కశ్మీర్‌లోని లాల్ చౌక్‌లో ఏక్తాయాత్రతో 1992లో ఎగిరిన భారత జెండా... అప్పడు నరేంద్ర మోదీ పాత్ర ఏంటి

  • 15 ఆగస్టు 2019
ఏక్తా యాత్రలో నరేంద్ర మోదీ Image copyright WWW.NARENDRAMODI.IN
చిత్రం శీర్షిక ఏక్తా యాత్రలో నరేంద్ర మోదీ

ఆర్టికల్ 370 సవరణ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో చాలా పోస్ట్‌లు కనిపించాయి. మిలిటెంట్ల నుంచి ముప్పు పొంచి ఉన్నా, 1992లో కశ్మీర్‌లోని లాల్ చౌక్‌లో భారత జెండాను ఎగరవేయడంలో ప్రస్తుత ప్రధాని మోదీ కీలకపాత్ర పోషించారని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అక్కడ త్రివర్ణ పతాకాన్ని స్వేచ్ఛగా ఆవిష్కరించే పరిస్థితిని తీసుకువచ్చారని ఆయన సమర్థకులు వ్యాఖ్యానాలు చేశారు.

1992లో లాల్ చౌక్‌లో జెండా ఎగరవేసేందుకు బీజేపీ చేపట్టిన 'ఏక్తా యాత్ర'కు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి నేతృత్వం వహించారు.

1991 డిసెంబర్‌లో కన్యాకుమారి నుంచి మొదలుపెట్టి దేశంలోని వివిధ రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగింది. చివరికి బీజేపీ నాయకులు కశ్మీర్ చేరుకుని 1992 జనవరి 26న లాల్ చౌక్‌లో భారత జాతీయ జెండా ఆవిష్కరించారు.

భారత స్వాతంత్ర దినం సందర్భంగా బీజేపీ చేపట్టిన ఈ ఏక్తా యాత్ర గురించి, మోదీ ఆ కార్యక్రమంలో పోషించిన పాత్ర గురించి వివరాలు తెలుసుకునేందుకు మురళీ మనోహర్ జోషిని బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే కలిశారు. ఆ ఇంటర్వ్యూలో బీబీసీ అడిగిన ప్రశ్నలకు మనోహర్ జోషి చెప్పిన సమాధానాలివే..

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మురళీ మనోహర్ జోషి

ఏక్తా యాత్ర ఉద్దేశం ఏంటి?

అప్పుడు నేను బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. కశ్మీర్‌లో ఓ గ్రౌండ్ సర్వే నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం నేను, మరో ముగ్గురం కలిసి 10-12 రోజులు కశ్మీర్‌లో పర్యటించాం. 'ఉగ్రవాదుల' శిక్షణ జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లాం. శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న కశ్మీరీ పండిట్లను కలిశాం. భారత వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న కొందరిని కలిసి మాట్లాడాం.

మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో రెండు వర్గాలు ఆధిపత్యం కోసం పోటీపడుతున్నాయి. భారత్‌కు తాము వ్యతిరేకమంటే, తాము వ్యతిరేకమంటూ నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నింటిపై నివేదిక రూపొందించి పార్టీకి, ప్రభుత్వానికి ఇచ్చాం.

కశ్మీర్‌లో పెరుగుతున్న వేర్పాటువాదం గురించి దేశ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక కార్యక్రమం చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. భారత సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన జెండాను అవమానించే ఘటనలు కశ్మీర్‌లో ఎక్కువగా జరుగుతుండేవి. అందుకే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ యాత్రగా వెళ్లి, అక్కడ జెండా ఎగరవేయాలని నిర్ణయించారు. దీనికి ఏక్తా యాత్ర అని పేరు పెట్టారు. జెండాను గౌరవించాలని, కశ్మీర్‌ను భారత్ నుంచి విడిపోనివ్వబోమని చాటి చెప్పడం ఈ యాత్ర ఉద్దేశం.

అన్ని వర్గాల నుంచీ ఈ యాత్రకు మంచి ఆదరణ లభించింది. వందలు, వేల సంఖ్యలో ప్రజలు జెండాలను మాకు అప్పగించారు. వాటిని కశ్మీర్‌లో ఎగరవేయాలన్నది వారి కోరిక.

Image copyright WWW.NARENDRAMODI.IN

జెండా ఆవిష్కరణకు లాల్ చౌక్‌నే ఎందుకు ఎంపిక చేశారు?

అక్కడ అంతకుముందు ఎప్పుడూ భారత జెండా ఎగరవేసేవారు కాదు. అక్కడ జెండాలు దొరికేవి కాదు. ఆగస్టు 15 సమయంలో కూడా అమ్మేవారు కాదు.

యాత్ర గురించి కేంద్ర ప్రభుత్వం ఆందోళనకు గురైంది. వాళ్లు నన్ను అక్కడికి వెళ్లకముందే అరెస్టు చేయాలనుకున్నారు. కానీ, యాత్రకు చాలా పెద్ద సంఖ్యలో జనం రావడంతో అది వీలుపడలేదు. ఒకవేళ నన్ను అరెస్టు చేసి ఉంటే, ఇంకా ఎక్కువ మంది వచ్చేవారు.

కశ్మీర్‌లో యాత్రలో మాతో పాటు దాదాపు లక్ష మంది ఉన్నారు. అంతమందితో లాల్ చౌకకు వెళ్లడం కుదరదు. అక్కడి గవర్నర్ కూడా అది సాధ్యం కాదని చెప్పారు. అక్కడ ఉగ్ర ఘటనలు కూడా ఎక్కువ జరుగుతున్న కారణంగా అది ప్రమాదకరం కూడా.

చివరికి 400 నుంచి 500 మంది మాత్రమే లాల్ చౌక్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. దీనికి ఏర్పాట్లు చేయడం కూడా ఇబ్బందిగా ఉంది. జన సమూహాన్ని నియంత్రించాలంటే అగ్రనేతలు వాజ్‌పేయి, అడ్వాణీ ఆగిపోవాలని, నేను లాల్ చౌక్‌కు వెళ్లాలని పార్టీ నిర్ణయించింది.

ఓ కార్గో విమానాన్ని అద్దెకు తీసుకుని, అందులో 17-18 మంది కూర్చొని వెళ్లాం. మేం ల్యాండ్ అయిన తర్వాత అక్కడి సైనికులు చాలా ఉత్సాహంగా కనిపించారు. జవనరి 26 ఉదయం లాల్ చౌక్‌లో జెండా ఎగరేశాం.

Image copyright WWW.NARENDRAMODI.IN

బెదిరింపులు వచ్చాయా? జెండా ఆవిష్కరణ సమయంలో మీతో ఎవరెవరున్నారు?

అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది. భారత జెండా ఎగరవేయనీయబోమని వాళ్లు చూపించుకోవాలనుకున్నారు. మమ్మల్ని చంపేస్తామని, క్షేమంగా తిరిగివెళ్లనిచ్చేది లేదని బెదిరింపులు వచ్చాయి. వాళ్లు చాలా శక్తిమంతమైన ట్రాన్స్‌మిటర్లు వాడేవారు. అందుకే, చండీగఢ్, అమృత్‌సర్‌ల్లో ఉన్నవారు కూడా వారి మాటలు వినగలిగారు. జెండా ఆవిష్కరణ తర్వాత చండీగఢ్ తిరిగి వెళ్లినప్పుడు అక్కడి వారు మాకు ఆ విషయం చెప్పారు.

మాతో ఉన్నవారందరి పేర్లు ఇప్పుడు నాకు గుర్తు లేవు. స్థానిక నాయకుడు చమన్‌లాల్ ఉన్నారు. ఆయన అప్పుడు జమ్మూ, కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారనుకుంటా. పార్టీ ఉపాధ్యక్షుడు కృష్ణలాల్ శర్మ ఉన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ఆయన యాత్ర నిర్వాహకుడు. ఇంకొందరు నాయకులు కూడా ఉన్నారు.

లాల్ చౌక్‌లో ఎంతసేపు గడిపారు, ఆ సమయంలో ఏం జరిగింది?

లాల్ చౌక్‌లో 15 నిమిషాలు ఉన్నాం. అప్పుడు రాకెట్ల పేలుళ్లు జరిగాయి. ఐదు నుంచి పది అడుగుల దూరంలో కాల్పులు జరిగాయి. పరిసరాల్లో బాంబులు కూడా పేలాయి.

మమ్మల్ని తిట్టేవారికి మేం రాజకీయంగా సమాధానాలు చెప్పాం. కశ్మీర్ లేకుండా పాకిస్తాన్ ఉండదని వారంటే, అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పినట్లు.. పాకిస్తాన్ లేకుండా హిందుస్తాన్ ఉండదని మేమన్నాం.

లాల్ చౌక్‌లో భారత జెండా ఎగురుతుంటే పాకిస్తాన్ రాకెట్లు, గ్రెనేడ్లు వందనం సమర్పిస్తున్నాయని నేనన్నాను. వారు మన జెండాకు వందనం చేస్తున్నారని చెప్పాను.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మురళీ మనోహర్ జోషి

ఏక్తాయాత్రలో మోదీ పాత్ర ఏంటి?

ఆ యాత్ర సఫలమయ్యేందుకు ఏర్పాట్లను మోదీనే చూసుకున్నారు. వివిధ రాష్ట్రాల గుండా ఈ సుదీర్ఘ యాత్ర సాగింది. దీనికి సంబంధించిన సమన్వయ బాధ్యతలు ఆయన నిర్వర్తించారు. యాత్ర షెడ్యూల్‌ ప్రకారం సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు. అవసరమైన చోట్ల ప్రసంగాలు కూడా చేసేవారు. యాత్ర మొదలు నుంచి చివరి దాకా ఆయన ఉన్నారు.

ఆ తర్వాత పరిస్థితులు మారాయా?

జెండా ఎగరవేయడం వల్ల అందరి కన్నా ఎక్కువగా సైన్యంపై సానుకూల ప్రభావం పడింది. వారిలో మానసిక స్థైర్యం పెరిగింది. అక్కడి ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోవడంలోనే తన సమయమంతా వెచ్చించేది. ఇదే అదునుగా కశ్మీర్‌లో వాతావరణం మరింత చెడిపోయేది.

జెండా ఆవిష్కరణ తర్వాత అక్కడివారికి దేశం తమ వెంట ఉందన్న భావన కలిగింది. పాకిస్తాన్ ఉగ్రవాదం వ్యాప్తి చేస్తున్న ఆ ప్రాంతంలో మార్పు వస్తోందన్న సందేశం దేశానికి చేరింది. కశ్మీర్‌ భారత్ అంతర్భాగమన్న భావన పిల్లలు, పెద్దలు అందరికీ కలిగింది. అంతకుముందు ఇలాంటి చైతన్యం ఉందని నేనైతే అనుకోను.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మురళీ మనోహర్ జోషి

ఆర్టికల్ 370 సవరణ తర్వాత కశ్మీర్‌లో ఫోన్, ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ విషయంలో ప్రభుత్వంతో మీరు ఏకీభవిస్తున్నారా?

ఇది ప్రభుత్వ నిర్ణయం. వాళ్లకు అందిన సమాచారం ఆధారంగా వారు తగిన చర్యలు తీసుకుంటారు. ఆందోళనకర పరిస్థితులున్న ప్రాంతంలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆర్టికల్ 370 సవరణ సరైన నిర్ణయం. ఇందుకోసం అనుసరించిన రాజ్యాంగ ప్రక్రియను దేశం చూసింది.

ఇది వాళ్ల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయమన్న విషయాన్ని అక్కడివారు అర్థం చేసుకోవాలి. స్థానిక నేతలతో చర్చలు చేపట్టలేదని అంటున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎవరితో చర్చించారు? ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)