అమెరికా గూఢచర్యం: ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పావురాలు సీక్రెట్ ఏజెంట్స్‌గా ఎలా పని చేశాయి... గుట్టు విప్పిన సిఐఏ

  • 14 సెప్టెంబర్ 2019
పావురం Image copyright Getty Images

సోవియట్ యూనియన్‌తో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పావురాలతో తాము సాగించిన గూఢచర్యం వివరాలను అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) తాజాగా బహిర్గతపరిచింది.

రహస్య ఆపరేషన్లలో భాగంగా సోవియట్ యూనియన్లోని కీలక లక్ష్యాలను ఫొటో తీసేందుకు పావురాలకు అమెరికా శిక్షణ అందించడం, తరలించడం గురించి సీఐఏ విడుదల చేసిన దస్త్రాల్లో ఉంది.

కిటికీ వద్ద బగ్గింగ్ డివైస్‌లను వదలి వచ్చేలా ఒక రకం కాకులకు, నీటి లోపల మిషన్ల కోసం డాల్ఫిన్లకు శిక్షణ అందించిన విధానాన్ని ఇవి వెల్లడిస్తున్నాయి.

తమ ఆపరేషన్ల నిర్వహణలో కొన్ని ప్రత్యేకమైన పనులను పక్షులు, జంతువులే చేయగలవని సీఐఏ అప్పట్లో భావించింది.

Image copyright Getty Images

వర్జీనియా రాష్ట్రం లాంగ్లేలోని సీఐఏ ప్రధాన కార్యాలయంలో ప్రజలను అనుమతించని ఒక మ్యూజియం ఉంది. ఒకప్పటి సీఐఏ డైరెక్టర్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు కార్యాలయానికి వెళ్లినప్పుడు బగ్గింగ్ డివైస్‌లు, గూఢచర్య పరికరాల మధ్య నాకు ఒక అసాధారణ వస్తువు కనిపించింది.

కెమెరా కట్టి ఉన్న ఒక పావురం నమూనా అది.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ గూఢచర్య పావురాల గురించి అప్పట్లో నేనో పుస్తకం రాస్తున్నాను. దీంతో మ్యూజియంలో ఈ వస్తువును చూశాక నాకు మరింత ఆసక్తి కలిగింది. సీఐఏ గూఢచర్య పావురాల మిషన్ల వివరాలు రహస్యంగా ఉంచుతున్నామని అక్కడి సిబ్బంది పదే పదే చెప్పారు. ఆ వివరాలే ఇప్పుడు వెల్లడయ్యాయి.

1970ల్లో 'టకానా' అనే సంకేతనామంతో సీఐఏ చేపట్టిన ఆపరేషన్లో- చిన్నపాటి కెమెరాలు అమర్చిన పావురాలతో ఆటోమేటికగ్గా ఫొటోలు తీయడంపై పరిశోధన చేశారు.

పావురాలను వందల కిలోమీటర్ల దూరంలో కొత్త ప్రదేశంలో వదిలేసినా అవి ఎక్కడి నుంచి వెళ్లాయో తిరిగి అక్కడికి చేరుకోగలవు. ఇది పావురాలకు ఉండే అద్భుత శక్తి. ఈ శక్తిని సీఐఏ తన అవసరాలకు తగినట్లు వాడుకుంది.

పావురాలను సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి వాడుకోవడం వేల సంవత్సరాల క్రితమే ఉంది. అయితే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే నిఘా సమాచార సేకరణకు పావురాలను వాడటం మొదలయ్యింది.

మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ నిఘా వ్యవస్థలో బయటకు పెద్దగా తెలియని విభాగం ఎంఐ14(డీ). ఈ విభాగంలోని 'సీక్రెట్ పిజన్ సర్వీస్' అప్పట్లో పావురాలను కంటైనర్‌లో పెట్టి, ప్యారాచూట్ సాయంతో జర్మనీ ఆక్రమిత యూరప్‌లో వదిలేది. పావురాలతోపాటే ఒక ప్రశ్నావళిని పంపేది. ఇలా పంపిన పావురాల్లో వెయ్యికి పైగా పావురాలు వివిధ సందేశాలను మోసుకొచ్చేవి. వీ1 రాకెట్ లాంచ్ ప్రదేశాలు, జర్మనీ రాడార్ కేంద్రాల వివరాలు కూడా ఇందులో ఉండేవి.

'లియోపాల్డ్ విండిక్టివ్' అనే సంకేతనామమున్న గ్రూప్ నుంచి పావురం తెచ్చిన ఒక సందేశంలో ఏకంగా 12 పేజీల ఇంటెలిజెన్స్ నివేదిక ఉంది. ఇది నేరుగా నాటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌కు చేరింది.

Image copyright PEN AND SWORD BOOKS

లేజర్ బీమ్‌తో లక్ష్య నిర్దేశం

యుద్ధం ముగిశాక, బ్రిటన్ జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీకి చెందిన 'పిజన్ సబ్-కమిటీ' ప్రచ్ఛన్న యుద్ధానికి ఉన్న మార్గాలను పరిశీలించింది. అయితే పావురాలతో గూఢచర్య కార్యకలాపాలను బ్రిటన్ దాదాపు నిలిపివేయగా, సీఐఏ ఈ పక్షుల శక్తిని మరింతగా వాడుకోవడం మొదలుపెట్టింది.

బయటి వ్యక్తులు వెళ్లడం సాధ్యంకాని భవనాల కిటికీల వద్ద 40 గ్రాముల వరకు బరువుండే వస్తువులను పెట్టేలా, అక్కడి నుంచి వస్తువులను తీసుకొచ్చేలా ఒక కాకికి సీఐఏ శిక్షణ ఇచ్చినట్లు ఈ పత్రాల్లో ఉంది.

నిర్దేశిత ప్రదేశాన్ని కాకి సులభంగా గుర్తించేందుకు వీలుగా సీఐఏ సిబ్బంది ఎరుపు రంగులో లేజర్ బీమ్ వేసేవారు. అది తిరిగి వచ్చేందుకు ఒక దీపాన్ని చూపించేవారు.

ఐరోపాలో సీఐఏ సిబ్బంది ఓ సందర్భంలో మాటలను, శబ్దాలను రహస్యంగా రికార్డు చేసేందుకు ఉద్దేశించిన పరికరాన్ని పక్షి సాయంతో ఒక భవనం కిటికీ వద్దకు చేర్చారు. అయితే వారు అనుకున్న వ్యక్తి లేదా వ్యక్తుల మాటలేవీ అందులో రికార్డు కాలేదు.

సోవియట్ యూనియన్ రసాయన ఆయుధాలను పరీక్షించిందా, లేదా అన్నది గుర్తించే సెన్సర్లను నిర్ణీత ప్రదేశానికి పంపేందుకు వలస పక్షులను వాడుకొనే అవకాశాలను సీఐఏ పరిశీలించింది.

Image copyright SENSORSPOT

కుక్కల కదలికల నియంత్రణ

తమ అవసరాలకు తగినట్లుగా కుక్కల కదలికలను దూరం నుంచి నియంత్రించేలా 'ఎలక్ట్రిక్ బ్రెయిన్ స్టిమ్యులేషన్' చేయడంపైనా సీఐఏ ప్రయోగాలు చేసినట్లు కనిపిస్తోంది. ఈ వివరాలను ఇంకా బహిర్గతపరచలేదు.

గతంలో 'అకౌస్టిక్ కిట్టీ' అనే ఓ ఆపరేషన్లో- సీఐఏ ఇతరుల మాటలు, శబ్దాలను రహస్యంగా వినేందుకు ఉపకరించే పరికరాలను ఒక పిల్లిలో పెట్టింది.

డాల్ఫిన్లతో దాడులకు యత్నం

శత్రువులు లక్ష్యంగా హార్బర్లలో డాల్ఫిన్లను వాడటంపై 1960ల్లో సీఐఏ పరిశీలన జరిపినట్లు తాజా దస్త్రాలు వెల్లడిస్తున్నాయి. అప్పుడు డాల్ఫిన్‌పై నియంత్రణను దీనికి శిక్షణ ఇచ్చిన ట్రైనర్ నుంచి సీఐఏ ఫీల్డ్ ఏజెంట్‌కు అప్పగించడంలో సమస్య తలెత్తింది.

Image copyright Getty Images

శత్రువుల నౌకలు లక్ష్యంగా జలాంతర దాడులకు బాటిల్‌నోస్ డాల్ఫిన్లను వాడేందుకు కీ వెస్ట్ ప్రాంతంలో సీఐఏ ప్రయత్నించింది.

సోవియట్ అణు జలాంతర్గాముల శబ్దాలను పసిగట్టే సెన్సర్లను డాల్ఫిన్లు తీసుకెళ్లగలవా, లేదా; దగ్గర్లోని ప్రదేశాల్లో ఉండే రేడియోధార్మిక, జీవ ఆయుధాల ఆనవాళ్లను గుర్తించగలవా, లేదా అన్నది తెలుసుకొనేందుకు కూడా సీఐఏ పరీక్షలు నిర్వహించింది.

ప్రయాణిస్తున్న నౌకలపై తాము ఇచ్చిన ప్యాకేజీలు పెట్టి, వాటిని వెనక్కు తీసుకురాగలవేమో నిర్ధరించుకొనేందుకు కూడా సీఐఏ నిపుణులు ప్రయత్నించారు.

Image copyright instagram/cia

పావురాలు గూఢచర్యంలో అత్యంత ప్రభావశీలంగా ఉన్నాయని రుజువైన తర్వాత, 1970ల మధ్య నాటికి సీఐఏ ప్రయోగాత్మకంగా వీటిని వరుసగా వాడటం మొదలుపెట్టింది. జైలుపై ఒక మిషన్, వాషింగ్టన్ డీసీలోని నేవీ యార్డ్స్‌పై మరో మిషన్ చేపట్టింది.

అప్పట్లో పావురానికి అమర్చిన కెమెరా బరువు 35 గ్రాములే. ఖరీదు రెండు వేల డాలర్లు. ఫిల్మ్ రోల్‌పై ఉన్న 140 చిత్రాల్లో దాదాపు సగం మంచి నాణ్యతతో ఉన్నాయని పరీక్షల్లో గుర్తించారు. నేవీ యార్డ్‌లో నడుస్తున్న మనుషులతోపాటు, నిలిపి ఉంచిన వాహనాలు స్పష్టంగా కనిపించాయి.

ఉపగ్రహ చిత్రాల కన్నా నాణ్యమైన ఫొటోలు

నాటి నిఘా ఉపగ్రహాలు అందిస్తున్న ఫొటోల కన్నా పావురాల కెమెరాలు తీసిన ఫొటోలు ఎక్కువ నాణ్యంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

శిక్షణ ఇచ్చిన పావురాలను సోవియట్ యూనియన్లో ముఖ్యమైన నిఘా లక్ష్యాలపై వాడటమే తమ మిషన్ల ఉద్దేశమని సీఐఏ పత్రాల్లో ఉంది.

నిఘా పావురాల సేవలను ఉపయోగించుకొనేందుకు వాటిని రహస్యంగా మాస్కోకు చేర్చడం సీఐఏ ప్రణాళికలో భాగం.

వదలడం ఎలా?

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా- కారు గంటకు 80 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్తున్నప్పుడు కిటికిలోంచి వదిలిపెట్టడం, కారు నిలిపి ఉంచినప్పుడు దాని దిగువ భాగంలో రంధ్రంలోంచి పావురాన్ని కిందకు జారవిడవటం, నిర్దేశిత లక్ష్యానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో పావురాన్ని వదిలేస్తే అది లక్ష్యం మీదుగా ఎగిరి శిక్షణ ఇచ్చిన ప్రదేశానికి తిరిగి వచ్చేలా చూడటం లాంటి ప్రయత్నాలు చేశారు.

లెనిన్‌గ్రాడ్‌లో అత్యంత అధునాతన జలాంతర్గాములను నిర్మించిన షిప్‌యార్డులను నిఘా పావురాల మోహరింపునకు లక్ష్యంగా ఎంచుకున్నట్లు 1976 సెప్టెంబరు నాటి ఒక మెమోను బట్టి తెలుస్తోంది. పావురాల గూఢచర్య ఆపరేషన్ సాగించడం సాధ్యమేననే నిర్ణయానికి సీఐఏ ఈ దశలోనే వచ్చింది.

ఆ తర్వాత ఏమైంది? పావురాలతో అసలు మిషన్లు ఎన్ని చేపట్టారు? ఏ నిఘా సమాచారాన్ని సేకరించారు? ఈ వివరాలన్నీ ఇప్పటికీ రహస్యమే. ఇప్పుడు బహిర్గతపరచిన దస్త్రాల్లో సీఐఏ వీటిని వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)