కశ్మీర్‌లో మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత భారత ప్రభుత్వానిదే: హ్యూమన్ రైట్స్ వాచ్

  • 20 ఆగస్టు 2019
నిరసనలు Image copyright Getty Images

కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత విధించిన ఆంక్షలను ప్రభుత్వం కొంత సడలించింది. ఇలా కశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తేసిన తర్వాత అక్కడి మానవ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిదేనని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది.

ఈ మేరకు హ్యూమన్ రైట్స్ వాచ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం..

ఆగస్ట్ 5న ఆర్టికల్ 370ను రద్దు చేశాక కేంద్రం ఆంక్షలు విధించింది. ఆగస్ట్ 17, 18 వారాంతంలో జరిగిన ఆందోళనల్లో ఎనిమిది మంది గాయపడినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వందలాది మంది రాజకీయ నాయకులు, ఉద్యమకారులు గృహ నిర్బంధంలోనే ఉన్నారు. మరికొందరు కశ్మీర్ బయట ఉండిపోయి తమ కుటుంబాలతో సంబంధాలు కోల్పోయారు. కశ్మీర్లో శాంతి పరిరక్షణకు కొందరిని గృహ నిర్బంధంలో ఉంచినట్లు భారత ప్రభుత్వం అంగీకరించిందని మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది.

ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆగస్ట్ 16న ల్యాండ్ లైన్ సేవలు పునరుద్ధరించినప్పటికీ మొబైల్, ఇంటర్నెట్ సేవలు మాత్రం చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అందుబాటులోకి రాలేదని హ్యూమన్ రైట్స్ వాచ్ అభిప్రాయపడింది.

భారత ప్రభుత్వం అక్కడి ఆంక్షల్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించడమే కాదు.. అక్కడున్న ప్రతి ఒక్కరి హక్కుల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని హ్యూమన్ రైట్స్ వాచ్ సౌత్ ఏషియా డైరెక్టర్ మీనాక్షి గంగూలీ అన్నారు.

Image copyright Getty Images

ఆగస్ట్ 5న ప్రభుత్వ వర్గాలు జమ్మూకశ్మీర్లో ఇంటర్నెట్, సెల్‌ఫోన్లు, ల్యాండ్‌లైన్ ఇలా అన్ని రకాల కమ్యూనికేషన్ వ్యవస్థల్ని నిలిపేశాయి. వాటితో పాటు బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడటాన్ని నిషేధించారు.

కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో అన్న ఆందోళన ప్రజల్లో త్రీవతరమైంది. ప్రజలు పెద్ద ఎత్తున తిరగకుండా నిషేధాలు విధించడంతో కొన్ని చోట్ల వైద్య సేవలకు, ఇతర అత్యవసర సర్వీసులకు అంతరాయం కలిగింది.

సోషల్ మీడియాలో అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో కొన్ని అకౌంట్లను నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వ వర్గాలు ట్విటర్‌ను కోరాయి.

కశ్మీర్లో కమ్యూనికేషన్ వ్యవస్థపై ఆంక్షలు విధించడంపై యునైటెడ్ నేషన్స్ ప్రత్యేక ప్రతినిధి డేవిడ్ కాయే విచారం వ్యక్తం చేశారు.

Image copyright Getty Images

ఆగస్ట్ 5 తర్వాత కాశ్మీర్లో చెదురుమదురు ఘటనలు జరిగినట్లు వార్తలు వచ్చాయని, భద్రతా బలగాలు ఉపయోగించిన పెల్లెట్ షాట్‌గన్‌ల వల్ల పన్నెండు మందికి గాయాలయ్యాయని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది.

ఆందోళనకారులను చెదరగొట్టడానికి పెల్లెట్ షాట్‌గన్స్ ఉపయోగిస్తారు. కానీ దీని వల్ల ఎక్కువ మందికి గాయాలవ్వడం, కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తుండటంతో వీటి ఉపయోగంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆయుధాలు ఉపయోగించే విషయంలో ఐక్యరాజ్య సమితి ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలని భద్రతాదళాలకు భారత ప్రభుత్వం బహిరంగంగా సూచించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ కోరింది.

అలాగే, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేసే సంస్థలు హింసాత్మక చర్యలకు పాల్పడకుండా మెలగాలని సూచించింది.

Image copyright Getty Images

పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద వందలాది కాశ్మీరీలను అధికార యంత్రాంగం నిర్బంధించిందని ఏజెన్సీ ఫ్రాన్స్ వెల్లడించింది. ఈ చట్టం ప్రకారం భద్రతాదళాలు ఎవరినైనా రెండేళ్ల పాటు నిర్బంధించవచ్చు. 

కశ్మీరీ రాజకీయ నాయకుడు షా ఫైజల్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ మర్నాడే అంటే ఆగస్ట్ 15న భద్రతా దళాలు షా ఫైజల్ ను అరెస్ట్ చేశాయి. కశ్మీర్లో చిన్నారులను కూడా నిర్బంధించారని స్థానిక ఉద్యమకారులు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ విడుదల చేశారని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది.

నిర్బంధించిన వారి వివరాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు బహిర్గతం చేసి, వారి ఆచూకీని కుటుంబ సభ్యులకు తెలియచేసి, వారితో మాట్లాడుకునే అవకాశం కల్పించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ సూచించింది.

ఆధారాలు లేకుండా నిర్భందించడం ఇంటర్నేషనల్ హ్యూమర్ రైట్స్ న్యాయ సూత్రాల ప్రకారం నిషేధం. ఈ బలవంతపు నిర్బంధాలు, అరెస్ట్‌ల విషయంలో సరైన న్యాయ సమీక్షలు జరగాలని చెప్పుకొచ్చింది.

కశ్మీర్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకే ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు భారత ప్రభుత్వం చెబుతోంది.

కశ్మీర్లో హింసాత్మక ఆందోళనలు చేయడానికి, తీవ్రవాద దాడులు చెయ్యడానికి పాకిస్థాన్ కుట్రలు పన్నుతోందని భారత్ ఆరోపిస్తోంది. శాంతి భద్రతల కోసం కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలను ముందుగానే అక్కడ మోహరించింది.

కశ్మీర్ విషయంలో ఇండియా-పాకిస్థాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆగస్ట్ 16న యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇరువర్గాలతో అంతరంగికంగా సంప్రదింపులు జరిపింది.

Image copyright Getty Images

భారత్, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్‌లలో భద్రతా బలగాలు, సాయుధ గ్రూపుల చర్యలు, వేధింపులపై యూఎన్ హ్యూమన్ రైట్స్ హై కమిషనర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై 43 పేజీల నివేదిక విడుదల చేసింది.

2016 జులై తర్వాత కశ్మీర్లో తలెత్తిన ఆందోళనలను అదుపు చేసేందుకు భారత భద్రతా బలగాలు కాస్త అతిగానే ప్రవర్తించాయని ఆ నివేదిక పేర్కొంది. 

అయితే, భారత ప్రభుత్వం ఈ ఆరోపణలు... నిరాధారమైనవని, దురుద్దేశంతో ఆపాదించినవని చెప్పుకొచ్చింది. ఈ నివేదిక సీమాంతర తీవ్రవాదం అన్న కీలకమైన అంశాన్ని విస్మరించిందని విమర్శించింది. 

"మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదని వాదించడం కన్నా భారత ప్రభుత్వం గడిచిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించి, మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని" హ్యూమన్ రైట్స్ వాచ్ సౌత్ ఏషియా డైరెక్టర్ మీనాక్షి గంగూలీ అభిప్రాయపడ్డారు.

హై కమిషనర్ సిఫార్సులను అమలు చేసేలా, కశ్మీరీల మానవ హక్కులను కాపాడేలా ఐక్యరాజ్య సమితి, సంబంధిత ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆమె కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు