ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?

  • 18 సెప్టెంబర్ 2019
పురుగుమందులు Image copyright Getty Images

ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షా యాభై వేలమంది ప్రజలు పురుగు మందులు తాగి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ప్రజల ప్రాణాలు తీస్తున్నఈ తరహా ఉత్పత్తుల లభ్యతను తగ్గించడానికి కఠినమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.

రెండు దశాబ్దాలుగా శ్రీలంక ప్రభుత్వం పురుగుమందులను నిషేధించి ఈ తరహా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది.

కానీ, ఇతర దేశాలలో ప్రాణాలు తీసే విషపూరిత పురుగుమందులు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

1990ల నుంచి ప్రపంచవ్యాప్తంగా పురుగుమందులతో ప్రాణాలు తీసుకోవడం తగ్గుముఖం పట్టింది. కానీ, ఇప్పటికీ ఆసియాలోని గ్రామీణ ప్రాంతాలలో పురుగుమందు వల్ల ఆత్మహత్యలు గరష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి.

శ్రీలంక 1980,90లలో ప్రపంచంలో అత్యధిక ఆత్మహత్య రేటును కలిగి ఉంది. ఇందులో పురుగుమందుల మరణాల వాటా మూడింట రెండు వంతుల వరకు ఉంది.

దీంతో శ్రీలంక ప్రభుత్వం పురుగుమందుల ఉత్పత్తి, వాడకంపై 20 ఏళ్ల నుంచి నిషేధం విధించింది. ఈ చర్యలతో

అక్కడ ఆత్మహత్య రేటు ప్రస్తుతం 70 శాతానికి పడిపోయింది.

ప్రజలు బలవన్మరణానికి పాల్పడటానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు కానీ, పురుగుమందులను ఇందుకు ఉపయోగించడం తగ్గుతోంది.

వ్యవసాయ సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ పురుగుమందులను ప్రవేశపెట్టారు. ఇవి కూడా విషపూరితమైనవే కానీ, కాస్త తక్కువ హాని చేస్తాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, అత్యంత ప్రమాదకర పురుగుమందులను సురక్షితమైన ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయడం వల్ల పంటల దిగుబడి తగ్గుందనే వాదనలకు సరైన ఆధారాలు లేవు.

Image copyright Getty Images

భారత్‌లో పరిస్థితి ఎలా ఉంది?

భారత్‌లో 2015లో 1,34,000 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని, ఇందులో 24,000 మంది పురుగుమందులు తాగి మరణించారని అధికారిక సమాచారం.

వాస్తవానికి, భారత్‌లో ఈ మరణాల సంఖ్యను తక్కువగా చూపించారు.

''భారత్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సివస్తుందనే భయంతో చాలా మంది ఆత్మహత్యలను ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా దాచిపెడుతుంటారు'' అని చంఢీగర్‌లోని ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్ ఆశిష్ భల్లా చెప్పారు.

భారత్‌లో గుర్తింపు పొందిన పురుగుమందులపై ఇంగ్లండ్‌కు చెందిన విద్యావేత్తల బృందం ఒక విశ్లేషణ చేసింది.

బలవన్మరణాల కోసం ఉపయోగించే 10 అత్యంత విషపూరిత ఉత్పత్తులను భారత ప్రభుత్వం నిషేధించిందని, మరికొన్ని ఉత్పత్తులను ప్రభుత్వం పరిమితం చేసిందని, 2020లో వీటిని కూడా నిషేధిస్తుందని ఆ బృందం తెలిపింది.

అయినప్పటికీ, డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం నిషేధించాల్సిన డజనుకు పైగా అత్యంత ప్రమాదకర పురుగుమందులు ఇప్పటికీ భారత్‌లో అందుబాటులో ఉన్నాయి.

Image copyright Getty Images

ఆసియాలోని ఇతర దేశాల్లో ఎలా ఉంది?

బంగ్లాదేశ్‌లో 2000లలో ఇలాంటి నిబంధనలు ప్రవేశపెట్టారు. దీని తర్వాత ఆత్మహత్యల రేటు తగ్గుతూ వచ్చింది.

అయితే, పురుగుమందులతో బలవన్మరణాలకు పాల్పడి ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్యలో మార్పేమీ రాలేదని 2017లో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది.

భారీగా విష రసాయనాలున్న మందులను దక్షిణ కొరియా 2012లో నిషేధించింది. దీనివల్ల పురుగుమందుల వల్ల జరిగే ఆత్మహత్యలు వెంటనే తగ్గాయి. అంతేకాకుండా మొత్తం మరణాల రేటు కూడా తగ్గింది.

చైనాలో 2006 నుంచి 2013 వరకు జరిపిన ఒక అధ్యయనం ప్రకారం దేశంలో మొత్తం ఆత్మహత్యల రేటు తగ్గింది.

పురుగు మందుల వాడకంపై కఠినమైన నిబంధనలు, పట్టణీకరణ, మెరుగైన ఆరోగ్య సేవలు, సాగు చేసే వారి సంఖ్య తగ్గడం సహా అనేక కారణాలు వల్ల ఆత్మహత్యల రేటు తగ్గినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది.

ప్రపంచవ్యాప్తంగా పురుగుమందుల సంబంధిత మరణాల రేటు తగ్గడానికి చైనానే ప్రధాన కారణమని భావిస్తున్నారు.

నేపాల్ కూడా 2001 నుంచి 21 రకాల పురుగుమందులను నిషేధించింది.

ఇందులో కొన్ని ఆరోగ్యం, పర్యావరణ కారణాల వల్ల నిషేధిస్తే, మరికొన్ని ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని నిషేధించినట్లు నేపాల్ పురుగుమందుల నిర్వహణ కేంద్రం అధిపతి డాక్టర్ డిల్లీ శర్మ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)