మోదీని యూఏఈ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సన్మానిస్తుంటే పాకిస్తాన్‌కు అభ్యంతరం ఎందుకు?

  • రోనక్ కోటేచా, ఫరాన్ రఫీ
  • దుబయ్, ఇస్లామాబాద్ నుంచి, బీబీసీ హిందీ కోసం
యూఏఈలో మోదీ

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ జాయెద్' స్వీకరిస్తారు.

ఈ పురస్కారాన్ని అందుకోనున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే. 'ఆర్డర్ ఆఫ్ జాయెద్' పురస్కారాన్ని చక్రవర్తులు, అధ్యక్షులు, దేశాధినేతలకు ఇస్తారు.

గతంలో 2007లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, 2010లో బ్రిటన్ రాణి ఎలిజబెత్, 2016లో సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లా అజీజ్ అల్ సౌద్, 2018లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

1995లో యూఏఈ ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Getty Images

మోదీకి 'ఆర్డర్ ఆఫ్ జాయెద్' ఎందుకు ఇస్తున్నారు?

అబూదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అభిప్రాయం ప్రకారం... భారత్-యూఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు మోదీ ఎంతో కృషి చేశారు.

అందుకే ఈ అవార్డును మోదీకి ప్రదానం చేయాలని నిర్ణయించామని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ ట్వీట్ ద్వారా షేక్ మొహమ్మద్ బిన్ జైద్ అల్ నహ్యాన్ ప్రకటించారు.

"మా మధ్య చారిత్రక, వ్యూహాత్మక బంధం ఉంది. దీని అభివృద్ధి కోసం మా మిత్రుడు నరేంద్రమోదీ ఎంతో కృషి చేశారు. ఆయన ఈ సంబంధాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 'ఆర్డర్ ఆఫ్ జాయెద్'తో గౌరవించాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నిర్ణయించారు" అని అబూదాబి రాజు తెలిపారు.

షేక్ జాయెద్ 100వ జయంతి వేడుకల సందర్భంగా అందిస్తున్న ఈ సంవత్సర పురస్కారం మరింత విశిష్టమైనదని, దాన్ని మోదీకి ప్రదానం చేస్తున్నామని యూఏఈ విదేశీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 'సహనంతో కూడిన సంవత్సరం'గా 2019ని గుర్తిస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.

యూఏఈ వ్యాపార భాగస్వాముల్లో మూడో అతిపెద్ద దేశం భారత్ అని, ఇరు దేశాల మధ్య ప్రతి సంవత్సరం 60బిలియన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుందని వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images

భారత్ - యూఏఈ సంబంధాలు

ఇరుదేశాల నేతలు ఒకరి దేశంలో మరొకరు పర్యటనలు జరపడం మోదీ హయాంలో గణనీయంగా పెరిగింది.

షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ గత మూడేళ్లలో రెండుసార్లు భారత్‌లో పర్యటించారు. మొదటిసారి 2016 ఫిబ్రవరిలో భారత్ వచ్చిన ఆయన, 2017 రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథి హోదాలో మరోసారి దిల్లీకి వచ్చారు.

మరోవైపు, రెండుసార్లు యూఏఈలో పర్యటించిన భారత ప్రధాని కూడా మోదీనే. మొదటిసారిగా 2015 ఆగస్టులో మోదీ యూఏఈ పర్యటనకు వెళ్లారు.

అదే సమయంలో, 2018లో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని యూఏఈ నరేంద్రమోదీని ఆహ్వానించింది. అంటే గత ఐదేళ్లలో ఇది మోదీకి మూడో పర్యటన అవుతుంది.

తన పర్యటనలో భాగంగా మోదీ.. యువరాజుతో భేటీ అవుతారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై ఇద్దరు నేతలూ చర్చించే అవకాశముంది.

ఈ సందర్భంగా, మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలకు గుర్తుగా అబూదాబీలోని భారత రాయబార కార్యాలయం మోదీ సమక్షంలో ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేయనుంది. మోదీ యూఏఈలో రూపే కార్డు సేవలను ప్రారంభిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌కు అభ్యంతరం ఎందుకు?

నరేంద్ర మోదీ యూఏఈ ప్రభుత్వ అత్యున్నత పౌరపురస్కారం అందుకోబోతున్నారనే వార్త పాకిస్తాన్‌కు తీవ్ర ఆశ్యర్యాన్ని కలిగించేదే.

‘‘భారత్‌తో బలమైన ఆర్థిక సంబంధాలు కలిగిన దేశంలోనే మోదీ ఇప్పుడు పర్యటిస్తుండవచ్చు. కానీ, కశ్మీర్ వివాదం కారణంగా ఇది పాకిస్తాన్‌కు భావోద్వేగపరమైన అంశంగా మారింది. భవిష్యత్తులో కశ్మీరీల ఇక్కట్లు మరింత ఎక్కవవుతాయని, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతాయని పాకిస్తాన్ భావిస్తున్న సమయం ఇది’’ అని లాహోర్‌కు చెందిన రాజనీతిశాస్త్ర నిపుణుడు డాక్టర్ ఉంబ్రీన్ జావేద్ బీబీసీతో అన్నారు.

ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ముస్లిం దేశాలు భారత ప్రధాని మోదీని ఒప్పించే దిశగా ప్రయత్నిస్తాయని, ఆయనకు ఎలాంటి పురస్కారాలు ప్రదానం చేయకుండా ఉంటాయని పాకిస్తాన్ ఆశించింది.

'ఆర్డర్ ఆఫ్ జాయెద్' పురస్కారాన్ని మోదీకి ఇవ్వాలనే నిర్ణయంపై మరోసారి సమీక్షించాలని యూకే లేబర్ పార్టీ ఎంపీ నాజ్ షా ఇటీవల యూఏఈ యువరాజుకు ఓ లేఖ రాశారు. మోదీ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు కారణమవుతున్నారని ఆయన ఆరోపించారు.

అయితే, ఈ విషయంపై పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం గొంతు వివ్పట్లేదు.

"ఇది పూర్తిగా భారత్, యూఏఈలకు సంబంధించిన అంశం. దీనిపై మేం స్పందించం" అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ ఫైసల్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)