ఏరియా 51: ‘ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపైకి వెళ్లలేదు. అమెరికా ఏలియన్స్‌ను బంధించి పెట్టింది’.. వీటిని మీరు నమ్ముతారా?

  • 11 ఆగస్టు 2019
ఏలియన్స్ Image copyright Getty Images

‘నాసా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చంద్రుడిపైకి పంపలేదు. భూమి మీదే చంద్రుడి సెట్ వేసి, వీడియో తీసి అందరినీ నమ్మించింది. ఏరియా 51 అనే ప్రాంతంలో అమెరికా సైన్యం గ్రహాంతరవాసులను బంధించి పెట్టింది. వాళ్ల నుంచే అధునాతన టెక్నాలజీని ఆ దేశం పొందుతోంది.’’

ఇలాంటి వదంతులను మీరు వినే ఉంటారు. కొందరు నమ్మి ఉంటారు కూడా.

వీటిని కుట్ర సిద్ధాంతాలు (కాన్‌స్పిరసీ థియరీస్) అని అంటారు. అంటే ఓ విషయం వెనుక ఏదో కుట్ర దాగుంది అని ప్రతిపాదించడం అన్నమాట.

బయటకు ఇవి ఆసక్తికరంగా, సరదాగా కనిపించవచ్చు. నమ్మి మనం ఇంకొకరికి చెబితే ప్రమాదం ఏముందని అనిపించవచ్చు.

కానీ, అలా అనుకోవడం పెద్ద పొరపాటు. కుట్ర సిద్ధాంతాలు ప్రచారమవ్వడం వల్ల కొన్నిసార్లు జనాలు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అలాంటి ఒక ఉదాహరణే వ్యాక్సిన్ల గురించి అమెరికాలో వ్యాపించిన వదంతులు.

వ్యాక్సిన్ల వల్ల చిన్న పిల్లల్లో ఆటిజం వస్తుందని చాలా కుట్ర సిద్ధాంతాలు వచ్చాయి. అమెరికాతోపాటు మెక్సికో, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఈ వదంతులను చాలా మంది నమ్ముతున్నారు. అపోహలతో తమ చిన్నారులకు వ్యాక్సిన్లు వేయించకుండా ఉంచుతున్నారు. ఫలితంగా ఆయా దేశాల్లో చాలాసార్లు భయంకరమైన అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 9/11 దాడుల గురించి ఎన్నో కుట్ర సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి

ఎలా అల్లుతారంటే..

కుట్ర సిద్ధాంతాలు ఒక రకమైన కట్టుకథలు.

జనాలకు ఎక్కువగా తెలియని, అర్థం కాని విషయాలకు ఇవి కొత్త వివరణలు ఇస్తుంటాయి. వీటి ప్రచారం వెనుక దురుద్దేశాలుంటాయి.

కుట్ర సిద్ధాంతాల్లో సాధారణంగా మూడు అంశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

అవే కుట్రదారుడు, పన్నాగం, జనాలను గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణ. ఈ మూడు విషయాలతో కుట్ర సిద్ధాంతాలను అల్లుతుంటారు.

కుట్ర సిద్ధాంతాలను అల్లేవారు తమ కట్టుకథల్లో ఏదైనా సంస్థ, దేశం, వ్యక్తులను కుట్రదారులుగా చూపుతుంటారని లండన్‌లోని ఓపెన్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ జోవన్ బైఫోర్డ్ అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రపంచాన్ని ఒకరు నియంత్రించవచ్చన్న భావన చాలా శక్తిమంతమైంది. చాలా వరకు కుట్ర సిద్ధాంతాలను అదే నమ్మేలా చేస్తుంది

‘‘ఓ పెద్ద ఫార్మా సంస్థ, సైన్యం, నాసా, ప్రముఖులు.. ఇలా ఎవరో ఒకరిని కుట్రదారుడిగా చిత్రిస్తారు. బయటకు తెలియకుండా వాళ్లేవో రహస్య కార్యకలాపాలు సాగిస్తున్నట్లు కథలు అల్లుతారు’’ అని ఆయన అన్నారు.

ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు లేదా ఇంకేదైనా వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఈ కుట్రదారులు పన్నాగం పన్నినట్లు కథలు ఈ కుట్ర సిద్ధాంతాల్లో కనిపిస్తుంటాయి.

‘‘ప్రపంచాన్ని ఒకరు నియంత్రించవచ్చన్న భావన చాలా శక్తిమంతమైంది. చాలా వరకు కుట్ర సిద్ధాంతాలను అదే నమ్మేలా చేస్తుంది. ఏదైనా సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఘటనలకు సరైన వివరణలు లేనప్పుడు వాటిని జనాలు తేలిగ్గా విశ్వసిస్తారు’’ అని బైఫోర్డ్ అభిప్రాయపడ్డారు.

ఈ కుట్ర సిద్ధాంతాన్ని నమ్మించేందుకు కొన్ని విషయాలను వాళ్లు సాక్ష్యాలుగా చూపుతుంటారు. వాస్తవిక వివరణలు ఉన్నా, వాటిని నమ్మకూడదన్న భ్రమను కలిగిస్తారు. చాలా మంది జనాలు వీటికి మోసపోతారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సోషల్ మీడియా వల్ల కూడా జనాలు కుట్ర సిద్ధాంతాలను నమ్మే అవకాశాలు పెరిగాయి

ఎందుకు నమ్ముతాం..

జనాల్లో ఉండే ఒత్తిడి, అనుమానాలకు కుట్ర సిద్ధాంతాలకు సంబంధం ఉందని ఇదివరకు అధ్యయనాల్లో తేలినట్లు బ్రిటన్‌లోని వించెస్టర్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్ట్ మైక్ వుడ్ అన్నారు.

‘‘ఒత్తిడి వల్ల తమ జీవితం తమ చేతుల్లో లేదన్న భావన మనుషులకు వస్తుంటుంది. అలాంటి సమయంలో కుట్ర సిద్ధాంతాలు ఎక్కువ నమ్మశక్యంగా కనిపిస్తాయి’’ అని అన్నారు.

సోషల్ మీడియా వల్ల కూడా జనాలు కుట్ర సిద్ధాంతాలను నమ్మే అవకాశాలు పెరిగాయని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్ హాంకాక్ అభిప్రాయపడ్డారు.

‘‘మళ్లీ మళ్లీ సోషల్ మీడియాలో ఆ వదంతి వినిపిస్తుంది. విన్నకొద్దీ దాని మీద నమ్మకం మరింత బలపడుతుంది’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)