మయన్మార్: రెండేళ్ల చిన్నారి మీద అత్యాచారం... కోర్టులో సాక్ష్యం చెప్పిన పసిపాప

  • 14 సెప్టెంబర్ 2019
మయన్మార్‌‌లో నిరసన ప్రదర్శన Image copyright AFP/Getty Images
చిత్రం శీర్షిక విక్టోరియాకు న్యాయం జరగాలని కోరుతూ మయన్మార్‌లో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి

ఆ చిన్నారి వయసు ఇప్పుడు కేవలం మూడేళ్లు. రెండేళ్ల వయసులో ఆ పాపపై అత్యాచారం జరిగిందని పోలీసులు చెబతున్నారు. తనపై దాడిచేసిన అనుమానుతుడి మీద కేసు విచారణలో ఆ చిన్నారి ఇప్పుడు సాక్ష్యం చెప్పింది.

ఆ పాపను 'విక్టోరియా' అనే మారు పేరుతో పిలుస్తున్నారు. ఈ చిన్నారి కోర్టు విచారణకు వీడియో లింక్ ద్వారా హాజరై దాదాపు రెండు గంటల పాటు మాట్లాడింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన న్యాయవాది మాత్రమే ఆ పాపతో పాటు ఉన్నారు.

మయన్మార్‌కు చెందిన ఈ చిన్నారి.. తనకు ఏం జరిగింది? ఎవరు తనపై దాడి చేసింది ఎవరు? అనేది వివరించింది. ఈ విచారణను వీక్షించటానికి పాత్రికేయులు, సాధారణ ప్రజలను కోర్టు రూములోకి అనుమతించలేదు.

ఇంత చిన్న వయసులో అత్యాచార బాధితురాలవటంతో పాటు.. ఈ వయసులోనే కోర్టులో సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితిని ఎదుర్కోవటం వంటి అనేక కారణాల వల్ల విక్టోరియా కేసు వివాదాస్పదంగా మారింది.

అయితే, అసమర్థ పోలీసు వ్యవస్థ అసలు నేరస్తుడిని కాకుండా వేరే వ్యక్తిని పట్టుకుని బోనులో పెట్టిందన్న అనుమానం కూడా జనంలో బలంగా ఉంది. దీంతో, ఈ కేసు విషయంలో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కోర్టులో సాక్ష్యం చెప్పిన విక్టోరియా.. తన మీద ఇద్దరు వ్యక్తులు దాడిచేశారని గుర్తులు చెప్పింది. ఆ ఇద్దరూ పోలీసుల అదుపులో లేరు.

పోలీసులు ఏమంటున్నారు?

అది మయన్మార్ రాజధాని నేపీదా నగరంలోని విస్డమ్ హిల్ ప్రైవేట్ ప్రీ-స్కూల్ నర్సరీ. ఈ ఏడాది మే 16వ తేదీ ఉదయం రెండేళ్ల బాలిక విక్టోరియా ఆ నర్సరీకి వెళ్లింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి రావటానికి ముందు ఆ బాలిక మీద అత్యాచారం జరిగిందని ఆమె కుటుంబం, పోలీసులు చెబుతున్నారు.

విక్టోరియా ఒంటి మీద గాయాలను తొలుత గమనించింది ఆమె తల్లి. వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలో ఆ పసిపాప అత్యాచారానికి గురైనట్లు గుర్తించారని పోలీసులు పేర్కొన్నారు.

ఆ చిన్నారికి చికిత్స చేస్తున్న కారణంగా తాము ఆమెతో తొలుతు మాట్లాడలేకపోయామన్నారు పోలీసులు. అయితే, ఆ తర్వాత పాపను పోలీసులు విచారించారని ఆమె తండ్రి చెప్పారు.

పోలీసులు వెంటనే నిందితుడిని పట్టుకున్నామని చెప్పారు.

మే 30వ తేదీన ఆంగ్ క్యావ్ మో అనే స్కూల్ డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ, సాక్ష్యం లేకపోవటంతో అతడిని వెంటనే విడిచిపెట్టారు.

మళ్లీ జూలై మూడో తేదీన అతడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే, అతడు నేరం చేశాడనే అంశం మీద ప్రజల్లో చాలా అనుమానాలున్నాయి. పోలీసు అధికారులు తమ పని పూర్తిచేశామని చెప్పుకోవటానికి అతడిని ఈ కేసులో ఇరికిస్తున్నారని చాలా మంది నమ్ముతున్నారు.

Image copyright Supplied
చిత్రం శీర్షిక సీసీటీవీ దృశ్యంలో నర్సరీ వెలుపల అనుమానితుడు

పోలీసులు బలిపశువును చేశారా?

ఇంటి దగ్గర తన తండ్రి చూపిన సీసీటీవీ దృశ్యాల్లో ఆంగ్ మోను విక్టోరియా గుర్తుపట్టింది. అతడి వైపు చూపిస్తూ తన మర్మాంగాలను 'గిచ్చింది' అతడేనని చెప్పింది.

అయితే, ఆ సీసీటీవీ దృశ్యాలు స్పష్టంగా లేవు. అందులో ఆంగ్ మో వీపు వైపు మాత్రమే కనిపిస్తోంది. అతడు టోపీ కూడా పెట్టుకుని ఉన్నాడు. ఈ ప్రాథమిక సాక్ష్యం ఆధారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి అభియోగం నమోదు చేశారు.

ఆ తర్వాత ఆంగ్ మో ఫొటోలను విక్టోరియాకు చూపించారు. అతడిని ఆమె గుర్తుపట్టలేదు.

కానీ, తన మీద దురాగతానికి పాల్పడ్డ వేరే ఇద్దరిని విక్టోరియా రెండు సార్లు గుర్తుపట్టి చెప్పింది. వారిద్దరూ మైనర్లే. ప్రజల్లోనూ వారిద్దరి మీదే అనుమానాలు బలంగా ఉన్నాయి.

మొదట విక్టోరియా తండ్రి తమ ఇంటి దగ్గర ఆమెకు మూడు ఫొటోలు చూపించాడు. అందులో ఆంగ్ మో ఫొటోతో పాటు ఆ ఇద్దరు మైనర్ల ఫొటోలు కూడా ఉన్నాయి. ఆంగ్ మోను ఆమె గుర్తుపట్టలేదు. కానీ ఇద్దరు మైనర్ల ఫొటోలు చూసిన వెంటనే ఆ చిన్నారికి చాలా కోపం వచ్చింది. వారిద్దరినీ గుర్తుపట్టి చెప్పింది.

విక్టోరియా ఆ ఇద్దరు ఫొటోలను గుర్తుపట్టటాన్ని ఆమె తండ్రి వీడియో చిత్రీకరించాడు. ఆ వీడియోను సాక్ష్యంగా కోర్టుకు అందించాడు.

ఫొటోలు చూసి గుర్తుపట్టిన చిన్నారి

మళ్లీ కోర్టు విచారణలో కూడా చిన్నారి విక్టోరియాకు కొన్ని ఫొటోలు చూపించారు. అందులో ఆ ఇద్దరు మైనర్ల ఫొటోలతో పాటు ఆంగ్ మో ఫొటో కూడా ఉంది.

ఈసారి న్యాయ నిపుణులు ఆ చిన్నారితో మాట్లాడారు. మళ్లీ ఆ ఇద్దరు మైనర్ బాలుర ఫొటోలనే ఈ చిన్నారి గుర్తుపట్టి తీసి ఇచ్చింది. తన మీద దాడిచేసింది వారేనని చెప్పింది. ఆంగ్ మోను గుర్తుపట్టిన సంకేతాలేవీ చిన్నారిలో కనిపించలేదు.

''చిన్నారికి ఫొటోలు చూపినపుడు, ఇద్దరు బాలురలో చిన్న 'కో కో' తన ఛాతీ మీద కొట్టాడని.. పెద్ద 'కో కో' తన మర్మాంగాన్ని గిచ్చాడని గుర్తుపట్టి కోర్టుకు చెప్పింది'' అని ఆమె కుటుంబం తరఫు న్యాయవాది యెట్ ను ఆంగ్ వెల్లడించారు. మయన్మార్‌లో మగ పిల్లలను 'కో కో' అని వ్యవహిస్తారు.

''పాప ముందు ఆరు ఫొటోలు ఉంచారు. ఆంగ్ మో ఫొటో చూపినపుడు అతడు తనకు తెలియదని చెప్పింది. అంతేకాదు, తన టీచర్ నిన్ నూ (ఆ దాడి జరిగిన తర్వాత) తనను కడిగిందని కూడా చిన్నారి వెల్లడించింది'' అని ఆంగ్ మో తరఫు న్యాయవాది కిన్ మిగ్ జా చెప్పారు.

చిత్రం శీర్షిక చిన్నారిపై దురాగతం నర్సరీలో జరగలేదని నిన్ నూ ఇతర టీచర్లు భావిస్తున్నారు

నర్సరీలో నేరం జరగలేదా?

స్కూల్ ఆవరణలో ఎటువంటి లైంగిక దాడీ జరగలేదని ఆ స్కూల్ నిర్వాహకురాలు తొలుత చెప్పుకొచ్చారు. నర్సరీలోని ఇతర టీచర్లు కూడా ఆమె చెప్పినదానిని సమర్థించారు.

కోర్టులో ప్రస్తావనకు వచ్చిన టీచర్ నిన్ నూ, పోలీసులు తనను తొమ్మిది సార్లు ప్రశ్నించారని బీబీసీతో చెప్పారు. ఆంగ్ మో ఈ నేరం చేసి ఉండే అవకాశమే లేదని ఆమె గట్టిగా వాదించారు.

''అతడు ఆ దురాగతం చేయటం అసాధ్యం. మేం టీచర్లందరం ఎప్పుడూ విద్యార్థులతో పాటే ఉన్నాం. ఆ దాడి జరగటం అసాధ్యం'' అని ఆమె పేర్కొన్నారు.

ఆ రోజు విక్టోరియా తన దృష్టిని దాటి ఎక్కడికీ వెళ్లలేదని మరొక టీచర్ నిలార్ యే చెప్పారు.

అమాయక సాక్ష్యమా?

ఆంగ్ మోను ఈ కేసులో ఇరికించారని మయన్మార్‌లో సాధారణ జనం నమ్ముతున్నారు.

ఇందుకు, అతడికి వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించిన అదే సీసీటీవీ దృశ్యాలను జనం ఆధారంగా చూపుతున్నారు. బీబీసీ న్యూస్ ఆ దృశ్యాలను సేకరించింది. దాడి జరిగిన రోజు ఆంగ్ మో నర్సరీలోకి వెళ్లటం అందులో కనిపించింది. అతడు రిసెప్షన్ ప్రాంతంలో వేచివున్నట్లు తెలుస్తోంది.

అతడు లోపలికి వెళ్లి విక్టోరియాను తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేయటానికి తగినంత సమయం లేదని ఆ వీడియో ద్వారానే కనిపిస్తోందని జనం వాదిస్తున్నారు.

జూలై ఆరో తేదీన దాదాపు 6,000 మంది తెల్లటి దుస్తులు ధరించి 'న్యాయం కావాలి' అని రాసిన బ్యానర్లు ధరించి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) యాంగాన్ ప్రధాన కార్యాలయం దగ్గరకు ప్రదర్శన నిర్వహించారు. ఇప్పుడు ఈ కేసు విచారణను సీఐడీ చేపట్టింది.

Image copyright AFP/Getty Images
చిత్రం శీర్షిక విక్టోరియాకు న్యాయం జరగాలని కోరుతూ మయన్మార్‌లోని చాలా ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు

తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు?

చిన్నారి విక్టోరియా తండ్రి ఆందోళనగా ఉన్నారు. పోలీసులను ఆయన నేరుగా విమర్శించలేదు. ఇతర సీసీటీవీ దృశ్యాలు పోయాయని, దర్యాప్తు 'పనిచేయటం లేద'ని ఆయన బీబీసీకి చెప్పారు.

గత రెండు నెలల కాలం తమ కుటుంబానికి ఓ పీడకలగా మారిందన్నాడు. ఈ పీడకల త్వరగా ముగిసిపోవాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు.

''నిజం ఏమిటో తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎంత కాలమైనా నేను వదిలిపెట్టను. ఒక అమాయక పసిపాప మీద జరిగిన నేరం ఇది'' అని పేర్కొన్నారు.

''ఈ ఉదంతంలో నా పాప మీద దాడి జరిగింది. కానీ ఆమె ఇంకా బతికే ఉంది. ఆమె మాట్లాడగలదు. నా కూతురు మాటలను సీరియస్‌గా పట్టించుకుని చర్యలు చేపడతారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

విక్టోరియాకు న్యాయం జరగాలి

చిన్నారి విక్టోరియాకు మద్దతుగా సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. ఈ అత్యాచారం ఆరోపణల గురించి తెలుసుకున్న కొందరు ఫేస్‌బుక్ యూజర్లు న్యాయం జరగాలని డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. ఈ కేసు మీద ప్రజలు దృష్టి సారించటం పెరిగింది.

రెండు వారాల తర్వాత ఆరోగ్య, క్రీడా మంత్రిత్వశాఖకు చెందిన విన్ కో కో తీన్ అనే అధికారి 'జస్టిస్ ఫర్ విక్టోరియా' ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ కేసులో అసంబద్ధంగా ఉన్నట్లు కనిపించే అంశాలను క్రోడీకరించారు.

అతడిని అరెస్ట్ చేసి పరువునష్టం అభియోగాలు మోపారు. అయినాకానీ అతడి మాటలు ప్రజల్లో ప్రతిధ్వనించాయి. చాలా మంది ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు. ఫేస్‌బుక్ యూజర్లు వేలాది మంది ఈ ఉద్యమ చిహ్నాన్ని తమ ప్రొఫైల్ ఫోటోగా పెట్టారు. ఉద్యమానికి మద్దతుగా కార్ల అద్దాల మీద కూడా స్టిక్కర్లు అంటించటం మొదలైంది.

Image copyright AFP/Getty Images
చిత్రం శీర్షిక విక్టోరియా ఉదంతం మయన్మార్‌‌లో లైంగిక దాడుల తీవ్రతను పట్టిచూపింది

ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ బీబీసీ బర్మీస్ ఫేస్‌బుక్ అకౌంట్‌కి కూడా చాలా మెసేజ్‌లు వచ్చాయి.

'నా చిన్నారి పాపా ధైర్యంగా ఉండు. వి లవ్ యు'

'చిన్నారిని చూస్తే బాధగా ఉంది. ఇంత చిన్న వయసులో కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. అది ఆ పాప వెళ్లాల్సిన స్థలం కాదు.'

'ఆ చిన్నారి అంతా చెప్పింది. పోలీసులు ఏం చేస్తున్నారు? న్యాయం ఎక్కడ?' అంటూ ఎన్నో సందేశాలు వచ్చాయి.

విస్తృతంగా లైంగిక దాడులు

దేశంలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. చిన్నారి విక్టోరియాకు న్యాయం జరగాలని మాత్రమే కాదు.. ఆందోళనకరంగా పెరిగిపోతున్న లైంగిక దాడులు - ప్రత్యేకించి చిన్నారుల మీద పెరుగుతున్న అత్యాచారాల మీద విస్తృత చర్యలు చేపట్టాలని ఆ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

మయన్మార్‌లో నమోదైన అత్యాచారం కేసులు గత రెండేళ్లలో 50 శాతం పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. 2018లో 1,528 అత్యాచారం కేసులు నమోదయ్యాయి.

దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. దాదాపు మూడింట రెండు వంతుల కేసుల్లో బాధితులు చిన్నారులే.

ఈ కేసుల నమోదు పెరగటం వెనుక.. ఈ దాడుల గురించి బయటకు మాట్లాడే ధైర్యం పెరగటం కారణమా అని కొన్ని స్వచ్ఛంద సంస్థలు విశ్లేషిస్తున్నాయి. అయితే.. గృహ హింసను ఇంకా వ్యక్తిగత విషయంగా పరిగణించే మయన్మార్‌లో అత్యంత తీవ్రమైన లైంగిక దాడుల పోకడను చిన్నారి విక్టోరియా ఉదంతం బట్టబయలు చేసిందని చాలా మంది ఉద్యమకారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)