ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరం కారకస్‌లో రాత్రి జీవితం ఎలా ఉంటుంది?

  • 13 సెప్టెంబర్ 2019
కారకస్ నగరం Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రపంచంలో హత్యల రేటు అధికంగా ఉన్న నగరాల్లో కారకస్ ఒకటి

కారకస్... కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వెనెజ్వేలా రాజధాని. ప్రపంచంలోనే హత్యల రేటు అత్యధికంగా ఉన్న నగరం. అంత ప్రమాదకరమైన ఈ ప్రాంతంలో రాత్రిళ్లు ఎలా గడుస్తాయి? ఆర్థిక సంక్షోభం ప్రభావం ఎలా ఉంది?

సూర్యుడు అస్తమించాడంటే చాలు, ఈ నగరం దాదాపు నిర్మానుష్యంగా మారిపోతుంది. వీధుల్లో అక్కడక్కడా.. కార్లు, సాధ్యమైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలన్న ఆత్రుతలో వెళ్లే కొంతమంది నీడలు కనిపిస్తాయి.

ఒకప్పుడు లాటిన్ అమెరికాలో ఆర్థికంగా శక్తిమంతమైన నగరాల్లో కారకస్ ఒకటి. కానీ, వెనెజ్వేలాను తీవ్రంగా దెబ్బతీసిన ఆర్థిక సంక్షోభం ప్రభావం ఈ నగరంలో రాత్రి జీవనంపై తీవ్రంగా పడింది.

నేరాల రేటు

వెనెజ్వేలా ప్రభుత్వం అధికారికంగా నేర గణాంకాలను విడుదల చేయడంలేదు. కానీ, ప్రపంచంలోని అత్యంత హింసాత్మక దేశాలలో వెనెజ్వేలా ఒకటని వివిధ సంస్థలు జరిపిన అధ్యయనాలు చెబుతున్నాయి.

వెనెజ్వేలా వయలెన్స్ అబ్జర్వేటరీ (ఓవీవీ) అనే పరిశోధనా సంస్థ ప్రకారం, 2018లో ఈ దేశంలో హత్యల రేటు 1,00,000 మందికి 81.4గా ఉంది, ఇది ప్రపంచంలోనే అత్యధికం.

గ్రేటర్ కారకాస్ ప్రాంతంలో హత్యల రేటు మరింత పెరుగుతోంది. రాజధాని శివారులో పేదలు అధికంగా ఉండే పెటారే ప్రాంతంలో హత్యల రేటు 1,00,000 మందికి 112గా ఉంది.

ఈ నేరాలు పెరగడానికి ప్రధాన కారణాలలో దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఒకటి.

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత తీవ్రస్థాయిలో ద్రవ్యోల్బణం ఉన్న దేశం వెనెజ్వేలా. ఇక్కడ వార్షిక ద్రవ్యోల్బణ రేటు 25,000 శాతంగా ఉంది.

వెనెజ్వేలాలో హింస ఒక "అంటువ్యాధి"గా మారి దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోందని ఓవీవీ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

"కొన్ని ఏళ్ల క్రితం వరకు పెద్ద నగరాల్లోనే ఇలాంటి నేరాలు ఎక్కువగా జరిగేవి. క్రమంగా చిన్నస్థాయి పట్టణాలకు వ్యాపించాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ హింస పెరుగుతోంది" అని ఆ సంస్థ తెలిపింది.

ఆర్థిక సంక్షోభం కారణంగా 2015 నుంచి ఇప్పటి వరకు 30 లక్షల మందికి పైగా ప్రజలు దేశం వదిలి బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిపోయినట్లు అంచనా.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చీకటి పడగానే ట్రాఫిక్ తగ్గిపోతుంటుంది

విలాసం తగ్గింది, కానీ ఆగలేదు

ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఉల్లాసంగా గడిపేందుకు కారకస్ నగరవాసులు వెనుకాడటం లేదు.

కారకాస్ తూర్పు భాగంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో లాస్ మెర్సిడెస్ ఒకటి. దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉన్నా... ఇక్కడ ఇప్పటికీ కొందరు పబ్బులకు, బార్లకు వెళ్లడం మానలేదు. 'అందం' కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం ఆపలేదు.

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే కార్విన్ సిల్వా... పూర్తిస్థాయి ప్రసూతి వైద్యురాలిగా అర్హత సాధించడంతో తన సహచర ఉద్యోగులతో కలిసి పార్టీ చేసుకునేందుకు బారియట్ రెస్టారెంట్ బార్‌కు వచ్చారు.

"మేము ఇంత ఖరీదైన బార్‌కు రావడానికి కారణం భద్రతే. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. మాకు ఎలాంటి హానీ ఉండదు. కాసేపు అలా సరదాగా గడపొచ్చు అని వచ్చాం" అని కార్విన్ చెప్పారు.

కారకస్‌లోని ఖరీదైన బార్లలో బారియట్ ఒకటి. విలాసవంతమైన కార్లలో చాలామంది ఈ బార్‌కు వస్తుంటారు. గేటు ముందు చాలామంది చిన్నారులు భిక్షాటన చేస్తుంటారు.

లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరినీ సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ఆర్థిక సంక్షోభానికి ముందు ఈ బార్ జనాలతో కిక్కిరిసిపోయి ఉండేది. ఇప్పుడు చాలా ఖాళీగా కనిపిస్తోంది.

చిత్రం శీర్షిక 'కారకాస్‌లో ధనికులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు' అని స్థానికుడు ఒకరు చెప్పారు

ఒకప్పుడు సందర్శకులతో ఎంతో సందడిగా కనిపించిన జువాన్ సెబాస్టియన్ బార్, ఇప్పుడు వారాంతాల్లోనూ దాదాపు ఖాళీగా కనిపిస్తోంది. ఆశ్చరకరమైన విషయం ఏంటంటే... శనివారం రాత్రి సందర్శకుల కంటే ఇందులో పనిచేసే సిబ్బందే ఎక్కువ మంది ఉన్నారు.

ఇప్పుడు మళ్లీ బారియట్ బార్‌‌కు వెళ్దాం. ఇక్కడ డాక్టర్ కార్విన్ 3,00,000 బొలీవర్‌లు (రూ. 1,067.92) పెట్టి ఒక బాటిల్ రమ్ తీసుకున్నారు. ఆమె నెల జీతం కంటే ఆ మద్యం సీసా ధర చాలా ఎక్కువ.

ఆ రోజు రాత్రంతా బార్‌లో కార్విన్, తన సహచర ఉద్యోగులు సందడి చేశారు. నృత్యాలు చేశారు. క్యాట్‌వాక్ చేశారు. సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టారు. పార్టీలోనూ వెనెజ్వేలా జాతీయ జెండాను ఊపుతూ కేరింతలు కొట్టారు.

తెల్లవారుజామున మూడు గంటలకు పార్టీ ముగింపు దశకు చేరుకుంది.

Image copyright Getty Images

ఇప్పటికీ ధనవంతులు ఉన్నారు

"ఇంత తీవ్రమైన ఆక్థిక సంక్షోభంతో దేశం కొట్టుమిట్టాడుతుంటే, కొందరు ఇంత ఉల్లాసంగా ఎలా గడుపుతున్నారు? అని చాలామంది విదేశీయులు ఆశ్చర్యపోతుంటారు. కానీ, ఇక్కడ ముఖ్యంగా కారకస్‌లో ఇప్పటికీ దండిగా డబ్బున్న ధనవంతులు చాలామంది ఉన్నారు" అని ఆసుపత్రులకు వైద్య పరికరాలు సరఫరా చేసే వ్యాపారి ఎర్నెస్టో చెప్పారు.

అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా తమ వ్యాపారం బాగా దెబ్బతిన్నదని ఆయన తెలిపారు.

ట్రంప్ ఆంక్షలు విధించడంతో తమతో వ్యాపారం చేసేందుకు అమెరికాలోని వ్యాపారులు ముందుకు రావడంలేదన్నారు.

చిత్రం శీర్షిక తక్కువ ధరకు దొరికే కోకుయ్ అనే పానీయానికి ఇక్కడ గిరాకీ అధికంగా ఉంది

విలాసవంతమైన ప్రదేశాలతో పాటు, సామాన్య మధ్య తరగతి ప్రజలు వెళ్లగలిగే చిన్నచిన్న రెస్టారెంట్లు, బార్లు, పబ్బులు కూడా కారకస్‌లో చాలానే కనిపిస్తాయి.

లా టాస్క్విటా లాంటి రెస్టారెంట్లు, బార్లు, పబ్బుల్లో ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇక్కడికి చాలామందే వస్తున్నారు.

Image copyright Vanessa Silva.
చిత్రం శీర్షిక కరీబియన్ మ్యూజిక్‌కి చిందులేస్తున్న జంట

కోకుయ్ అనే పానీయానికి కారకస్‌ నగరంలో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ అధికంగా ఉండే ఆ పానీయాన్ని కలబంద నుంచి తయారు చేస్తారు.

ఒక బాటిల్ కోకుయ్ ధర 14,000 బోలివర్లు (70 రూపాయల కంటే తక్కువ) ఉంటుంది.

దేశంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ తమ వ్యాపారం బాగానే కొనసాగుతోందని లా టాస్క్విటా రెస్టారెంట్ యజమాని విల్సెన్ చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రజలు మద్యానికి ఖర్చు చేస్తూనే ఉన్నారని ఆయన అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)