అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్

  • 20 ఆగస్టు 2019
ఇంటర్నెట్ Image copyright Getty Images

ముంబయిలో మధ్యాహ్న భోజన సమయంలో లక్షల మంది ఉద్యోగులు ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో కొందరికి డబ్బావాలా భోజనం అందించాల్సి ఉంది. సాధారణంగా డబ్బవాలాలు సైకిల్‌పై వీటిని చేరవేస్తారు. ముంబయిలో ఇది 125 ఏళ్లుగా కొనసాగుతోంది. ఆహారం అందుకొనేవారిలో కొందరికి డబ్బావాలాలతో నేరుగా మాట్లాడాల్సిన పని లేదు. వాళ్లు ఒక యాప్ ద్వారా డబ్బావాలాలతో ఆహారం తెప్పించుకుంటారు. ఇలా యాప్‌తో తెప్పించుకొనేవారి సంఖ్య పెరుగుతోంది కూడా!

"నేనుండేది ముంబయిలోనే. ఇక్కడ ఆహారం అందించడం ఇప్పుడో ముఖ్యమైన విషయమైపోయింది. ఉదాహరణకు స్టార్‌బక్స్ ఔట్‌లెట్‌కు వెళ్తే అక్కడ ఆహార సరఫరా సంస్థ 'స్విగ్గీ' ప్రతినిధులు ఓ ఐదుగురు కనిపిస్తారు" అని మెకన్సీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ పార్ట్‌నర్ అనూ మడ్గావ్‌కర్ చెప్పారు.

భారత్‌లో డిజిటల్ విప్లవం వ్యాప్తి చెందుతోందనేందుకు ఓ రుజువు- 13 ఏళ్ల బాలుడు తయారుచేసిన డబ్బావాలాల యాప్.

యాప్ సాయంతో ఆహారం సరఫరా చేయడమనే కొత్త పోకడపై స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. అదే సమయంలో, దీనికి చాలా మంది అభిమానులు కూడా ఉన్నారని అనూ మడ్గావ్‌కర్ చెప్పారు.

భారత్‌లో వ్యాపార సంస్థలను మరింత వ్యవస్థీకృతంగా ఉండేలా, మరింత నిలకడగా సేవలందించేలా ఇంటర్నెట్ చేస్తోంది.

ఇక్కడ మరో ఆసక్తికర అంశం కూడా ఉంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ముంబయి డబ్బావాలా

భారత్‌లో ఇంటర్నెట్ కవరేజీ ఇంకా తక్కువగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య 14 శాతంలోపే ఉండొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా చాలా వర్ధమాన దేశాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. సబ్-సహారన్ ఆఫ్రికన్ దేశాల నుంచి లాటిన్ అమెరికా వరకు, అలాగే ఆగ్నేయాసియాలోని చాలా దేశాల్లో పరిస్థితి ఇలాగే ఉంది.

ప్రపంచంలో సగానికి పైగా జనాభాకు నేటికీ ఇంటర్నెట్ సదుపాయం లేదు. భారత్ సహా పైన ప్రస్తావించిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ కవరేజీ పెరుగుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ లేని 400 కోట్ల మంది ప్రజలకు ఈ సదుపాయాన్ని కల్పించడం కోసం కేబుళ్లు వేయడం, మొబైల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేయడం చాలా సమయం పట్టే పనులు. ఈ సదుపాయం కల్పించాల్సినవన్నీ మారుమూల ప్రాంతాలు. ఈ సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా కొన్ని కంపెనీలు వినూత్న ప్రయత్నం చేస్తున్నాయి. అదే 'అంతరిక్షం నుంచి ఇంటర్నెట్'.

ఈ విధానంలో- వేల సంఖ్యలో చిన్న ఉపగ్రహాలను దిగువ భూ కక్ష్య(లో ఎర్త్ ఆర్బిట్)లో ప్రవేశపెడతారు. అవి అక్కడి నుంచి భూమిపై ఎక్కడైనా, ఎవ్వరికైనా ఇంటర్నెట్‌ను అందిస్తాయి. దీనిని అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు చేస్తున్న సంస్థల్లో 'వన్‌వెబ్' ఒకటి.

ఇది తొలి విడతగా ఆరు ఉపగ్రహాలను ప్రయోగించింది. స్మార్ట్ ఫోన్‌తో ఎవరికైనా ఎక్కడైనా ఇంటర్నెట్ పొందేందుకు వీలుగా మొబైల్ ఇంటర్నెట్ సిగ్నల్ అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎలాన్ మస్క్

అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని 'స్పేస్‌ఎక్స్' సంస్థతోపాటు దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌కు కూడా ఇంటర్నెట్ అందించే ఉపగ్రహాలను ప్రయోగించాలనే ప్రణాళికలు ఉన్నాయి.

ఈ విధంగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అందించేందుకు సంస్థలు పోటీపడొచ్చని కంపెనీల ప్రణాళికలను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఉపాధిపై ఇది విస్మయకర ప్రభావాన్ని చూపే అవకాశముంది.

వన్‌వెబ్ దాదాపు 1900 ఉపగ్రహాలను, స్పేస్‌ఎక్స్ దాదాపు 12 వేల ఉగప్రహాలను ప్రయోగించాలనుకొంటున్నాయని ఇంగ్లండ్‌లోని నార్తంబ్రియా యూనివర్శిటీలో అంతరిక్ష చట్టం, విధానం ప్రొఫెసర్ క్రిస్టఫర్ న్యూమన్ చెప్పారు.

భూమి చుట్టూ కక్ష్యలో ప్రస్తుతం దాదాపు రెండు వేల వాణిజ్య ఉపగ్రహాలు ఉన్నాయి.

అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ అందించాలనుకొంటున్న సంస్థలు పంపే ఉపగ్రహాలను కలుపుకొంటే ఈ సంఖ్య భారీగా పెరుగుతుంది.

Image copyright Getty Images

'వాస్తవిక దృక్పథం అవసరం'

'అంతరిక్షం నుంచి ఇంటర్నెట్' అనే భావనలో వాస్తవిక దృక్పథం కూడా అవసరమని ప్రొఫెసర్ క్రిస్టఫర్ న్యూమన్ చెప్పారు.

ఈ ఉపగ్రహ వ్యవస్థ నిర్వహణ ఖర్చు భరించగలిగేలా ఉంటుందా, లేదా, అలాగే ఇవి అంతరిక్షంలో మరిన్ని వ్యర్థాలను సృష్టిస్తాయా, భూకక్ష్య పర్యావరణాన్ని దెబ్బతీస్తాయా అనే అంశాల్లో స్పష్టత లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ఆలోచన ఆచరణలోకి వస్తే- మనుషులు పనిచేసే విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని న్యూమన్ చెప్పారు.

ఇంటర్నెట్ ప్రపంచ నలుమూలల్లో అందరికీ అందుబాటులోకి వస్తే ఇతర ఆర్థిక వ్యవస్థలు ఎలా మారొచ్చనేదానికి భారత్‌లో వస్తున్న మార్పులే తొలి సంకేతాలని అనూ మడ్గావ్‌కర్ చెప్పారు.

భారత కార్మికుల్లో అత్యధికులు అవ్యవస్థీకృత రంగంలో లేదా తమకు ఉపాధి కల్పించే 'సూక్ష్మ సంస్థల్లో' పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. ముంబయి డబ్బావాలాల పని మాదిరి ఈ కార్మికుల పనిని యాప్‌ల ద్వారా చేయించుకోవచ్చని చెప్పారు. ట్యాక్సీ సేవల యాప్ 'ఉబర్‌'ను ఇలాంటి యాప్‌లకు ఉదాహరణగా ప్రస్తావించారు.

Image copyright Getty Images

స్థానిక ఆర్థిక వ్యవస్థలు మారిపోవచ్చు

హైస్పీడ్ ఇంటర్నెట్ వేగంగా వ్యాప్తి చెందితే ఉత్పాదకత పెరగడంతోపాటు స్థానిక ఆర్థిక వ్యవస్థలు మారిపోవచ్చు. ఇది సాధ్యమేననే ఆధారాలున్నాయి. ఉదాహరణకు భారత్‌లో ధరలు, వాతావరణ పరిస్థితులను తెలుసుకొనేందుకు మొబైల్ ఫోన్లు వాడే రైతుల, మత్స్యకారుల లాభాలు ఎనిమిది శాతం పెరిగాయి.

ఇండోనేషియా ఈకామర్స్ రాబడిలో 35 శాతం రాబడి మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎం) పరిశ్రమల నుంచి వస్తున్నట్లు మెకిన్సీ నివేదిక ఒకటి తెలిపింది. దే ఆఫ్‌లైన్ రాబడిలో అయితే మహిళల యాజమాన్యంలోని ఇలాంటి పరిశ్రమల వాటా కేవలం 15 శాతంగానే ఉంది.

ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరగడమంటే మారుమూల ప్రాంతాల్లోని కార్మికులకు మరిన్ని అవకాశాలు దక్కడమేనని అనూ మడ్గావ్‌కర్ చెప్పారు.

ఉదాహరణకు బ్యాంకు ఉద్యోగులు ఫోన్ ద్వారా వినియోగదారులకు సేవలు అందించవచ్చు. సేవల ఆధారిత ఉద్యోగాలకు, సలహాలు అందించే ఉద్యోగాలకు ఉద్యోగార్థులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ అందించవచ్చు. శాటిలైట్ ఇంటర్నెట్ వస్తే ఇలాంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేవారి సంఖ్య భారీగా పెరగొచ్చు.

ఆన్‌లైన్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫాంలు కూడా పెరిగే అవకాశముంది.

తగినంత విద్య లేకపోతే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అడ్డంకి ఏర్పడుతుంది. భారత్‌లో అక్షరాస్యత ఇటీవల స్వల్పంగా పెరిగింది. అయినప్పటికీ నేటికీ దేశంలో దాదాపు పాతిక శాతం మంది చదవలేరు, రాయలేరు. చాలా దేశాల్లో ఈ సమస్య ఉంది.

ఇంటర్నెట్ సదుపాయం కల్పించినా దానితోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావు.

ప్రతికూలతలు?

ఇంటర్నెట్ సృష్టించే ఉద్యోగాల్లో కొన్ని ప్రతికూలతలు కూడా దాగి ఉన్నాయి. ఉబర్, ఆహార సరఫరా సంస్థ 'డెలివరూ' లాంటి ప్లాట్‌ఫాంలు కార్మికులకు నష్టదాయం కావొచ్చనే ఆందోళనలు ఉన్నాయి. అలాగే ఏ మాత్రం నైపుణ్యం అవసరంలేని ఉద్యోగాలు కూడా పుట్టుకురావొచ్చనే అంచనాలూ ఉన్నాయి.

'క్లిక్ వర్క్'ను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. వివిధ నమూనాలను గుర్తించేలా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లను సన్నద్ధం చేయడంలో భాగంగా చేసే ఇమేజ్-ట్యాగింగ్ ఈ కోవలోకే వస్తుంది. తమ ఉత్పత్తుల్లో వాడే అల్గారిథమ్‌లను మెరుగుపరచడానికి భారీ టెక్ కంపెనీలకు ఈ పని తోడ్పడుతుంది.

ఆఫ్రికాలో ఉద్యోగులు గంటల కొద్దీ ఇలాంటి నిరాసక్తికర పనులను చేసే పెద్ద పెద్ద కార్యాలయాలను ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ మార్క్ గ్రాహం సందర్శించారు. అక్కడ పని జరిగే తీరు తనకు దిగ్భ్రాంతి కలిగించిందని ఆయన చెప్పారు.

ఈ ప్లాట్‌ఫాంపై విపరీతమైన పోటీ ఉందని, మరింత మందికి ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే ఈ పోటీ ఇంకా పెరుగుతుందని గ్రాహం తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు అధిక వేతనాలు సాధించుకోలేరని, ఎందుకంటే ఇదే పనిని ప్రపంచంలో మరో చోట ఇంత కన్నా తక్కువ వేతనాలకు చేయగలరని వివరించారు.

ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరిగితే, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో నిరాసక్తికర ఉద్యోగాలే కాదు, వెబ్‌ డెవలప్‌మెంట్, ప్రోగ్రామింగ్, డిజైన్ రంగాల్లోనూ అవకాశాలు ఏర్పడతాయని ఆయన ప్రస్తావించారు.

Image copyright Getty Images

ప్రపంచంలోని కార్మికశక్తి అంతటికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే, ఉద్యోగాలు చేసేవాళ్లు వాటిని కాపాడుకొనేందుకు ఇతరులతో పోటీపడాల్సి రావొచ్చా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది.

ప్రతీ ఉద్యోగాన్ని ఔట్ సోర్సింగ్ చేయడం సాధ్యం కాదు. తక్కువ వేతనాలున్న దేశాల్లోకి కార్యకలాపాలను తరలించడంలో కంపెనీలు విఫలమైన సుదీర్ఘ చరిత్ర కూడా ఉంది. కానీ టెక్నాలజీ వల్ల ఔట్ సోర్సింగ్ సులభతరం, సరసం అయితే అంతవరకు ఉపాధిపరంగా ప్రభావం పడని ఉద్యోగులపైనా ప్రభావం పడొచ్చు. తక్కువ వేతనాలు, ప్రతికూల పని వాతావరణం తప్పకపోవచ్చు.

టెక్నాలజీతో జరగబోయే మార్పులతో కార్మికుల హక్కులకు, ఉద్యోగాల నాణ్యతకు విఘాతం కలగకుండా అందరం జాగ్రత్త పడాల్సి ఉందని గ్రాహం చెప్పారు.

శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేసరికి ఐదు, పదేళ్లు పట్టొచ్చని లండన్ కేంద్రంగా పనిచేసే ’ఐహెచ్ఎస్ మార్కిట్’ మార్కెట్ అనలిస్ట్ అల్జ్‌బెటా ఫెలెన్‌బామ్ అభిప్రాయపడ్డారు. కానీ ఒక వ్యక్తి కెరీర్లో ఇది అంత పెద్ద కాలమేమీ కాదని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఒక దేశ కార్మికశక్తి మరో దేశ కార్మికశక్తి కన్నా రాణించవచ్చు. కానీ ఎల్లకాలం పరిస్థితి ఇలాగే ఉండకపోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)