వృద్ధాప్యాన్ని దాచుకునే ప్రయత్నం ఎందుకు చేస్తాం?

  • 25 ఆగస్టు 2019
వృద్ధులు Image copyright Getty Images

ఒక్కసారి "రిటైర్మెంట్" అనే పదాన్ని ఇంటర్నెట్‌లో శోధించి చూడండి. నెరిసిన జుట్టుతో తాతయ్యలు, బామ్మలు... కిచెన్‌లో జానపద నృత్యాలు చేస్తూ, బోటులో షికారు చేస్తూ, పెరటిలో సేదతీరుతూ... విభిన్నమైన భంగిమల్లో యోగా చేస్తూ, మనుమలు- మనవరాళ్లతో ముచ్చటిస్తూ... ఉన్న రకరకాల చిత్రాలు తెర నిండా కనిపిస్తాయి.

మరి, ఉద్యోగ విరమణ చేసే ముందు, తర్వాత వృద్ధులు ఏ విషయాల గురించి ఆలోచిస్తారు? తమను తాము ఎలా చూసుకుంటారు? విశ్రాంత జీవితంలో వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయి?

చాలా మంది, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మొదటి కొన్ని నెలలపాటు తరచూ అస్తిత్వ సంక్షోభానికి లోనవుతారని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ తెరెసా అమాబిలే అంటున్నారు.

రిటైర్మెంట్ గురించి ఎవరి అభిప్రాయం ఎలా ఉందన్నది తెలుసుకునేందుకు ప్రొఫెసర్ అమాబిలే, తన సహచరులతో కలిసి నాలుగేళ్లకు పైగా అధ్యయనం చేశారు. అందుకోసం అమెరికాలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన 120 మంది నిపుణులతో ముఖాముఖిగా మాట్లాడి ఉద్యోగ విరమణ గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఒక్కసారి కాకుండా వివిధ దశల్లో పలుమార్లు వారితో మాట్లాడి, విశ్రాంత జీవితంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఉద్యోగ విరమణ కోసం ప్రణాళికలు వేసుకోవడాన్ని చాలామంది ఆర్థికపరమైన వ్యవహారంగా మాత్రమే భావిస్తారని తమ అధ్యయనంలో తేలిందని ప్రొఫెసర్ అమాబిలే చెప్పారు.

అయితే, ఆర్థిక ప్రణాళికలతో పాటు, మానసిక ప్రశాంతత, సామాజిక బాంధవ్యాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

"ఉద్యోగ విరమణ చేశాక మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? మన సంబంధాలు ఎలా ఉండాలి? అన్న విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నవారు మాత్రమే అలా ఆలోచిస్తున్నట్లు మా అధ్యయనంలో వెల్లడైంది" అని ఆమె చెప్పారు.

Image copyright Getty Images

'హలో.. మేమూ కుర్రాళ్లమే'

చాలామంది తమ వృద్ధాప్యాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారని ఈ పరిశోధనలో తేలింది.

మీ గురించి మీరు ఎలా వర్ణించుకుంటారు? అని రిటైర్మెంట్ తీసుకున్న వృద్ధులను అడిగినప్పుడు, ’’మేము కేవలం ఉద్యోగం నుంచి సాంకేతికంగా విరామం తీసుకున్నామే తప్ప, మాలో పనిచేయాలన్న ఉత్సాహం ఏమీ తగ్గలేదు" అని కొందరు తమ వృద్ధాప్యాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించారు.

"డెబ్బై ఎనభై ఏళ్లు దాటినవారు కూడా నేను రిటైర్డ్ టీచర్, నేను రిటైర్డ్ లైబ్రేరియన్, నేను రిటైర్డ్ పరిశోధకుడిని అంటూ ఆ వృత్తిని తమ గుర్తింపుగా చూస్తారు" అని ప్రొఫెసర్ అమాబిలే చెప్పారు.

"జనాలు నన్ను నిన్నటి వార్తను చూసినట్లు చూడకూడదు. ఇవాల్టి తాజా వార్తలా చూడాలని కోరుకుంటాను" అని ఒక పెద్దాయని అన్నారు.

'భవిష్యత్తులో వృద్ధాప్యం' అనే అంశంపై మే 22న స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో నోబెల్ ఫౌండేషన్ ఒక సదస్సును నిర్వహించింది. పలువురు నోబెల్ పురస్కార గ్రహీతలు, నిపుణులు అందులో పాల్గొన్నారు.

భవిష్యత్తులో మనం ఎంతకాలం జీవిస్తాం? ఎంతకాలం జీవించగలం? ఎంతకాలం జీవించాలి? అన్న విషయాలతో పాటు, వృద్ధాప్యంలో ఎక్కువగా వచ్చే డెమెన్షియా, క్యాన్సర్ లాంటి రుగ్మతల గురించి చర్చించారు.

చిత్రం శీర్షిక నోబెల్ అవార్డు గ్రహీత ఎడ్మండ్ ఫెల్ప్స్

ఎడ్మండ్ ఫెల్ప్స్‌ 2006లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ప్రస్తుతం 86 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మాడ్రిడ్‌ సదస్సులో పాల్గొన్న ఆయన, అక్కడ కొన్ని రోజులపాటు విశ్వవిద్యాలయాల్లో వరుస ఉపన్యాసాలు, చర్చలు, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడిపారు.

ఆరోగ్యవంతమైన జీవితానికి పనిచేయడమే చక్కని మార్గమని ఆయన అంటున్నారు.

"చాలామందికి వారు చేసే పనితోనే అర్థవంతమైన గుర్తింపు వస్తుంది. కొన్ని దశాబ్దాల పాటు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు బిజీగా ఉంటారు. కానీ, ఆ బాధ్యత ఎప్పటికీ ఉండదు. వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. అది చాలా అవసరం" అంటారు ఎడ్మండ్.

"మనం పనిచేసే ప్రదేశం ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. మిమ్మల్ని మీరు పరీక్షించుకునేందుకు, మీరు ఏం చేయగలరో చూపించుకునేందుకు, లక్ష్యాలను చేరుకునేందుకు, కొత్త ఆవిష్కరణలు చేసేందుకు, అన్వేషించేందుకు అదొక అద్భుతమైన ప్రదేశం. ఇన్ని అవకాశాలు దొరికేది పనిచేసే చోట మాత్రమే" అని ఆయన అంటున్నారు.

ఎడ్మండ్ అభిప్రాయంతో ఇతర నోబెల్ గ్రహీతలు కూడా ఏకీభవిస్తున్నారు. నవలా రచయిత మారియో వర్గాస్ లోసా కూడా ఎనిమిది పదుల వయసులోనూ రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తారు.

"నేను వారంలో ఏడు రోజులు, ఏడాదిలో 12 నెలలూ పని చేస్తా" అంటున్నారు ఆయన. "విశ్రాంత జీవితంలో కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలను వృథా చేయకూడదు" అని సూచిస్తున్నారు.

అయితే, మేధస్సుతో పనిచేసే వారితో పోలిస్తే, నిత్యం శారీరకంగా శ్రమించే వారు అరవై, డెబ్బై ఏళ్లు వచ్చాక పనిచేయడం సాధ్యం కాకపోవచ్చు.

కానీ, అనేక దేశాలలో ఉద్యోగ విరమణ వయసు పరిమితి పెరుగుతోంది. దాని ప్రభావం ప్రజల మీద అనేక రకాలుగా పడే అవకాశం ఉంది.

ఒకవేళ ఉద్యోగ విరమణ వయసును పెంచడం, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్లను, ఇతర ప్రయోజనాలను ఇవ్వకూడదని ప్రభుత్వాలు, కంపెనీలు నిర్ణయిస్తే, అది ప్రజల్లో అసమానతలకు దారితీయవచ్చని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ఆర్థశాస్త్రం ప్రొఫెసర్ డేవిడ్ బ్లూమ్ హెచ్చరిచిస్తున్నారు.

Image copyright Getty Images

"కార్యాలయాల్లో శారీరక శ్రమ పెద్దగా లేని వైట్‌కాలర్ ఉద్యోగులతో పోలిస్తే, రోజూ చెమటోడ్చి పనిచే ఉద్యోగులు 60, 70 ఏళ్లు వచ్చాక పనిచేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు, పదవీ విరమణ వయసును పెంచడం వల్ల కొంతమందికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది. దాంతో, వైట్ కాలర్, వైట్ కాలర్ ఉద్యోగుల మధ్య వ్యత్యాసాలు పెరిగిపోతాయి" అని డేవిడ్ అంటున్నారు.

(ఈ కథనాన్ని బీబీసీ, నోబెల్ మీడియా ఎబి సంయుక్తంగా అందిస్తున్నాయి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు