9/11 దాడులను అమెరికా కావాలనే అడ్డుకోలేదా? కుట్ర సిద్ధాంతాలు ఏమంటున్నాయి, నివేదికలు ఏం చెప్పాయి?

  • 11 సెప్టెంబర్ 2019
ట్విన్ టవర్స్ Image copyright Getty Images

అమెరికాలోని న్యూయార్క్ ట్విన్‌ టవర్స్ మీద 9/11 దాడులు జరిగి 18 ఏళ్లు అవుతోంది. ఆ దాడిలో 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

2001 సెప్టెంబర్ 11న నాలుగు ప్రయాణికుల విమానాలను ఇస్లామిస్ట్ మిలిటెంట్లు హైజాక్ చేశారు. ఆ విమానాలతో ప్రపంచ వాణిజ్య కేంద్రం (వరల్డ్ ట్రేడ్ సెంటర్), పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం)తో పాటు, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో దాడి చేశారు. చూస్తుండగానే, న్యూయార్క్ ట్విన్ టవర్స్ కుప్పకూలాయి.

అమెరికా చరిత్రలో అత్యంత చీకటి రోజు అది.

Image copyright Getty Images

ఆ దాడులకు సంబంధించి ఇప్పటి వరకు అనేక అధికారిక నివేదికలు వెలువడ్డాయి. ఆ దాడులు ఎవరు, ఎలా చేశారు? అన్న విషయాలను దర్యాప్తు సంస్థలు వివరించాయి.

అయినా, ఆ దాడులపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ దాడులకు మిలిటరీ వైఫల్యమే కారణమని కొందరు ఆరోపిస్తే, ట్విన్ టవర్స్‌ను ముందస్తుగా బాంబులు అమర్చి పేల్చివేశారంటూ మరికొందరు సందేహాలు వ్యక్తం చేశారు. ఆ ప్రశ్నలకు దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సహా వివరించేందుకు ప్రయత్నించాయి.

అలా కుట్ర సిద్ధాంత కర్తలు వినిపించిన 5 ప్రధానమైన వాదనలు, వాటికి దర్యాప్తు సంస్థలు ఇచ్చిన వివరణలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక యుద్ధ విమానం పాత చిత్రం

1. హైజాక్‌కు గురైన విమానాలను అడ్డుకోవడంలో విఫలం

ప్రశ్న: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా వైమానిక దళం హైజాక్‌ అయిన నాలుగు విమానాల్లో ఒక్కదాన్ని కూడా ఎందుకు అడ్డుకోలేకపోయింది?

కుట్ర సిద్ధాంతకర్తలు చెప్పే మాట: ఆ విమానాలను అడ్డగించవద్దని మిలిటరీకి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్ చీనీ ఆదేశాలు జారీ చేశారు.

అధికారిక నివేదిక చెబుతున్నది: హైజాకర్లు ఒకేసారి అన్ని విమానాలను హైజాక్ చేయడం, విమానం లోపల హింసాత్మక చర్యలకు పాల్పడటం చాలా అరుదు. విమానాన్ని గుర్తించేందుకు ఉపయోగపడే ట్రాన్స్‌పాండర్‌ను పనిచేయకుండా చేశారు, లేదంటే మార్చేశారు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పటిలాగే ఆ రోజు కూడా అమెరికా గగనతల రక్షణ కమాండ్ వద్ద సైనిక శిక్షణ విన్యాసాలు జరగాల్సి ఉంది.

మిలిటరీతో మాట్లాడుతూ ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కోలిన్ స్కాగ్గిన్స్ అటువైపు నుంచి స్పందనలో ఎలాంటి లోపం లేదని చెప్పారు. పౌర విమానాల ట్రాఫిక్ కంట్రోల్‌ (ఎఫ్‌ఏఏ)కు మిలిటరీకి మధ్య సమాచార లోపం, అస్పష్టత ఉంది.

ప్రచ్ఛన్న యుద్ధ (కోల్డ్ వార్) ముప్పును పసిగట్టేందుకు సముద్రం మీద నిఘా పెట్టేందుకు వినియోగించే మిలిటరీ పరికరాలు కాలం చెల్లాయి.

Image copyright JASON SCOTT/TEXTFILES

2. ట్విన్ టవర్ల కూల్చివేత

ప్రశ్న:కొన్ని అంతస్తులలో మంటలు చెలరేగాయి. అవి ఒకట్రెండు గంటల పాటు మాత్రమే ఉన్నాయి. మరి, ట్విన్ టవర్లు అంత తొందరగా ఎలా కుప్పకూలాయి?

కుట్ర సిద్ధాంతకర్తలు చెప్పే మాట: నియంత్రిత కూల్చివేతలతో (ముందే బాంబులు అమర్చి) ట్విన్ టవర్లను ధ్వంసం చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్-2లో 56 నిమిషాల పాటు మంటలు చెలరేగాయి, వరల్డ్ ట్రేడ్ సెంటర్-1 భవనంలో 102 నిమిషాల పాటు మంటలున్నాయి. ఆ మంటలు ర్యాపిడ్ కొలాప్స్ (10 సెకన్ల) సిద్ధాంతాన్ని గుర్తు చేస్తున్నాయి.

ఆ భవనాలు కుప్పకూలక ముందు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు, భారీ ఎత్తున ప్రమాదకర పదార్థాలు బయటకు చిమ్ముకొచ్చినట్లు కథనాలు వచ్చాయి.

అధికారిక నివేదిక ఏం చెప్పింది: విమానాలు భవనానికి పట్టునిచ్చే కీలక స్తంభాలను, అగ్ని నిరోధక వ్యవస్థను ధ్వంసం చేశాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన దర్యాప్తులో తేలింది.

అనేక అంతస్తులలో సుమారు 10,000 గ్యాలన్ల జెట్ ఇంధనం చిమ్ముకుంది. దాంతో, భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 1,000 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి వల్ల భవనం పిల్లర్లు ఒక్కసారిగా వంగి విరిగాయి. స్లాబులు కూలిపోయాయి. అందుకే పెద్దఎత్తున 'పేలుడు' లాంటి శబ్దాలు వచ్చాయి.

ఒక అంతస్తు కూలిపోతే, దాని బరువు కింది అంతస్తుల మీద ఒక్కసారిగా పడటంతో అవి కూడా కూలిపోయాయి. పై అంతస్తులు కూలినప్పుడు ఒక్కసారిగా భారీ మొత్తంలో దుమ్ము, ధూళీ కిటికీల నుంచి బయటకు వచ్చింది.

నియంత్రిత కూల్చివేతలను ఎప్పుడైనా... కింది అంతస్తుల నుంచి మొదలుపెడతారు. కానీ, ఈ భవనాల విధ్వంసం పై అంతస్తుల నుంచి ప్రారంభమైంది.

ఈ భవనంలో బాంబు పేలుళ్లు జరిగాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. నియంత్రిత కూల్చివేతలు జరిపే ముందు గోడలకు ముందస్తుగా గాట్లు పెడతారు. ఈ భవనాలలో అలాంటి గాట్లు పెట్టినట్లు ఎలాంటి ఆనవాళ్లూ కనిపించలేదు.

Image copyright JASON SCOTT/TEXTFILES

3. పెంటగాన్‌పై దాడి

ప్రశ్న: నైపుణ్యం లేని ఓ పైలట్ అత్యంత చాకచక్యంగా ఒక వాణిజ్య విమానాన్ని తీసుకెళ్లి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన రక్షణశాఖ ప్రధాన కార్యాలయం మీద దాడి చేశాడు. ఆ విమానం హైజాక్‌కు గురైందని అధికారులకు ప్రాథమిక సమాచారం అందిన 78 నిమిషాల తరువాత, ఆ పైలట్ ఎవరికీ చిక్కకుండా వెళ్లి ఆ దాడి ఎలా చేయగలిగాడు?

కుట్ర సిద్ధాంతకర్తల వాదన: బోయింగ్ 757 విమానం ఆ భవనాన్ని ఢీకొనలేదు. క్షిపణి, చిన్న విమానం లేదా మానవరహిత డ్రోన్‌ను ఉపయోగించారు. అది అల్-ఖైదా నియంత్రణలో లేదని, పెంటగాన్‌ చేతిలోనే ఉందన్న వాదన ఉంది.

అధికారిక నివేదికలు చెప్పిన విషయాలు: ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్సులతో సహా విమానం శకలాలను ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుని వాటిలోని సమాచారాన్ని విశ్లేషించింది.

తొలుత రికార్డు అయిన వీడియోలో శకలాలు పెద్దగా కనిపించలేదు. కానీ, విమానం శకలాలను, విమానం ప్రయాణించిన మార్గాన్ని సూచించే ఆధారాలు స్పష్టంగా ఉన్న మరో వీడియో దొరికింది.

విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికుల అవశేషాలు డీఎన్‌ఏ పరీక్షల్లో బయటపడ్డాయి. పెంటగాన్‌ను విమానం ఢీకొట్టడాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు.

Image copyright JASON SCOTT/TEXTFILES

4. నాలుగో విమానం- యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం 93

ప్రశ్న: పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లే దగ్గర విమానం దాడి జరిగిన ప్రదేశం ఎందుకు అంత చిన్నగా ఉంది? అక్కడ విమాన శకలాలు ఎందుకు కనిపించలేదు?

కుట్ర సిద్ధాంతకర్తల వాదన:యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం- 93ను క్షిపణితో కూల్చివేశారు. అది గాలిలోనే పూర్తిగా ధ్వంసమైంది. దాంతో, శకలాలు చాలా దూరంలో పడ్డాయి.

అధికారిక నివేదికలు చెబుతున్నదేమిటి?: కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌, విమాన శకలాలను చూపించే స్పష్టమైన ఫొటోలు లభ్యమయ్యాయి. ప్రయాణికులు ఎదురుతిరగడంతో హైజాకర్లు ఉద్దేశపూర్వకంగా ఆ విమానాన్ని కూల్చివేశారని ఆ వాయిస్ రికార్డింగులు చెబుతున్నాయి.

ఆ విమానం కూలిన ప్రదేశానికి చాలా మైళ్ల దూరంలో భారీ శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయని అనడంలో వాస్తవం లేదని తేలిపోయింది. అయితే, గాలి ప్రవాహం కారణంగా కొన్ని కాగితాలు, ఇన్సులేషన్ లాంటి తేలికపాటి వస్తువులు ఒక మైలు దూరంలో పడిన మాట వాస్తవమే.

ఆ విమానాన్ని మిలిటరీ క్షిపణి కూల్చివేసిందని అంటున్నారు. కానీ, వాణిజ్య విమానాలను కాల్చివేయాలని వైమానిక దళానికి సైన్యం ఎన్నడూ ఆదేశాలు ఇవ్వలేదు.

Image copyright JASON SCOTT/TEXTFILES

5. వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం-7 కూల్చివేత

ప్రశ్న: దానిని విమానం ఢీకొనలేదు. అయినా, ఆ ఆకాశ హర్మ్యం అంత తొందరగా, ఒక పద్ధతి ప్రకారం ఎలా కూలిపోయింది? ఒకవేళ అది మంటల వేడి వల్ల కూలిందని అనుకుంటే... మరి ఉక్కు- ఫ్రేమ్‌లు ఉన్న ఇతర భవనాలు కూలిపోలేదు కదా?

కుట్ర సిద్ధాంతకర్తల వాదన: వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం-7 పేలుడు పదార్థాలను, బాంబులను ఉపయోగించి నియంత్రిత కూల్చివేత పద్ధతిలో ధ్వంసం చేశారు.

ఒక టీవీ ఇంటర్వ్యూలో భవన యజమాని లారీ సిల్వర్‌స్టెయిన్ ఉపయోగించిన "పుల్ ఇట్ (దానిని లాగండి)" అనే మాట మొదట్లో చర్చనీయాంశమైంది. కానీ, వాస్తవానికి ఆయన అగ్నిమాపక దళాన్ని వెనక్కి రప్పించడం గురించి మాట్లాడుతున్నారు. (కూల్చివేత నిపుణులు పేలుడు పదార్థాలను అమర్చడానికి "లాగండి" అనే పదాన్ని సాధారణంగా ఉపయోగించరు.)

ఆ తర్వాత కేవలం 2.25 సెకన్ల వ్యవధిలోనే అంత పెద్ద భవనం నిట్టనిలువుగా కుప్పకూలడంపై దృష్టి మళ్లింది. పేలుడు పదార్థాలు మాత్రమే ఆ భారీ భవనం అంత త్వరగా, నిట్టనిలువుగా కూలిపోయేలా చేయగలవు.

అధికారిక వివరణలపై అనుమానంతో, కొంతమంది శాస్త్రవేత్తలు భవనం గ్రౌండ్ జీరో అంతస్తు నుంచి నాలుగు దుమ్ము నమూనాలను సేకరించి పరిశీలించారు. వేడిచేసినప్పుడు అత్యంత భయానకంగా పేలే థర్మైట్ పదార్థాన్ని గుర్తించినట్లు వారు చెప్పారు. అక్కడ కొన్ని టన్నుల థర్మైట్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నాయని, అవి వరల్డ్ ట్రేడ్ సెంటర్-7 భవనంతో పాటు, ట్విన్ టవర్స్‌లో కూడా ఉన్నాయని వారు పేర్కొన్నారు.

అధికారిక నివేదికలు ఏం చెప్పాయి?: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ మూడేళ్ల పాటు దర్యాప్తు చేపట్టింది. "నియంత్రించలేని మంటల కారణంగా ఆ భవనం కూలిపోయింది. దానికి సమీపంలో ఉన్న నార్త్ టవర్ ఏడు గంటల పాటు మంటల్లో కాలి కూలిపోయింది. మంటలు దాని నుంచి టవర్ 7కు అంటుకున్నాయి" అని ఆ సంస్థ తన నివేదికలో తెలిపింది.

అత్యవసర స్ప్రింక్లర్ వ్యవస్థకు నీటిని సరఫరా చేసే మెయిన్ పైపులు ధ్వంసమయ్యాయి. పేలుడు జరిగిందన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ బయటపడలేదు. సాధారణంగా నియంత్రిత కూల్చివేతల్లో భారీ శబ్దాలు వస్తాయి. ఈ భవనం నుంచి అలాంటి శబ్దాలేవీ రాలేదు.

"థర్మైట్ పదార్థం" అనేది ఒక రకమైన పెయింట్. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ నిర్మాణంలో 12,00,000 టన్నుల నిర్మాణ సామగ్రిని వినియోగించారు. ఆ సామాగ్రి అవశేషాలన్నీ అక్కడి దుమ్ములో కలిసిపోయాయి.

అక్కడ జరిపిన విస్తృత పరిశీలనలో ఆ దుమ్ములో థర్మైట్, పేలుడు పదార్థాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని అమెరికా జియోలాజికల్ సర్వే, ఆర్జె లీ సంస్థలు తమ నివేదికల్లో చెప్పాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు