జాన్ బోల్టన్: మూడో జాతీయ భద్రతా సలహాదారును మార్చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

  • 11 సెప్టెంబర్ 2019
జాన్ బోల్టన్ Image copyright EPA

తనతో విభేదిస్తున్న జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌ను విధుల నుంచి తప్పించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

''రాజీనామా చేయమని జాన్ బోల్టన్‌ను కోరాను. ఈ రోజు ఉదయం ఆయన నాకు రాజీనామా లేఖ అందించారు. వచ్చేవారం జాతీయ భద్రతా సలహాదారుగా మరో వ్యక్తిని నియమిస్తాను'' అని ట్రంప్ మంగళవారం ట్వీట్ చేశారు.

మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు పదవి నుంచి తాను వైదొలిగానని ధ్రువీకరించిన బోల్టన్.. సరైన సమయంలో తాను చెప్పాల్సింది చెబుతానన్నారు.

బోల్టన్ పదవిలో ఉన్నప్పుడు అమెరికా విదేశీ విధానానికి సంబంధించిన అనేక అంశాల్లో అధ్యక్షుడు ట్రంప్‌తో ఆయన విభేదించారు.

ఇరాన్ నుంచి అఫ్గానిస్తాన్ వరకు అనేక అంశాలకు సంబంధించి ఆయన ట్రంప్‌తో ఏకీభవించలేదు.

గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పదవిలో ఉన్న బోల్టన్ ట్రంప్ హయాంలో మూడో జాతీయ భద్రతా సలహాదారు. ఆయన కంటే ముందు మిఖాయిల్ ఫ్లిన్, హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్‌లు ట్రంప్ హయాంలో ఆ పదవిలో పనిచేశారు.

ఇంతకీ బోల్టన్ ఏం చెబుతున్నారు

ట్రంప్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే జాన్ బోల్టన్ కూడా ట్వీట్ చేశారు. తాను ముందు రోజే రాజీనామా లేఖ ఇచ్చానని, కానీ, ట్రంప్ 'దీనిపై రేపు మాట్లాడదాం' అన్నారని బోల్టన్ ట్వీట్ చేశారు.

బోల్టన్‌ను రాజీనామా చేయమని తాను కోరానంటూ ట్రంప్ ట్వీట్ చేసిన వెంటనే బోల్టన్ ఫాక్స్ న్యూస్ ప్రజెంటర్‌ ఒకరికి మెసేజ్ పంపించారు. తాను అప్పటికే రాజీనామా చేశానంటూ అందులో ఆయన తెలిపారు.

తాను చెప్పాల్సింది ఉందని.. తన మనసంతా అమెరికా జాతీయ భద్రత గురించే ఆందోళన చెందుతోందని బోల్టన్ వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ ఒకరికి కూడా మెసేజ్ పంపించారు.

బోల్టన్ స్థానంలో జాతీయ భద్రత తాత్కాలిక సలహాదారుగా చార్లెస్ కుప్పర్‌మేన్ వ్యవహరిస్తారని వైట్‌హౌస్ వర్గాలు 'బీబీసీ' తెలిపాయి.

Image copyright Getty Images

వైట్‌హౌస్ వర్గాలు ఏమంటున్నాయి

బోల్టన్ సలహాదారుగా ఉన్న సమయంలో జాతీయ భద్రతా మండలి వైట్‌హౌస్‌లో ఒక ప్రత్యేక సామ్రాజ్యంలా మారిపోయిందని.. అందుకే బోల్టన్‌పై వేటేశారని వైట్‌హౌస్ వర్గాలు చెబుతున్నాయి.

ట్రంప్ ప్రభుత్వంలోని పేరు వెల్లడించడానికి ఇష్టపడని మాజీ సీనియర్ అధికారి ఒకరు 'బీబీసీ'తో మాట్లాడుతూ వైట్‌హౌస్‌లోని మిగతా కార్యాలయాలకు భిన్నంగా బోల్టన్ కార్యాలయం ఒక్కటే విడిగా పనిచేస్తుందని చెప్పారు.

వైట్ హౌస్ సమావేశాలకు బోల్టన్ హాజరుకారని.. ఆయన సొంత విధానాలు, కార్యక్రమాలు మాత్రమే పాటిస్తారని చెప్పారు.

ఆయనెప్పుడూ ట్రంప్ ప్రాధాన్యాలేమిటో తెలుసుకోలేదని.. తన ప్రాధాన్యాలకే ప్రాధాన్యం ఇస్తూ పనిచేశారని ఆరోపించారు మరో సీనియర్ అధికారి.

బోల్టన్ సొంత అజెండాతో సాగుతుండడంతో వైట్‌హౌస్‌లో ట్రంప్ సహా చాలామంది అధికారులకు ఆగ్రహం తెప్పించిందని మరో అధికారి వెల్లడించారు.

ట్రంప్, బోల్టన్ మధ్య ఎక్కడ బెడిసికొట్టింది?

ఇరాన్ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరించాలన్న ట్రంప్ విధానం వెనుక బోల్టన్ ఉన్నారని చెబుతారు. అయితే, ఇటీవల ఇరాన్ నేతలతో చర్చలకు ట్రంప్ సానుకూలత కనబర్చడాన్ని బోల్టన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెబుతున్నారు.

రష్యా, అఫ్గానిస్తాన్, ఉత్తరకొరియాలతో అమెరికా కఠిన వ్యవహారశైలి వెనుకా బోల్టనే ఉన్నారని చెబుతారు.

ఫిబ్రవరిలో ట్రంప్, ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ మధ్య సమావేశం అర్ధంతరంగా ముగియడానికి కూడా కారణం బోల్టనేనని అమెరికా అధికారులు విమర్శిస్తుంటారు. ఉత్తరకొరియా ఏమాత్రం రాజీపడడానికి వీలులేని, ఆమోదించే అవకాశం లేని డిమాండ్లను కిమ్ ముందు ఉంచడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి.

తాలిబన్లతో శాంతి చర్చలు వద్దని చెప్పింది కూడా బోల్టనే. తొలుత తాలిబన్ ప్రతినిధి బృందాన్ని చర్చలకు ఆహ్వానించి ఆ తరువాత రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

బోల్టన్‌కు యుద్ధపిపాసిగా పేరుంది. వెనెజ్వెలాలో అమెరికా విదేశాంగ విధానం విఫలమైందంటూ ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ ఓసారి బోల్టన్‌పై మండిపడ్డారట. వెనెజ్వెలా అధ్యక్షుడు మడూరోను పదవీచ్యుతుడిని చేయడం చాలా సులభమంటూ తనను తప్పుదోవ పట్టించారని ట్రంప్ ఆయనపై మండిపడినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)