సాగుతాయి. అసలు అలాంటివి ఉన్నాయని తెలిసేటప్పటికే అవి ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లిపోతాయి'' అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)