ఈ బంగారు టాయిలెట్‌ను ప్యాలస్ నుంచి ఎత్తుకెళ్లారు

  • 15 సెప్టెంబర్ 2019
బంగారం టాయిలెట్ Image copyright AFP/GETTY IMAGES

18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఒక టాయిలెట్‌ను బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్ బ్లెన్‌హెమ్ ప్యాలెస్‌ నుంచి దొంగిలించారు.

థేమ్స్ వ్యాలీ పోలీసుల వివరాల ప్రకారం ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో ఉన్న ఈ ప్యాలెస్‌లోకి చొరబడిన ఒక గ్యాంగ్ ఈ కళాఖండాన్ని దొంగిలించింది.

ఈ బంగారు టాయిలెట్‌ను ఇటలీకి చెందిన మారిజియో కేటెలన్ అనే కళాకారుడు తయారు చేశాడు. గురువారం నుంచి జరుగుతున్న ఒక ప్రదర్శనలో భాగంగా దీనిని అక్కడ ఉంచారు.

అమెరికా నుంచి తీసుకొచ్చిన ఈ టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నారు కూడా. దీనిని చూడ్డానికి వచ్చే వారికి కూడా టాయిలెట్‌ను ఉపయోగించుకునే అవకాశం ఇచ్చారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption18 క్యారెట్ల ఈ బంగారు టాయిలెట్‌ను గతంలో న్యూయార్క్‌లోని ఒక మ్యూజియంలో ప్రదర్శించారు.

కానీ దొంగలు ఈ బంగారు టాయిలెట్‌ను తీసుకెళ్లడానికి దాని పైప్‌లైన్ ధ్వంసం చేశారని పోలీసులు చెప్పారు. దాంతో భవనం లోపల నీళ్లు నిండాయని తెలిపారు.

ఈ బంగారు టాయిలెట్ ఏమైందో ఇప్పటివరకూ తెలీలేదు. కానీ ఈ కేసులో 66 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.

18వ శతాబ్దానికి చెందిన బ్లెన్‌హెమ్ ప్యాలస్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి సర్ విన్‌స్టన్ చర్చిల్ ఈ ప్యాలెస్‌లోనే పుట్టారు.

ప్రస్తుతం బంగారు టాయిలెట్ చోరీపై దర్యాప్తు జరుగుతుండడంతో దీన్ని మూసివేశారు.

"ఈ భవనంలో కళాఖండాల భద్రత గురించి తమకు ఎలాంటి ఆందోళనా లేదు, అక్కడనుంచి ఏదైనా దొంగిలించాలంటే అంత సులభం కాదు" అని డ్యూక్ ఆఫ్ మొలబోరా కజిన్ ఎడ్వర్డ్ స్పెన్సర్ చర్చిల్ నెల క్రితమే అన్నారు.

Image copyright JOHN LAWRENCE
చిత్రం శీర్షిక బంగారం టాయిలెట్ చోరీ తర్వాత మూసేసిన బ్లెన్‌హెమ్ ప్యాలెస్‌ను ఆదివారం నుంచి మళ్లీ తెరిచారు

సింహాసనంపై కూర్చోవచ్చు

బ్లెన్‌హెమ్ ప్యాలెస్‌లో కళాఖండాలను చూసేందుకు ప్రేక్షకులు భారీగా వస్తుంటారు.

ఇక్కడకు వచ్చేవారికి లోపల ప్రదర్శిస్తున్న సింహాసనంపై కూర్చోడానికి కూడా అనుమతి ఉంది. కానీ అక్కడ క్యూ పెరిగిపోకుండా ఒక్కొక్కరికి 3 నిమిషాల సమయం మాత్రమే ఇస్తారు.

దొంగిలించిన బంగారు టాయిలెట్ చాలా ఖరీదైనదని, దాన్ని తయారు చేసిన కళాకారుడు ఆ ప్రదర్శన కోసం దాన్ని అక్కడ ఉంచాడని డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ జాస్ మిలన్ చెప్పారు.

"దొంగలు రెండు వాహనాలు ఉపయోగించినట్లు మాకు అనిపిస్తోంది. కళాఖండం ఇప్పటివరకూ దొరకలేదు. మా దర్యాప్తు కొనసాగుతోంది" అన్నారు.

"ప్యాలెస్ పూర్తిగా మూసేస్తున్నాం. ఆదివారం తిరిగి తెరుస్తాం" అని బ్లెన్‌హెమ్ ప్యాలెస్ తరఫున ట్విటర్ ద్వారా ఒక సమాచారం విడుదల చేశారు.

ఇంతకు ముందు ఈ బంగారు టాయిలెట్‌ను న్యూయార్క్‌లోని ఒక మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

2017లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు ఈ బంగారు టాయిలెట్‌ను ఆఫర్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)