పాక్ అధీనంలోని కశ్మీర్‌లో 'స్వాతంత్ర్యం' ఎంత?

  • 16 ఆగస్టు 2019
పాక్ అధీనంలోని కశ్మీర్ Image copyright REUTERS/DANISH ISMAIL

"భారత్ నుంచి విడిపోయి పాకిస్తాన్ ఏర్పడడంతో కశ్మీరీలు చాలా డిస్టర్బ్ అయ్యారు. భారత్‌కు స్వాతంత్ర్యం లభించింది. పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. మధ్యలో మేం ఇరుక్కుపోయాం. 1931 నుంచి ఇప్పటివరకూ కశ్మీరీలు సరిహద్దులో అమరులవుతూనే ఉన్నారు. సరిహద్దు లోపల ఉన్న వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. వీళ్లంతా స్వాతంత్ర్యం కోసమే ఈ త్యాగం చేస్తున్నారు".

బీబీసీతో ఈ మాట చెప్పిన వ్యక్తి జమ్ము-కశ్మీర్‌లోనే మరో భాగంలో ఉంటారు. కానీ, ఆ ప్రాంతం గురించి చాలా తక్కువ వార్తలు వెలుగుచూస్తాయి. అది పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్‌లో ఒక భాగం.

అక్కడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఈ వ్యక్తి తన పేరు బయటపెట్టవద్దని కోరారు. ఈయన 1990లో భారత కశ్మీర్ నుంచి పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్‌కు వెళ్లారు.

"అక్కడ హాయిగా ఉన్నా" అని చెబుతున్నా, లోపల గూడుకట్టుకున్న ఆవేదనను ఆయన నోరు దాచలేకపోతోంది.

Image copyright Getty Images

పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్

ఆయనే కాదు, భారత కశ్మీర్ నుంచి వెళ్లిన రజియా కూడా బాధలన్నీ గుండెలోనే దాచుకున్నారు. (మేం ఆమె అసలు పేరును వెల్లడించడం లేదు.)

"సుఖం ఉంది, కానీ కష్టాలు కూడా ఎక్కువే. అక్కడికి (భారత కశ్మీర్) తిరిగి వెళ్లిపోవాలని మనసు చాలాసార్లు లాగుతుంది. కానీ ఎలా వెళ్లాలి? కశ్మీర్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకునేవరకూ అక్కడికి వెళ్లలేం. ఇక్కడ మేం బంగారం తింటున్నా (ఎంత ధనవంతులైనా) అక్కడ, మా భూమి గురించి కచ్చితంగా దిగులుంటుంది. నేను నా సమాధి కూడా మా నేలపైనే ఉండాలనుకుంటున్నా. ఇంతకంటే ఏం చెప్పగలను?" అన్నారు రజియా.

అయితే, పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్‌లో పరిస్థితుల గురించి మాట్లాడ్డానికి రజియా కూడా వెనకాడారు.

కానీ, రుహానా ఖాన్‌కు అలాంటి ఇబ్బందేం లేదు. ఆమె ఒక విద్యార్థి. (మేం ఆమె పేరు కూడా మార్చాం.)

"జీవితం ఏదో అలా నడిచిపోతోంది. కానీ (మా జీవితం) చాలా కష్టాల్లో నడుస్తోంది. మాకు పాకిస్తాన్ ప్రభుత్వం అలవెన్స్ ఇస్తుంది. దానితో జీవించడం చాలా కష్టమైపోతోంది. చెప్పాలంటే, అసలు సరిపోవడం లేదు" అన్నారు రుహానా.

జమ్ము, కశ్మీర్

భారత విభజన జరిగి పాకిస్తాన్ వేరే దేశంగా ఏర్పడడానికి ముందు జమ్ము-కశ్మీర్‌లో డోగ్రా రాజ్యం ఉండేది. దానికి రాజు మహారాజా హరిసింగ్.

ఆగస్టు 1947లో పాకిస్తాన్ ఏర్పడింది. సుమారు రెండు నెలల తర్వాత దాదాపు 2.06 లక్షల చదరపు కిలోమీటర్లలో వ్యాపించిన జమ్ము, కశ్మీర్ రాజ్యం కూడా ముక్కలైంది.

ఆ తర్వాత 72 ఏళ్లలో, అంటే ఇప్పటికి ప్రపంచం చాలా మారిపోయింది. జమ్ము-కశ్మీర్ సరిహద్దుల్లో కూడా మార్పు వచ్చింది.

అప్పటికీ ఇప్పటికీ మారనిది భారత్-పాకిస్తాన్ మధ్య అప్పుడు మొదలైన ఉద్రిక్తతలు మాత్రమే.

రెండు దేశాలూ జమ్ము-కశ్మీర్ మాదంటే మాదంటున్నాయి. దీనికోసం చాలాసార్లు యుద్ధరంగంలోకి కూడా దిగాయి.

కాల్పుల శబ్దాలు, బాంబు పేలుళ్లు, నేతల ప్రసంగాలు, బలమైన నినాదాల మధ్య కశ్మీరీల గళం వినిపించకపోయి ఉంటే, దీన్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు.

Image copyright Getty Images

భారత సైన్యం

పాక్ అధీనంలోని కశ్మీర్లో ఉంటున్న వారు కూడా ఎప్పటినుంచో చాలా ఫిర్యాదులు చేస్తున్నారు.

పాకిస్తాన్ తమ నియంత్రణలో ఉంచుకున్న కశ్మీర్‌ భాగాన్ని 'ఆజాద్ కశ్మీర్' (స్వతంత్ర కశ్మీర్) అంటుంది.

1947లో పాకిస్తాన్ వైపు నుంచి తమను 'ఆజాద్ ఆర్మీ'గా చెప్పుకునే గిరిజన సైనిక దళం కశ్మీర్లోకి చొరబడింది. అప్పుడు మహారాజా హరిసింగ్ భారత్ సాయం కోరారు. రాష్ట్రాన్ని విలీనం చేసే ప్రతిపాదనపై సంతకాలు పెట్టారు.

భారత సైన్యం కశ్మీర్ చేరుకునేసరికే, జమ్ము-కశ్మీర్‌లోని ఒక భాగాన్ని పాకిస్తాన్ గిరిజనులు ఆక్రమించారు. అది రాజ్యం నుంచి విడిపోయింది.

పాక్ అధీనంలోని కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్‌లో ఉండే రచయిత అబ్దుల్ హకీమ్ కశ్మీరీ సుదీర్ఘ కాలం నుంచీ కశ్మీర్ అంశాన్ని దగ్గర నుంచి గమనిస్తున్నారు.

బీబీసీతో మాట్లాడిన ఆయన "మొదటి కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్‌కు దక్కిన భాగంలో రెండు పాలనలు మొదలయ్యాయి. ఒకటి ఆజాద్ కశ్మీర్, ఇంకొకటి గిల్గిత్ బాల్టిస్తాన్. ఆజాద్ కశ్మీర్‌లో 1947 అక్టోబర్ 24 నుంచి పాలన మొదలైంది. 1949 ఏప్రిల్ 28న ప్రభుత్వ ప్రెసిడెంట్ ఒక ఒప్పందం కింద గిల్గిత్ బాల్టిస్తాన్‌లోని ఒక పెద్ద ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు ఇచ్చారు.

Image copyright HASSAN ABBAS
చిత్రం శీర్షిక గిల్గిత్

దాదాపు జనాభా అంతా ముస్లింలే

పాక్ అధీనంలోని కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ రెండూ జమ్ము-కశ్మీర్ రాజ్యంలోని భాగాలే.

ప్రస్తుతం పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్‌లో 13,296 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంది. దీని సరిహద్దులు పాకిస్తాన్, చైనా, భారత పాలిత కశ్మీర్‌తో ఉన్నాయి. ముజఫరాబాద్ రాజధానిగా ఉన్న దీనిలో 10 జిల్లాలు ఉన్నాయి.

అటు గిల్గిత్ బాల్టిస్తాన్‌లో 72,970 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంది. గిల్గిత్ బాల్టిస్తాన్‌లో కూడా పది జిల్లాలు ఉన్నాయి. దాని రాజధాని గిల్గిత్.

ఈ రెండు ప్రాంతాల మొత్తం జనాభా 60 లక్షలు. ఇక్కడ దాదాపు అందరూ ముస్లింలే.

Image copyright Getty Images

ఒప్పందం ఉల్లంఘన

పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్ దగ్గర పాకిస్తాన్‌ రాష్ట్రాలకంటే ఎక్కువ హక్కులు ఉన్నాయని పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్ మాజీ చీఫ్ జస్టిస్ సయ్యద్ మంజూర్ గిలానీ చెబుతారు.

కానీ గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని కరాచీ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు అప్పగించాలనే నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు.

"కరాచీ ఒప్పందం 1949 ఏప్రిల్లో జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం, ఆజాద్ కశ్మీర్ ప్రభుత్వం, అప్పటి రూలింగ్ పార్టీ సమయంలో అది జరిగింది. ఒప్పందం ప్రకారం అక్కడ రాజ్యాంగం ఏర్పాటు చేసుంటే, మాకు పవర్ ఆఫ్ అటార్నీ లభించి ఉండేది. ఆ ఒప్పందంలో అదే ఒక లోపం. దీంతో గిల్గిత్ బాల్టిస్తాన్ పాకిస్తాన్‌కు సరెండర్ అయిపోయింది" అని అన్నారు.

పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ మావే అని భారత్ చెబుతోంది.

భారత్‌లో నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజరీ బోర్డ్ మెంబరు, 'రా' మాజీ స్పెషల్ సెక్రటరీ తిలక్ దేవాశర్ పాకిస్తాన్, కశ్మీర్ అంశాలను నిశితంగా గమనిస్తుంటారు.

ఆయన పాకిస్తాన్ గురించి చాలా పుస్తకాలు రాశారు. పాకిస్తాన్ ఆ ఒప్పందాన్ని మాటిమాటికీ ఉల్లంఘించిందని దేవాశర్ చెప్పారు.

Image copyright Reuters

నియంత్రణ పాకిస్తాన్ చేతుల్లో

"ఆగస్టు 5న జమ్ము, కశ్మీర్ హోదాను మార్చేసిందని అంతా ఇప్పుడు భారత్‌ వైపు చూపిస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే.. పాకిస్తానే దీన్ని (ఒప్పందాన్ని) ఉల్లంఘించింది. నేను ఉదాహరణ కూడా ఇస్తా. 1963లో పాకిస్తాన్.. కశ్మీర్‌లోని ఒక ప్రాంతాన్ని చైనాకు ఇచ్చింది. అది దాదాపు 1900 చదరపు మైళ్లు ఉంటుంది" అని దేవాశర్ చెప్పారు.

"అది కూడా ఒప్పందం ఉల్లంఘనే. తర్వాత 1949లో కరాచీ ఒప్పందం జరిగింది. కానీ, గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలను అందులో చేర్చలేదు. 'ఆజాద్ కశ్మీర్' అని చెబుతున్న దాని నేతృత్వంలో ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు ఇచ్చేశారు. వారికి ఎలాంటి హక్కూ లేదు. కానీ పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది" అంటారు దేవాశర్.

చైనా అంతకు ముందే 1962లో జమ్ము-కశ్మీర్‌లోని ఒక భాగాన్ని (అక్సాయ్ చిన్) స్వాధీనం చేసుకుంది.

గిల్గిత్ బాల్టిస్తాన్‌ను పట్టించుకోలేదనే విషయాన్ని అబ్దుల్ హకీమ్ కశ్మీరీ కూడా చెప్పారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో చాలా తక్కువ హక్కులు ఉన్నాయి. దీని నియంత్రణ దాదాపు పూర్తిగా పాకిస్తాన్ దగ్గరే ఉంది అన్నారు.

"గిల్గిత్ బాల్టిస్తాన్‌కు పాకిస్తాన్ వేరే స్టేటస్ ఇచ్చింది. అక్కడ మొదటి నుంచీ ప్రజాస్వామ్యం లేదు. 2009లో దానికి మొదటి స్టేటస్ ఇచ్చారు. అది దానికి ఒక సుబా హోదా ఇస్తామని చెప్పింది. కానీ దానిని రాష్ట్రం చేస్తామని ప్రకటించలేదు. అక్కడ ఉన్న ప్రజలు రాష్ట్రం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు 2018లో వచ్చిన ఆదేశాల్లో గిల్గిత్ బాల్టిస్తాన్ అసెంబ్లీకి చట్టం రూపొందించే హక్కు ఉందని చెప్పారు. దానికి కూడా చాలా పరిమిత హక్కులే ఉన్నాయి" అన్నారు.

Image copyright Reuters

మెజారిటీలు షియాలు

గిల్గిత్ బాల్టిస్తాన్ సరిహద్దు చైనాతో ఉంటుంది. ఆ ప్రాంతం చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రధాన రహదారిపై ఉంటుంది. ఇక్కడ చైనా బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

గిల్గిత్ బాల్టిస్తాన్ స్టేటస్ మార్చడానికి ఇది కూడా ఒక కారణం అని భావిస్తున్నారు. దీన్ని స్థానికులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు.

"పాక్ అధీనంలోని కశ్మీర్‌లో కూడా వ్యతిరేకతలు ఉన్నాయి. కానీ అవి వెలుగులోకి రావు. గిల్గిత్ బాల్టిస్తాన్‌లో 1947-48లో మెజారిటీ జనాభా షియాలు. ఇప్పుడు స్టేట్ సబ్జెక్ట్ రూల్ తొలగించారని చెబుతున్నారు. కానీ (వాస్తవానికి) 1970 నుంచే గిల్గిత్ బాల్టిస్తాన్‌లో స్టేట్ సబ్జెక్ట్ రూల్‌ను తొలగించేశారు" అని తిలక్ దేవాశర్ చెప్పారు.

"అక్కడికి బయటవారిని రప్పించి, షియాల మెజారిటీని తగ్గించాలని చూశారు. స్థానికులు దానిని వ్యతిరేకించారు. కారాకోరమ్ హైవే నిర్మిస్తున్నప్పుడు, సీపెక్ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నప్పుడు చాలా వ్యతిరేకతలు వచ్చాయి. అక్కడ ఉన్న మానవ హక్కుల కార్యకర్తల పేర్లు కూడా మీరు వినుండరు. బాబా జాన్ అనే ఒక నేత ఎన్నో ఏళ్ల నుంచీ అక్కడ జైల్లో మగ్గుతున్నారు".

అయితే, ఇప్పటికీ అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గిల్గిత్ బాల్టిస్తాన్, పాకిస్తాన్ అధీన కశ్మీర్‌లో స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు నడుస్తున్నాయి.

కశ్మీర్ ప్రజలు

జుల్ఫికర్ భట్ కూడా అలాంటి ఒక సంస్థకు చెందినవారే.

"ఆజాద్ కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ లోపల ఉన్నవారు, పాకిస్తాన్ సైన్యాన్ని ఆక్రమిత దళాలుగా భావిస్తారు. ఇక్కడ మూవ్‌మెంట్ ఖుద్ ముక్తార్ కశ్మీర్ (కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోసం ఉద్యమం) చాలా తీవ్రంగా నడుస్తోంది. ఇదుంలో పదికిపైగా నేషనలిస్ట్ సంస్థలు ఉన్నాయి. వీటిలో ఐదారు యాక్టివ్‌గా ఉన్నాయి" అని జుల్ఫికర్ చెప్పారు.

డోగ్రా రాజ్యం తర్వాత చొరబడ్డ పాకిస్తానీ గిరిజనులు కశ్మీర్‌ విభజనకు, కశ్మిరీల బానిసత్వానికి పునాదులు వేశారు. దాని పునరుద్ధరణ కోసం కశ్మీరీలు తీవ్రంగా పోరాడుతున్నారు".

తమ నియంత్రణలో ఉన్నది 'ఆజాద్ కశ్మీర్' అంటున్న పాకిస్తాన్ వాదనలపై ఇలాంటి ఉద్యమాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

"పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్‌లో ఎప్పుడూ నామమాత్రంగా ఎన్నికలు జరుగుతాయి. 1974 నుంచి పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. ప్రభుత్వ నేతగా ప్రధానమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడుగా రాష్ట్రపతి ఉంటున్నారు" అని మాజీ చీఫ్ జస్టిస్ గిలానీ చెప్పారు.

Image copyright Arko Datto

హ్యూమన్ రైట్స్ వాచ్

కానీ రచయిత అబ్దుల్ హకీమ్ కశ్మీరీ మాత్రం పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్ అసెంబ్లీకి ఉన్న హక్కులకు అర్థం లేదని చెబుతారు.

"అసెంబ్లీ అంటే రాజ్యాంగం ఉండాలి. ఆ రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేయాలి. కానీ, ఈ అసెంబ్లీ దగ్గర చట్టం మాత్రమే ఉంది. దీని దగ్గర రాజ్యాంగం లేదు" అని అబ్దుల్ హకీమ్ అన్నారు.

"దానికి అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి స్టేటస్ లేదు. ఇక్కడి పాలనకు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి తప్ప ప్రపంచంలో ఎక్కడా గుర్తింపు లేదు. నిజం చెప్పాలంటే, జమ్ము-కశ్మీర్ రాజ్యానికి చెందిన ఈ అసెంబ్లీ పొజిషన్ 'వేలిముద్ర' కంటే ఘోరంగా ఉంది" అని చెప్పారు.

పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్‌లో మానవ హక్కులకు సంబంధించి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. గత దశాబ్దంలో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చిన తర్వాత హ్యూమన్ రైట్స్ వాచ్ దీనిపై ఒక రిపోర్టు కూడా రూపొందించింది.

"ఆజాద్ కశ్మీర్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛపై పాకిస్తాన్ ప్రభుత్వ కఠిన నియంత్రణ ఉంది. ఈ నియంత్రణలను కూడా సెలక్టివ్‌గా ఉపయోగిస్తారు. జమ్ము-కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలపాలని డిమాండ్ చేసే పాకిస్తాన్‌లోని మిలిటెంట్ సంస్థలకు ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ముఖ్యంగా 1989 నుంచి ఇది ఎక్కువైంది. ఇక కశ్మీర్ స్వతంత్రత గురించి మాట్లాడేవారిని మాత్రం అణచివేస్తున్నారు" అని ఈ రిపోర్టులో చెప్పారు.

Image copyright Getty Images

పట్టించుకోని అంతర్జాతీయ సమాజం

'రా' మాజీ అధికారి తిలక్ దేవాశర్ కూడా ఇదే అంశంపై పాకిస్తాన్‌ను బోనులో నిలబెడతారు.

"వీళ్లు ఆజాద్ కశ్మీర్ అని దేన్ని చెబుతున్నారో దానికి అసలు 'స్వతంత్రం' లేదు. మొత్తం కంట్రోల్ పాకిస్తాన్ చేతుల్లోనే ఉంది. అక్కడ ఉన్న కౌన్సిల్‌కు చైర్మన్‌ పాకిస్తాన్ ప్రధానమంత్రే. దానిని పాకిస్తాన్ సైన్యమే నియంత్రిస్తోంది" అన్నారు.

"వాళ్లు లైన్ ఆఫ్ కంట్రోల్‌కు దగ్గరగా ఉన్నారు. 1989 నుంచి లెక్కలేనన్ని శిబిరాలు నడుస్తున్నాయి. అక్కడ వాళ్లు ట్రైనింగ్ కూడా ఇస్తారు. అక్కడ లాంచ్‌పాడ్స్ ఉన్నాయి. అక్కడి నుంచి భారత్‌లోకి చొరబాట్లు జరుగుతాయి. అవి ఎప్పుడూ ఆర్మీ క్యాంపులతో టచ్‌లో ఉంటాయి".

అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండడం వల్ల పాకిస్తాన్‌ నోటికొచ్చినట్టు మాట్లాడగలుగుతోంది.

"పాకిస్తాన్ వల్ల ప్రజలు సంతోషంగా లేరు. వాళ్లు పాకిస్తాన్‌లో భాగం కావాలనుకోవడం లేదు. కానీ వారికి ఎలాంటి సపోర్ట్ లేదు. వారి గోడు వినేవారు ఎవరూ లేరు. అంతర్జాతీయ సమాజం వారిని పట్టించుకోవడం లేదు. దాంతో పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టు చేస్తోంది" అంటారు తిలక్.

Image copyright AFP

పాకిస్తాన్-హిందుస్తాన్

ఈ సమస్య కశ్మీర్ హక్కుల గురించే అంటారు రచయిత అబ్దుల్ హకీమ్ కశ్మీరీ. ఇక్కడ ఎక్కువ సమస్యలు కశ్మీరీలకే వస్తున్నాయని చెప్పారు.

"బుల్లెట్ ఎల్ఓసీకి అటు నుంచి వచ్చినా, ఇటు నుంచి వచ్చినా దానికి లక్ష్యంగా మారుతోంది కశ్మీరీలే. పాకిస్తాన్, హిందుస్తాన్‌లో ఉన్న సైనికుల కాల్పుల్లో బలి అవుతోంది కశ్మీరీలే" అంటారు హకీమ్.

ఇక రుహనా ఖాన్ లాంటి కశ్మీరీలకు బహుశా అభ్యర్థించడం తప్ప వేరే హక్కులేవీ లేవు అనిపిస్తోంది.

"నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. యుద్ధం చేయడం వల్ల, ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల జరిగేది ఏదీ ఉండదు. రెండు ప్రభుత్వాలు పరస్పరం చర్చించాలి. దీనికి ఒక పరిష్కారం వెతకాలి" అన్నారు రుహానా

కానీ, 'ఆజాద్ కశ్మీర్' అని చెప్పుకుంటున్న ఒక ప్రాంతంలో ఇలాంటి సందేశం ఇచ్చే ఒక యువతి తన పేరు కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారంటే, ఆ గళం ఎంతమందికి వినిపిస్తుంది? ఇదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: బోటు ప్రమాదంలో 11 మంది మృతి, 27 మంది సురక్షితం.. మిగతా 23 మంది కోసం గోదావరిలో కొనసాగనున్న గాలింపు చర్యలు

ప్రెస్ రివ్యూ: గోదావరి పడవ ప్రమాదంపై యజమాని సమాధానమిదే

కమలీ: ఆస్కార్ 2020 బరిలో నిలిచిన ఈ అమ్మాయి జీవిత కథేంటంటే..

11 త‌రాలుగా ఈ ఆలయంలో అర్చకులంతా దళితులే.. వివక్షను పారదోలిన చెన్నకేశవ ఆలయం ప్రత్యేకతలివీ

గోదావరిలో పడవ మునక: 'భర్తను, బిడ్డను పోగొట్టుకుని ఎలా బతకాలి...'

9/11 పుట్టిన తేదీ, 9.11 గంటలు పుట్టిన సమయం, పాప బరువు 9.11 పౌండ్లు.. ఏమిటీ చిత్రం

పచ్చరాళ్ళ వేట కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు... ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు

యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతీ ఇవ్వలేదు.. ఇవ్వదు - కేటీఆర్