నడి సంద్రంలో తిండీ నీరూ లేక 14 మంది చనిపోయారు... ఒకే ఒక్కడు బతికాడు

  • 19 ఆగస్టు 2019
మొహమ్మద్ ఆదాం ఓగా Image copyright Times of malta
చిత్రం శీర్షిక మొహమ్మద్ ఆదాం ఓగా

''ఆ బోటులో 15 మంది ప్రయాణించాం. అందులో నేనొక్కడినే బతికాను'' మాల్తాలో హాస్పిటల్ బెడ్ మీద ఉనన మొహమ్మద్ ఆదాం ఓగా చెప్పిన మాట ఇది.

మొహమ్మద్ ఆదాం సహా 15 మంది లిబియా నుంచి ఐరోపా దేశాలకు రహస్యంగా చేరుకోవడానికి మధ్యధరా సముద్రంలో ఒక చిన్న బోటు(డింగీ)లో ప్రయాణం ప్రారంభించారు.

అందుకోసం వారిని తీసుకెళ్తానన్న స్మగ్లర్‌కు ఒక్కొక్కరు 700 డాలర్లు చొప్పున చెల్లించారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సముద్ర ప్రాంతం మీదుగా వారి ప్రయాణం సాగింది. కొద్దిరోజులకే వారి బోటులోని ఇంధనం అయిపోయింది.

దాంతో నట్ట నడి సంద్రంలో ఆ చిన్నబోటులో ఎటు గాలి వేస్తే అటు కొట్టుకుపోతున్నారు.

ఇంకొన్ని రోజులకు వారు తమతో తెచ్చుకున్న ఆహారమూ అయిపోయింది. అక్కడికి మరికొద్ది రోజులకే నీరూ అయిపోయింది.

రోజులు గడుస్తున్నాయి.. ఎటు చూసినా సముద్రమే. కనుచూపు మేరలో ఏదైనా ఓడ కానీ, బోటు కానీ వారికి కనిపించడం లేదు.

తినడానికి తిండే కాదు తాగడానికి నీరు కూడా లేకపోవడంతో అలమటించిపోయారు.

ఆ ప్రాణాంతక ప్రయాణంలో ఓ నిండు గర్భిణి కూడా ఉంది.

Image copyright AFP

''అలా తిండీనీరు లేకుండా 11 రోజులు గడిపాం. ఆ తరువాత సముద్రం నీటినే తాగడం మొదలుపెట్టాం.

అయిదు రోజుల తరువాత ఇద్దరు చనిపోయారు.

అప్పటి నుంచి రోజుకు ఇద్దరు చొప్పున చనిపోయారు'' మొహమ్మద్ ఆదాం ఆ భయంకర ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు.

అలా వారం రోజుల్లో బోటులోని 14 మంది చనిపోయారు.. మొహమ్మద్ ఆదాం ఒక్కరే బతికున్నారు.

తనకూ చావు తప్పదని నిర్ణయించుకుని, శుష్కించిన శరీరంతో నడిసంద్రంలో దారీతెన్నూ లేకుండా సాగుతున్న చిన్నబోటులో నిస్తేజంగా పడిపోయారు.

వారం కిందట యూరోపియన్ యూనియన్ కోస్ట్‌గార్డ్ ఏజెన్సీ ఫ్రాంటెక్స్‌కు చెందిన సిబ్బంది మధ్యధరా సముద్రంలో మాల్తా సముద్రజలాల సమీపంలో ఐరోపా సరిహద్దుల్లో ఈ బోటు తేలుతుండడాన్ని చూశారు.

అందులో మొహమ్మద్ ఆదాం కనిపించడంతో ఆయన్ను రక్షించారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఇటలీ ఓపెన్ ఆర్మ్స్ బోటు

మొహమ్మద్ ఆదాం ఓగా ఎవరు? ఈ ప్రాణాంతక ప్రయాణం వెనుక కథేమిటి?

38 ఏళ్ల మొహమ్మద్ ఆదాం ఓగా తనది ఇథియోపియా అని.. ఆ దేశ బహిష్కృత రాజకీయ నాయకుడినని చెబుతున్నారు. అక్కడి ఒకప్పటి తిరుగుబాటు గ్రూప్ ఓరోబో లిబరేషన్ ఫ్రంట్ నేతనని చెప్పారు. జర్మనీలో ఉన్న కొందరు స్నేహితుల వద్దకు వెళ్లిపోవాలని ఈ రహస్య ప్రయాణానికి ప్రయత్నించినట్లు చెప్పారు.

సోమాలియాకు చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తిని తాను లిబియాలో కలుసుకున్నానని, ఆ తరువాత ఓ స్మగ్లర్ సహాయంతో ఈ బోటు ప్రయాణం చేశామని చెబుతున్నారు.

లిబియా రాజధాని ట్రిపోలీకి 45 కిలోమీటర్ల దూరంలో ఉండే జవీయా నగరం నుంచి ఆగస్టు 1న వీరు బయలుదేరారు.

అక్కడి నుంచి మాల్తా చేరుకుంటారని ఏజెంటు తమకు చెప్పినట్లుగా మొహమ్మద్ చెబుతున్నారు.

బోటులో తనతో పాటు ఘనాకు చెందిన ఓ పురుషుడు, ఓ గర్భిణి, ఇథియోపియాకు చెందినవారు మరో ఇద్దరు, సోమాలియాకు చెందిన 11 మంది ఉన్నారన్నారు.

ఆయిల్, ఆహారం, నీరు అయిపోయిన తరువాత ఏమైంది?

''బోటులో ఆయిల్, ఆహారం, నీరు అన్నీ అయిపోయాయి. అందరం నీరసించిపోయాం. అప్పుడప్పుడూ కనిపించే బోట్లు, హెలికాప్టర్ల నుంచి సహాయం కోసం ప్రయత్నించాం. కానీ, ఎవరూ మమ్మల్ని చూసినట్లు లేదు.

చాలా బోట్లను చూశాం. రక్షించమంటూ కేకలు వేశాం.

ఒక హెలికాప్టర్ దగ్గర వరకు వచ్చి తిరిగి వెళ్లిపోయింది. ఒక్కరొక్కరు ఆకలితో చనిపోవడం మొదలైంది'' అంటూ ఆ భయంకర పరిస్థితులను మొహమ్మద్ వివరించారు.

'ఇద్దరమే మిగిలాం.. మనమూ చచ్చిపోదామన్నాడు ఇస్మాయిల్'

ఒక్కొరక్కరుగా అందరూ ప్రాణాలు విడిచాక తాను, ఇస్మాయిల్ మాత్రమే చివరకు మిగిలామని.. చనిపోయినవారందరినీ ఎప్పటికప్పుడు సముద్రంలోకి జారవిడిచామని మొహమ్మద్ చెప్పారు.

ఇద్దరమే మిగిలాక ఇస్మాయిల్ తీవ్రమైన నిరాశలో.. 'ఇక మనమూ చనిపోతాం. చావు మన వరకు రాకముందు మనమే సముద్రంలో దూకి చనిపోదాం' అన్నాడని చెప్పారు.

ఒక రకమైన నిరాశతో ఇస్మాయిల్ బోటులోని అన్ని వస్తువులు.. ఫోన్లు, జీపీఎస్ పరికరాలు కూడా సముద్రంలోకి విసిరేశాడని, అప్పుడు ''చనిపోవాలనుకుంటే నీ ఇష్టం.. నేను మాత్రం ఆత్మహత్య చేసుకోను'' అని చెప్పానన్నారు మొహమ్మద్.

దాంతో ఇస్మాయిల్ సముద్రంలోకి దూకేశాడు.

మధ్యధరా సముద్ర ప్రయాణంలో ఏడాది 839 మంది మృతి

ఇతర దేశాలకు వలసవెళ్లేవారు, శరణార్థుల విషయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతం మధ్యధరా సముద్రం. ఏటా వేలాది మంది ప్రాణాలను బలిగొంటోంది.

ఈ ఏడాది ఇప్పటివరకు ఐరోపాకు వలస వెళ్లే క్రమంలో మధ్యధరా సముద్రం దాటుతూ 839 మంది మరణించారని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి.

అలాంటి ప్రాణాంతక ప్రయాణం చేసి ఐరోపా దేశాల సముద్ర తీరాలకు 40 వేల మందికి పైగా చేరగలిగారు. మరో వెయ్యి మంది మాల్తా చేరారు. అలా బతికిబట్టకట్టినవారిలో ఇప్పుడు మొహమ్మద్ కూడా ఒకరు.

Image copyright Times of malta

ఇప్పుడు మొహమ్మద్ ఆదాం ఓగా పరిస్థితి ఏమిటి?

మొహమ్మద్ ఆదాం ఓగా బోటులో నిస్తేజంగా పడి ఉండడాన్ని చూసిన తరువాత ఆయన్ను రక్షించారు. సముద్రం మధ్య నుంచి హెలికాప్టర్లో మాల్తాకు తీసుకొచ్చారు.

మొహమ్మద్ ఇప్పుడు జరిగిందంతా మాల్తా ఇమిగ్రేషన్ పోలీసులకు, ఆ దేశ రెఫ్యూజీ కమిషన్‌కు చెప్పాల్సి ఉంటుంది.

పూర్తిగా శుష్కించిపోయిన మొహమ్మద్ ఇప్పుడు ఆ బోటులో తనను రక్షించిన సమయంలోని పరిస్థితులను పూర్తిగా గుర్తుచేసుకోలేకపోతున్నారు.

ఇప్పుడు తనను ఇథియోపియా అరెస్టు చేయడం ఖాయమని అంటున్నారాయన. అందుకు కారణం ఆయన పనిచేసిన తిరుగుబాటు గ్రూపుపై నిషేధం ఉండడమే.

మొహమ్మద్ 15 ఏళ్లుగా ఇథియోపియా ప్రభుత్వానికి దొరక్కుండా తప్పించుకుంటున్నారు. పదిహేనేళ్ల కిందట ఆయన ఇథియోపియా నుంచి ఎరిత్రియాకు, అక్కడి నుంచి సూడాన్‌కు వెళ్లిపోయారు.

ఇప్పడు జర్మనీ చేరుకుని.. అక్కడి నుంచి బ్రిటన్ వెళ్లిపోవాలనే ప్రయత్నం చేస్తే ఇలా అయిందని చెబుతున్నారాయన.

ఇంత జరిగాక ఈ ప్రయాణం చేసుండకపోవాల్సింది అనిపిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ''లేదు. బతికున్నందుకు సంతోషంగా ఉంది'' అన్నారు.

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)