ఐఫోన్ 11: లాంగ్ బ్యాటరీ పవర్, సరికొత్త కెమెరా ఫీచర్లు.. యాపిల్ కొత్త ఫోన్ ప్రారంభ ధర ఎంతో తెలుసా

  • 11 సెప్టెంబర్ 2019
ఐఫోన్ 11 ప్రో బ్యాటరీ గత మోడళ్లలో బ్యాటరీ కన్నా 4 గంటలు అదనంగా పనిచేస్తుందని, ప్రో మ్యాక్స్ బ్యాటరీ 5 గంటలు అదనంగా పనిచేస్తుందని యాపిల్ ప్రకటించింది. Image copyright APPLE
చిత్రం శీర్షిక ఐఫోన్ 11 ప్రో బ్యాటరీ గత మోడళ్లలో బ్యాటరీ కన్నా 4 గంటలు అదనంగా పనిచేస్తుందని, ప్రో మ్యాక్స్ బ్యాటరీ 5 గంటలు అదనంగా పనిచేస్తుందని యాపిల్ ప్రకటించింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 11 వచ్చేసింది. సరికొత్త కెమెరా ఫీచర్లు, మునుపెన్నడూలేని వేగంతో నడిపించే ప్రొసెసర్లతో ఇది ముస్తాబైంది. బ్యాటరీ పవర్‌నూ తక్కువగా ఉపయోగించుకొనేలా దీన్ని సిద్ధంచేశారు.

ఐఫోన్ 10 శ్రేణి ఫోన్ల కంటే తాజాగా ఆవిష్కరించిన రెండు ''11 ప్రో'' మోడల్స్‌లో.. బ్యాటరీ పిక్‌అప్ ఎక్కువగా ఉంటుందని యాపిల్ తెలిపింది. నాలుగు నుంచి ఐదు గంటలపాటు అదనంగా బ్యాటరీ వస్తుందని వెల్లడించింది.

అయితే 5జీ కోసం ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. ఆన్‌లైన్‌లో ఐఫోన్‌పై చర్చలకు కేంద్రంగా మారిన కొన్నికొత్త ఫీచర్లూ దీనిలో కనిపించలేదు.

మరోవైపు స్మార్ట్‌వాచ్ కొత్త వెర్షన్‌ (5 సిరీస్)నూ యాపిల్ ఆవిష్కరించింది. దీనిలో తొలిసారిగా ''ఆల్వేస్ ఆన్'' డిస్ప్లే ఫీచర్ కనిపిస్తోంది.

రెప్పపాటులో రీఫ్రెష్ కావడం దీని ప్రత్యేకత. ఇదివరకటి వెర్షన్‌లానే 18 గంటలపాటు బ్యాటరీ లైఫ్ ఉండేందుకు ఇమేజ్‌ బ్రైట్‌నెస్‌ను తగ్గించే ఆప్షన్ ఉంది.

కొత్త కంపాస్‌తోపాటు టైటానియం కేస్‌లనూ యాపిల్ పరిచయం చేసింది. పరిసరాల్లో ధ్వనులు ప్రమాదకర స్థాయులకు పెరిగినప్పుడు హెచ్చరించేలా ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసింది. మహిళలు రుతుక్రమాన్ని ట్రాక్ చేసుకునే సదుపాయమూ దీనిలో ఉంది.

''యాపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన హెల్త్, సేఫ్టీ ఫీచర్లు బాగా నచ్చాయి. అయితే నిద్ర నాణ్యతను పసిగట్టే ఫీచర్‌ను అందుబాటులోకి తేవకపోవడంపై కొంచెం నిరాశపడ్డాను''అని స్మార్ట్ డివైజెస్ నిపుణులు ప్యాట్రిక్ మూర్‌హెడ్ వ్యాఖ్యానించారు.

తమ సిరీస్ 3 మోడల్‌ను మార్కెట్‌లో ఉంచుతామని యాపిల్ స్పష్టీకరించింది. దీని ధర బ్రిటన్‌లో 199 డాలర్ల వరకు ఉంది.

ప్రస్తుతం గ్లోబల్ స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో యాపిల్ వాటా 49 శాతం వరకు ఉన్నట్లు 'ఐడీసీ' సంస్థ పరిశోధనలో తేలింది.

Image copyright EPA
చిత్రం శీర్షిక యాపిల్ కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోతున్నానని జూన్ నెలలో ప్రకటించిన సర్ జానీ ఐవ్ కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు.

కెమెరా ఫీచర్లు

తాజా ఐఫోన్లలో ప్రవేశపెట్టిన కెమెరా ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సరికొత్త అల్ట్రావైడ్ రియర్ కెమెరాను (వెనుకవైపు కెమెరా) యాపిల్ పరిచయం చేసింది. '2x' ఆప్టికల్ జూమ్ అవుట్ దీని ప్రత్యేకత.

ఐఫోన్ 10ఎస్, 10ఎస్ మ్యాక్స్ శ్రేణి ఫోన్లలో కనిపించే టెలిఫొటో, నార్మల్ లెన్సెస్ ఫీచర్లు.. 11 'ప్రో' శ్రేణి ఫోన్లలోనూ ఉన్నాయి. అయితే ఐఫోన్ 11లో అల్ట్రావైడ్, స్టాండార్డ్ లెన్స్ మాత్రమే ఉన్నాయి.

కెమెరాలో 'సరికొత్త' నైట్ మోడ్‌ను యాపిల్ అందుబాటులోకి తెచ్చింది. సహజత్వాన్ని కోల్పోకుండా ఇమేజ్ బ్రెట్‌నెస్‌ను పెంచడం/తగ్గించడం దీని ప్రత్యేకత.

గూగుల్, శాంసంగ్, హువావే లాంటి బ్రాండ్లు ఇలాంటి ఫీచర్‌ను ఇప్పటికే తమ ఫోన్లలో నిక్షిప్తం చేశాయి.

'డీప్ ఫ్యూజన్' పేరుతో సరికొత్త ఫీచర్‌నూ యాపిల్ తెరపైకి తెచ్చింది. దీనిలో కెమెరా వెంటవెంటనే తొమ్మిది ఫొటోలు తీస్తుంది. వీటిని పిక్సెల్ స్థాయిలో పరిశీలిస్తూ.. ఓ అద్భుతమైన ఫొటోను మన ముందు ఉంచుతుంది.

అయితే ఈ ఫీచర్‌ను ప్రస్తుతం కొత్త ఫోన్లలో నిక్షిప్తం చేయలేదు. ఈ ఏడాది చివర్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఇది అందుబాటులోకి వస్తుంది.

Image copyright APPLE
చిత్రం శీర్షిక (ఎడమవైపు) నైట్ మోడ్ ఆఫ్ చేసి తీసిన ఫొటో - (కుడివైపు) నైట్ మోడ్ ఆన్ చేసి తీసిన ఫొటో

తాజాగా ఫ్రంట్ కెమెరాతోనూ 'స్లో మోషన్' వీడియోలు తీసుకొనే అవకాశం కల్పించారు.

ప్రొసెసర్ 'ద ఏ13 బయోనిక్'ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. తమ కొత్త సెంట్రల్ ప్రొసెసింగ్ యూనిట్ (సీపీయూ), గ్రాఫిక్స్ ప్రొసెసింగ్ యూనిట్ (జీపీయూ)లతో ఏ ఆండ్రాయిడ్ ఫోన్ కూడా పోటీపడలేదని యాపిల్ తెలిపింది.

మ్యాట్రిక్స్ గణనలను వేగంగా పూర్తిచేసేలా చిప్‌లలోని 'న్యూరల్ ఇంజిన్'ను అప్‌డేట్ చేశారు. ఏ12 ప్రొసెసర్ కంటే ఇది 20 శాతం వేగంగా పనిచేయడం విశేషం.

అయితే ఐప్యాడ్‌లో అందుబాటులో ఉండే ''పెన్సిల్'' స్టైలస్ ఆప్షన్‌ను కొత్త ఫోన్‌కు జోడించలేదు. ఈ ఫీచర్ కొత్త ఫోన్లలో ఉంటుందని బాగా ప్రచారం జరిగింది.

మరోవైపు శాంసంగ్, హువావే ప్రవేశపెట్టిన వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా యాపిల్ అందుబాటులోకి తీసుకురాలేదు.

ఐప్యాడ్ ప్రో తరహాలో డేటా ట్రాన్స్‌ఫర్ వేగంగా అయ్యేందుకు అవకాశం కల్పించే యూఎస్‌బీ-సీ పోర్ట్‌ ఫీచర్‌నూ తాజా ఫోన్లలో నిక్షిప్తం చేయలేదు.

ఐఫోన్ 11 భారత్ మార్కెట్లలో రూ.64,900 నుంచి అందుబాటులోకి వస్తోంది. 11 ప్రో ధర రూ.99,900 నుంచి మొదలవుతోంది. ఈ నెల 27 నుంచి వీటిని విక్రయించనున్నారు. మరోవైపు ఐప్యాడ్ ప్రారంభ ధర రూ.29,900గా నిర్ణయించారు.

Image copyright APPLE
చిత్రం శీర్షిక గత మోడల్ ఎక్స్ఆర్ కన్నా ప్రస్తుత 11 ప్రారంభ మోడల్ బ్యాటరీ కనీసం గంటపాటు అదనంగా వస్తుందని యాపిల్ ప్రకటించింది.

తగ్గుతున్న డిమాండ్

మిగతా ఫోన్లతో పోలిస్తే ఏడాది నుంచి యాపిల్ ప్రవేశపెడుతున్న కొత్త ఫోన్లకు డిమాండ్ బాగా తగ్గుతోంది.

అయితే ప్రస్తుతం వినియోగంలోనున్న ఐఫోన్ల సంఖ్య రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరినట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది.

దీనికి చాలా కారణాలున్నాయని ఐడీసీ సంస్థకు చెందిన స్మార్ట్‌ఫోన్ నిపుణురాలు మార్టా పింటో వ్యాఖ్యానించారు.

''ఆండ్రాయిడ్ ఫోన్‌లతో పోలిస్తే.. దీర్ఘకాలం మన్నిక వచ్చేలా ఐఫోన్లను యాపిల్ అభివృద్ధి చేస్తుంది. మరోవైపు ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త వెర్షన్లనూ ఎప్పటికప్పుడే తీసుకొస్తుంది. ఐఫోన్ల సెకండ్ హ్యాండ్ విక్రయాలు కూడా ఎక్కువగానే ఉంటాయి'' అని మార్టా అన్నారు.

''మొత్తంగా చూస్తే స్మార్ట్‌ఫోన్ మార్కెట్ జోరు కాస్త తగ్గింది. అయితే యాపిల్ దీన్ని పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే ఇప్పుడు సేవలపై సంస్థ ఎక్కువగా దృష్టిపెడుతోంది. సంస్థ వేరబుల్ డివైజెస్ కూడా బాగా ఆదరణ పొందుతున్నాయి'' అని ఆమె అన్నారు.

తాజా ఐఫోన్లలో 5జీ సదుపాయం లేదు. దీనికి సంబంధించిన మోడెమ్‌ కోసం ఇంటెల్ సంస్థ చేస్తున్న కసరత్తు ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది.

ప్రస్తుతం తీసుకొనే ఫోన్లను దీర్ఘకాలం ఉపయోగించేందుకు వినియోగదారులు ఇష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో 5జీ అప్‌గ్రేడ్ ఆలస్యం కావడంతో విక్రయాలపై ప్రభావంపడే అవకాశముంది. మరోవైపు బ్రిటన్‌లాంటి దేశాల్లో 5జీ మోడళ్లు, నెట్‌వర్క్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

''ఐఫోన్‌ను మాత్రమే ఉపయోగించాలని చాలా మంది కోరుకుంటుంటారు. అలాంటివారు 5జీ కోసం మరికొన్నాళ్లు వేచిచూడాల్సిందే'' అని సీసీఎస్ ఇన్‌సైట్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన బెన్ వూడ్ వ్యాఖ్యానించారు.

''ఇప్పుడు ఎక్కువ ధర పలికే 4జీ స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవడమంటే.. కొన్నేళ్లక్రితం హెచ్‌డీ-రెడీ ఫీచర్ అందుబాటులోలేని టీవీని కొన్నట్లే'' అని బెన్ వ్యాఖ్యానించారు.

Image copyright APPLE
చిత్రం శీర్షిక సమావేశానికి హాజరైనవారితో సెల్ఫీ తీసుకుంటున్న యాపిల్ సీఈవో టిమ్ కుక్

సబ్‌స్క్రిప్షన్ సేవలు

యాపిల్ సీఈవో టిమ్ కుక్.. రెండు సబ్‌స్క్రిప్షన్ సేవలనూ అందుబాటులోకి తెచ్చారు.

యాపిల్ ఆర్కేడ్- ఇది వీడియో గేమ్ డీల్. కొత్తకొత్త గేమ్‌లతో దీన్ని యాపిల్ సిద్ధంచేసింది. సెప్టెంబరు 19 నుంచి అందుబాటులోకి వస్తుంది.

మరోవైపు టెలివిజన్ ప్రోగ్రామ్, మూవీ-స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ 'యాపిల్ టీవీ ప్లస్‌'పై నవంబరు 1 నుంచి టీవీ షోల ప్రసారం మొదలవుతుంది.

నెట్‌ఫ్లిక్స్, డిస్నీ లాంటి ప్లాట్‌ఫామ్‌లకు పోటీగా యాపిల్ దీన్ని తీసుకొచ్చింది. సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు మిగతా వాటితో పోలిస్తే కాస్త తక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ కంటెంట్ కూడా కాస్త తక్కువగా ఉండే అవకాశముంది.

''యాపిల్ టీవీ ప్లస్‌కు వెబ్ యాక్సెస్ ఇవ్వడం సంతోషకరం. అయితే ఆండ్రాయిడ్, విండోస్ యాప్‌లలోనూ దీన్ని తీసుకురావాలి'' అని మూర్‌హెడ్ వ్యాఖ్యానించారు.

Image copyright APPLE

ప్రస్తుతమున్న క్లౌడ్ స్టోరేజీ, న్యూస్, మ్యూజిక్ సేవలను దీనిపై డిస్కౌంట్‌కు అందిస్తామని యాపిల్ ఎక్కడా చెప్పలేదు. డిస్కౌంట్ ఉంటుందని సోషల్ మీడియాలో తొలుత ప్రచారం జరిగింది.

అయితే తమ కంప్యూటర్లు, సెట్-టాప్ బాక్సులు కొనేవారికి యాపిల్ టీవీ ప్లస్ మెంబర్‌షిప్ ఏడాదిపాటు ఉచితంగా ఇచ్చే అవకాశముంది.

మరోవైపు కొత్త ఐప్యాడ్‌ను కూడా యాపిల్ ఆవిష్కరించింది.

ఈ ఏడో జనరేషన్ మోడల్ 10.2 అంగుళాలు (25.9 సెంమీ) పొడవుంది. ఈ నెల చివరి నుంచి ఇది మార్కెట్‌లోకి రానుంది.

తొలి ఐఫోన్‌ను స్టీవ్ జాబ్స్ ఆవిష్కరించి 13ఏళ్లు అయ్యింది. క్రమంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్ మారింది.

''వావ్ అనిపించే ఉత్పత్తులను యాపిల్ ప్రవేశపెట్టాలని అందరూ కోరుకుంటారు. ఈ అంచనాలను యాపిల్ ఇప్పటివరకూ అందుకొంటూ వస్తోంది. ప్రస్తుతం దీన్ని కొనసాగించడం పెద్ద సవాల్ లాంటిది'' అని వూడ్ వ్యాఖ్యానించారు.

Image copyright APPLE
చిత్రం శీర్షిక యాపిల్ టీవీ+

ఫీచర్లలో కొత్తదనం లోపించింది

డేవ్ లీ, నార్త అమెరికా టెక్నాలజీ రిపోర్టర్

ఈ అప్‌డేట్‌లో కనిపిస్తున్న కొత్త ఫీచర్‌లు తక్కువగా ఉన్నాయి. అందరికీ పరిచయం ఉన్న ఫీచర్లనే కొంచెం కొత్తగా అప్‌డేట్ చేశారు.

ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రో కెమెరాలను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. షార్ట్‌ఫిల్మ్‌లు, డాక్క్యుమెంటరీలు తీసేవారి నుంచి దీనికి ఆదరణ లభించొచ్చు. అదనపు బ్యాటరీ లైఫ్ కూడా కలిసొచ్చే అంశం.

మిగతావాటితో పోలిస్తే యాపిల్ టీవీప్లస్ ఛార్జీలు కాస్త తక్కువే. అయితే ఎంత వరకు దీనితో ఉపయోగం ఉంటుంది?

డిస్నీ ప్లస్, నెట్‌ఫ్లిక్స్, హెచ్‌బీవోలలో టీవీ షోలు, సినిమాల జాబితా కాస్త పెద్దదే ఉంటుంది. యాపిల్‌లో ఇంత పెద్ద లిస్ట్ కనిపించకపోవచ్చు. అసలు అక్కడ ఏం ఉంటాయో స్పష్టతేలేదు.

కొత్త డివైజ్‌లు కొనేటప్పుడు ఏడాది వరకు ఉచిత సేవలు కల్పించడం ద్వారా ప్రస్తుతం అందుబాటులోనున్న షోలను ప్రజలకు చేరువచేయొచ్చు. అయితే మిగతావారికంటే తమ ప్లాట్‌ఫామ్‌పై షోలను టెలికాస్ట్ చేస్తే మంచి ఫలితాలుంటాయని ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి యాపిల్ గట్టి నమ్మకం కల్పించాలి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: రేప్ కేసుల విచారణలో ఇతర దేశాలతో పోల్చితే భారత న్యాయవ్యవస్థ పనితీరు ఎలా ఉంది?

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు

ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...

నిందితులను చంపేస్తే దేశమంతటా ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు

పెళ్లి వేడుకలో డాన్స్ మధ్యలో ఆపినందుకు యువతి ముఖంపై తుపాకీతో కాల్చారు

BBC Exclusive: ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలో లోపం.. 32 కోట్ల మంది సమాచారం లీకయ్యే ప్రమాదాన్ని సరిదిద్దామన్న సంస్థ

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: మహబూబ్ నగర్‌ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు

ఉన్నావ్ అత్యాచారం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి