పాకిస్తాన్‌వన్నీ తప్పుడు ఆరోపణలు.. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో ఆర్థిక, సామాజిక సమానత్వం సాధ్యం: ఐరాస మానవ హక్కుల మండలిలో స్పష్టం చేసిన భారత్

  • 11 సెప్టెంబర్ 2019
యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో మాట్లాడుతున్న విజయసింగ్ ఠాకుర్ Image copyright MEA/twitter
చిత్రం శీర్షిక యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో మాట్లాడుతున్న విజయసింగ్ ఠాకుర్

ఐరాస మానవ హక్కుల మండలి వేదికగా (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) పాకిస్తాన్ జమ్మూకశ్మీర్ విషయంలో చేసిన ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది.

ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమైనదని.. భారత సార్వభౌమాధికారానికి సంబంధించిన ఈ నిర్ణయం విషయంలో బయటి శక్తుల జోక్యాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది.

కశ్మీర్‌లో భారత ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. అక్కడ అంతర్జాతీయ విచారణ జరపాలంటూ స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న యూఎన్‌హెచ్‌ఆర్‌సీ 42వ సాధారణ సమావేశాల్లో పాకిస్తాన్ కోరిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు మంగళవారం ఉదయం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఐరాసను కోరడంతో పాటు కశ్మీర్‌లో మానవహననం జరిగే పరిస్థితులున్నాయంటూ తీవ్ర ఆరోపణలతో ఒక ప్రకటన చేశారు.

దీనికి భారత్ గట్టి సమాధానమిచ్చింది. భారత్ వైఖరి తెలుపుతూ, పాకిస్తాన్‌ని ఎండగడుతూ భారత విదేశాంగ కార్యదర్శి (తూర్పు) విజయసింగ్ ఠాకుర్, ఐరాసలో భారత శాశ్వత కార్యక్రమ ఫస్ట్ సెక్రటరీ విమర్శ్ ఆర్యన్‌లు ప్రకటన చేశారు.

జమ్మూకశ్మీర్ ప్రజల హక్కుల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని వారు తమతమ ప్రకటనల్లో స్పష్టం చేశారు.

‘ఉగ్రవాదానికి పుట్టినిల్లు పాకిస్తాన్’

ఉగ్రవాదానికి పుట్టినిల్లయిన పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని విజయ్ సింగ్ ఠాకుర్ చెప్పారు.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం ఏళ్లుగా కశ్మీర్‌ను ఎలా నాశనం చేసిందో వివరిస్తూ పాక్ రెండు నాల్కల ధోరణిని ఆమె ఎండగట్టారు. తమ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎంతమాత్రం సహించబోదని ఆమె స్పష్టం చేశారు.

పాకిస్తాన్ చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలనీ.. పూర్తిగా రాజ్యాంగాన్ని అనుసరిస్తూ భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆమె అన్నారు.

జమ్మూకశ్మీర్‌లో సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ ప్రాంతంలో ఏళ్లుగా పాతుకుపోయిన లింగవివక్షకు తెరపడుతుందని చెప్పారు.

జమ్ముకశ్మీర్‌లో సవాళ్లు ఉన్నప్పటికీ అక్కడి పౌర ప్రభుత్వం ప్రాథమిక సేవలు, నిత్యావసరాల సరఫరా, సంస్థలు ఎప్పటిలా పనిచేసే పరిస్థితులు, రవాణాకు ఇబ్బందుల్లేకుండా చూస్తోందని చెప్పారు.

సీమాంతర ఉగ్రవాదం కారణంగా ముప్పు ఉండడంతో ప్రజల భద్రత దృష్ట్యా ముందుజాగ్రత్తగా కొన్ని ఆంక్షలు విధించినా ఒక్కటొక్కటిగా సడలిస్తున్నారని స్పష్టం చేశారు.

Image copyright Twitter/IndiaatUN,Geneva
చిత్రం శీర్షిక విమర్శ్ ఆర్యన్

సీమాంతర ఉగ్రవాదం ఇక సాగించలేమనే..

తప్పుడు ఆరోపణలతో రాజకీయం చేసేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు తమకేమీ ఆశ్చర్యం కలిగించలేదని.. భారత్‌ను వ్యతిరేకిస్తున్న పాక్ సాగిస్తున్న సీమాంతర ఉగ్రవాదానికి ఆటంకం అవుతుందన్న ఉద్దేశంతోనే జమ్ముకశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంపై పాక్ అంతగా ఆందోళన చెందుతోందని ఫస్ట్ సెక్రటరీ విమర్శ్ ఆర్యన్ తన ప్రకటనలో ఎండగట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం