కాంగోలో ఉత్తరాంధ్రుల కష్టాలు: సరైన భోజనం లేదు.. పనిచేస్తున్న కంపెనీ జీతం ఇవ్వడం లేదు.. పైగా ఎబోలా భయం

  • 24 ఆగస్టు 2019
బాధితుడి తల్లి
చిత్రం శీర్షిక కాంగోలో చిక్కుకున్నవారి కుటుంబసభ్యులు

సొంతూళ్లను వీడి ఉపాధి కోసం ఆఫ్రికా ఖండంలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ) వెళ్లిన ఉత్తరాంధ్రులకు అక్కడ కష్టాలు ఎదురవుతున్నాయి.

దేశం కాని దేశంలో తమ గోడు వినేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో తమను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలంటూ తమ వారికి ఫోన్ చేసి వేడుకుంటున్నారు.

ఇప్పటికే కొందరు స్వస్థలాలకు చేరుకోగా మిగతావారినీ రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకాంగోలో ఉత్తరాంధ్రుల కష్టాలు: సరైన భోజనం లేదు.. పనిచేస్తున్న కంపెనీ జీతం ఇవ్వడం లేదు.. పైగా ఎబోలా భయం

స్థానికంగా కంటే ఎక్కువ వేతనాలు పొందొచ్చని.. అలా సంపాదించిన డబ్బుతో తమవారిని బాగా చూసుకోవచ్చన్న ఆశతో ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఇతర దేశాల్లో పనులకు వెళ్తున్నారు.

ఇలాంటి ఆశతోనే శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం ఉద్దాన గోపీనాథపురానికి చెందిన కొందరు యువకులు ఇచ్చాపురంలోని ఓ ఏజెంట్ సహాయంతో కాంగో వెళ్లారు.

నెలకు రూ.లక్ష జీతం.. దాంతో పాటు ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని ఏజెంట్లు చెప్పడంతో ఒక్కొకక్కరు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ చెల్లించారు. ఇలా 40 మంది శ్రీకాకుళం జిల్లావాసులు కాంగో వెళ్లారు.

చిత్రం శీర్షిక కర్ని మల్లేశం

చైనా కంపెనీలో చిక్కుకుపోయాం

కొద్దికాలం కాంగోలో పనిచేస్తే తమ కష్టాలన్నీ తీరుతాయని.. ఆ తరువాత సొంతూళ్లకు వెళ్లి సుఖంగా ఉండొచ్చని భావించామని.. కానీ, అక్కడికి వెళ్లాక పరిస్థితులు వేరేగా ఉన్నాయని 'బీబీసీ'తో ఫోన్‌లో మాట్లాడిన కర్ని మల్లేశం చెప్పారు.

ఏజెంట్లు తమకు చెప్పిన కంపెనీ కాకుండా చైనాకు చెందిన ఓ బహుళ జాతి సంస్థలో పనికి కుదిర్చారని మల్లేశం తెలిపారు.

తమ పరిస్థితి దయనీయంగా ఉందని.. కనీసం సరిపడా భోజనం కూడా పెట్టడం లేదని, ఒకే ఇంట్లో 20 మందిని ఉంచుతున్నారంటూ ఆయన తన గోడు వెళ్లగక్కారు.

జీతం గురించి ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని.. తమను పంపించిన ఏజెంట్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తాను సమస్యను పరిష్కరిస్తానని చెబుతున్నారే కానీ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని మల్లేశం అన్నారు.

Image copyright Getty Images

ఎబోలా భయం

కాంగోలో శ్రీకాకుళం వాసులు ఉంటున్న ప్రాంతానికి సమీపంలోనే ఇటీవల ఎబోలా వైరస్ వ్యాప్తి చెందింది. దాంతో వారికిప్పుడు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. తమను వెంటనే స్వస్థలాలకు పంపించమని ఆందోళన చేశారు.

అయినా కంపెనీ నుంచి, ఏజెంట్ నుంచి స్పందన రాకపోయేసరికి కొందరు తమ కుటుంబసభ్యులకు సమస్యను మొరపెట్టుకొన్నారు. కుటుంబ సభ్యులు విమాన టిక్కెట్లు పంపడంతో సొంతూళ్లకు చేరుకోగలిగారు.

అలా వచ్చిన వారిలో కర్ని జోగారావు ఒకరు. తాను అప్పు చేసి రూ.లక్షా 10 వేలు ఏజెంటుకు చెల్లించినట్లు ఆయన చెప్పారు.

ఇచ్ఛాపురంలోని మణికంఠ ఇనిస్టిట్యూట్‌‌కు చెందిన చందు అనే ఏజెంట్ ద్వారా వెల్డింగ్ పనుల కోసం కాంగో వెళ్లినట్లు ఆయన చెప్పారు.

ఈ ఇనిస్టిట్యూట్ వెల్డింగ్, ఎలక్ట్రికల్ వంటి శిక్షణలు ఇచ్చి విదేశాలకు పంపిస్తుంది.

చిత్రం శీర్షిక కర్ని జోగారావు

ఆందోళన చేస్తే పంపించారు: కర్ని జోగారావు

''మొదట దక్షిణ కొరియాకు చెందిన సంస్థలో పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. తీరా అక్కడకు వెళ్లాక ఒక మేన్‌పవర్ సప్లయ్ కంపెనీలో పనిలో పెట్టారు. భోజనం అసలు బాగుండేది కాదు.

ఉదయం పూట ఒక బ్రెడ్ మాత్రమే ఇచ్చేవారు. అక్కడ ఏదైనా అనారోగ్యం వస్తే అన్నీ చూసుకుంటాం అని చెప్పారు. కానీ అక్కడకు వెళ్లాక కనీసం చేతికి వేసుకునే గ్లోవ్స్ కూడా ఇవ్వలేదు.

45 రోజుల జీతం ఇంకా మాకు రావాల్సి ఉంది. పని గంటలు పెంచేశారు. మేమంతా ఆందోళన చేయడంతో కొంతమందిని స్వదేశానికి పంపించారు. అలా వచ్చిన వారిలో నేనొకడిని.''

మా వాళ్లను వెనక్కు రప్పించండి: ఆదిలక్ష్మి

''నా కొడుకు కర్ని మల్లేశం గతంలో పలు దేశాల్లో పనిచేశాడు. కానీ ఇప్పుడు కాంగోలో ఇబ్బందులు పడుతున్నానని ఫోన్ చేసి బాధపడ్డాడు. భోజనం సరిగా ఉండడం లేదట. అప్పు చేసి వెళ్లాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో'' అని కర్ని మల్లేశం తల్లి ఆదిలక్ష్మి కాంగోలో తన కుమారుడు పడుతున్న కష్టాలను బీబీసీతో చెప్పింది.

చిత్రం శీర్షిక టెక్కలి ఆర్డీవో ఎంవీ రమణ

కాంగోలో చిక్కుకున్నవారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నాం: టెక్కలి ఆర్డీవో ఎంవీ రమణ

''ఉత్తరాంధ్ర నుంచి దాదాపు 30 మందికి పైగా కాంగో వెళ్లారు. వారు అక్కడ చిక్కుకున్నట్లు మాకు సమాచారం ఉంది.

ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఈ విషయంపై విచారణకు ఆదేశించారు. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, వజ్రపుకొత్తూరు.. ఇలా జిల్లాలో చాలా ప్రాంతాలకు చెందిన వాళ్లు కాంగోలో ఉన్నారు.

అక్కడ చిక్కుకున్న వాళ్లను విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం.

నకిలీ ఏజెంట్లకు సంబంధించిన సమాచారం ఇప్పటికే పోలీసులు సేకరించారు.

దీనిపై విచారణ జరుపుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని టెక్కలి ఆర్డీవో ఎంవీ రమణ బీబీసీతో చెప్పారు.

'10 మంది తిరిగొచ్చారు.. మిగతావారినీ తీసుకొస్తున్నాం'

"కాంగోలో చిక్కుకున్న వారిలో 10 మంది వరకు స్వస్థలాలకు చేరుకున్నారు. సాధ్యమైనంత త్వరగా అందరినీ రప్పించే ప్రయత్నం చేస్తున్నాం" అని ఇచ్ఛాపురంలోని మణికంఠ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన చందు తెలిపారు.

అక్కడ పని చేసేందుకు వెళ్లినవారు సమ్మె చేయడంతో సమస్య ముదిరిందని.. సాధ్యమైనంత త్వరగా అందరిని వెనక్కు రప్పిస్తున్నామని ఆయన చెప్పారు. వారికి రావాల్సిన బకాయిలన్నీ వచ్చేలా చూస్తామన్నారు.

ప్రధాన ఏజెంట్ గుజరాత్‌లో..

శ్రీకాకుళం వాసులను కాంగో పంపించిన చందు ప్రధాన ఏజెంట్ కాదు. గుజరాత్‌కు చెందిన అజాద్ సింగ్ (షాబీ ఇంటర్నేషనల్ టూర్ అండ్ ట్రావెల్ ఓవర్సీస్ సర్వీసెస్) అనే వ్యక్తి ప్రధాన ఏజెంట్. కాంగోకు కార్మికులను సరఫరా చేసే కాంట్రాక్టు ఈయనకు ఉంది.

విశాఖపట్నంలోని గాజువాక ఆటోనగర్‌లో ఉన్న ఐసాట్ ఇన్‌స్టిట్యూట్‌కు అజాద్ సింగ్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు.

ఐసాట్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మణికంఠ ఇన్‌స్టిట్యూట్ మళ్లీ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. ఈ మణికంఠ ఇన్‌స్టిట్యూట్ ద్వారా శ్రీకాకుళం వాసులు వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు.

అలా చిక్కుకుపోయినవారిలో 90 శాతం మంది స్వదేశానికి చేరుకున్నారు. అయితే, వీరికి జీతం బకాయి ఉండడంతో ఆ వ్యవహారాల పరిష్కారం కోసం ప్రధాన ఏజెన్సీతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం