‘కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఇప్పుడు రద్దు చేశారు.. కానీ, గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రత్యేక అధికారాలను పాక్ 1974లోనే రద్దు చేసింది’

  • 1 సెప్టెంబర్ 2019
రుస్తుమ్ అలీ
చిత్రం శీర్షిక రుస్తుమ్ అలీ

రుస్తుమ్ అలీకి 83 ఏళ్లు.. మంచి ఆరోగ్యంతో తన పనులు తాను చేసుకుంటుంటారు. పాకిస్తాన్ అధీనంలో ఉన్న బాల్టిస్తాన్‌లోని స్కర్దూ జిల్లాలో ఆయన కుమారుడు ఓ ఇల్లు కట్టిస్తున్నారు. అక్కడికి రుస్తుమ్ వచ్చారు.

బాల్టిస్తాన్‌.. భారత్‌లోని లద్దాఖ్‌కు సరిహద్దు ప్రాంతం.

రుస్తుమ్ కుమారుడి ఇంటి నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ఎత్తైన కొండ ప్రాంతంలో ఇంకా అది అసంపూర్తిగానే ఉంది.

అక్కడ తన మనవడితో మాట్లాడుతూ, ఆ ఇంటి గోడలను వేళ్లతో స్పృశిస్తూ రుస్తుమ్ అటూ ఇటూ తిరుగుతున్నారు. ఒక్కసారిగా ఆయనలో దుఃఖం మొదలైంది.

రుస్తుమ్‌ సొంత ఊరు చలోంఖా. అది కార్గిల్ సెక్టార్‌లో ఉంది. 1971 కన్నా ముందు పాకిస్తాన్‌లో భాగంగా ఉన్న ఆ గ్రామం.. ఆ ఏడాది యుద్ధం తర్వాత భారత్ అధీనంలోకి వచ్చింది.

''నా ఇల్లు, ఊరు ఎప్పుడూ గుర్తుకొస్తుంటాయి. పూలు, పండ్ల తోటలు.. ఆ దారులు.. దేన్నీ నేను మరిచిపోలేదు. రోజూ రాత్రి నాకు కలలోనూ అవే కనిపిస్తుంటాయి'' అంటూ రుస్తుమ్ చెబుతుండగానే ఆయన కళ్ల నుంచి చెంపలపైకి కన్నీరు జారుతోంది.

రుస్తుమ్‌లాగే బతూల్ సీమా కూడా కార్గిల్‌లో ఉంటున్న తమ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారోనని ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘వాళ్లకు కనీసం తిండైనా దొరుకుతుందో లేదో మాకు తెలియడం లేదు. కర్ఫ్యూ వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ’’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

చిత్రం శీర్షిక బతూల్ సీమా

రుస్తుమ్, బతూల్ లాగే సరిహద్దుకు అటువైపు ఉన్న తమ కుటుంబ సభ్యులను ఎప్పటికైనా కలుస్తామన్న ఆశ వారిలో చాలా మందికి ఉంది.

కానీ, జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని, స్థానికులకు ప్రత్యేక అధికారాలను రద్దు చేస్తూ ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏలను భారత ప్రభుత్వం సవరించిన తర్వాత వారిలో ఆశలు సన్నగిల్లుతున్నాయి.

రుస్తుమ్ లాంటి వేల మంది శరణార్థుల ఆస్తులకు ఆర్టికల్ 370 ఓ రక్షణగా ఉండేది.

''భారత ప్రభుత్వానికి మా సంపదను తీసుకునే హక్కు లేదు. ఒకప్పుడు మా ప్రాంతంలో రాజుల్లా బతికేవాళ్లం'' అంటూ రుస్తుమ్ ఆవేదన వ్యక్తం చేశారు.

భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ నిర్ణయానికి ముందు గిల్గిత్ బాల్టిస్తాన్ జమ్మూకశ్మీర్‌లోని రాజసీ ప్రాంతంలో భాగంగా ఉండేది.

పాకిస్తాన్ దీన్ని ఆక్రమించుకుని పాక్ అధీనంలోని కశ్మీర్‌లో కలుపుకొంది.

Image copyright Getty Images

మూడు దేశాలకూ ముఖ్యం

ప్రకృతి సాందర్యం, మంచు కొండలతో మనోహరంగా కనిపించే గిల్గిత్ బాల్టిస్తాన్ భౌగోళికంగా భారత్, పాకిస్తాన్‌లకు చాలా కీలకమైన ప్రాంతం.

భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, చైనా.. ఇలా నాలుగు దేశాలకు ఈ ప్రాంతంతో సరిహద్దులున్నాయి. వీటిలో మూడు దేశాలు అణ్వస్త్ర సామర్థ్యమున్నవే.

చైనా తలపెట్టిన ‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్’ (సీపెక్)కు ప్రవేశమార్గం గిల్గిత్ బాల్టిస్తానే.

స్థూలంగా చెప్పాలంటే పాక్ అధీనంలో ఉన్న గిల్గిత్ బాల్టిస్తాన్‌లో పరిస్థితులు దాదాపుగా నియంత్రణలోనే ఉన్నాయి.

అయితే, కొంతమంది పాక్ సర్కారు 'ద్వంద్వ వైఖరి'పై అంసతృప్తితో ఉన్నారు.

స్కర్దూలోని ఓ హోటల్‌లో మూడు వేర్వేరు జాతీయవాద వర్గాల ప్రతినిధులు షబ్బీర్ మెహర్, అల్తాఫ్ హుస్సేన్, అలీ శఫాలతో మేం మాట్లాడాం. సామన్య ప్రజల మద్దతు కూడగట్టేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

పాకిస్తాన్ తమల్ని మోసం చేస్తోందని షబ్బీర్ మెహర్ అన్నారు.

''ఈ ప్రాంతాన్ని తమదని ప్రకటించుకోవడానికి పాకిస్తాన్ తటపటాయిస్తుంటుంది. గిల్గిత్ బాల్టిస్తాన్‌ విషయం కశ్మీర్ వివాదంతో ముడిపడి ఉందని, అది పరిష్కారమయ్యేంతవరకూ ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కలుపుకోలేమని అంటూ వస్తోంది. కానీ, క్షేత్ర స్థాయిలో పాక్ వ్యవహార శైలి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది'' అని ఆయన చెప్పారు.

‘సీపెక్ వల్ల మాకేమీ రావట్లేదు’

ఆర్టికల్ 35ఏ లాగే గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతవాసులకు ప్రత్యేక అధికారాలను కల్పించే చట్టం ఉండేదని, దాన్ని దశాబ్దల కిందటే పాక్ రద్దు చేసిందని షబ్బీర్ అన్నారు.

''స్టేట్ సబ్జెక్ట్ రూల్ అనే చట్టం ఉండేది. అది కూడా 35-ఏ లాంటిదే. గిల్గిత్ బాల్టిస్తాన్‌లో దాన్ని రద్దు చేశారు. తాజాగా భారత్ 35-ఏ రద్దు చేసింది. మేం రెండు దేశాలను తప్పుపడుతున్నాం'' అని అన్నారు.

''మూడు తరాలుగా మా ప్రజలకు గుర్తింపే లేదు. భవిష్యత్తు గురించి మాకు ఆందోళన ఉంది. సీపెక్ మా భూభాగం నుంచే వెళ్తోంది. కానీ, మాకు దాని వల్లా ఏమీ రావట్లేదు'' అని షబ్బీర్ ఆవేదన వ్యక్తం చేశారు.

గిల్గిత్ బాల్టిస్తాన్‌ను కలుపుకొంటామని చెబుతూ 72 ఏళ్లుగా స్థానిక జనాలను పాక్ పిచ్చివాళ్లను చేస్తోందని బాల్టిస్తాన్ యూత్ అలయన్స్‌కు చెందిన అలీ షఫా అన్నారు.

''స్థానిక నేతలు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. హక్కుల కోసం గొంతు విప్పితే, ద్రోహులన్న ముద్ర వేస్తారు. కశ్మీరీల కోసం రోదించే బదులు గిల్గిత్ బాల్టిస్తాన్‌వాసులు కోల్పోయిన ప్రత్యేక అధికారాల కోసం వాళ్లు మాట్లాడాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

బాల్టిస్తాన్ యూత్ ఫెడరేషన్ నాయకుడు అల్తాఫ్ హుస్సేన్ కూడా షఫాతో ఏకీభవించారు.

''మేం కశ్మీరీల పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. భారత ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తున్నాం. ఈ వివాదాస్పద ప్రాంతాల్లో ఐరాస ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరుతున్నాం. అది సాధ్యం కాకపోతే.. భారత్ ఆర్టికల్ 370 రద్దును, పాకిస్తాన్ స్టేట్ సబ్జెక్ట్ రూల్ చట్టం రద్దును వెనక్కితీసుకోవాలి'' అని అల్తాఫ్ డిమాండ్ చేశారు.

గిల్గిత్ బాల్టిస్తాన్ కూడా ఒకప్పుడు కశ్మీర్ మహారాజు నియంత్రణలో ఉండేది.

కానీ, పాకిస్తాన్ మాత్రం తమ వద్ద అలాంటి అధికారిక రికార్డులు, పత్రాలేవీ లేవని అంటోంది. 1974లో పాక్ సర్కారు స్టేట్ సబ్జెక్ట్ రూల్‌ను రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం