హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?

  • 17 సెప్టెంబర్ 2019
హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్

హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమై ఇన్నేళ్లు గడుస్తున్నా, ఆ కాలంలో జరిగిన ఓ భారీ నగదు లావాదేవీపై ఇంకా వివాదం నడుస్తోంది.

భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న తమ దేశంలో విలీనం చేసుకుంది.

అప్పుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్‌ను పాలిస్తున్నారు. ఆ సమయంలో ప్రపంచలోనే అత్యంత ధనవంతుడిగా ఆయన్ను పరిగణించేవారు.

నిజాంకు ఆర్థిక మంత్రిగా ఉన్న మోయిన్ నవాజ్ జంగ్ ఆపరేషన్ పోలో సమయంలో బ్రిటన్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్‌ ఇబ్రహీం రహ్మతుల్లాకు పది లక్షల పౌండ్లను 'జాగ్రత్తగా దాచమని' పంపించారు.

రహ్మతుల్లా నాట్‌వెస్ట్ బ్యాంకు ఖాతాకు ఈ సొమ్ము బదిలీ అయ్యింది.

అయితే, ఈ నగదు ఎవరికి చెందాలన్నదానిపై ఇంకా నిజాం వారసులకు, పాకిస్తాన్‌కు మధ్య న్యాయవివాదం కొనసాగుతోంది.

బ్యాంకులో ఉన్న ఆ డబ్బు ఇప్పుడు వడ్డీతో కలిపి 3.5 కోట్ల పౌండ్లకు చేరుకుంది. భారత కరెన్సీలో దాని విలువ దాదాపు రూ.310 కోట్లు.

రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో నడుస్తున్న ఈ కేసు త్వరలో పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి.

ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ మార్కస్ స్మిత్ అక్టోబర్‌లో తీర్పు వెలువరించాల్సి ఉంది.

Image copyright KEYSTONE-FRANCE

ఈ కేసులో నిజాం మనవళ్లలో ఒకరైన ఎనిమిదో ముకరం జా తరఫున విథర్స్ వరల్డ్‌వైడ్ న్యాయవాద సంస్థకు చెందిన పాల్ హెవిట్ వాదిస్తున్నారు.

ఈ లావాదేవీ చరిత్ర గురించి ఆయన వివరించారు.

''ఆ లావాదేవీ గురించి తెలుసుకున్న వెంటనే డబ్బు వెనక్కిఇవ్వాలని ఏడో నిజాం పాకిస్తాన్‌ను కోరారు. అయితే రహ్మతుల్లా అందుకు అంగీకరించలేదు. ఆ డబ్బు ఇక పాకిస్తాన్‌దేనని ఆయన స్పష్టం చేశారు'' అని హెవిట్ తెలిపారు.

దీంతో 1954లో ఏడో నిజాం ఆ డబ్బు కోసం యూకే హైకోర్టులో న్యాయపోరాటం ప్రారంభించారు. అయితే, అక్కడ పాకిస్తాన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.

దీన్ని నిజాం అప్పీళ్ల కోర్టులో సవాలు చేసి, గెలిచారు.

అయితే, పాకిస్తాన్ హౌజ్ ఆఫ్ లార్డ్స్‌ను ఆశ్రయించింది. అప్పట్లో అదే యూకే సర్వోన్నత న్యాయస్థానం.

సార్వభౌమిక దేశమైన పాకిస్తాన్‌పై నిజాం కేసు వేయడం కుదరదని పాక్ వాదించింది.

హౌజ్ ఆఫ్ లార్డ్స్ కూడా పాకిస్తాన్ వాదనను సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అదే సమయంలో, ఆ సొమ్ము ఉన్న బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసింది.

అప్పటి నుంచి రహ్మతుల్లా నాట్‌వెస్ట్ బ్యాంకు ఖాతాలో డబ్బులు అలాగే ఉన్నాయి.

ఆ డబ్బు ఎవరికి చెందాలన్నది తేలాక, వారికి ఆ సొమ్ము అందజేస్తామని బ్యాంకు వెల్లడించింది.

Image copyright Getty Images

గత 60 ఏళ్లలో వడ్డీతో కలిపి ఆ సొమ్ము పెరుగుతూ పోయింది.

ఈ కేసును పరిష్కరించుకునేందుకు వివిధ పక్షాల మధ్య రాజీ కోసం ప్రయత్నాలూ జరిగాయి. అయితే, అవేవీ సఫలం కాలేదు.

1967లో ఏడో నిజాం మరణించారు. అప్పటి నుంచి ఆయన వారసులు ఆ డబ్బును దక్కించుకునేందుకు న్యాయపోరాటం చేస్తున్నారు.

2013లో ఆ డబ్బును పొందేందుకు పాకిస్తాన్ హైకమిషనర్ నాట్‌వెస్ట్ బ్యాంకుపై చర్యలు ప్రారంభించారు.

దీంతో ఆ బ్యాంకు ఆ డబ్బు తమదని వాదిస్తున్న మిగతా పక్షాలను కూడా వివాద పరిష్కారం కోసం ఆహ్వానించింది.

మొదట నిజాం మనవళ్లను, ఆ తర్వాత భారత ప్రభుత్వాన్ని కూడా ఆహ్వానించింది.

ఈ డబ్బు తమకు చెందుతుందని భారత్ కూడా ఓ సమయంలో వాదించింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ‘నాకు లొంగిపోవటం మినహా దారి లేదు’ - నిజాం

నిజాం మనవళ్లు ఇద్దరూ భారత ప్రభుత్వంతో చేతులు కలిపారని పాల్ హెవిట్ చెప్పారు.

అయితే, ఈ అంగీకారం కుదరినట్లు రుజువు చేసే అధికారిక పత్రాలేవీ లేవు.

నిజాం వారసులు ఈ కేసు గురించి మాట్లాడేందుకు నిరాకరించారు.

ఆపరేషన్ పోలో సమయంలో భద్రపరచడం కోసమే ఆ డబ్బును పాకిస్తాన్‌కు ఇచ్చినట్లు నిజాం కుటుంబం చెబుతోంది.

విలీన సమయంలో ఏడో నిజాంకు తాము అందించిన సహకారానికి బదులుగా తమ దేశ ప్రజలకు ఆ డబ్బును ఆయన బహుమతిగా ఇచ్చారని పాకిస్తాన్ వాదిస్తోంది.

''1947-48 మధ్య హైదరాబాద్‌కు పంపిన ఆయుధాలకు చెల్లింపుగానే ఆ పది లక్షల పౌండ్లు తమకు అందాయని పాకిస్తాన్ 2016లో వాదించింది'' అని పాల్ హెవిట్ చెప్పారు.

పాకిస్తాన్ తరఫున వాదిస్తున్న ఖవార్ ఖురేషీ ఈ కేసుపై ఏమీ మాట్లాడేందుకు ముందుకు రాలేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్

''ఏడో నిజాంకు పాకిస్తాన్ అందించిన సహకారానికి పరిహారంగానూ, భారత్ చేతుల్లోకి డబ్బులు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనూ హైదరాబాద్ ఆ పది లక్షల పౌండ్లను రహ్మతుల్లా ఖాతాకు బదిలీ చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసం హైదరాబాద్ చేసిన ప్రయత్నాలకు పాకిస్తాన్ సహకారం అందించింది'' అని పాకిస్తాన్ వాదనల కాపీలో ఉంది.

1948 సెప్టెంబర్ 20న ఆ లావాదేవీ జరిగినట్లు కూడా ఆ కాపీ పేర్కొంది.

ఈ లావాదేవీ గురించి రెండు పక్షాల మధ్య రాతపూర్వక ఒప్పందమేదైనా కుదిరిందా అన్న ప్రశ్నకు.. ''ఈ లావాదేవీ జరిగినట్లే తనకు తెలియదని ఏడో నిజాం కోర్టులో ప్రమాణం చేసి చెప్పారు. నిజాం కోసం డబ్బును భద్రపరచాలన్న ఉద్దేశంతోనే రహ్మతుల్లాకు హైదరాబాద్ ఆర్థిక మంత్రి డబ్బు పంపించినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి'' అని పాల్ హెవిట్ వివరించారు.

''బతికుండగా ఆ డబ్బు తన చేతికి రాదని ఏడో నిజాం నిర్ణయానికి వచ్చారు. ఆ మొత్తం తన ఇద్దరు మనవళ్లు యజమానులుగా ఉన్న ట్రస్టుకు చేరేలా చర్యలు తీసుకున్నారు'' అని పాల్ హెవిట్ తెలిపారు.

ఇటువంటి చారిత్రక నేపథ్యమున్న కేసు చాలా చాలా అరుదని ఆయన అభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్‌కు చేరిన ఆ డబ్బు గురించి దక్కన్ హెరిటేజ్ సొసైటీ ఛైర్మన్ మహమ్మద్ సైఫుల్లాతో బీబీసీ తెలుగు రిపోర్టర్ దీప్తి బత్తిని మాట్లాడారు.

ప్రస్తుతం రూ.310 కోట్ల వరకూ విలువ ఉన్న ఆ సొమ్మును మూడు సమాన భాగాలుగా పంచుకునేలా భారత్, నిజాం వారసులు, పాకిస్తాన్ ఒక అంగీకారానికి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)