'దక్షిణ కొరియాతో ఇక మాటల్లేవ్...' శాంతి చర్చల ప్రతిపాదనను తిరస్కరించిన ఉత్తర కొరియా

  • 16 ఆగస్టు 2019
కిమ్ జోంగ్-ఉన్ Image copyright Reuters

దక్షిణ కొరియాతో ఇక చర్చలు కొనసాగించే ప్రసక్తి లేదని ఉత్తర కొరియా తేల్చిచెప్పింది. చర్చలు విఫలమయ్యాయంటూ.. దక్షిణ కొరియా చర్యలే దీనికి కారణమని తప్పుపట్టింది.

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ గురువారం చేసిన ప్రసంగానికి ప్రతిస్పందనగా ఉత్తర కొరియా తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు.. ఉత్తర కొరియా శుక్రవారం ఉదయం మరో రెండు క్షిపణులను తన తూర్పు సముద్ర తీరంలోకి పేల్చి పరీక్షించిందని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది.

నెల రోజుల వ్యవధిలో క్షిపణుల ప్రయోగం ఇది ఆరోసారి.

వారం రోజుల కిందట కూడా ఉత్తర కొరియా జపాన్ సముద్రంలోకి రెండు క్షిపణులను ప్రయోగించింది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్‌ల మధ్య జూన్‌లో జరిగిన భేటీలో.. అణు నిరాయుధీకరణ చర్చలను మళ్లీ ప్రారంభించాలని అంగీకరించిన అనంతరం ఉత్తర కొరియా ఈ క్షిపణి పరీక్షల పరంపర చేపట్టటం గమనార్హం.

అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నందున ఉత్తర కొరియా మీద అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధించింది.

Image copyright EPA

దక్షిణ కొరియా ఏం చెప్పింది?

జపాన్ వలస పాలన నుంచి ఉత్తర కొరియా విముక్తి పొందిన దినోత్సవం సందర్భంగా మూన్ జే-ఇన్ ప్రసంగిస్తూ.. కొరియా ద్వీపకల్పాన్ని 2045 నాటికి ఐక్యం చేస్తామని ప్రతినబూనారు.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసినపుడు కొరియా రెండు దేశాలుగా విభజితమైంది.

కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చాలన్న లక్ష్యాన్ని సాధించటం.. ఉభయ కొరియాల మధ్య చర్చలు స్తంభించిపోయినట్లు కనిపిస్తుండటంతో ''అత్యంత కీలక దశ''లో ఉందని మూన్ జే-ఇన్ పేర్కొన్నారు.

''కొరియా ద్వీపకల్పానికి, ఆసియాకు, ప్రపంచానికి శాంతి సౌభాగ్యాలను అందించే నూతన కొరియా ద్వీపకల్పం మున్ముందు ఏర్పడుతుంది'' అని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక అమెరికా - దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది

ఉత్తర కొరియా ప్రతిస్పందన ఏమిటి?

అయితే, ''ఇప్పుడు కూడా ఉత్తర కొరియా సంయుక్త సైనిక కసరత్తును కొనసాగిస్తోంది'' అంటూ.. అలాంటపుడు చర్చలకు అర్థం ఏమిటని ఉత్తర కొరియా ఒక ప్రకటనలో ప్రశ్నించింది. ''శాంతియుత ఆర్థికవ్యవస్థ, శాంతియుత పాలన గురించి మాట్లాడితే అలా చేసే హక్కు ఆ దేశానికి లేదు'' అని తప్పుపట్టింది.

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ మీద విమర్శలు ఎక్కుపెడుతూ.. ''ఒకవైపు మా సైన్యాన్ని చాలా వరకూ 90 రోజుల్లో ధ్వంసం చేసే ప్రణాళికలతో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తూ.. మరోవైపు ఉత్తర - దక్షిణ కొరియాల మధ్య 'చర్చల' గురించి మాట్లాడుతున్న మూన్ జే-ఇన్ ఆలోచనా సరళి ఎంత ఆరోగ్యవంతమైనదని కూడా మేం ప్రశ్నిస్తున్నాం'' అని వ్యాఖ్యానించింది.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఉత్తర కొరియా నెల రోజుల వ్యవధిలో ఆరు సార్లు క్షిపణి పరీక్షలు నిర్వహించింది

''ఆయన నిజంగా సిగ్గులేని మనిషి''

ప్రస్తుతం జరుగుతున్న అమెరికా - దక్షిణ కొరియా సైనిక విన్యాసాల మీద ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తోను, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌తోను చేసుకున్న ఒప్పందాలను ఈ సైనిక విన్యాసాలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది.

ఆ సైనిక విన్యాసాలను 'యుద్ధ అభ్యాసాల'ని ఉత్తర కొరియా ఇంతకుముందు అభివర్ణించింది.

ఈ సైనిక విన్యాసాలు చాలా విడ్డూరమైనవని, ఖరీదైనవని వ్యాఖ్యానిస్తూ ట్రంప్‌కు ఇటీవల రాసిన ఒక లేఖలో కిమ్ జోంగ్-ఉన్ అభ్యంతరం తెలియజేశారని వార్తలు వచ్చాయి.

సైనిక విన్యాసాలు నిర్వహించాలన్న దక్షిణ కొరియా నిర్ణయమే అణు నిరాయుధీకరణ చర్చల్లో ప్రతిష్టంభనకు పూర్తి కారణమని ఉత్తర కొరియా ప్రభుత్వ అధికార ప్రతినిధి తప్పుపట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)