ఆత్మహత్యల నివారణ దినం: ఆత్మహత్యలను ఆలోచనలను గుర్తించడమెలా, వారితో ఎలా మాట్లాడాలి

  • 10 సెప్టెంబర్ 2019
యువకుడు, ఆత్మహత్య చిత్రం Image copyright Getty Images

ప్రతి 40 సెకన్లకు ఒకరు... ప్రపంచంలో ఏదో ఒకచోట బలన్మరణానికి పాల్పడుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం, ఏటా 8,00,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు వారి మరణాలకు రోడ్డు ప్రమాదాల తర్వాత రెండో ప్రధాన కారణం ఆత్మహత్యలే.

ఈ గణాంకాలు ఆందోళన కలిగించేలా ఉన్నా, ఈ విషయంపై పెద్దగా చర్చ జరగడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించింది.

ఒకరు ఆత్మహత్య చేసుకుంటే, ఆ ప్రభావం వారి పిల్లలు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, స్నేహితులు, సహచరులపై పడుతోంది. ఎంతోమంది పిల్లలు అనాథలవుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

ఒక వ్యక్తి బలన్మరణానికి పాల్పడితే, దానివల్ల 135 మంది దాకా ప్రభావితం అవుతారని గతేడాది అమెరికాలో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది.

ఆత్మహత్యలు.. బాధితుల కుటుంబ సభ్యులతో పాటు, వారి సన్నిహితులపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని కెంటకీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జూలీ సెరెల్ చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆత్మహత్యల నివారణకు అందరూ కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతోంది. సెప్టెంబరు 10ని ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినంగా ప్రకటించింది. బలవన్మరణాలను నివారించేందుకు ప్రజలను చైతన్య పరిచేందుకు ఏటా ఒక నినాదంతో ముందుకెళ్తోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు కావాల్సిన నైపుణ్యాలను యువతలో పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది

ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారిని ఎలా గుర్తించాలి?

ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడుతుండటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరి తనాన్ని ఇష్టపడటం, నిరాశా నిస్పృహలు, ప్రతి విషయం గురించీ ప్రతికూలంగా ఆలోచించటం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్లా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం.. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, అతను/ఆమె ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని భావించాలి.

Image copyright Getty Images

సంభాషణతోనే నివారణ

"ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించే వారితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అన్నది ముఖ్యం కాదు. వారితో ఎంత తొందరగా సంభాషణ ప్రారంభించామన్నదే అత్యంత ముఖ్యం" అని రీథింక్ యూకే సంస్థ ప్రతినిధి ఎమ్మా క్యారింగ్టన్ బీబీసీతో చెప్పారు.

ఇలాంటి వారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు నిరంతరం ధైర్యం చెప్పాలని, వారితో తరచూ మాట్లాడుతూ ధైర్యం చెబుతుండాలని ఎమ్మా సూచిస్తున్నారు.

ఆత్మహత్య ఆలోచనతో ఉన్నవారితో ఎలా మాట్లాడాలి?

  • ప్రదేశం ఏదైనా సరే, నిశ్శబ్దంగా ఉన్న చోట, అవతలి వ్యక్తికి సౌకర్యవంతంగా అనిపించే చోట మాట్లాడండి.
  • మీ ఇద్దరికీ మాట్లాడుకునేందుకు తగినంత సమయం ఉందని ముందుగా నిర్ధారించుకోండి.
  • మీరు ఏదైనా తప్పుగా మాట్లాడినా భయపడొద్దు.
  • ఎదుటి వ్యక్తి కళ్లలో కళ్లు పెట్టి స్నేహపూర్వకంగా మాట్లాడండి.
  • మీరు పూర్తిగా ఆ సంభాషణ మీదే దృష్టి పెట్టాలి. కాబట్టి, మీ ఫోన్‌ను దూరంగా పెట్టండి.
  • ఎక్కువసేపు ఓపికగా వినండి. ఎందుకంటే, ఆ వ్యక్తి తన మనసు విప్పి చెప్పేందుకు కాస్త ఎక్కువ సమయం పట్టొచ్చు.
  • అవును లేదా కాదు అనే సమాధానాలు వచ్చేలా ఎక్కువగా ప్రశ్నలు అడగండి. వాళ్ల సమస్య మీకు అర్థమైందో కాలేదో చూసుకోండి.
  • ఆ వ్యక్తి మాట్లాడుతుంటే మీరు మధ్యలో అంతరాయం కలిగించొద్దు.
  • వారికి మానసిక నిపుణుల కౌన్సెలింగ్ అవసరమా? లేక ఇంట్లోనే వారి ఆలోచనలను మార్చొచ్చా? అన్నది గుర్తించండి.
Image copyright Getty Images

పురుషులే ఎక్కువ

అన్ని వయసుల వారూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ, ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంది.

2016 గణాంకాల ప్రకారం, పురుషుల్లో ఆత్మహత్య రేటు 1,00,000 మందికి 13.5 కాగా, మహిళల్లో 1,00,000 మందికి 7.7గా ఉంది.

అయితే, పురుషుల, మహిళల రేటులో వ్యత్యాసం ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉన్నాయి.

రష్యాలో ప్రపంచంలోనే అత్యధిక పురుషుల ఆత్మహత్యల రేటు ఉంది. 2016లో రష్యాలో ప్రతి 1,00,000 మంది జనాభాలో 48 మంది పురుషులు ఆత్మహత్య చేసుకున్నారు. అది మహిళల సంఖ్యతో పోల్చితే ఆరు రెట్లు ఎక్కువ.

2016 ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, భారత్‌లో లక్ష మంది జనాభాలో పురుషుల ఆత్మహత్యల రేటు 18.5గా ఉండగా, మహిళల రేటు 14.5గా ఉంది.

ఆత్మహత్యలకు, మానసిక రుగ్మతలకు మధ్య సంబంధం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా జీవితం పట్ల నిరాశ, విరక్తి, మద్యపానం లాంటివి బలన్మరణాలకు ఎక్కువగా దారితీస్తున్నాయి.

జీవితంలో ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, సంబంధాల విచ్ఛిన్నం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిళ్లు, తీవ్ర అనారోగ్యం లాంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రాణాలను తీసుకుంటున్నారు.

గ్రామీణ ప్రజల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటోంది. అలాగే వివిధ రకాలుగా వివక్ష ఎదుర్కొనే శరణార్థులు, వలసదారులు, ఎల్‌జీబీటీ ప్రజలు, ఖైదీలు వంటి వారు కూడా బలన్మరణాలకు పాల్పడుతున్నారు.

ఘర్షణలు, విపత్తులు, హింస, ఒంటరితనం లాంటివి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

Image copyright Getty Images

ఆత్మహత్య ఆలోచనలతో ఉన్నవారికి మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తేనే మంచిదని ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక సర్వేలో పాల్గొన్నవారిలో అధిక శాతం మంది అభిప్రాయపడ్డారు.

కానీ, "మీరు ప్రొఫెషనల్ కాకపోయినా ఫర్వాలేదు. ఎదుటి వ్యక్తితో నిదానంగా, స్నేహపూర్వకంగా మాట్లాడగలిగితే చాలు" అని మానసిక సమస్యలతో బాధపడేవారికి సాయం అందించేందుకు పనిచేస్తున్న బియాండ్ బ్లూ సంస్థ నిర్వాహకురాలు, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని జులియా గిల్లార్డ్ అంటున్నారు.

"ఈరోజు ఎలా గడిచింది? ఏం చేశారు? ఆఫీసు సంగతులేంటి? లాంటి విషయాలు అడుగుతూ ఉండండి. టుడే (ఈరోజు) అనే పదం చాలా ఉపయోగపడుతుంది. అలాంటి సంభాషణల ద్వారా ఎదుటి వారి మనసులోని ఆలోచనలను తెలుసుకోవచ్చు. అంతకంటే ముందు మీ మీద వారికి విశ్వాసం కలిగేలా చూసుకోవాలి" అని గిల్లార్డ్ సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

డోనల్డ్ ట్రంప్: ముగిసిన రెండు రోజుల భారత పర్యటన

ఇరాన్ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనావైరస్.. స్పెయిన్‌లో వందలాది మందిని లోపలే ఉంచి హోటల్‌ను మూసేసిన ప్రభుత్వం

దిల్లీ హింస: ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో హింసకు కారకులెవరు.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు

BBC Indian Sportswoman of the Year 2019: విజేత ఎవరో మార్చి 8న ప్రకటిస్తాం

దిల్లీ హింస: సీఏఏ వ్యతిరేక హింసాత్మక ఘర్షణల్లో 10కి చేరిన మృతుల సంఖ్య

కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు

మోదీ ప్రభుత్వ విజయాలపై అహ్మదాబాద్‌లో ట్రంప్ చెప్పినవన్నీ నిజాలేనా? - బీబీసీ రియాల్టీ చెక్

వీడియో: ఇళ్ల మధ్యకు వచ్చిన ఎలుగుబంటి