నాజీల కాలం నాటి మానవ శరీర నిర్మాణ శాస్త్ర గ్రంథంలోని చిత్రాలు ఎవరివి? దాని వెనుక ఉన్న రక్తసిక్త చరిత్ర ఏంటి?

  • కీలీగ్ బేకర్
  • బీబీసీ ప్రతినిధి
పెర్న్‌కాఫ్ అట్లాస్‌లోని ఒక చిత్రం
ఫొటో క్యాప్షన్,

పెర్న్‌కాఫ్ అట్లాస్‌లోని ఒక చిత్రం

నరాల సర్జన్ డాక్టర్ సుసాన్ మాకినన్, ఒక శస్త్రచికిత్స పూర్తి చేయటానికి అవసరమైన సాయం కోసం ఒక పుస్తకం తెరిచారు. అది 20వ శతాబ్దపు మధ్య కాలంలో ముద్రించిన శరీరనిర్మాణ శాస్త్రం పుస్తకం.

మానవ శరీరంలోని ఒక్కొక్క పొరను చేతితో చిత్రీకరించిన సంక్లిష్టమైన చిత్రాలతో ఆ పుస్తకం నిండి ఉంది. దాని సాయంతో అమెరికాలోని సెయింట్ లూయీలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సుసాన్ తన శస్త్రచికిత్స ప్రక్రియను పూర్తిచేయగలిగారు.

ఆ పుస్తకం పేరు... పెర్న్‌కాఫ్ టోపోగ్రాఫిక్ అనాటమీ ఆఫ్ మాన్. ప్రపంచంలో మానవ శరీర నిర్మాణ చిత్రాలకు ఇది ఉత్తమ ఉదాహరణగా పరిగణిస్తారు. మరే పుస్తకంలో కన్నా ఈ పుస్తకంలోని చిత్రాలలో సూక్ష్మ వివరాలు చాలా సంపన్నంగా ఉంటాయి. రంగులు చాలా స్పష్టంగా ఉంటాయి.

చర్మం, మాంసపు కండ, కండరాలు, నరాలు, అంతర్గత అవయవాలు, ఎముకలు.. సవివరంగా చిత్రీకరించి ఉంటాయి. అయితే గుండె దిటవు లేని వారికి ఇది సరిపోదు.

పెర్న్‌కాఫ్ అట్లాస్ అని సాధారణంగా పిలిచే ఈ పుస్తకం కొన్ని భాగాలుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ముద్రణలో లేదు. పాత పుస్తకాలు ఉంటే ఆన్‌లైన్‌లో వేలాది డాలర్లకు అమ్ముడవుతాయి.

అంత అరుదైనది, డిమాండ్ ఉన్న పుస్తకమే అయినా... ఈ పుస్తకం ఉన్నవారు తమ ఆస్పత్రిలో కానీ, లైబ్రరీలో కానీ, ఇంట్లో కానీ గర్వంగా ప్రదర్శించరు.

ఎందుకంటే, ఈ పుస్తకంలో క్షుణ్నంగా చిత్రించిన వివరాలు... నాజీలు చంపిన వేలాది మంది మృతదేహాలను ఉపయోగించుకుని కనుగొన్నవి. ఆ పుస్తకంలోని వేలాది పుటల్లో చూపించిన చిత్రాలన్నీ ముక్కలుగా ఛేదించిన ఆనాడు నాజీల చేతుల్లో చనిపోయిన వారివే.

ఆ చీకటి చరిత్రతో ఆ పుస్తకం కళంకితమైందని విమర్శకులు అంటారు. ఆ పుస్తకం మూలాలు తనకు ఇబ్బందికరంగా అనిపిస్తాయని డాక్టర్ సుసాన్ అంటారు. కానీ, ఆ పుస్తకం తన వృత్తిలో చాలా కీలకమైన భాగమని, అది లేకుండా తన పని పూర్తి చేయలేనని చెబుతారు.

ఫొటో క్యాప్షన్,

పెర్న్‌కాఫ్ అట్లాస్‌ పుస్తకాలు కొన్ని బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి

ఆ పుస్తకాన్ని ''నిజమైన దుష్ట చర్యల నుంచి తయారైనది కానీ.. దానిని మేలు కోసం ఉపయోగిస్తున్నారు.. కాబట్టి ఆ పుస్తకం ఒక 'నైతిక ప్రహేళిక'' అని అభివర్ణిస్తారు.. నాటి జాతి హననం నుంచి ప్రాణాలతో బయటపడ్డ యూదు గురువు జోసెఫ్ పొలాక్. ఆయన ప్రస్తుతం ఆరోగ్య చట్టంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

నాటి నాజీ ప్రముఖుల్లో ఒకరైన డాక్టర్ ఎడ్వర్డ్ పెర్న్‌కాఫ్.. అడాల్ఫ్ హిట్లర్‌కి చెందిన పార్టీకి మద్దతు ఇవ్వటం వల్ల ఆస్ట్రియాలో విద్యారంగంలో ఉన్నత హోదాకు చేరుకున్నాడు. ఆయన 20 సంవత్సరాల పాటు పనిచేసి ఈ పుస్తకాన్ని తయారు చేశారు.

పెర్న్‌కాఫ్ చురుకైన నేషనల్ సోషలిస్ట్ అని ఆయన సహచరులు అభివర్ణించారు. 1938 నుంచి ఆయన ప్రతి రోజూ విధుల్లో నాజీ యూనిఫాం ధరించేవాడు.

యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో వైద్య కళాశాల డీన్‌గా పదవి చేపట్టినపుడు.. ఆ విభాగంలోని అధ్యాపకుల్లో యూదులందరినీ విధుల నుంచి తొలగించాడు. అలా ఉద్వాసనకు గురైన వారిలో ముగ్గురు నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా ఉన్నారు.

1939లో చేసిన కొత్త థర్డ్ రాయిఖ్ చట్టం.. మరణశిక్షకు గురైన వారి మృతదేహాలన్నిటినీ.. పరిశోధన, బోధన అవసరాల కోసం తక్షణమే సమీపంలోని మానవ శరీరశాస్త్ర విభాగానికి పంపించాలని నిర్దేశించింది.

ఈ కాలంలో పెర్న్‌కాఫ్ రోజుకు 18 గంటల పాటు మృతదేహాలను విచ్ఛేదం చేస్తూ గడుపుతుంటే.. ఒక చిత్రకారుల బృందం అతడి పుస్తకం కోసం చిత్రాలు గీస్తుండేది.

కొన్నిసార్లు యూనివర్సిటీలోని ఈ మానవ శరీరనిర్మాణ శాస్త్ర విభాగం మృతదేహాలతో నిండిపోయి ఉండేది. అటువంటి సమయంలో మరణశిక్షలను వాయిదా వేసేవారు.

ఫొటో క్యాప్షన్,

పెర్న్‌కాఫ్, అతడి చిత్రకారులు

ఆ అట్లాస్‌లోని 800 చిత్రాల్లో కనీసం సగం చిత్రాలు.. రాజకీయ ఖైదీలవేనని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ సబీన్ హిల్దిబ్రాంట్ చెప్తారు. వారిలో స్వలింగ సంపర్కులు, జిప్సీలు, రాజకీయ వ్యతిరేకులు, యూదులు ఉన్నారు.

1937లో ప్రచురించిన అట్లాస్ తొలి ముద్రణలో.. చిత్రకారులు ఎరిక్ లెపీర్, కార్ల్ ఎండ్రెసర్‌ల సంతకాలలో స్వస్తికా చిహ్నాలు, ఎస్ఎస్ చిహ్నం కూడా ఉన్నాయి.

1964లో రెండు భాగాలుగా ప్రచురించిన ఇంగ్లిష్ ముద్రణలో కూడా.. నాజీ చిహ్నాలతో సహా వారి సంతకాలు ఉన్నాయి. ఆ తర్వాతి ముద్రణల్లో నాజీ చిహ్నాలను సరిగా కనిపించకుండా చెరిపివేశారు.

ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఈ అట్లాస్ ప్రతులు అమ్ముడయ్యాయి. ఐదు భాషల్లోకి అనువదించారు. వాటిలోని ముందుమాటలు, పరిచయాల్లో అందులోని చిత్రాలను ప్రశంసిస్తూ రాశారే కానీ.. వాటి వెనుక రక్తసిక్త చరిత్ర గురించి ప్రస్తావించలేదు.

1990ల్లో కానీ.. విద్యార్థులు, విద్యావేత్తలు అసలు ఆ అట్లాస్‌లోని చిత్రాల్లో ఉన్న వారు నిజంగా ఎవరు అని ప్రశ్నించటం మొదలు కాలేదు. నిర్ఘాంతపరిచే చరిత్ర వెలుగుచూసిన తర్వాత 1994లో ఈ అట్లాస్‌ ముద్రణ ఆగిపోయింది.

ఫొటో క్యాప్షన్,

ఎరిక్ లెపీర్ సంతకం మధ్యలో స్వస్తికా చిహ్నం

ఈ అట్లాస్‌ను బ్రిటన్‌లో ఉపయోగించటం లేదని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ పేర్కొంది. అయితే, చారిత్రక అవసరాల కోసం లైబ్రరీల్లో వాటిని కొనసాగిస్తున్నట్లు చెప్పింది.

కానీ, న్యూరోసర్జరీ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో పెర్న్‌కాఫ్ అట్లాస్ గురించి 59 శాతం మంది నాడీ సర్జన్లకు తెలుసునని.. 13 శాతం మంది దానిని ప్రస్తుతం ఉపయోగిస్తున్నారని వెల్లడైంది.

సర్వేలో స్పందించిన వారిలో 69 శాతం మంది ఈ అట్లాస్ వెనుక చరిత్ర తెలిసిన తర్వాత దానిని ఉపయోగించటంలో ఎటువంటి ఇబ్బందీ లేదని చెప్పారు. ఇక 15 శాతం మంది.. ఆ చరిత్ర తెలిశాక దీనిని ఉపయోగించాలంటే ఇబ్బందిగా ఉందన్నారు. మరో 17 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు.

ఈ పుస్తకంలోని కచ్చితత్వానికి, క్షుణ్నమైన వివరాలను పోల్చటానికి మరో పుస్తకమేదీ దరిదాపుల్లోకి కూడా రాదని డాక్టర్ సుసాన్ అంటారు. ప్రత్యేకించి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలకు ఇది చాలా ఉపయోగకరమన్నారు. ఎందుకంటే, ''మన శరీరంలో అల్లుకుని ఉన్న ఎన్నో చిన్న నరాలలో నొప్పికి కారణమవుతున్న నరం ఏదనేది గుర్తించటానికి ఇది తోడ్పడుతుంది'' అని చెప్పారు.

అయితే, ఈ పుస్తకం పుట్టుక వెనుక గల చీకటి చరిత్ర గురించి, శస్త్రచికిత్సలో పాలుపంచుకునే ప్రతి ఒక్కరికీ తెలిసేలా చూస్తానని ఆమె పేర్కొన్నారు.

''ఈ అట్లాస్ పుట్టుకలో ఉన్న రక్తసిక్త, కళంక చరిత్ర గురించి నాకు తెలిసినపుడు.. దీనిని నా ఆపరేటింగ్ రూమ్ లాకర్‌లో జాగ్రత్తగా దాచిపెట్టటం మొదలుపెట్టాను'' అని వివరించారు.

ఫొటో క్యాప్షన్,

డాక్టర్ సుసాన్ మాకినన్

ఈ అట్లాస్‌ను వినియోగించటం నైతికమా కాదా అనే అంశం మీద.. గత ఏడాది యూదు గురువు పోలాక్, వైద్య చరిత్రకారుడు, మానసిక వైద్య నిపుణుడు ప్రొఫెసర్ మైఖేల్ గోర్డన్‌లు.. యూదు వైద్య విలువల ఆధారంగా ఒక పరిశోధనాత్మక జవాబును రూపొందించారు. అందుకు డాక్టర్ సుసాన్ అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు.

మనుషుల ప్రాణాలను కాపాడటానికి.. ఈ అట్లాస్ వెనుక గల చరిత్రను తెలియజేయాలన్న షరతుతో - ఇందులోని చిత్రాలను ఉపయోగించుకోవటానికి చాలా యూదు అధికార వ్యవస్థలు అనుమతిస్తాయని వారు నిర్ధారించారు. ఆ చరిత్రను తెలియజేయటం ద్వారా నాటి బాధితులకు దక్కాల్సిన గౌరవం కొంతైనా దక్కుతుందన్నది ఈ షరతు వెనుక ఉద్దేశంగా చెప్పారు.

''డాక్టర్ సుసాన్‌ను చూడండి. ఆమె తన వృత్తిలో చాలా గొప్పవారు. కానీ ఒక నరాన్ని ఆమె గుర్తించలేకపోయారు. ఆ రోగి 'మీరు దానిని గుర్తించలేకపోతే నా కాలిని తీసివేయండి' అని ఆమెతో చెప్పారు. అలా జరగాలని ఎవరూ కోరుకోరు'' అని రబ్బీ పోలాక్ బీబీసీతో పేర్కొన్నారు.

''కాబట్టి ఆమె ఇష్టం లేకపోయినా సరే.. పెర్న్‌కాఫ్ అట్లాస్ తెప్పించుకున్నారు. అందులోని చిత్రాల సాయంతో ఆ నరాన్ని కొన్ని నిమిషాల్లోనే గుర్తించారు'' అని వివరించారు.

''నైతికంగా ఆలోచించే వ్యక్తిగా ఈ పరిస్థితి గురించి ఆమె నన్ను అడిగారు. ఆ రోగికి నయం అవుతుందంటే.. వారి జీవితం వారికి తిరిగి లభిస్తుందంటే.. అందుకోసం ఈ అట్లాస్‌ను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చునని నేను ఆమెకు చెప్పాను'' అని తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

శస్త్రచికిత్స నిర్వహిస్తున్న డాక్టర్ సుసాన్

యుద్ధం తర్వాత పెర్న్‌కాఫ్‌ను అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ నుంచి తొలగించారు. మిత్రదేశాల యుద్ధ శిబిరంలోని ఒక జైలులో మూడేళ్ల పాటు నిర్బంధించారు. అయితే.. అతడి మీద ఎటువంటి నేరాభియోగం చేయలేదు.

అక్కడి నుంచి విడుదల చేసిన అనంతరం.. అతడు యూనివర్సిటీలో తిరిగి చేరాడు. అట్లాస్ తయారు చేసే పనిని కొనసాగించాడు. 1952లో మూడో సంపుటి ప్రచురించాడు. నాలుగో సంపుటి ప్రచురించిన కొంత కాలానికి 1955లో చనిపోయాడు.

ఆరు దశాబ్దాలకు పైగా కాలం గడచిపోయినా కూడా.. శరీరనిర్మాణానికి సంబంధించి సవివరమైన సచిత్ర సమాచారానికి, శస్త్రచికిత్సలకు ఉపయోగపడే అత్యుత్తమ వనరుల్లో ఈ అట్లాస్ ఒకటిగా ఉందని డాక్టర్ సబీన్ హిల్దిబ్రాంట్ పేర్కొన్నారు. ఆమె శరీరనిర్మాణ శాస్త్రాన్ని బోధిస్తారు.

''ఈ అట్లాస్ ద్వారా 'చూడటం' నేర్చుకున్న మాలాంటి వాళ్లం మాకు సందేహాలు వచ్చినపుడల్లా దీనిని ఉపయోగిస్తుంటాం. ఇక నాడీ శస్త్రచికిత్సలో కొంతమంది సర్జన్లకు ఇది ప్రత్యామ్నాయం లేని విశిష్టమైన సమాచార వనరుగా కనిపిస్తుంది'' అంటారామె.

''కానీ, వ్యక్తిగతంగా నేను మానవశరీర నిర్మాణ శాస్త్రాన్ని బోధించేటపుడు.. దీని చరిత్ర గురించి మాట్లాడటానికి సమయం ఉంటే తప్ప ఈ పుస్తకాన్ని ఉపయోగించను'' అని తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

డాక్టర్ సబీన్ హిల్దిబ్రాంట్ ఈ అట్లాస్ గురించి విస్తారంగా రచనలు చేశారు

ఈ అట్లాస్ ''అద్భుతంగా సవివరంగా'' ఉందనటంతో యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన బయోఎతిసిస్ట్ డాక్టర్ జొనాథన్ ఐవ్స్ ఏకీభవిస్తారు. కానీ, దాని ''భయానక చరిత్ర''తో అది కళంకితమైందని అంటారు.

''మనం దీనిని వాడుతున్నామంటే.. దీని నుంచి ప్రయోజనం పొందుతున్నామంటే.. ఒకరకంగా మనం కూడా (ఆనాటి దుష్కృతిలో) భాగస్వాములం అవుతున్నట్లే'' అని అభిప్రాయపడ్డారు.

''ఒకవేళ ఉపయోగించకపోతే ఈ అట్లాస్ మరుగునపడిపోతుందని.. ఈ అట్లాస్‌ ద్వారా చరిత్రలో ఏం జరిగిందనేది గుర్తుచేయటానికి వీలు లేకుండా పోతుందని కూడా వాదించవచ్చు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

డాక్టర్ సుసాన్‌కు.. ఈ అట్లాస్ చరిత్రను ఎన్నడూ మరచిపోలేకపోయినప్పటికీ.. ఇది ఒక కీలకమైన పనిముట్టుగానే ఉంటుంది.

''ఒక నైతిక సర్జన్‌గా, విజయవంతమైన ఫలితం కోసం ఉపకరిస్తుందని నేను భావించే ఎటువంటి విద్యా వనరునైనా సరే ఉపయోగించాలనే నేను భావిస్తాను. నా రోగి నా నుంచి అదే ఆశిస్తారు'' అని ఆమె పేర్కొన్నారు.

''నా అనుభవంలో.. ఈ పుస్తకాలు గనుక కనుమరుగైతే.. సవివరమైన నాడీ శస్త్రచికిత్స చాలా వెనుకబడుతుంది'' అని చెప్పారు.

వీడియో క్యాప్షన్,

హోలోకాస్ట్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)