జమాల్ ఖషోగ్జీ 'బలి ఇవ్వాల్సిన జంతువు' - హత్యకు ముందు రికార్డింగ్ వివరాలు ప్రచురించిన టర్కీ పత్రిక

  • 11 సెప్టెంబర్ 2019
జమాల్ ఖషోగ్జీ Image copyright Reuters

సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్యకు ముందు ఆయన చివరి క్షణాలుగా చెబుతున్న రికార్డింగ్స్‌కు సంబంధించిన కొత్త వివరాలను ఒక టర్కీ వార్తాపత్రిక ప్రచురించింది.

సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే ఖషోగ్జీని గత ఏడాది అక్టోబర్‌లో ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా కాన్సులేట్‌లో హత్య చేశారు.

టర్కీలోని ప్రభుత్వ అనుకూల వార్తాపత్రిక 'సబా' ఈ వివరాలను కాన్సులేట్ లోపల జరిగిన రికార్డింగ్స్‌కు సంబంధించినవని చెప్పింది, టర్కీ నిఘా వర్గాల నుంచి వాటిని పొందామని తెలిపింది.

జర్నలిస్టు ఖషోగ్జీ చివరగా అన్నట్లు చెబుతున్న మాటలు కూడా సబా కథనంలో ఉన్నాయి.

కనిపించకుండా పోయే ముందు అమెరికాలో నివసించిన ఖషోగ్జీ వాషింగ్టన్ పోస్ట్‌కు ఒక వ్యాసం రాశారు.

టర్కీకి చెందిన ప్రియురాలిని పెళ్లి చేసుకోడానికి అవసరమైన పత్రాల కోసం, 2018 అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లో సౌదీ కాన్సులేట్‌ లోపలికి వెళ్లిన ఖషోగ్జీ తర్వాత కనిపించలేదు.

ఖషోగ్జీ డెత్ మిస్టరీపై సౌదీ అరేబియా దర్యాప్తు చేసింది. తర్వాత ఆయన అదృశ్యం కావడం గురించి విరుద్ధ సమాచారం విడుదల చేసింది.

ఆయన్ను హత్య చేయడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ సౌదీ అధికారులు 11 మందిని విచారించారు.

చిత్రం శీర్షిక సౌదీ అరేబియా కాన్సులేట్‌లోకి వెళ్తున్న ఖషోగ్జీ

వార్తాపత్రిక ఏం చెబుతోంది

సబా.. జర్నలిస్ట్ ఖషోగ్జీ డెత్ మిస్టరీ గురించిన వివరాలను ఎప్పుడూ అంతర్జాతీయ పతాక శీర్షికలుగా పెడుతుంది. వాటిలో కొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయి.

సబా వార్తాపత్రిక ఈ వారం రెండు కొత్త కథనాలను ప్రచురించింది. వాటిలో ఖషోగ్జీని 'హిట్ స్క్వాడ్' అనే పేరున్న ఒక గ్రూప్ హత్య చేసిందని చెప్పింది. తమ తాజా కథనంలోని వివరాలు ఆయన చనిపోయే ముందు చేసిన రికార్డింగ్ నుంచే లభించాయని పత్రిక చెబుతోంది.

సౌదీ అరేబియా నుంచి పంపిన బృందంలో భాగంగా ఉన్న ఒక ఫోరెన్సిక్ నిపుణుడు ఖషోగ్జీ లోపలికి రాక ముందు ఆయనను 'బలి ఇవ్వాల్సిన జంతువు'గా చెప్పినట్లు కూడా ఈ కథనంలో వివరించారు.

కాన్సులేట్‌లోకి రాగానే ఖషోగ్జీకి సందేహం వచ్చిందని, దాంతో ఆయన వెంటనే ఇంటర్‌పోల్ ఆదేశాలతో తను తిరిగి రియాద్ వెళ్లాలని చెప్పారని సబా తన కథనంలో చెప్పింది.

తర్వాత ఆయన ఆ గ్రూప్‌లో వాళ్లు చెప్పినవి చేయడానికి నిరాకరించారు. వాటిలో ఆయన తన కొడుక్కి మెసేజ్ పంపించడం కూడా ఉంది. తర్వాత ఖషోగ్జీకి డ్రగ్ ఇచ్చారు.

హంతకులతో ఖషోగ్జీ చివరగా తనకు ఆస్తమా ఉందని, నా నోటిని మూసి ఉంచద్దని చెప్పారని, తర్వాత స్పృహ కోల్పోయారని పత్రిక కథనంలో చెప్పింది.

తలకు ఒక సంచి వేయడంతో ఖషోగ్జీకి ఊపిరాడలేదని, ఆయన పెనుగులాడినట్లుగా అనిపించే శబ్దాలు కూడా రికార్డ్ అయ్యాయని సబా రాసింది.

ఖషోగ్జీ హత్యలో ఫోరెన్సిక్ నిపుణుడి చేయి ఉందని కూడా టేపుల్లో స్పష్టంగా తెలుస్తోందని వార్తా పత్రిక ఆరోపించింది.

వ్యూహం ప్రకారం చేసిన హత్య: ఐక్యరాజ్య సమితి

ఖషోగ్జీ హత్యకు సంబంధించి ఆడియో రికార్డింగ్స్ ఉన్నట్లు గత ఏడాది నుంచీ కథనాలు వస్తూనే ఉన్నాయి.

రికార్డింగ్స్ ఉన్నాయని టర్కీ అధికారులు బహిరంగంగా ధ్రువీకరించారు. వాటిని అంతర్జాతీయంగా అందరికీ అందజేస్తామని, పంచుకుంటామని, కానీ వార్తాపత్రికకు అవి ఎలా అందాయో తమకు తెలీదన్నారు.

హత్య జరిగి దాదాపు ఏడాది అవుతున్నా, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు వస్తున్నా ఖషోగ్జీ మృతదేహాన్ని ఇప్పటివరకూ గుర్తించలేకపోయారు.

ఈ హత్యపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని ఈ ఏడాది మొదట్లో ఐక్యరాజ్య సమితి కోరింది.

"ఇది ఉద్దేశపూర్వతంగా ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య. దీనికి సౌదీ అరేబియానే బాధ్యత వహించాలి. హత్యపై దర్యాప్తు జరిపించాలి" అని ఖషోగ్జీ మృతిపై ఐక్యరాజ్య సమితి ప్రత్యేక అధికారి యాగ్నెస్ కాల్లమర్డ్ తన నివేదికలో చెప్పారు.

ఆమె నివేదికను సౌదీ ప్రభుత్వం కొట్టిపారేసింది. సౌదీ అధికారుల ఆదేశాలతో ఖషోగ్జీని హత్య చేశారనే ఆరోపణలను అది మొదటి నుంచీ ఖండిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)