బంగారు చెవిదుద్దును కోడిపుంజు మింగేసింది.. కోసి బయటకు తీశారు

  • 14 సెప్టెంబర్ 2019
కోడిపుంజు Image copyright Ethiopian Press Agency/APA
చిత్రం శీర్షిక కోడిపుంజు

బంగారాన్ని తినే ఓ కోడిపుంజు హంగామా సృష్టించింది.

ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో హచాల్తు బెదిరీ అనే మహిళా వ్యాపారి తమ కోళ్లను అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్లారు.

రద్దీగా ఉన్న ఈ మార్కెట్లో ఇంకో వ్యాపారికి చెందిన కోడిపుంజు యజమాని నుంచి తప్పించుకొంది. అది హచాల్తు బంగారు చెవిదుద్దును లాక్కొని మింగేసింది.

కోడిపుంజు చేసిన పనితో ఈ ఇద్దరు వ్యాపారుల మధ్య గొడవ మొదలైంది.

చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వ్యాపారులిద్దరికీ సర్దిచెప్పి వారు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

తన బంగారు ఆభరణాన్ని మింగేసిన కోడిపుంజును దాని యజమాని నుంచి 150 ఇథియోపియన్ బిర్లకు (భారత కరెన్సీ ప్రకారం 363 రూపాయలు) కొనుక్కొనేందుకు ఆ మహిళా వ్యాపారి అంగీకరించారు.

Image copyright Ethiopian Press Agency/APA

తన కోడిపుంజు విపరీత ప్రవర్తన కారణంగా, మార్కెట్ ధరైన 250 బిర్ల కన్నా తక్కువకే దానిని అమ్మేందుకు యజమాని ఒప్పుకొన్నారు.

కోడిపుంజును కోసి హచాల్తు తన చెవిదుద్దును తీసుకున్నారు.

ఒరోమియా రాష్ట్రం వోలిసో పట్టణంలో ఈ నెల 10న ఈ ఘటన జరిగింది. ఈ నెల 12 గురువారం ఇథియోపియా కొత్త సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో నాడు మార్కెట్ రద్దీగా ఉంది.

మార్కెట్లో కోడిపుంజు అతి ఉత్సాహంతో తిరిగిందని, తమ కస్టడీలో ఉన్నప్పుడు పసిడి రంగు వస్తువుల కోసం వెతుకులాడిందని పోలీసు అధికారి టెడిస్సీ బెడాడా బీబీసీతో చెప్పారు.

ఇథియోపియా క్యాలండర్ గ్రెగోరియన్ క్యాలండర్ కన్నా దాదాపు ఏడేళ్లు వెనక ఉంటుంది. దీని ప్రకారం ఇది 2012వ సంవత్సరం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు