స్మగ్లర్లు ఈ చెక్‌పోస్టులను దాటి ముందుకెళ్లడం అసాధ్యం

  • 3 సెప్టెంబర్ 2019
యూవీ ఐ టెక్నాలజీ

చెక్ పోస్టుల దగ్గర పొడవాటి క్యూలలో గంటల తరబడి వేచి ఉండాలంటే నరకం కనిపిస్తుంది.

ఒకేసారి బారులు తీరే వేలాది వాహనాలను మనుషులు క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి అది అసాధ్యం కూడా. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ సంస్థ ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం వెతికింది.

ఇజ్రాయెల్ చుట్టుపక్కల రాజకీయాలు, చరిత్ర చాలా వివాదాస్పదమైనవి. ఇలాంటి పరిస్థితులే ఆ దేశం భద్రత కోసం కొత్త దారులు వెతుక్కునేలా చేసింది.

సరికొత్త టెక్నాలజీ సెక్యూరిటీ స్టార్టప్స్‌కు ఆ దేశం కేంద్ర బిందువుగా మారింది.

సరిహద్దుల్లో శరవేగంగా తనిఖీలు పూర్తయ్యేలా టెల్ అవీవ్‌ నగరంలోని ఒక సంస్థ రూపొందించిన కొత్త టెక్నాలజీని బీబీసీ పరిశీలించింది.

ఇజ్రాయెల్ సరిహద్దులు, చెక్ పాయింట్స్ దగ్గర తనిఖీలను సులభతరం చేసేందుకు ఒక స్టార్టప్ 'యూవీ ఐ' అనే టెక్నాలజీని రూపొందిస్తోంది.

ఎలాంటి ముప్పునైనా ముందే గుర్తించేలా రూపొందించిన 'యూవీ ఐ' లాంటి టెక్నాలజీ ఇప్పటివరకూ ఎక్కడా ఉపయోగించలేదు.

సరికొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో కింద ఉన్న వీడియోలో చూడండి.

దీనిలోని 'అడ్వాన్స్‌డ్ త్రెట్ రికగ్నైజింగ్ సిస్టమ్' రోడ్డుపై ఉన్న వాహనాలను కింది నుంచి స్కాన్ చేస్తుంది.

ఈ 'యూవీ ఐ' సిస్టంను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సరిహద్దుల్లో, చెక్ పాయింట్స్ దగ్గర ఉపయోగిస్తున్నారు.

కదులుతున్న వాహనాల్లోని అనుమానాస్పద వస్తువులను మనుషుల కంటే వేగంగా గుర్తించడం దీని ప్రత్యేకత.

చెక్ పాయింట్ దగ్గర తనిఖీ చేస్తున్నప్పుడు వాహనం రాగానే రోడ్డు కింద ఉన్న ఐదు హై రిజల్యూషన్ కెమెరాలు యాక్టివేట్ అవుతాయి. ఒక్క క్షణంలోనే కొన్ని వేల ఫొటోలు తీస్తాయి.

'యూవీ ఐ' టెక్నాలజీ ఆ ఫొటోలన్నింటినీ కలిపి వాహనం లోపలి భాగాన్ని ఒక హై రిజల్యూషన్ మోడల్‌లా తయారు చేస్తుంది.

ఇలా ఒక వాహనాన్ని నిశితంగా పరిశీలించాలంటే మనుషులకు చాలా సమయం పడుతుంది. అందుకే ఆ పనిని వారి కోసం డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ చేస్తాయి.

అవి స్కానర్ తీసిన ఫొటోలను ఆటోమేటిగ్గా అనలైజ్ చేసి అక్కడ ఉండకూడని వస్తువులు ఏవైనా ఉన్నాయేమో గుర్తిస్తాయి.

ఈ టెక్నాలజీని వివరించడానికి 'యువీ ఐ' వైస్ ప్రెసిడెంట్ డేవిట్ ఓరియెన్ ఒక కారు అడుగున బాంబుల్లా కొన్ని బాక్సులు పెట్టారు.

తర్వాత వాహనాన్ని అడుగు నుంచి స్కాన్ చేయగానే.. కెమెరాలు ఆ పెట్టెలను క్షణంలో గుర్తించాయి.

అంతే కాదు.. ఈ కెమెరాలు మనుషుల వేలిముద్రల్లాంటి సూక్ష్మ విషయాలను కూడా గుర్తిస్తాయి.

వాహన భాగాలపై ఉండే నంబర్లు, చిన్న చిన్న గీతలను ఫొటోలు తీయడం ద్వారా ఈ టెక్నాలజీతో ఒక వాహనాన్ని కచ్చితత్వంతో గుర్తించవచ్చు.

అంటే, కారు నంబర్ ప్లేట్ మార్చినా, అదే కారును అంతకు ముందు ఈ సిస్టం చూసుంటే దానిని ఈజీగా గుర్తు పట్టేస్తుంది.

ఇలాంటి ఒక టెక్నాలజీ సమర్థంగా పనిచేయాలంటే దానికి తగిన డేటా కావాలి. ఆ డేటాను సృష్టించేందుకు 'యూవీ ఐ' కొన్ని వేల కార్లను అద్దెకు తీసుకుంది.

కార్లకు సంబంధించిన సమస్త డేటాను ఆల్గారిథంలో ఫీడ్ చేశారు.

అలా, ఒక కారులో ఏవైనా నిషేధిత వస్తువులు కనిపించినప్పుడు అది తనిఖీ చేసేవారిని అప్రమత్తం చేయగలుగుతుంది.

ఇక తర్వాతి దశలో టెల్ అవీవ్ రోడ్లపై తిరిగే బస్సులపై దీన్ని ఉపయోగిస్తున్నారు. డిపో నుంచి బస్సులు బయటికి వెళ్లినప్పుడు అవి 'యూవీ ఐ' డిటెక్టర్ మీద నుంచి వెళ్తుంటాయి.

కార్లను స్కాన్ చేసినట్లే బస్సు కింద ఏవైనా అనుమానిత వస్తువులు ఉంటే 'యూవీ ఐ' కెమెరాలు గుర్తిస్తాయి. అంతే కాదు, ఆయిల్ లీకవ్వడం, ఇతర డామేజ్ లాంటివి ఏవైనా ఉన్నా వెంటనే అప్రమత్తం చేస్తుంది.

యువీ ఐ సిస్టమ్ లేటెస్ట్ వెర్షన్లో మరిన్ని కెమెరాలు ఉపయోగించబోతున్నారు.

ఒక వాహనాన్ని 360 డిగ్రీల్లో స్కాన్ చేయడం వల్ల దానిని అన్ని వైపుల నుంచీ కవర్ చేసి.. పూర్తి వివరాలు సేకరించేలా ప్రయోగాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు