ఐఫోన్ 11 కెమెరాలను చూస్తే భయమేస్తోందా... అయితే మీకు ట్రైపోఫోబియా ఉన్నట్లే

  • 14 సెప్టెంబర్ 2019
కొత్త ఐఫోన్ కెమెరాలు Image copyright Apple
చిత్రం శీర్షిక రేఖాగణిత ఆకృతులు, లేదా కూర్పులు - ప్రత్యేకించి రంధ్రాలు, చాలా చిన్న చతురస్రాల ఆకృతులు చూస్తే మీకు భయం కలుగుతుందా?

హెచ్చరిక: ఈ కథనంలో రేఖాగణిత ఆకృతులు, రంధ్రాల కూర్పుల చిత్రాలు ఉన్నాయి. ఇవి ట్రైపోఫోబియా రుగ్మత ఉన్నవాళ్లకి ఆ రుగ్మత లక్షణాలను ప్రేరేపించవచ్చు.

యాపిల్ కంపెనీ తన ఉత్పత్తులను చాలా అందంగా డిజైన్ చేస్తుందని పేరు. కొత్త ఐఫోన్ 11 అలాంటి మరో సొగసైన ఆధునికమైన మోడల్. కానీ ఈ ఫోన్ వెనుక ఉన్న మూడు గుండ్రని కెమెరాలను కొందరు తట్టుకోలేరు.

ఇలా తట్టుకోలేకపోవటం వెనుక ట్రైపోఫోబియా అనే అరుదైన రుగ్మత ఉంది.

ట్రైపోఫోబియా అంటే.. రేఖాగణిత ఆకృతులు, కూర్పులు - ప్రత్యేకించి రంధ్రాలు, చాలా చిన్న చతురస్రాల ఆకృతులు, కూర్పులను చూసినపుడు కలిగే భయం, వికర్షణ.

యాపిల్ సంస్థ సెప్టెంబర్ 10న కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించటంతో ఈ రుగ్మత ఇప్పుడు పతాక శీర్షికలకు ఎక్కింది.

ట్రైపోఫోబియాతో పుట్టే భయానికి మంచి ఉదాహరణ.. తామర పువ్వులోని విత్తనాల అమరిక చిత్రంతో పుట్టే భయం.

తేనె తుట్టె లేదా సముద్ర పాచి (సీ స్పాంజ్)లో రూపొందే రేఖాగణిత నిర్మాణం కూడా ఇలాంటి భయాన్నే రేకెత్తిస్తుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తామర పువ్వులోని ఈ రంధ్రాలను చూసినపుడు కొంతమందిలో ఆందోళన చెలరేగుతుంది.. ఎందుకనేది అర్థంచేసుకోవటానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు

ఇలాంటి రూపాలు, ఆకృతుల పట్ల కొందరిలో కలిగే విముఖతకు కారణం.. ఒక ఆత్మరక్షణ ప్రతిక్రియ కావచ్చునని యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్‌కు చెందిన ఇద్దరు పరిశోధకులు ప్రొఫెసర్ అర్నాల్డ్ విల్కిన్స్, డాక్టర్ జెఫ్ కోల్ భావిస్తారు.

ఎందుకంటే.. కొన్ని రకాల సాలీళ్లు, పాములు, తేళ్లు వంటి చాలా ప్రాణాంతక జంతువులకు ఇలాంటి చిహ్నాలు ఉంటాయి కాబట్టి ఈ తరహా ఆకృతుల పట్ల విముఖత పరిణామక్రమంలో ఇమిడిపోయిన ఆత్మరక్షణ ప్రక్రియ అని.. అది కొంతమందిలో కొనసాగుతూ వస్తోందని వారు వివరిస్తున్నారు.

అయితే.. ఈ రుగ్మతను వైద్యపరమైన పరీక్షలతో గుర్తించలేరు. అయినా దీనిని పునరావృత ఆకృతులను చూస్తే కలిగే భీతి (రిపిటిటివ్ పాటర్న్ ఫోబియా) గా గుర్తిస్తుంటారు.

కొత్త ఐఫోన్ మోడళ్ల వెనుక ఉన్న మూడు గుండ్రని కెమెరాల ఆకృతి సరిగ్గే ఇదే.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కొత్త ఐఫోన్‌లోని అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వల్ల.. ఫొటో తీసిన తర్వాత దానిని రీఫ్రేమ్ చేసుకునే అవకాశం ఉంటుంది

నిజానికి.. ఆపిల్ ఆవిష్కరించిన ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌లో ఉన్న అతి పెద్ద వినూత్న ఫీచర్లలో ఈ కెమెరాలు ఒకటి. ఇవి ఒకే సమయంలో బహుళ వీడియోలను రికార్డు చేయగలవు.

ప్రో మోడళ్లలో టెలీఫొటో, వైడ్, అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. అతి తక్కువ వెలుగులో సైతం ఫొటోలు తీయటానికి వీలుకల్పించే నైట్ మోడ్ కూడా ఉంది.

కానీ.. ట్రైపోఫోబియా ఉన్న వాళ్లకి ఇవి ఒక పీడకల లాంటివే. ఎందుకంటే వీటిని చూసినపుడు వారి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కొన్నిసార్లు వాంతులు వచ్చినట్లు, తల తిరిగినట్లు అనిపిస్తుంది. కొందరికి ఒళ్లు గగుర్పొడుస్తుంది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ట్రైపోఫోబియా ఉన్నవారికి తేనెతుట్టె నిర్మాణంలోని ఆకృతి కూడా భయం కలిగిస్తుంది

కాబట్టి.. కొంతమంది ఈ కారణంతో కొత్త మోడల్ ఐఫోన్‌ను కొనకుండా ఉండిపోవచ్చు.

ఇంకొంతమంది.. కొత్త ఐఫోన్ వెనుకవైపు చూసినపుడు తమకు ఏమనిపించిందో చెప్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.

ఐఫోన్ ప్రో ఫొటోలను చూసిన ఒక మహిళ.. ''దీని నిండా కెమెరాలే'' అని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

ట్రైపోఫోబియా రుగ్మత ఉన్నవాళ్లు.. పాత ఐఫోన్ మోడళ్ల వల్ల తమకు భయం కలగలేదని చెప్పారు. అలాంటి వారిలో న్యూయార్క్‌కు చెందిన ఒక విద్యార్థి ఉన్నారు. సదరు విద్యార్థి తనకు ట్రైపోఫోబియా ఉన్న విషయాన్ని స్వయంగా నిర్ధారిస్తూ 2009లోనే ఒక ఫేస్‌బుక్ పేజీలో రాశారు.

ఐఫోన్ 8, ఎక్స్ఆర్ మోడల్ ఫోన్ల వెనుక ఒకే కెమెరా ఉంది. అది ఎలాంటి విచిత్ర ఆకృతిలో లేదు.

అయితే.. ఐఫోన్ 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ వెర్షన్లు మూడు కెమెరాలతో రావటంతో.. వాటి ఆకృతి ట్రైపోఫోబియా ఉన్న వాళ్లని కలవరపరుస్తోంది.

యాపిల్ కంపెనీ డిజైనర్లు తమ ప్రఖ్యాత ఉత్పత్తిలో ఇలా మూడు కెమెరాలను చేర్చేటపుడు.. అరుదైన ఈ రుగ్మత గురించి ఆలోచించలేదన్నది స్పష్టమవుతోంది.

ఆ రుగ్మత ఉన్నవాళ్లలో చిన్న రంధ్రాలను చూసినపుడు కలిగే ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉండొచ్చు.

ముఖ్యంగా కొత్త మోడళ్లు ఎన్ని రంగుల్లో వస్తున్నాయో ప్రదర్శించటం కోసం కొన్ని ఫోన్లను కలిపి తీసిన ఫొటోల్లో ఆ ఆకృతులు మరింత ఎక్కువగా ఇలాంటి వారికి భయం కలిగిస్తాయి.

''మనందరికి ఎక్కువగానో తక్కువగానో ట్రైపోఫోబియా ఉంటుంది. మనకు ఆ ఫోబియా ఏ స్థాయిలో ఉందనే దానిని బట్టి ప్రతిస్పందిస్తుంటాం'' అని డాక్టర్ కోల్ బీబీసీతో పేర్కొన్నారు.

ఐఫోన్ 11 ఆవిష్కరణతో.. ట్రైపోఫోబియా అనే పదం ట్విటర్‌లో ట్రెండయింది. దానితో పాటు ఆ రుగ్మతను ప్రేరేపించే ఫొటోలు కూడా విస్తృతంగా పోస్టయ్యాయి.

తమకు ట్రైపోఫోబియా ఉందని చెప్తున్న వాళ్లలో అమెరికన్ హారర్ స్టోరీ సిరీస్ నటి సారా పాల్సన్, మోడల్ కెండాల్ జెనర్‌లు కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బోరిస్ జాన్సన్: మళ్లీ ప్రధానిగా కన్జర్వేటివ్ నేత.. బ్రిటన్ ఎన్నికల్లో టోరీల ఘన విజయం

గొల్లపూడి మారుతీరావు (1939-2019): "ఒక్క జీవితంలోనే పది జీవితాలు చూసిన మనిషి"

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

పార్లమెంటుపై దాడికి 18ఏళ్లు: బులెట్లు దూసుకొస్తున్నా, ప్రాణాలకు తెగించి గేటు నంబర్ 1 మూసేశాడు

ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు

'విజయవాడ, విశాఖపట్నం మెట్రోలపై ఏపీ ప్రభుత్వ అనాసక్తి'

అస్సాంలో ఆందోళనలు: పౌరసత్వ సవరణ బిల్లుపై పెరిగిన నిరసనలు... ఇద్దరు మృతి