పాకిస్తాన్‌లో లీటర్ పాలు రూ. 140.. పెట్రోలు కంటే ఎక్కువ ధర.. కారణమేంటి?

  • 11 సెప్టెంబర్ 2019
పాల క్యాన్లతో వెళ్తున్న వ్యక్తి Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

పాకిస్తాన్‌లోని కరాచీలో లీటరు పాల ధర రూ.140కి పైగా పలుకుతోంది.

అంటే, భారత కరెన్సీలో దాదాపు రూ.64.

డిమాండ్ పెరగడంతో నగరంలో ఈ పరిస్థితి నెలకొన్నట్లు పాక్ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.

నిజానికి కరాచీ కమిషన్ కార్యాలయం నిర్ణయించిన గరిష్ఠ ధర రూ.94 (భారత కరెన్సీలో రూ.43) మాత్రమే అని పాకిస్తాన్‌కు చెందిన 'డాన్' పత్రిక తెలిపింది. ధరను అంతకు మించి పెంచకూడదని నిబంధనలు ఉన్నట్లు వివరించింది.

కానీ, స్థానిక పాల ఉత్పత్తిదారులు దీనికి అంగీకరించడం లేదని పాకిస్తాన్‌కే చెందిన 'ద న్యూస్' వెబ్‌సైట్ వివరించింది.

కరాచీలో మూడు పాడి రైతు సంఘాలు పాలను సరఫరా చేస్తున్నాయని, ఇవన్నీ కలిసి మూకుమ్మడిగా గత జులైలో పాల హోల్‌సేల్ ధరను లీటర్‌కు రూ.85 నుంచి రూ.96కు పెంచాయని పేర్కొంది.

ఫలితంగా రిటైల్ మార్కెట్‌లో లీటర్ పాల రూ.110 దాటిందని, మోహర్రం పండుగ నేపథ్యంలో డిమాండ్ మరింత పెరగడంతో గరిష్ఠంగా రూ.150 వరకూ వెళ్లిందని పేర్కొంది.

దుకాణాలపై దాడులు చేసి, అధిక ధరలకు పాలను విక్రయిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు కరాచీ కమిషనర్ ఇఫ్తికార్ షాల్వానీ చెప్పారని 'ద న్యూస్' తెలిపింది. అయితే, ఎంతమందిపై చర్యలు తీసుకున్నారనే వివరాలు ఆయన వెల్లడించలేదని వివరించింది.

Image copyright Getty Images

ధర పెంపు వెనుకున్న కారణాలపై ప్రశ్నించినప్పుడు.. ''ధరను నిర్ణయించడానికి కమిషనర్ ఎవరు? మేం ఉత్పత్తి చేస్తున్నాం. మేమే ధర నిర్ణయించుకుంటాం'' అని ఓ పాడి సంఘం నేతలు సమాధానమిచ్చారని 'పాకిస్తాన్ టుడే' వెబ్‌సైట్ తెలిపింది.

మొహర్రం జరిగే నెలలో నగరంలో జరిగే మతపరమైన ర్యాలీల్లో పాల్గొనేవారికి పాలు, పళ్ల రసాలు, తాగు నీరు అందించే కేంద్రాలను స్థానికులు ఏర్పాటు చేస్తుంటారు. ఆ స్టాళ్లను సబీల్ అంటుంటారు. వీటి వల్ల పాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

''ఏటా సబీల్ పెడుతున్నాం. పాల ధర పెరిగినంత మాత్రాన ఈసారి ఊరుకోలేం కదా. అయితే, నేను జీవితంలో ఇలాంటి ధరలు ఎన్నడూ చూడలేదు'' అని షెహర్యార్ అలీ అనే స్థానికుడు చెప్పినట్లు ద న్యూస్ పేర్కొంది.

జఫారియా డిసాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ జఫార్ అబ్బాస్ నగరంలో 100 సబీళ్లు ఏర్పాటు చేశారని, పాల ధరలు ఎక్కువగా పొండటంతో ఆయన పాల పొడిని తెప్పించారని వివరించింది.

కరాచీలో పాల డిమాండ్ రోజుకు 5 లక్షల లీటర్లు కాగా, 4 లక్షల లీటర్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందని కరాచీ డైరీ, క్యాటిల్ ఫార్మర్స్ అసోసియేషన్ చీఫ్ షాకిర్ ఉమెర్ చెప్పినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)