జీ7 సదస్సు: అసలు జీ7 బృందం ఏమిటి? అది ఏం చేస్తుంది?

జీ7 దేశాలు

ఫొటో సోర్స్, AFP

ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో కూడిన జీ7 బృందం ఫ్రాన్స్‌లోని రిసార్ట్ పట్టణం బియారిట్జ్‌లో సమావేశం అవుతోంది. ఇది జీ7 బృందం 45వ శిఖరాగ్ర సమావేశం. అసలు ఏమిటీ జీ7? అందులో సభ్యు దేశాలు ఏవి? ఈ బృందం ఏం చేస్తుంది?

జీ7 అంటే ఏడు దేశాల బృందం. ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందినట్లు భావించే ఏడు దేశాలు: కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా - ఇందులో సభ్యులుగా ఉన్నాయి.

ఈ బృందం తనని తాను ఒక 'విలువలతో కూడిన సమాజం'గా పరిగణిస్తుంది. స్వాతంత్ర్యం, మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, చట్ట పాలన, సుసంపన్నత, సుస్థిర అభివృద్ధి దీని ప్రధాన సూత్రాలు.

మొదట 1975లో నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి సాధ్యమైన పరిష్కారాల గురించి చర్చించటానికి ఆరు దేశాల బృందం సమావేశమైంది. ఆ మరుసటి ఏడాది ఈ బృందంలో కెనడా కూడా చేరింది.

ఫొటో సోర్స్, Getty Images

ఈ జీ7 దేశాల మంత్రులు, అధికారులు.. ఉమ్మడి ప్రయోజనాల అంశాలపై చర్చించటానికి ఏడాది పొడవునా సమావేశమవుతుంటారు.

ప్రతి సభ్య దేశమూ.. ఒక్కో ఏడాది జీ7 అధ్యక్ష బాధ్యతను చేపడుతుంది. ఆ దేశమే ఆ సంవత్సరానికి కీలకమైన రెండు రోజుల శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తుంది.

ఇంధన విధానం, వాతావరణ మార్పు, హెచ్ఐవీ-ఎయిడ్స్, ప్రపంచ భద్రత వంటివి గత శిఖరాగ్ర సదస్సుల్లో చర్చించిన కొన్ని అంశాలు.

వార్షిక శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం.. సభ్యదేశాలు ఆమోదించిన అంశాలను వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేస్తుంది.

ఈ సదస్సుకు హాజరయ్యే వారిలో జీ7 దేశాల ప్రభుత్వాధినేతలతో పాటు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా ఉంటారు.

ఈసారి యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడ్ జుంకర్ శస్త్రచికిత్స కారణంగా సదస్సుకు హాజరుకావటం లేదు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనల్డ్ టస్క్ హాజరవుతున్నారు.

ఇక పలు ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తుండటం సంప్రదాయంగా ఉంది.

ఇప్పుడు జరుగుతున్న బియారిట్జ్ సదస్సులో.. ''అసమానత మీద పోరాటం'' అనేది కీలక అంశంగా పెట్టుకున్నారు.

అయితే.. జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగిన ప్రతిసారీ.. అనేక సంస్థల నుంచి భారీ సంఖ్యలో నిరసనకారులు తమ నిరసనను వ్యక్తంచేస్తుంటారు. పర్యావరణ కార్యకర్తలు మొదలుకుని పెట్టుబడిదారుల వ్యతిరేకుల వరకూ విభిన్న సంస్థలు ఈ ఆందోళనలను నిర్వహిస్తుంటాయి. ఈ ఆందోళనకారులను సదస్సు జరిగే వేదికకు చాలా దూరంలోనే భారీ భద్రతా ఏర్పాట్లతో నిలువరిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images

అసలు ఈ జీ7 ప్రభావం చూపగలదా?

ఈ జీ7 బృందాన్ని ''ముగిసిపోయిన శకానికి సంబంధించి మిగిలిపోయిన శకలం'' అని విమర్శించే వాళ్లు చాలా మందే ఉన్నారు.

అయినప్పటికీ.. ఎయిడ్స్, టీబీ, మలేరియా వంటి వాటి మీద పోరాటానికి అంతర్జాతీయంగా నిధులు అందించటానికి దోహదపడటం సహా అనేక విజయాలు సాధించామని.. ఆ చర్యలు 2002 నుంచి నేటి వరకూ 2.7 కోట్ల ప్రాణాలు కాపాడాయని జీ7 చెప్తుంది.

అలాగే 2016 నాటి పారిస్ వాతావరణ ఒప్పందం అమలు వెనుక గల చోదకశక్తి కూడా తానేనని చెప్తుంది. ఆ ఒప్పందం నుంచి తాను వైదొలగుతున్నట్లు అమెరికా నోటీస్ ఇవ్వటం వేరే విషయం.

ఈ బృందంలో చైనా ఎందుకు లేదు?

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగివుండటంతో పాటు రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా కూడా ఉన్న చైనాలో.. జనాభా తలసరి సంపద మిగతా అభివృద్ధి చెందిన దేశాలకన్నా తక్కువ స్థాయిలో ఉండటం వల్ల.. జీ7 దేశాల తరహాలో ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా దానిని పరిగణించటం లేదు.

అయితే.. మరింత విస్తృతమైన జీ20 దేశాల బృందంలో చైనా కూడా ఉంది.

ఈ బృందంలో రష్యాకు చోటు లేదా?

నిజానికి 1998లో రష్యా కూడా ఈ బృందంలో చేరింది. అప్పుడది జీ8 బృందంగా మారింది. కానీ.. ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను రష్యా తన భూభాగంలో కలుపుకోవటంతో 2014లో ఈ బృందం నుంచి ఆ దేశానికి ఉద్వాసన పలికారు. దీంతో ఈ బృందం మళ్లీ జీ7గా మారింది.

అయితే.. ఈ బృందంలో రష్యాను మళ్లీ చేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విశ్వసిస్తున్నారు. ''మన చర్చల్లో రష్యా కూడా ఉండాలి'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, twitter/narendramodi

జీ7 ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి?

ఈ జీ7 బృందంలో అంతర్గతంగా చాలా విభేదాలున్నాయి.

గత ఏడాది కెనడాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. దిగుమతులపై పన్నులు, వాతావరణ మార్పు విషయంలో చేపట్టాల్సిన చర్యల విషయంలో మిగతా సభ్య దేశాలతో తలపడ్డారు.

అలాగే.. ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులను ఈ బృందం ప్రతిఫలించటం లేదన్న విమర్శలూ ఉన్నాయి.

ఈ బృందంలో ఆఫ్రికా నుంచి, లాటిన్ అమెరికా నుంచి.. దక్షిణార్థ గోళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలేవీ లేవు.

ఆ దేశాలు జీ20లో సభ్యులుగా ఉన్నా.. జీ7లో చోటు లేని ఇండియా, బ్రెజిల్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల నుంచి కూడా ఈ బృందానికి సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఇటువంటి దేశాల్లో కొన్ని 2050 నాటికి.. జీ7 బృందంలోని కొన్ని దేశాలకు స్థానభ్రంశం కలిగిస్తాయని కొందరు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)