అమెజాన్ తగలబడుతోంది.. ఈ కార్చిచ్చును ఆపేదెలా?

  • 23 ఆగస్టు 2019
అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు Image copyright Reuters
చిత్రం శీర్షిక అమెజాన్ అడవుల్లో ఈ ఏడాది 75,000కు పైగా కార్చిచ్చులు నమోదయ్యాయి

అమెజాన్ అడువులను వేలాది కార్చిచ్చులు దహించివేస్తున్నాయి. ప్రధానంగా బ్రెజిల్‌లో గత ఏడాది కన్నా దాదాపు రెట్టింపు సంఖ్యలో అడవుల్లో మంటలు చెలరేగాయి. దీనిపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

అమెజాన్ బేసిన్.. 30 లక్షలకు పైగా మొక్కలు, జంతువులు, ఇతర జీవజాతులకు ఆలవాలం. దాదాపు పది లక్షల మంది ఆదిమవాసులు కూడా ఈ అడవుల్లో నివసిస్తున్నారు. భూతాపాన్ని నియంత్రించటానికి ఈ ప్రాంతం చాలా కీలకమైనది. ఎందుకంటే.. అమెజాన్ అడవులు ప్రతి ఏటా కోట్లాది టన్నుల కర్బన ఉద్గారాలను పీల్చుకుంటాయి.

కానీ.. ఈ చెట్లను నరికి, దహనం చేసినపుడు.. అవి నిల్వచేసుకున్న బొగ్గుపులుసు వాయువు వాతావరణంలోకి విడుదలవుతుంది. కర్బన ఉద్గారాలను శోషించుకునే సామర్థ్యం కూడా ఈ అడవికి తగ్గిపోతుంది.

దాదాపు 74 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న అమెజాన్ బేసిన్‌ ప్రధానంగా బ్రెజిల్‌లో ఉంది. ఆ దేశంలోని అమెజాన్‌ అడవుల్లో గత దశాబ్దం కాలంలోనే ఇప్పుడు చాలా అధికంగా, తీవ్రంగా మంటలు చెలరేగుతున్నాయి.

ప్రత్యేకించి ఉత్తర ప్రాంత రాష్ట్రాల్లో ఈ మంటల దుష్ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అడవుల్లో మంటల కారణంగా బ్రెజిల్‌లో అతి పెద్ద రాష్ట్రమైన అమెజానాస్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

ఈ కార్చిచ్చులకు కారణాలేమిటి?

ప్రపంచంలో అతిపెద్ద వర్షాధార అడవులు అమెజాన్ అడవులు. ఇక్కడ జులై నుంచి అక్టోబర్ వరకూ కొనసాగే పొడి కాలంలో అటవీ మంటలు చెలరేగటం సాధారణ విషయమే. పిడుగులు పడటం వంటి సహజ సంఘటనలతో పాటు.. పంటల కోసం, పశువులను మేపటం కోసం అడవులను శుభ్రం చేసే రైతుల వల్ల కూడా ఈ మంటలు చెలరేగుతుంటాయి.

అయితే ఈసారి ఈ మంటల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 85 శాతం అధికంగా మంటలు చెలరేగాయని బ్రెజిల్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ సమాచారం చెప్తోంది.

ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లోనే 75,000కు పైగా కార్చిచ్చులు నమోదైనట్లు అధికారిక లెక్క. ఇది 2013 తర్వాత అతిపెద్ద సంఖ్య. 2018లో అమెజాన్ అడవుల్లో 39,759 మంటలు రేగాయి.

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో పర్యావరణానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండటం.. చెట్లను నరికి దగ్ధం చేసేవారిని ప్రోత్సహిస్తోందని ఉద్యమకారులు అంటున్నారు.

వాతావరణ మార్పు వాదనను తిరస్కరించే బొల్సొనారో ఈ విమర్శలకు ప్రతిస్పందిస్తూ.. తన ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయటానికి స్వచ్ఛంద సంస్థలు స్వయంగా అడవుల్లో మంటలు రాజేస్తున్నాయని ఆరోపించారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో

ఆర్పటానికి తీసుకుంటున్న చర్యలేమిటి?

అయితే.. అమెజాన్ అడవులు యూరప్ కంటే పెద్దవని.. అక్కడ మంటలతో ఎలా పోరాటం చేస్తామని బ్రెజిల్ అధ్యక్షుడు ప్రశ్నించారు. ఈ మంటలతో పోరాడటానికి తన ప్రభుత్వం వద్ద తగిన వనరులు లేవన్నారు.

''మంటలను ఆర్పటానికి 40 మందిని పంపించటమా? మా దగ్గర అన్ని వనరులు లేవు'' అని ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అమెజాన్ బేసిన్‌లోని పలు ఇతర దేశాల్లో కూడా ఈ ఏడాది కార్చిచ్చులు చెలరేగాయి. వెనిజ్వేలాలో 26,000 కార్చిచ్చులు, బొలీవియాలో 17,000 అడవి మంటలు నమోదయ్యాయి.

బొలీవియా తమ దేశం తూర్పు భాగంలో రేగుతున్న అటవీ మంటలను ఆర్పటానికి అగ్నిమాపక ఎయిర్-టాంకర్‌ను అద్దెకు తీసుకుంది. ఆ కార్చిచ్చు ఇప్పటివరకూ ఆరు చదరపు కిలోమీటర్ల అడవుల్లో విస్తరించింది.

మంటల నుంచి తప్పించుకున్న జంతువుల కోసం సంరక్షణ ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నారు.

Image copyright PLANET LABS INC

ఈ మంటల వల్ల దుష్పరిణామాలేమిటి?

ఈ మంటల నుంచి భారీ ఎత్తున పొగ, కార్బన్ విడుదలవుతోంది.

మంటల నుంచి రేగుతున్న పొగ అమెజాన్ అడవి మీద, అడవిని దాటి కూడా విస్తరించింది.

ఈ పొగ అట్లాంటిక్ సముద్ర తీరం వరకూ ప్రయాణిస్తోందని యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సర్వీస్ (కామ్స్) చెప్తోంది. ఈ పొగ వల్ల దాదాపు 3,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సావో పాలో నగరం మీద ఆకాశం కూడా నల్లబారింది.

అమెజాన్ అడవుల్లో మంటల నుంచి రేగుతున్న పొగవల్ల ఈ ఏడాది ఇప్పటివరకూ 228 మెగాటన్నులతో సమానమైన కార్బన్ డై ఆక్సైడ్ విడుదలైందని కామ్స్ లెక్కగట్టింది.

ఈ పొగల నుంచి అత్యంత విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ కూడా విడుదలవుతున్నట్లు చెప్పింది.

మన ఇల్లు తగలబడుతోంది: ఫ్రాన్స్ అధ్యక్షుడు

అమెజాన్‌ అడవుల్లో రికార్డు సంఖ్యలో కార్చిచ్చులు చెలరేగుతుండటం అంతర్జాతీయ సంక్షోభమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుత జీ7 శిఖరాగ్ర సదస్సు అజెండాలో ఈ అంశం అగ్రభాగాన ఉండాలన్నారు.

''మన ఇల్లు కాలిపోతోంది'' అంటూ ఆయన ట్వీట్ కూడా చేశారు.

అయితే.. మాక్రాన్ ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో విమర్శించారు. నిష్పాక్షిక సమాచారం, పరస్పర గౌరవం ప్రాతిపదికగా ఈ అంశంపై చర్చించటానికి తాను సిద్ధమన్నారు.

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా.. అమెజాన్ మంటల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.

అమెజాన్‌లో సరికొత్త జీవజాతులు - వీడియో

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionసరికొత్త జీవజాతుల్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీరీలను ఆగ్రా జైలులో పెట్టిన ప్రభుత్వం.. తమవారిని కలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న బంధువులు

పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు

ప్రెస్‌ రివ్యూ: గోదావరిలో 315 అడుగుల లోతులో బోటు

హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి

సెప్టెంబర్ 17: విలీనమా.. విమోచనా... 1948లో జరిగిన హైదరాబాద్ విలీనాన్ని ఎలా చూడాలి

డాక్టర్ కోడెల శివప్రసాద్: ప్రేమాస్పదుడు - వివాదాస్పదుడు

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులతో పెరిగిన ఆయిల్ ధరలు

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు