బలూచిస్తాన్‌ స్వతంత్ర దేశ ఉద్యమానికి భారత్ 'రా' సహకారం ఇస్తోందా?.. ఇప్పటికీ ఆ ప్రాంతంతో పాకిస్తాన్‌కు చిక్కులు ఎందుకు?

  • 12 సెప్టెంబర్ 2019
బలూచిస్తాన్ Image copyright Getty Images

చాలా కాలం క్రితం పాకిస్తాన్‌లోని విప్లవ కవి హాబీబ్ జాలిబ్ ఒక కవిత రాశారు.

''బలూచీలను ఎంతగా అణిచివేశారో కళ్లారా చూశా.

స్వాతంత్ర్య పోరాటం ఇచ్చే ఆనందం రుచి ఎలా ఉంటుందో నాకు తెలుసు.

పాకిస్తాన్‌లో జీవితమనే శిక్షను అరవై ఏళ్లుగా అనుభవిస్తూనే ఉన్నా.

జీవితమంతా ఇక్కడే గడవాలని నాకు అస్సలు లేదు'' అన్నది దాని సారాంశం.

పాకిస్తాన్‌లో బలూచిస్తానే అతిపెద్ద ప్రావిన్సు. పాకిస్తాన్ దేశం అవతరించి 72 ఏళ్లు గడుస్తున్నా, ఇంకా ఆ ప్రాంతం సమస్యాత్మకంగానే ఉంది.

బలూచిస్తాన్ కథంతా తిరుగుబాటు, హింస, మానవ హక్కుల ఉల్లంఘనల చుట్టూనే తిరుగుతుంది.

''బలూచిస్తాన్ వేర్పాటువాదులు హింస అనే గిన్నెలో వేగుతున్నారు. వాళ్లు ఎప్పుడైనా పొంగే అవకాశం ఉంది'' అని సీనియర్ పాత్రికేయుడు నవీద్ హుస్సేన్ అంటున్నారు.

అసలు బలూచ్ వేర్పాటువాదానికి కారణాలేంటి? అది ఎక్కడ మొదలైంది?

'ద బలూచిస్తాన్ క్యానన్‌డ్రమ్' అనే పుస్తక రచయిత, భారత్ జాతీయ భద్రత సలహాదారుల బోర్డు సభ్యుడు తిలక్ దేవేశర్ ఈ విషయం గురించి మాట్లాడారు.

''పాకిస్తాన్‌లో తమను బలవంతంగా, చట్టవిరుద్ధంగా కలిపారన్నది చాలా మంది బలూచిస్తాన్ ప్రజల భావన. 1948లో ఈ సమస్య మొదలైంది. బ్రిటీష్ పాలకులు వెళ్లిపోయాక బలూచ్ ప్రజలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ కూడా దీనికి సమ్మతి తెలిపింది. కానీ, ఆ తర్వాత మాట మార్చింది. బలూచిస్తాన్‌ పార్లమెంటులో రెండు సభలు ఉండేవి. ఆ సమయంలో నిర్ణయాన్ని బలూచిస్తాన్ పాలకుడు ఆ రెండు సభలకే వదిలేశారు'' అని దేవేశర్ అన్నారు.

''పాక్‌లో విలీనం అయ్యే ప్రతిపాదనను ఆ రెండు సభలు తిరస్కరించాయి. 1948 మార్చిలో అక్కడికి పాకిస్తాన్ సైన్యం వచ్చింది. బలూచిస్తాన్ పాలకుడిని అపహరించి కరాచీ తీసుకువెళ్లింది. ఆయనపై ఒత్తిడి తెచ్చి విలీన ఒప్పందంపై సంతకం చేయించుకుంది'' అని వివరించారు.

Image copyright TILAK DEVASHER

నేపాల్‌లాగే స్వతంత్ర్య రాజ్యం

బలూచిస్తాన్‌ను అప్పట్లో కలాత్ అని పిలిచేవారు. ఈ సంస్థానం పాలకుడిని కలాత్ కే ఖాన్ అనేవారు. చారిత్రకంగా చూస్తే కలాల్ చట్టబద్ధత భారత్‌లో విలీనమైన మిగతా సంస్థానాలకు భిన్నంగా ఉండేది.

1876లో కుదిరిన ఒప్పందం ఆధారంగా భారత ప్రభుత్వం, కలాత్ మధ్య సంబంధాలుండేవి. దాని ప్రకారం కలాత్‌ను బ్రిటీష్ ప్రభుత్వం స్వతంత్ర రాజ్యంగా గుర్తించింది.

1877లో కలాత్ కే ఖాన్ ఖుదాదాద్ ఖాన్‌కు కలాత్‌పై సార్వభౌమ అధికారం ఉండేది. బ్రిటీష్ పాలకులకు ఆ రాజ్యంపై ఎలాంటి అధికారమూ లేదు.

560 సంస్థానాలను బ్రిటీష్ పాలకులు 'ఏ' జాబితాలో పెట్టారు. నేపాల్, భూటాన్, సిక్కిం, కలాత్‌లు 'బీ' జాబితాలో ఉండేవి.

1946లో తమ రాజ్యం హోదాను తెలియజేసేందుకు కలాత్ కే ఖాన్ సమద్ ఖాన్‌ను దిల్లీకి పంపారు. కానీ, నెహ్రూ కలాత్ స్వతంత్ర దేశమన్న వాదనను తిరస్కరించారు.

ఆ తర్వాత బిజెంజో మౌలానా ఆజాద్‌ను కలిసేందుకు కలాత్ స్టేట్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు గౌస్ బక్ష్ దిల్లీకి వచ్చారు.

భారత్‌లో బలూచిస్తాన్ ఎప్పుడూ భాగంగా లేదని బిజెంజో ఆజాద్ అంగీకరించారు.

అయితే, 1947 తర్వాత స్వతంత్ర రాజ్యంగా బలూచిస్తాన్ మనుగడ సాగించలేదని, బ్రిటన్ రక్షణ అవసరమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒకవేళ ఆంగ్లేయులు బలూచిస్తాన్‌లో ఉంటే, భారత ఉపఖండానికి స్వాతంత్ర్యం ఇచ్చామనడంలో ఏ అర్థమూ ఉండదు.

Image copyright Getty Images

ఆల్ ఇండియా రేడియో పొరపాటు

''1948 మార్చి 27న ఆల్ ఇండియా రేడియో వీపీ మేనన్ ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశం గురించి ఓ కథనం ప్రసారం చేసింది. కలాత్‌ను పాకిస్తాన్‌కు బదులుగా భారత్‌లో విలీనం చేయాలని కలాత్ కే ఖాన్ ఒత్తిడి తెస్తున్నట్లు మేనన్ వ్యాఖ్యానించారని అందులో పేర్కొంది. ఈ ప్రస్తావనను భారత్ పట్టించుకోలేదని, దీనితో తమకు ఏ సంబంధమూ లేదని మేనన్ అన్నట్లు ప్రసారం చేసింది. కలాత్ కే ఖాన్ దీన్ని విని షాక్‌కు గురయ్యారు. దీని తర్వాత ఆయన జిన్నాతో సంప్రదింపులు మొదలుపెట్టారని, పాక్‌తో ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరిపారని విశ్లేషకులు చెబుతుంటారు'' అని దేవేశర్ వివరించారు.

''రాజ్యాంగ పరిషత్‌లో ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ నెహ్రూ ఈ విషయం గురించి మాట్లాడారు. వీపీ మేనన్ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని, ఆల్ ఇండియా రేడియో తప్పుడు కథనం ప్రసారం చేసిందని ఆయన వివరణ ఇచ్చారు. కానీ, 'నష్ట నివారణ' కోసం నెహ్రూ చేసిన ప్రయత్నాల వల్ల ఫలితం లేకపోయింది''

ఆర్థిక, సామాజిక వెనుకబాటు

ఆర్థికంగా, సామాజికంగా పాకిస్తాన్‌లో అత్యంత వెనుకబడిన ప్రావిన్సు బలూచిస్తానే.

70వ దశకంలో పాకిస్తాన్ జీడీపీలో ఆ ప్రావిన్సు వాటా 4.9%. అది 2000కు వచ్చేసరికి 3 శాతానికి పడిపోయింది.

పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్సు అయినా ఆదాయపరంగా బలూచిస్తాన్ చాలా వెనుకబడి ఉందని అఫ్గానిస్తాన్‌లో భారత రాయబారిగా, భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన వివేక్ కట్జూ అన్నారు.

Image copyright Getty Images

"బలూచిస్తాన్‌కు పఠాన్లు పెద్ద సంఖ్యలో వచ్చి, నివసించడం మొదలుపెట్టారు. విద్య సహా చాలా విషయాల్లో బలూచ్ ప్రజలు చాలా వెనుకబడి ఉండేవారు. అక్కడ వనరులు పుష్కలంగా ఉన్నా, కరవు సమస్య కూడా తీవ్రంగా ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడి సూయీ ప్రాంతంలో సహజ వాయువు లభిస్తోంది. అది పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లలో వెలుగులు నింపుతోంది కానీ, స్థానికులకు మాత్రం చేరడం లేదు'' అని వివేక్ వివరించారు.

పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్‌ను కావాలని వెనుకబాటుతనంలో ఏమీ ఉంచలేదని సీనియర్ పాత్రికేయుడు రహీముల్లా యూసుఫ్‌జాయి అభిప్రాయపడ్డారు.

''బలూచిస్తాన్‌లో మౌలిక సదుపాయాలు ముందు నుంచీ లేవు. వాటిని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టలేదన్నది నిజం. కావాలనే అలా చేశారని నేను అనుకోవడం లేదు. ప్రభుత్వం, సంస్థలు విఫలమయ్యాయని మనం భావించాలి'' అని ఆయన అన్నారు.

''గిరిజన ప్రాంతమైన ఫటాలో, దక్షిణ పంజాబ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. పాకిస్తాన్‌లో అభివృద్ధి అన్ని చోట్లా ఒకే విధంగా లేదు. కొన్ని ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇంకొన్నింటిని వదిలేశారు'' అని అన్నారు.

Image copyright Getty Images

వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం

బలూచిస్తాన్‌కు 760 కి.మీ.ల పొడవైన సముద్ర తీరం ఉంది. పాక్ తీర రేఖలో మూడింట రెండొంతులు ఇదే.

ఇక్కడ 1.8 లక్షల కి.మీ.ల మేర విస్తరించి ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్‌ను సరిగ్గా వినియోగించుకోవడం లేదు.

''పాకిస్తాన్ ప్రావిన్సులన్నింటిలోకెల్లా బలూచిస్తాన్ వ్యూహాత్మకంగా అత్యంత ప్రధానమైంది. పాక్ నావికాదళ స్థావరాలు ఉన్న ఒర్మారా, పాస్నీ, గ్వాదర్ బలూచిస్తాన్ తీరంలోనే ఉన్నాయి. కరాచీకి లేని వ్యూహాత్మక రక్షణ గ్వాదర్‌కు ఉంది'' అని తిలక్ దేవేశర్ అన్నారు.

''రాగి, బంగారం, యురేనియం ఇక్కడ విరివిగా దొరుకుతాయి. అణు పరీక్షలు జరిపిన ప్రాంతం ఇక్కడి చాగాయ్‌లోనే ఉంది. అఫ్గానిస్తాన్‌లో అమెరికా జరిపిన 'ఉగ్రవాదంపై యుద్ధం' కూడా ఇక్కడి నుంచే సాగింది. వాళ్ల స్థావరాలన్నీ ఇక్కడే ఉండేవి'' అని వివరించారు.

Image copyright Getty Images

అణిచివేతకు ప్రయత్నిస్తూనే ఉంది

పాక్ సైన్యం ఎప్పుడూ తన శక్తిని ఉపయోగిస్తూ బలూచ్ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.

'వన్ యూనిట్' విధానాన్ని ఉపసంహరించుకుంటామని పాకిస్తాన్ అంగీకరించాక 1959లో బలూచ్ నాయకుడు నౌరోజ్ ఖాన్ ఆయుధాలను వదిలేశారు.

కానీ, ఆ తర్వాత పాక్ ప్రభుత్వం ఆయన కుమారులను, మద్దతుదారులను ఉరి తీసింది.

''వాళ్లందరినీ ఉరి తీశాక, ఆ మృతదేహాల వద్దకు 80 ఏళ్ల నౌరోజ్ ఖాన్‌ను పాక్ సైన్యం తీసుకువచ్చింది. 'ఈయన మీ కుమారుడేనా?' అని ఓ సైనికాధికారి నౌరోజ్‌ను అడిగాడు'' అంటూ 'ఎ జర్నీ టు డిస్‌ఇల్యూషన్‌మెంట్ పుస్తకంలో షెర్బాజ్ ఖాన్ మజారీ రాశారు.

''నౌరోజ్ కొద్ది సేపు తీక్షణంగా ఆ అధికారిని చూశారు. ఇక్కడ పడి ఉన్న వీరులందరూ నా కమారులే అని బదులిచ్చారు. తన కుమారుల్లో ఒకరి మృతదేహం నౌరోజ్‌కు అప్పుడు కనిపించింది. ఆయన ఆ శరీరం దగ్గరికి వెళ్లి, మీసాన్ని పైకి మెలిపెట్టారు. 'మరణించాక కూడా నువ్వు నైరాశ్యంలో ఉన్నావని నీ శత్రువు అనుకోకూడదు' అని కోపంతో అన్నారు'' అని మజారీ పేర్కొన్నారు.

చిత్రం శీర్షిక బీబీసీ స్టూడియోలో తిలక్ దేవేశర్‌తో రేహాన్ ఫజల్

సొంత ప్రజలపైనే పాక్ బాంబులు

1974లో జనరల్ టిక్కా ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై మిరాజ్, ఎఫ్-86 యుద్ధ విమానాలతో బాంబులు వేసింది.

ఇరాన్ షా కూడా కోబ్రా హెలికాప్టర్లను పంపించి, బలూచ్ విప్లవకారులున్న ప్రాంతాల్లో బాంబులు వేయించాడు.

''షా హెలికాప్టర్లనే కాదు, తమ పైలెట్లను కూడా పంపారు. తిరుగుబాటును అణిచేందుకు భుట్టోకు డబ్బులు కూడా ఇచ్చారు. వైమానిక దళాలను ఉపయోగించి చిన్నారులను, ముసలివాళ్లను కూడా చంపించారు'' అని తిలక్ దేవేశర్ చెప్పారు.

''ఇప్పటికీ పాకిస్తాన్ బలూచిస్తాన్‌లో ఏం జరిగినా, వైమానిక దళాలను వినియోగిస్తుంది. భారత్‌లోనూ తిరుగుబాట్లు వచ్చిన సందర్భాలున్నాయి. కానీ, మనం ఎప్పుడూ సొంత పౌరులపై గానీ, మిలిటెంట్లపై గానీ వైమానిక దళాలను వాడలేదు'' అని వివరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక నవాబ్ అక్బర్ బుగ్తీ (మధ్యలో వ్యక్తి)

అక్బర్ బుగ్తీ హత్య

పాకిస్తాన్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ పాలనలో ఉండగా 2006 ఆగస్టు 26న బలూచ్ ఉద్యమ నాయకుడు నవాబ్ అక్బర్ బుగ్తీని ఆయన దాక్కుని ఉన్న గుహలో సైన్యం చుట్టుముట్టింది. ఆయన్ను చంపింది.

బలూచ్ ఉద్యమంలో బుగ్తీ చాలా పెద్ద నాయకుడు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, గవర్నర్‌గా ఆయన పనిచేశారు కూడా.

ఆయన్ను అణచివేయడానికి పాక్ చేసిన ఈ చర్య, ఆయన్ను ఓ హీరోను చేసింది.

ఆబిదా హుస్సేన్ గతంలో పాకిస్తాన్ మంత్రిగా, దౌత్యవేత్తగా పనిచేశారు. ఆమె ఓ పుస్తకంలో ఇలా రాశారు.

''బుగ్తీ తన మరణానికి కొంత సమయం ముందు శాటిలైట్ ఫోన్‌లో నాతో మాట్లాడారు. 'ఇప్పటికి 80 వసంతాలు చూశా. నేను వెళ్లిపోయే సమయం వచ్చింది. మీ పంజాబీ సైన్యం నన్ను చంపాలన్న కసితో ఉంది. కానీ, ఇది బలూచిస్తాన్ స్వాతంత్ర్య ఉద్యమం మరింత తీవ్రమయ్యేందుకే ఉపయోగపడుతుంది. ఇంతకన్నా గొప్ప మరణం ఏమీ ఉండదు. నాకు ఎంత మాత్రమూ బాధ లేదు' అని ఆయన అన్నారు'' అని ఆబిదా వివరించారు.

Image copyright Getty Images

పాక్‌పై ఎన్నో ఆరోపణలు

బలూచిస్తాన్ ఉద్యమం కోసం పోరాడుతున్న ఎంతో మందిని రహస్యంగా చంపుతోందని పాక్‌పై ఎన్నో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

2007లో పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ఆ దేశ సుప్రీంకోర్టుకు 148 మంది పేర్లతో కూడిన ఓ జాబితాను ఇచ్చింది. వారంతా ఒక్కసారిగా గల్లంతైనవారు. వాళ్లు ఏమైపోయారో, వారి బంధువులకూ తెలియదు.

''వ్యక్తులు గల్లంతవుతుండటం, ప్రభుత్వ హత్యలు బలూచిస్తాన్‌లో పెద్ద సమస్యలు. వ్యక్తలును అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత వారి మృతదేహాలు మాత్రమే కనిపిస్తాయి. పోరాటం కొనసాగుతూనే ఉంది కాబట్టి, ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సైన్యంపైనా దాడులు జరుగుతుంటాయి'' అని రహీముల్లా యూసుఫ్‌జాయ్ అన్నారు.

ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. వేర్పాటువాదులను, వారి మద్దతుదారులను మాయం చేయడంలో ఈ సంస్థలు హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి.

అక్బర్ బుగ్తీ మరణం తర్వాత ఇలాంటి ఘటనలు చాలా పెరిగాయి. వీటిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Image copyright Getty Images

చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్

కొన్నేళ్ల క్రితం చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) ఏర్పాటు కోసం రూ.4.3లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని చైనా ప్రకటించింది.

పాకిస్తాన్ అభివృద్ధికి దీని ద్వారా భారీ ఊతం లభించబోతుందని విశ్లేషకులు భావించారు. అయితే, బలూచ్ ప్రజలు సీపెక్‌ను వ్యతిరేకించారు.

''అరేబియా సముద్రాన్ని చేరుకునేందుకు చైనాకున్న మార్గం గ్వాదర్. దక్షిణ చైనా సముద్రంలో భవిష్యతుతలో ఏవైనా ప్రతికూలతలు తలెత్తితే, ఈ మార్గం గుండా చమురు, వస్తువుల రవాణా సాగించొచ్చు. బర్మా నుంచి మరో మార్గం వెళ్తుంది. అక్కడ ఓ కారిడార్ నిర్మించాలని వారు ప్రణాళికలు వేసుకున్నారు. అక్కడి నుంచి గిల్గిత్ బల్తిస్తాన్, కారాకోరం హైవేల ద్వారా గ్వాదర్‌కు వస్తువులు చేరుకుంటాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని చైనా హామీ ఇచ్చింది'' అని తిలక్ దేవేశర్ అన్నారు.

''గ్వాదర్‌లో ఉంటున్న జాలర్లను అక్కడి నుచి ఖాళీ చేయించారు. దీనిపై నిరసనలు తలెత్తాయి. ఇక్కడి ప్రజలకు నీరు చాలా ముఖ్యమైన విషయం. దొంగతనం జరిగితే, ఇంట్లో ముందు పోయేది నీటి కుండలే అని ఇక్కడ స్థానికులు అంటుంటారు'' అని దేవేశర్ వివరించారు.

''వారి సమస్యలకు ఏం పరిష్కారమూ సూచించలేదు. వాళ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రాంతం తమదైనా, అక్కడేం జరుగుతుందో తమకు తెలియట్లేదని బలూచిస్తాన్ సీఎం అంటున్నారు. 50 లక్షల మంది చైనీయులు బలూచిస్తాన్‌కు రాబోతున్నారని స్థానికులు ఆందోళనపడుతున్నారు. అప్పుడు వారి ప్రాంతంలో వాళ్లే మైనార్టీలుగా మారిపోతారు'' అని అభిప్రాయపడ్డారు.

Image copyright TWITTER@BBUGTI
చిత్రం శీర్షిక బ్రహ్మదాగ్

మోదీ ఎర్రకోట ప్రసంగంలో‘బలూచిస్తాన్’

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇటీవల ఎర్ర కోట నుంచి చేసిన ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బలూచిస్తాన్ గురించి ప్రస్తావించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

దీనిపై బలూచ్ తిరుగుబాటు నాయకుడు బ్రహ్మదాగ్ బుగ్తీ స్పందించారు. ప్రస్తుతం ఆయన స్విట్జర్లాండ్‌లో ఉంటున్నారు.

''మా గురించి ప్రస్తావించడం ద్వారా మోదీ మా పోరాటానికి ఎంతో సాయం చేశారు. బలూచిస్తాన్‌లో యుద్ధ వాతావరణం ఉంది. క్వెట్టా లాంటి నగరాల్లో పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించారు. చిన్న రాజకీయ ప్రదర్శనల్లో పాల్గొన్నా, ప్రజలను సైన్యం పట్టుకువెళ్తుంది. మాకేమీ చేసే అవకాశం లేదు. పాకిస్తాన్‌తో ఉండాలని మా ప్రజలు కోరుకోవడం లేదు'' అని ఆయన అన్నారు.

Image copyright Getty Images

'అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం'

మోదీ ప్రసంగంలో బలూచిస్తాన్‌ గురించి ప్రస్తావించడాన్ని తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంగా పాకిస్తాన్ చూస్తోంది.

బలూచ్ ఉద్యమానికి భారత్ సహకారం అందిస్తోందని పాక్ ఆరోపణలు చేస్తోంది.

''బలూచ్ వేర్పాటువాదులకు బయటి నుంచి సాయం అందుతోందని పాక్ పాలకులు అంటుంటారు. అమెరికా సీఐఏ పేరును వారు బహిరంగంగా చెప్పరు కానీ, భారత నిఘా విభాగం 'రా'ను మాత్రం నిందిస్తారు. కుల్‌భూషణ్ యాదవ్ వ్యవహారాన్ని పాక్ ఇందుకు ఉపయోగించుకుంది. ఆయన భారత నావికా దళం ఉద్యోగని, బలూచిస్తాన్‌లో పట్టుకున్నామని అంటోంది'' అని రహీముల్లా యూసుఫ్‌జాయ్ అన్నారు.

''బలూచిస్తాన్ విషయంలో ఇటీవల భారత్ ఆసక్తి పెరిగింది. మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్నపుడు, అప్పటి పాక్ ప్రధాని గిలానీని షర్మ్ ఎల్-షేక్‌లో కలిశారు. బలూచిస్తాన్ అంశంపై పరస్పరం చర్చలు జరగాలని పాక్ ప్రతిపాదించింది. దీనికి భారత్ అంగీకారం తెలిపింది. అవకాశం వస్తే ఉపయోగించుకోవాలని భారత్ ఎందుకు అనుకోదు? అమెరికా మాత్రం పాక్ ఒకటిగా ఉండాలని తాము భావిస్తున్నట్లు చెబుతుంది. కానీ, ఆ దేశ నాయకులు కొందరు బలూచ్ వేర్పాటువాదులను కలుస్తుంటారు'' అని వివరించారు.

Image copyright Getty Images

ఉద్యమంలో ఇవీ బలహీనతలు..

బలూచ్ పోరాటానికి స్వతంత్ర దేశాన్ని సాధించుకోగల శక్తి ఉందా? అన్నది ప్రధాన ప్రశ్న.

గట్టి మధ్య తరగతి వర్గం, ఆధునిక నాయకత్వం లేకపోవడం బలూచ్ ఉద్యమానికి ఉన్న ప్రధాన లోపమని 'ది ఐడియా ఆఫ్ పాకిస్తాన్' అనే పుస్తకంలో స్టీవెన్ కోహెన్ రాశారు.

''పాక్ జనాభాలో బలూచ్ ప్రజల శాతం చాలా తక్కవ. తమ ప్రావిన్సులో పెరుగుతున్న పఠాన్ జనాభాతోనూ వారికి సమస్యలు వస్తున్నాయి. ఇరాన్, అఫ్గానిస్తాన్ వారికి సాయం అందడం లేదు. అలా సాయం పొందితే బలూచ్ ప్రజల నుంచి అసంతృప్తి వస్తుంది'' అని పేర్కొన్నారు.

చిత్రం శీర్షిక రేహాన్ ఫజల్‌తో వివేక్ కట్జూ

ప్రత్యమ్నాయంగా తమ పాలన ఎలా సాగాలన్న విధానం బలూచ్ ఉద్యమకారులకు లేకపోవడం కూడా మరొక లోపం.

అయితే, ఈ వాదన తప్పని వివేక్ కట్జూ అంటున్నారు.

''ఉద్యమాలు విజయవంతమైతే, జాతి నిర్మాణం ప్రక్రియ వెంటనే మొదలవుతుంది. పాలన విధానం గురించి ప్రణాళిక ఇప్పుడు లేకపోవడం లోపమని భావించడం సరికాదు'' అని ఆయన చెప్పారు.

బలూచ్ ఉద్యమం రెండోసారి జరిగినప్పుడు నాయకత్వం చీలిపోయింది.

''చాలా మంది నాయకులు వేరే దేశాల్లో రాజకీయ పునరావాసం పొందుతున్నారు. స్విట్జర్లాండ్, యూఏఈ, అమెరికా వంటి దేశాల్లో ఉంటున్నారు. కొందరు భారత్‌లోనూ ఉన్నారని అంటున్నారు. రాజకీయ, ఆర్థిక కార్యాచరణపై, వివిధ అంశాలపై వీళ్లందరి మధ్య ఏకాభిప్రాయం లేదు'' అని రహీముల్లా యూసుఫ్‌జాయ్ అభిప్రాయపడ్డారు.

Image copyright FACEBBOK/RAHIMULLAH.YUSUFZAI
చిత్రం శీర్షిక రహీముల్లా యసుఫ్‌జాయ్

పాక్ బలహీనతే వారి బలం

బలూచ్ పోరాటం ఇంకా 'చిన్న స్థాయి తిరుగుబాటు'గానే ఉందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.

ఈ పోరాటం విజయవంతమయ్యే అవకాశాల గురించి ప్రశ్నించినప్పుడు.. ''విజయం విత్తనాలు ఎప్పుడో నాటుకున్నాయి. ఫలాలు ఎలా వస్తాయన్నది మరికొన్ని అంశాలపై ఆధారపడి ఉంది. పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితిలో అంతర్గతంగా ఏ సంక్షోభం వచ్చినా, బలూచ్ ఉద్యమంపై ఆ ప్రభావం పడుతుంది. వారి ఆర్థిక వ్యవస్థ మరణశయ్యపై ఉంది. ఎప్పుడైనా అది మునిగిపోవచ్చు'' అని తిలక్ దేవేశర్ బదులు చెప్పారు.

''పాక్‌లో నీటి కొరత తీవ్రం. పాక్ అంతర్గతంగా ఏ కొంచెం బలహీనపడినా, బలూచ్ ప్రజలకు అది బలమవుతుంది. ఊహించని విధంగా, అకస్మాత్తుగా ఏదైనా జరగొచ్చు. బలూచ్ వేర్పాటువాదం బాగా వ్యాపించింది. దాన్ని నియంత్రించేందుకు పాక్ తమ విధానాలను తీవ్రంగా మార్చుకోవాలి. అందుకు అంగీకరించేందుకు ఆ దేశ సైన్యం సిద్ధంగా లేదు'' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పౌరసత్వ సవరణ బిల్లు: అస్సాం ఎందుకు రగులుతోంది.. ప్రజల్లో భయం దేనికి

వీడియో: న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ‘గల్లంతైనవారు బతికే ఉన్నారనేందుకు ఎలాంటి సంకేతాలు లేవు’

సీరియల్ రేపిస్టుకు 33 యావజ్జీవ శిక్షలు

మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్‌ ప్రశ్న, సమాధానం ఏంటి

'అతడి నీడ పడిన చోట మృత్యువు కాటేస్తుంది'.. బాలీవుడ్ సినిమాపై పొరుగు దేశంలో ఆగ్రహం

హైదరాబాద్ ఎన్‌కౌంటర్ మృతుల్లో ఇద్దరు మైనర్లని చెప్తున్న 'బోనఫైడ్' సర్టిఫికెట్లు.. ఎన్‌హెచ్‌ఆర్సీకి అందించిన కుటుంబ సభ్యులు

బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ అంశం ప్రభావం చూపుతుందా

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్