బుమ్రా సూపర్ ఇన్నింగ్స్... ఆంటిగ్వా టెస్టులో భారత్ ఘనవిజయం

  • 26 ఆగస్టు 2019
భారత్ విజయం Image copyright Getty Images

ఫాస్ట్ బౌలర్ బుమ్రా చెలరేగడంతో ఆంటిగ్వాలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది.

రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఏడు పరుగులు ఇచ్చిన బుమ్రా ఐదు వికెట్లు తీసి వెస్టిండిస్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు.

దీంతో ఆతిథ్య జట్టు 100 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో రోస్టన్ ఛేస్(12), కెమర్ రోచ్(38), క్యుమిన్స్(19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు.

భారత బౌలర్ల ధాటికి 27 ఓవర్లలలోనే వెస్టిండిస్ కథ ముగిసింది.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు నష్టపోయి 343 పరుగులు చేసింది. ఈ దశలోనే కెప్టెన్ కోహ్లీ ఇన్సింగ్స్ డిక్లేర్డ్ చేశారు. దీంతో వెస్టిండిస్‌పై 419 పరుగులు భారీ లక్ష్యం పడింది.

Image copyright Getty Images

రాణించిన రహానే, విహారీ

భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 222 పరుగులు చేసింది.

77 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు కోహ్లీ, రహానే, హనుమ విహారీ రాణించడంతో వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.

రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 51 పరుగులతో రాణించగా, హనుమ విహారీ(92) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. రహానే(102) నెమ్మదిగా ఆడుతూ టెస్టుల్లో 10వ సెంచరీ చేశాడు.

విహారీతో కలిసి రహానే చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో లంచ్ సమయానికి భారత్ 287/4తో పటిష్ఠ స్థితికి చేరింది. రహానే తర్వాత క్రీజ్‌లో వచ్చిన పంత్ (7) ఎక్కువ సేపు కొనసాగలేకపోయాడు. విహారీ ఔటకావడంతో కోహ్లీ 343/7 పరుగుల వద్ద ఇన్సింగ్స్ డిక్లేర్డ్ చేశారు.

Image copyright Getty Images

బుమ్రా సూపర్ ఇన్నింగ్స్

భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన వెస్టండీస్ జట్టు ఆదిలోనే తడబడింది. భారత ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, ఇషాంత్ బౌలింగ్ ధాటికి ఆ జట్టు కుప్పకూలింది.

స్కోర్ బోర్డు మీద 10 పరుగులు చేరుకునేలోపే ఓపెనర్లు బ్రాత్ వైట్ (1), క్యాంప్ బెల్ (7) వెనుదిరిగారు. టీ బ్రేక్ సమాయానికి వెస్టిండీస్ స్కోర్ 15/5కు చేరింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రోచ్, కమిన్స్ కొద్దిసేపు నిలదొక్కుకోవడంతో ఆ జట్టు 100 పరుగులైనా చేయగలింది.

బుమ్రా ఈ ఇన్నింగ్స్‌లో కేవలం ఏడు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. రెండో ఇన్సింగ్స్‌లో సెంచరీ చేసిన రహానేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించారు.

ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ‌షిప్ పట్టికలో 60 పాయింట్లతో శ్రీలంకతో కలిసి భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రెండో టెస్టు శుక్రవారం జమైకాలో ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు