క్యాన్సర్ చికిత్స పేరుతో యూట్యూబ్ నకిలీ వీడియోలతో సొమ్ము చేసుకుంటోందా?

  • 18 సెప్టెంబర్ 2019
యూట్యూబ్ Image copyright Reuters

నకిలీ క్యాన్సర్ వీడియోలను యూట్యూబ్ వెబ్‌సైట్ ఆల్గోరిథమ్ అనేక భాషల్లో ప్రొమోట్ చేస్తున్నట్లు బీబీసీ పరిశోధనలో వెల్లడైంది.

యూట్యూబ్ ఆల్గోరిథమ్.. నకిలీ క్యాన్సర్ వీడియోలను అనేక భాషల్లో ప్రొమోట్ చేస్తోంది. తప్పుదారి పట్టించే ఈ వీడియోలతో పాటు పెద్ద పెద్ద బ్రాండ్లు, యూనివర్సిటీల అడ్వర్టైజ్‌మెంట్లను కూడా చూపిస్తోంది. ఈ విషయం బీబీసీ చేపట్టిన ఒక పరిశోధనలో వెల్లడైంది.

బీబీసీ పది భాషల్లో యూట్యూబ్‌లో సెర్చ్ చేసింది. ఆరోగ్యానికి సంబంధించినవనే పేరుతో తప్పుడు సమాచారం చెప్పే 80 వీడియోలు ఉన్నాయి. అందులోనూ ఎక్కువగా క్యాన్సర్‌కు చికిత్స పేరుతో నకిలీ వీడియోలే ఉన్నాయి.

వీటిలో పది వీడియోలకు పది లక్షల కన్నా ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. చాలా వాటిలో వాణిజ్య ప్రకటనలూ ఉన్నాయి.

నిరూపితం కాని ఈ ''నయం చేసే చికిత్స''లు తరచుగా పసుపు, వంట సోడా వంటి పదార్థాలను తినాలని చెప్తుంటాయి. రసాలు ఆహారంగా తీసుకోవాలని, అధికంగా ఉపవాసం చేయాలని కూడా సూచిస్తుంటాయి. కొందరు యూట్యూబర్లు గాడిద పాలు లేదా వేడి నీళ్లు తాగాలని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్న చికిత్సలేవీ క్యాన్సర్‌ను నయం చేస్తాయని వైద్యపరంగా నిరూపణ కాలేదు.

ఈ నకిలీ క్యాన్సర్ చికిత్స వీడియోలు ప్లే కావటానికి ముందు శాంసంగ్, హెనీజ్, క్లినిక్ వంటి ప్రముఖ బ్రాండ్ల వాణిజ్య ప్రకటనలు వస్తున్నాయి.

యూట్యూబ్ వాణిజ్యప్రకటనల వ్యవస్థను బట్టి.. గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్‌తో పాటు, ఈ వీడియోను తయారు చేస్తున్న వారు కూడా.. తప్పుదోవ పట్టించే ఈ వీడియోలతో సొమ్ము చేసుకుంటున్నారు.

Image copyright YouTube
చిత్రం శీర్షిక ఖ్వాలా ఐసాన్ అరబిక్ భాషలో పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోలో.. గాడిద పాలతో క్యాన్సర్ కణాలను నియంత్రించవచ్చని చెప్పారు

ఇంగ్లిష్‌లో ఆపేశారు కానీ...

''ఏదైనా తీవ్రమైన జబ్బుకు అద్భుత చికిత్స అంటూ యూజర్లకు హాని కలిగించే విధంగా తప్పుడు సమాచారం సందేహాస్పద సమాచారం ఇచ్చే వీడియోలను సిఫారసు చేయటం తగ్గిస్తాం'' అని యూట్యూబ్ గత జనవరిలో యూట్యూబ్ ప్రకటించింది.

కానీ.. మొదట ఈ మార్పు అమెరికాలో చాలా చిన్న వీడియోలకే పరిమితమవుతుందని.. ఇంగ్లిష్ మినహా మిగతా భాషలకు వర్తించదని చెప్పింది.

ఈ నేపథ్యంలో ఇంగ్లిష్, పోర్చుగీస్, రష్యన్, అరబిక్, హిందీ, జర్మన్, ఉక్రేనియన్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషల్లో యూట్యూబ్ వీడియోలను బీబీసీ శోధించింది.

ఉదాహరణకు.. రష్యన్ భాషలో 'క్యాన్సర్ చికిత్స' అని సెర్చ్ చేస్తే.. వంట సోడా తాగాలని ప్రచారం చేసే వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోలను వీక్షించినపుడు.. క్యారట్ రసం తాగాలని, అధికంగా ఉపవాసం చేయాలని సూచించే పలు ఇతర వీడియోలు చూడండని సిఫారసులు కనిపించాయి.

''యూట్యూబ్ ఆల్గోరిథమ్ సిఫారసు చేయటం వల్ల.. వీక్షించిన తరహా వీడియోలే ఒకదాని వెంట మరొకటి వచ్చేలా మార్గం ఏర్పాటు చేస్తున్నాయి.. ఆ వీడియోల్లో ఇస్తున్న సలహాల విశ్వసనీయతతో నిమిత్తం లేదు'' అని డాటా అండ్ సొసైటీ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్న ఎరిన్ మెకావీనీ వివరించారు.

''ఎవరైనా ఒక విశ్వసనీయమైన వీడియోను చూడటంతో మొదలుపెట్టొచ్చు. దాని వెంటనే జ్యూస్ తాగండనో, సోడా తాగండనో చెప్పే వీడియోలను ఆల్గోరిథమ్ సిఫారసు చేస్తుంది. ఎందుకంటే ఇలా సిఫారసు చేసే వ్యవస్థకు ఆ వీడియోల్లోని సమాచారం విశ్వసనీయమైనదా కాదా అనేది తెలియదు'' అని ఆమె పేర్కొన్నారు.

యూట్యూబ్ యూజర్లను కుట్ర సిద్ధంతాల వైపు, అతివాదం వైపు తీసుకెళుతోందని ఆరోపణలు ఎదుర్కొన్న సిఫారసు వ్యవస్థ మారుతుందని.. విశ్వసనీయమైన, నమ్మకమైన వీడియోలను సిఫారసు చేస్తుందని ఆ సంస్థ గట్టిగా చెప్పింది.

నిజానికి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్లు.. ''ప్రమాదకర పరిష్కారాలు లేదా చికిత్సలు: హానికర పదార్థాలు లేదా చికిత్సలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పే సమాచారం'' సహా హానికర కంటెంట్‌ను నిషేధిస్తున్నాయి.

బీబీసీ గుర్తించిన నకిలీ క్యాన్సర్ చికిత్సల్లో చాలావరకూ వాటికవిగా హానికరం కాదు. కానీ, క్యాన్సర్‌ రోగికి పరోక్షంగా హాని చేయవచ్చు. ఉదాహరణకు, ఈ నకిలీ చికిత్సలను నమ్మి సంప్రదాయ వైద్య చికిత్స తీసుకోవటాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల పరిస్థితి విషమిస్తుంది.

Image copyright YouTube
చిత్రం శీర్షిక ఎలీజూ కోరియా వంటి చాలా మంది బ్రెజిలియన్ యూట్యూబర్లు కాకరకాయ కషాయం వంటి కషాయాలను తాగాలని సలహాలు ఇస్తున్నారు

తప్పుడు సమాచారంతో సొమ్ము చేసుకోవటం

బీబీసీ మానిటరింగ్, బీబీసీ న్యూస్ బ్రెజిల్‌కు చెందిన పరిశోధకులు ఈ నకిలీ చికిత్సల వీడియోలను వీక్షించినపుడు అనేక రకాల వాణిజ్య ప్రకటనలు కూడా వచ్చాయి.

వాటిలో శాంసంగ్, హీన్జ్, క్లినిక్‌ వంటి బడా బ్రాండ్లతో పాటు.. ప్రయాణ వెబ్‌సైట్ బుకింగ్.కామ్, రైటింగ్ యాప్ గ్రామర్లీ, హాలీవుడ్ సినిమాలు, బ్రిటిష్ యూనివర్సిటీల వాణిజ్య ప్రకటనలు కూడా ఉన్నాయి. ఈ యాడ్లన్నీ.. హానికరం కాగల తప్పుడు సమాచారంతో పాటు ప్లే అయ్యాయి.

ఆయా కంపెనీలు, యూనివర్సిటీలు.. ఈ తప్పుడు సమాచారంతో తమకు సంబంధం లేదని పక్కకు తప్పుకున్నాయి.

యూట్యోబ్‌లో తమ ప్రకటన తర్వాత ప్లే అయిన నకిలీ క్యాన్సర్ చికిత్సతో తమ ప్రకటనకు ''ఏమాత్రం సంబంధం లేదా అనుబంధం'' లేదని శాంసంగ్ చెప్పింది.

బీబీసీ పరిశోధకులు వీక్షించిన నకిలీ క్యాన్సర్ చికిత్స వీడియోలతో పాటు గ్రామర్లీ యాప్ అడ్వర్టైజ్‌మెంట్ 20 సార్లు ప్లే అయింది. ''ఈ విషయం తెలిసిన తర్వాత మేం వెంటనే యూట్యూబ్‌ను సంప్రదించాం. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే కంటెంట్‌తో పాటు మా యాడ్లను ప్లే చేయవద్దని చెప్పాం'' అని గ్రామర్లీ పేర్కొంది.

ఈ అంశంపై వ్యాఖ్యానించాలని బీబీసీ చేసిన విజ్ఞప్తులకు క్లినిక్ యజమాని ఎస్టీ లౌడర్, బుకింగ్.కామ్‌ల స్పందించలేదు.

ఇక ఇలాంటి నకిలీ చికిత్సల వీడియోల్లో తమ యాడ్లు కేవలం ఒక్కసారి మాత్రమే వచ్చాయని.. బీబీసీ సంప్రదించిన వెంటనే అటువంటి చానళ్లలో తమ యాడ్ల ప్రచారం జరగకుండా బ్లాక్ చేశామని రెండు బ్రిటిష్ యూనివర్సిటీలు చెప్పాయి.

Image copyright YouTube
చిత్రం శీర్షిక వంట సోడా తాగితే క్యాన్సర్ నయమవుతుందని వీడియో పోస్ట్ చేసిన ఎఫిమోవా తాత్యానా.. బీబీసీ మాట్లాడిన తర్వాత ఆ వీడియోను తొలగించారు

మనం ఏ యాడ్లు చూడాలో గూగుల్ ఎలా నిర్ణయిస్తుంది?

యూట్యూబ్‌లో వాణిజ్య ప్రకటనలను నిర్దిష్ట ప్రాంతాలు లేదా ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ప్లే చేయవచ్చు. ఏ యాడ్‌ను ఏ వ్యక్తికి ఏ సమయంలో చూపించాలనేది నిర్ణయించే వ్యవస్థలు సంక్లిష్టమైనవని టిమ్ ష్కామోయర్ పేర్కొన్నారు. ఆయన యూట్యూబ్ కన్సల్టెన్సీ సంస్థ వీడియో క్రియేటర్స్ వ్యవస్థాపకుడు.

''ఈ యాడ్లు ఇచ్చే కంపెనీలకు, ఆ యాడ్లు ప్లే చేసే కంటెంట్ తయారీదారులకు, తమకు కూడా అత్యధిక ప్రతిఫలం దక్కేలా ఈ యాడ్లను యూట్యూబ్ ఆప్టిమైజ్ చేస్తుంది'' అని ఆయన వివరించారు.

కొన్ని చానళ్లను 'డీమానిటైజ్' చేసే అధికారం - అంటే.. వీడియో తయారీదారులు వాటి మీద వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం పొందకుండా నిరోధించే అధికారం యూట్యూబ్‌కి ఉంది.

ఉదాహరణకు వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ప్రచారం చేసే చానళ్లను డీమానిటైజ్ చేయటానికి యూట్యూబ్ చర్యలు చేపట్టింది.

అయితే.. దీనివల్ల అటువంటి వీడియో తయారీదారులు డబ్బులు సంపాదించుకోకుండా ఆపవచ్చు. కానీ.. ఆ వీడియోలు వైరల్‌గా మారకుండా నిలువరించలేదని మెకావీనీ చెప్తున్నారు. ప్రేక్షకుల సంఖ్యను, వీడియో ప్రయాణించే దూరాన్ని.. డీమానిటైజేషన్ నిలువరిస్తుందనే ఆధారమేమీ లేదని ఆమె పేర్కొన్నారు.

''ఆరోగ్యానికి సంబంధించి తప్పుడు సమాచారం, నకిలీ సమాచారం ప్రచారం చేయటం వెనుక చాలా ఉద్దేశాలు ఉంటాయి. డబ్బు అనేది అందులో ఒకటి మాత్రమే. చాలా సందర్భాల్లో ఒక వీడియో మీదకు జనం దృష్టిని ఆకర్షించటం, వీక్షణలు పెంచుకోవటం.. దానివల్ల వచ్చే డబ్బులకన్నా వీరికి చాలా ముఖ్యం'' అని వివరించారు.

బీబీసీ గుర్తించిన నకిలీ చికిత్స వీడియోలను యూట్యూబ్‌కు పంపించింది. ఆ సంస్థ ఇప్పటివరకూ దాదాపు 70 వీడియోలను తమ మానిటైజేషన్ విధానాన్ని ఉల్లంఘించాయంటూ డిమానిటైజ్ చేసింది.

ఆ వీడియోల్లో ఐదు వీడియోలను తయారుచేసిన వారితో కూడా బీబీసీ మాట్లాడింది.

'వంట సోడా చికిత్స' గురించి వీడియో పెట్టిన తాత్యానా ఎఫిమోవా అనే రష్యన్ యూట్యూబర్.. తాను డాక్టర్‌ని కాదని అదే వీడియోలో స్పష్టంగా చెప్పారు. తనకు తెలిసిన ఒక వ్యక్తి స్వీయ అనుభవాన్ని తాను ఆ వీడియోలో చెప్పానని.. వంట సోడా తీసుకోవాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది వీక్షకులేనని ఆమె పేర్కొన్నారు. అయితే.. బీబీసీ సంప్రదించిన తర్వాత ఆమె ఆ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. ''నాకు ఇది అంత ముఖ్యం కాదు'' అని చెప్పారు.

కాకరకాయ కషాయం ట్యూమర్లను నయం చేస్తుందంటూ వీడియో పోస్ట్ చేసిన బ్రెజిల్‌కు చెందిన ఎలీజూ కోరియా అనే యూట్యూబర్.. తన వీడియో ప్రమాదకరమైన లేదా విషపూరిత కషాయం గురించి చెప్పటం లేదని స్పందించారు. బీబీసీతో మాట్లాడిన తర్వాత ఆయన ఆ వీడియో సెట్టింగ్‌ను ప్రైవేట్‌కు మార్చాడు. దీనివల్ల సాధారణ ప్రజలు దానిని చూడటానికి అవకాశం ఉండదు.

హిందీ భాషలోని ఒక మీడియా సంస్థ శూన్యకాల్.. బీబీసీ విజ్ఞప్తులకు స్పందించలేదు. అయితే, వైద్యేతర క్యాన్సర్ చికిత్సా కేంద్రం గురించి వారు పోస్ట్ చేసిన వీడియోను.. మేం వారితో మాట్లాడటానికి ప్రయత్నించిన తర్వాత బహిరంగ చానల్ నుంచి తొలగించారు. అలా తొలగించటానికి ముందు ఆ వీడియోను 14 లక్షల సార్లు వీక్షించారు.

గాడిద పాలు తాగితే క్యాన్సర్ నయమవుతుందంటూ వీడియో పోస్ట్ చేసిన ఖ్వాలా ఐసాన్ కూడా స్పందించలేదు.

ఈ అంశాలపై యూట్యూబ్ ఇంటర్వ్యూకోసం బీబీసీ కోరగా ఆ సంస్థ తిరస్కరించింది. అయితే.. ''తప్పుడు సమాచారం అనేది ఒక కష్టమైన సవాలు. దీనిని పరిష్కరించటానికి మేం పలు చర్యలు చేపట్టాం. వైద్యపరమైన అంశాలపై మరింత అధీకృత సమాచారాన్ని చూపించటం, విశ్వసనీయమైన ఆధారాలతో కూడిన సమాచార ప్యానళ్లను చూపించటం, హానికరమైన ఆరోగ్య సలహాలను ప్రచారం చేసే వీడియోల నుంచి యాడ్లు తొలగించటం వంటివి ఈ చర్యల్లో భాగం'' అని ఒక ప్రకటనలో పేర్కొంది.

''మా వ్యవస్థలు అత్యంత కచ్చితమైనవి కాదు. కానీ మేం ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ ఉన్నాం. ఈ విషయంలో పురోగతి సాధించటానికి మేం కట్టుబడి ఉన్నాం'' అని కూడా చెప్పింది.

Image copyright SPL

వైద్య సమాజం

బీబీసీ పరిశోధనలో గుర్తించిన కొన్ని వీడియోల్లో.. వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ హెచ్చరికలు కూడా పొందుపరిచారు. కానీ చాలా వీడియోల్లో తాము చెప్తున్న చికిత్సలు సంప్రదాయ క్యాన్సర్ చికిత్సలకు ప్రత్నామ్నాయాలని బాహాటంగా చెప్పుకొచ్చారు.

''యూట్యూబ్, ఇంటర్నెట్‌లలో కొన్ని అంశాలు ప్రమాదకరమైనవి.. వాటిని జల్లెడపట్టటం లేదు'' అని వ్యాఖ్యానించారు ప్రొఫెసర్ జస్టిన్ స్టెబింగ్. ఆయన ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌లో ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు.

''ఆరోగ్య పరిరక్షణ, ప్రజారోగ్యంలో నైపుణ్యంలేని జనం ఉండే కార్పొరేట్ సంస్థలను.. ప్రజల తరఫున నిర్ణయాలు తీసుకోవాలని మనం అడుగుతున్నాం'' అని ఇసాక్ చున్-హే ఫుంగ్ పేర్కొన్నారు. ఆయన జార్జియా సదర్న్ యూనివర్సిటీలో ఎపిడెమియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

యూట్యూబ్‌లో ఇంగ్లిష్‌లో ఉన్న ఆరోగ్య సమాచారం మీద డాక్టర్ ఫుంగ్, ఆయన విద్యార్థులు పరిశోధన చేశారు. అంశం ఏదైనా కానీ.. యూట్యూబ్‌లో అత్యంత ప్రజాదరణ గల 100 వీడియోలను అప్‌లోడ్ చేసింది.. ఆరోగ్యం లేదా సైన్స్ నిపుణులు కాని, అనుభవం లేని అమెచ్యూర్లేనని గుర్తించారు.

ఈ పరిస్థితికి ఒక పరిష్కారం... ఆరోగ్య నిపుణులు మరింత ఎక్కువగా కంటెంట్ తయారు చేసి పోస్టు చేయటమని డాక్టర్ ఫుంగ్ అభిప్రాయపడ్డారు.

''నిపుణులు కాని వారి కోసం అన్ని భాషల్లోనూ అత్యంత నాణ్యమైన అవగాహన పెంపొందించే వీడియోలు ఉండాలి. ఇందుకోసం ఆరోగ్యరంగ వృత్తి నిపుణులు, మీడియా వృత్తి నిపుణులతో కలిసి పని చేయాలి. ఈ విషయంలో తగినంత కృషి జరగటం లేదని నేను భావిస్తున్నా'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

భారత సైన్యం దాడిలో ‘ఉగ్రవాదులు’, పాక్ సైనికులు మృతి: ఇండియన్ ఆర్మీ చీఫ్ ప్రకటన

తండ్రి శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్న కొడుకులు.. కారణమేంటి

సంతాన నిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు

మెట్రో రైలు చార్జీల పెంపుపై నిరసన: చిలీలో హింస.. ముగ్గురి మృతి

‘డియరెస్ట్ మోదీజీ... దక్షిణాది సినీ కళాకారులకు స్థానం లేదా?’ - ఉపాసన కొణిదెల

వాట్సాప్‌పై పన్ను వేసేందుకు లెబనాన్‌లో ప్రయత్నం.. ప్రజాగ్రహంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం

టర్కీ అధ్యక్షుడి హెచ్చరిక: 'కుర్దు ఫైటర్లు ఉత్తర సిరియా నుంచి వెనక్కి వెళ్లకపోతే తలలు చిదిమేస్తాం’

బ్రెగ్జిట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ