బియాంకా ఆండ్రిస్కూ: సెరెనా విలియమ్స్‌కు షాకిచ్చిన 19 ఏళ్ల టీనేజర్ .. సెరెనా అత్యధిక టైటిళ్ల కలకు బ్రేక్

  • 8 సెప్టెంబర్ 2019
బియాంకా Image copyright Getty Images
చిత్రం శీర్షిక బియాంకా

యూఎస్ ఓపెన్‌లో టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు యువ కెరటం బియాంకా ఆండ్రిస్కూ ఊహించని షాక్ ఇచ్చింది. అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా రికార్డు అందుకోవాలనే సెరెనా ఆశలను ఆవిరి చేసింది.

కెనడాకు చెందిన 19ఏళ్ల బియాంకా దాటికి 37ఏళ్ల సెరెనా నిలువ లేకపోయింది. 6-3, 7-5 స్కోర్‌తో మ్యాచ్‌ను సమర్పించుకొంది.

''ఈ ఏడాది నా కల నిజమైంది''అంటూ తన ఆనందాన్ని బియాంకా పంచుకొంది.

''నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఈ క్షణం కోసం చాలా కష్టపడ్డాను. సెరెనా లాంటి దిగ్గజానికి ఎదురు నిలవడం అంటే మామూలు విషయం కాదు. అద్భుతం..''అంటూ వివరించింది.

Image copyright AFP

సెరెనాను నిరాశ పలుకరించడం ఇది వరుసగా నాలుగోసారి. నాలుగు ప్రధాన టైటిళ్లను ఆమె వరుసగా ఓడిపోయారు.

''బియాంకా ఆడుతుంటే ఆశ్చర్యం వేసింది. ఆమెను చూసి చాలా గర్వపడ్డ. ఇది చాలా గోప్ప మ్యాచ్''అని సెరెనా వ్యాఖ్యానించింది.

ఎనిమిదో సీడ్ అయిన సెరీనా.. మొదట్నుంచీ కాస్త ఆందోళనగానే కనిపించింది. అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా ఆస్ట్రేలియాకు చెందిన మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న రికార్డును సమం చేయాలని ఆమె ఎంతో ప్రయత్నించింది.

అయితే ఆత్మవిశ్వాసంతో బియాంకా చెలరేగిపోయింది. తొలి ప్రధాన టైటిల్ గెలిచిన కెనడియన్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. మరియా షరపోవా తర్వాత వింబుల్డన్‌లో విజయం సాధించిన తొలి టీనేజర్‌గానూ రికార్డుల్లో నిలిచింది.

Image copyright EPA

''యూఎస్ ఓపెన్‌లో సెరెనాతో తలపడాల్సి ఉంటుందని ఓ ఏడాది ముందు ఎవరైనా అంటే.. వారికి పిచ్చేమో అనుకొనేదాన్ని. అయితే 15 రోజుల క్రితం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి''అని మ్యాచ్‌కు ముందుగా ఆత్మవిశ్వాసంతో బియాంకా చెప్పింది.

ఏడాది క్రితం యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లోనూ ఆమె విజయం సాధించలేదు. తొలి 200 ర్యాంకుల్లోనూ ఆమెకు చోటు దక్కలేదు. కానీ ఇప్పుడామే 15వ సీడ్. తాజాగా టైటిల్‌తోపాటు 3.85 మిలియన్ డాలర్ల నగదునూ ఆమె గెలుచుకొంది. ఆమె ర్యాంకు కూడా 5గా మారనుంది.

ఈ ఏడాది ఆరంభం నుంచీ ఎక్కువ మంది నోట నానుతున్న యువ కెరటంగా ఆమె పేరు వార్తల్లో నిలిచింది.

అందరూ సెరెనా వైపే

బియాంకా తల్లిదండ్రులు నికూ, మరియా రొమేనియన్లు. వీరు 1990ల్లో కెనడాకు వలస వచ్చారు.

మ్యాచ్‌కు వచ్చినవారంతా సెరెనా వెంట నిలుస్తుంటే.. ఒత్తిడిని తట్టుకుంటూ బియాంకా పోరాడిన తీరు మరువలేనిది. ఒకానొక సమయంలో అరుపులు భరించలేక చెవులను కూడా బియాంకా మూసుకోవాల్సి వచ్చింది.

''ఆడియన్స్‌ నుంచి వచ్చే ఒత్తిడికి కచ్చితంగా ఎదురు నిలవాలి. ఎందుకంటే సెరెనా గెలుపును వారు కోరుకుంటారని నాకు తెలుసు''అని విజయం సాధించిన అనంతరం చిరునవ్వులు చిందిస్తూ బియాంకా తెలిపింది.

''సెరెనా విజృంభిస్తుందని ముందే ఊహించాను. ఆమెకు కళ్లెం వేసేందుకు చేయాల్సిందంతా చేశాను. ఎలాగోలా ఆమెను నిలువరించగలిగాను''అని బియాంకా వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు