ఆసియాలోనూ సైనిక సూపర్ పవర్ అమెరికానేనా?

  • 26 ఆగస్టు 2019
అమెరికా, చైనా పతాకాలు Image copyright Getty Images

పసిఫిక్‌లో అమెరికా గుత్తాధిపత్యం ఇప్పుడిక లేదు.

చైనా శరవేగంగా తన సైన్యాన్ని ఆధునికీకరించటం గురించి నిపుణులు చాలా కాలంగా మాట్లాడుతున్నారు. ఆ దేశాన్ని 'ఎదుగుతున్న శక్తి'గా ప్రస్తావిస్తున్నారు.

కానీ ఆ విశ్లేషణకు కాలం చెల్లిపోయి ఉండొచ్చు. చైనా ఇప్పుడు ఎదుగుతున్న శక్తి కాదు. అది ఎదిగిపోయింది. ఇప్పుడా దేశం అనేక సైనిక రంగాల్లో అనేక రకాలుగా అమెరికాను సవాల్ చేస్తోంది.

ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీలో అమెరికా అధ్యయన కేంద్రం కొత్తగా రూపొందించిన నివేదిక నిర్ధారణ ఇది.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా రక్షణ వ్యూహం ''అనూహ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంద''ని.. చైనా నుంచి తన మిత్ర దేశాలకు రక్షణ కల్పించటానికి అమెరికా ఇబ్బందులు పడాల్సి రావచ్చునని ఆ నివేదిక హెచ్చరిస్తోంది.

''ఇండో-పసిఫిక్‌లో అమెరికాకు ఇప్పుడిక సైనిక ఆధిపత్యం లేదు.. ఇక్కడ సైనిక ప్రాబల్యం తనకు అనుకూలంగా ఉండేలా చూసుకోగల ఆ దేశ సామర్థ్యం అంతకంతకూ అనిశ్చితమవుతోంది'' అని పేర్కొంది.

అమెరికా, దాని మిత్ర పక్షాల కీలక సైనిక స్థావరాలకు ముప్పుగా ఉన్నటువంటి చైనా అసాధారణ క్షిపణుల అమ్ములపొదిని ఈ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ స్థావరాలు.. ''ఏదైనా సంఘర్షణ తలెత్తితే ప్రారంభమైన గంటల్లోనే గురిచూసి చేసే దాడులతో నిరుపయోగంగా మారతాయి'' అని ఉద్ఘాటించింది.

చిత్రం శీర్షిక చైనా దేశీయంగా నిర్మించిన తొలి యుద్ధనౌకను ఇటీవల ఆవిష్కరించింది

అమెరికా తరహాలో చైనా అంతర్జాతీయ సూపర్‌-పవర్ కాదు. నిజానికి ఆ దేశం తన సైనిక ఆకాంక్షలు అంత దూరం విస్తరించటం మీద సందేహాలున్నాయి. (అయితే.. ఆ దేశం విదేశాల్లో ఓడరేవులు, స్థావరాల వ్యవస్థను నెమ్మదిగా అభివృద్ధి చేస్తుండటంతో ఇది కూడా మారుతుండవచ్చు.)

ఇప్పటికైతే.. చైనా అంతర్జాతీయ విస్తరణ ప్రధానంగా దాని ఆర్థికవ్యవస్థ మీద ఆధారపడి ఉంది. ఇరవయ్యో శతాబ్దంలో ప్రపంచ ఆధిపత్యం కోసం విదేశీ ఆపరేషన్లు చేపట్టటానికి అమెరికాలో కనిపించిన తపన చైనాలో లోపించింది.

అలాగే.. ప్రపంచ ప్రజలు తన విలువలలో భాగస్వామ్యమయ్యేలా ప్రోత్సహించటానికి అమెరికాకు గల బ్లూ జీన్స్, హాలీవుడ్, బర్గర్ల వంటి మృదువైన శక్తిసామర్థ్యాలేవీ చైనాకు లేవు.

నిజానికి చాలా సూచికల్లో.. అమెరికాకు గల సైనిక బలం ఇప్పటికీ చైనా కన్నా చాలా అధికమైనదే. చైనాతో పోలిస్తే అమెరికా దగ్గర (రష్యా దగ్గర కూడా) అణ్వస్త్రాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

నిఘా సమచార సేకరణ, ఖండాంతర క్షిపణి రక్షణ, నూతన తరం యుద్ధ విమానాల వంటి కీలక రంగాల్లో అమెరికా సాంకేతికంగా చాలా ముందుంది. అలాగే ఆసియాలో లోతుగా పాతుకున్న మిత్రుల వ్యవస్థ మీద.. యూరప్‌లో నాటో వ్యవస్థ మీద అమెరికా ఆధారపడగలదు.

Image copyright Reuters

చైనాకు ఇటువంటి మిత్రుల వ్యవస్థ ఏదీ లేదు. కానీ.. అమెరికాకు గల సాంకేతిక ఆధిక్యతను చైనా వేగంగా తుడిచేస్తోంది. చైనాకు చాలా ముఖ్యమైన ప్రాంతం ఆసియా. విస్తరణ విషయంలో దీనిని తన ఇంటి పరిసరాలుగా పరిగణిస్తుంది.

రెండు కీలకమైన అంశాలు.. దృష్టి - సామీప్యత అనే విషయాలను పరిశీలిస్తే.. ఆసియాలో అమెరికాను సవాల్ చేస్తున్న ఒక సూపర్-పవర్‌గా చైనా ఇప్పటికే అవతరించింది.

అమెరికా శక్తిసామర్థ్యాలను, యుద్ధపోరాటాలను చైనా అధ్యయనం చేసింది. అమెరికా సైనిక శక్తికి సంప్రదాయ వనరులుగా ఉన్న వాటిని నిరోధించటానికి.. ముఖ్యంగా అమెరికా తన సైనిక బలాన్ని ప్రదర్శించటంలో కీలకంగా ఉన్న ఆ దేశ నావికాదళానికి చెందిన శక్తివంతమైన యుద్ధవిమాన వాహక బృందాలను ఎదుర్కోవటానికి సమర్థవంతమైన వ్యూహాలను అమలు చేస్తోంది.

సైనిక భాషలో చెప్తే.. ''అందుబాటుకు వ్యతిరేకంగా.. ప్రాంతాన్ని నిరాకరించే'' వైఖరిని అవలంబిస్తోంది. అమెరికా బలగాల సంచారం తన తీరానికి సాధ్యమైనంత దూరంగానే ఆగిపోయేలా చేయటానికి.. అనేక సెన్సర్లు, ఆయుధ వ్యవస్థల మీద చైనా తదేకంగా దృష్టి కేంద్రీకరిస్తోంది.

ఇది పైకి స్వాభావికమైన ఆత్మరక్షణ విధానంగా కనిపిస్తుంది.

అయితే.. చైనా సామర్థ్యాలు అమెరికా నుంచి రాగల ఎటువంటి స్పందననైనా తిప్పికొట్టి ఎదుర్కోగలమన్న ఆత్మవిశ్వాసంతో.. ముందడుగు వేయటానికి వీలు కల్పిస్తున్నాయనే విశ్లేషకుల సంఖ్య పెరుగుతోంది.

ఇండో-పసిఫిక్‌లో తన శక్తిని చాటగల అమెరికా సామర్థ్యాన్ని.. చైనా కౌంటర్-ఇంటర్వెన్షన్ వ్యవస్థలు తగ్గించివేశాయి. అమెరికా స్పందించటానికి ముందే.. ఆ దేశం తేరుకునే లోగానే విజయం సాధించటానికి చైనా పరిమిత బలం ఉపయోగించే ముప్పు పెరిగింది. ఈ క్రమంలో అమెరికా రక్షణ హామీలకు సవాల్ విసురుతుంది'' అని ఆస్ట్రేలియా అధ్యయన నివేదిక వివరించింది.

ఏదైనా సంక్షోభ సమయంలో అమెరికాను 'తొలి దీవి శ్రేణి' (జపాన్ దిగువ మొదలుకుని తైవాన్ మీదుగా పశ్చిమ ఫిలిప్పీన్స్ వరకూ గల దీవుల శ్రేణి) ప్రాంతంలోకి రాకుండా నిరోధించటం చైనా లక్ష్యం.

అంతేకాదు.. దీనికి వెలుపల గల 'రెండో దీవి శ్రేణి'కి కూడా రాకుండా.. గ్వామ్ దీవిలోని అమెరికా స్థావరాల వరకూ చేరుకోగల తన ఆయుధాలతో నిరోధించాలని కూడా చైనా భావిస్తోంది.

చైనా నుంచి ఎదురవుతున్న సవాలు గురించి అమెరికా రక్షణ విభాగానికి తెలియదని కాదు. దశాబ్దాల పాటు తీవ్రవాద వ్యతిరేక యుద్ధాల అనంతరం భారీ బల పోటీకి అమెరికా తన సైన్యాన్ని పునర్నిర్మిస్తూ, పునరుత్తేజితం చేస్తోంది.

ప్రచ్ఛన్న యుద్ధంలో సోవియట్ యూనియన్ మీద దృష్టి కేంద్రీకృతమై ఉండేది. ఇప్పుడు ప్రధానంగా చైనా మీదకు ఆ దృష్టి మళ్లింది.

అయితే.. చేయాల్సిన పని మీద అమెరికా తగినంత దృష్టి కేంద్రీకరించిందా అని సిడ్నీ యూనివర్సిటీ నివేదిక ప్రశ్నిస్తోంది.

అమెరికా విదేశాంగ విధాన వ్యవస్థలో పాతుకుపోయి ఉన్న సూపర్-పవర్ ఆలోచనా తీరు.. ఇండో-పసిఫిక్‌లో విజయం సాధించటం కోసం.. ఇతర ప్రపంచ హామీలను తగ్గించుకోవటంలో లేదంటే వ్యూహాత్మక సంతులనం సాధించటంలో అమెరికా సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని ఆ నివేదిక అంటోంది.

కొత్త ఆయుధాలు, పరిశోధనలకు నిధులు వెచ్చిస్తున్నారు. కానీ ప్రమాదం చాలా భారీగా ఉంది.

''తగినంత విధంగా సంసిద్ధంగా లేని, తగినంత ఆయుధ సంపత్తి అందని, బలప్రదర్శన పోటీ కోసం ఉద్దేశించిన బలగాల బలం చాలా వృధా అవుతోంది'' అని ఆ నివేదిక పేర్కొంది. ఏకకాలంలో ఆధునికీకరణ ప్రాధాన్యతలు వెనుకపట్టు పట్టడం వల్ల అమెరికా బడ్జెట్ సామర్థ్యాలు కూడా దెబ్బతింటాయని ఆ నివేదిక హెచ్చరిస్తోంది.

అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఒక దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థ రూపొందించిన నివేదిక ఇది.

చైనా సాధికారికంగా భావించటం స్పష్టంగా తెలుస్తోంది. ఆ దేశం ఇటీవల ప్రచురించిన రక్షణ రంగ శ్వేతపత్రంలో స్వరంలో ఇది కనిపిస్తోంది.

Image copyright Getty Images

ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు ఎదురు నిలవటానికి మాత్రమే కాదు.. మరింత ఆత్మవిశ్వాసంతో కూడిన వైఖరిని అనుసరించాలని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ నిర్ణయించుకున్నారు. హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనల విషయంలో కానీ, తైవాన్ మీద హక్కులు తనవేనన్న దీర్ఘకాలిక వైఖరిలో కానీ ఇది తేటతెల్లమవుతోంది.

చైనా పెరుగుతున్న తన ఆర్థిక బలానికి అనుగుణంగా సైనికంగా కూడా ఎదగటం అనివార్యం. అయితే.. అసలే కష్టంగా ఉన్న పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరింత దిగజార్చారని కొందరు విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

వాణిజ్యంలో చైనాను ఎదుర్కోవాల్సిందేనని.. కానీ ఈ విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి వల్ల వాణిజ్య యుద్ధంలో ఓడిపోతుందేమోనని అమెరికాలో చాలా మంది భయపడుతున్నారు.

మొత్తంమీద.. ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధానంలో స్పష్టమైన వ్యూహాత్మక కోణం తరచుగా లోపిస్తోంది. అధ్యక్షుడి ట్విటర్ వ్యాఖ్యల చపలత్వంతో.. గ్రీన్‌ల్యాండ్‌ను కొనాలన్నటువంటి విడ్డూరమైన తన కోరికలతో అమెరికా విదేశాంగ విధానం దెబ్బతినే ఆస్కారముంది.

దీనికి విరుద్ధంగా.. తను ఏం కావాలనుకుంటున్నది చైనాకు ఖచ్చితంగా తెలుసు. అది సాధించే వ్యూహం, మార్గం ఆ దేశానికి ఉన్నాయి. నిజానికి.. అది ఇప్పటికే సాధించి ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)