బెంజమిన్ నెతన్యాహు: ఇజ్రాయెల్ ఆర్మీ కమాండో నుంచి.. ఐదోసారి దేశ ప్రధాని రేసు వరకూ...

 • 18 సెప్టెంబర్ 2019
బెంజమిన్ నెతన్యాహు Image copyright Getty Images

ఇజ్రాయెల్‌లో సార్వత్రికఎన్నికలు మంగళవారం ముగిశాయి. అయితే, ప్రపంచం కళ్లన్నీ ప్రస్తుత ప్రధాని, లికుడ్ పార్టీ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుపైనే ఉన్నాయి.

అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ఆయన ఐదోసారి ప్రధాని పదవి అందుకుని కొత్త రికార్డు సృష్టించగలరా అని గమనిస్తున్నాయి.

గత ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు విజయం సాధించినప్పుడు మద్దతుదారులు ఆయన్ను 'మెజీషియన్' అన్నారు. ఈసారీ ఆయన అదే మ్యాజిక్ కొనసాగించలరా అని చూస్తున్నాయి.

అయితే, ఎగ్జిట్ పోల్స్ మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా సీట్లు తెచ్చుకుంటాయని చెబుతున్నాయి.

1996లో ఎన్నికల్లో పోటీ చేసిన నెతన్యాహు రాజకీయ అనుభవం లేదనే విమర్శలు ఎదుర్కున్నా.. ప్రత్యర్థిపై స్వల్పతేడాతో గెలిచి మొదటిసారి ప్రధాని పదవి చేజిక్కించుకున్నారు.

ఈ ఏడాది జులైలో నెతన్యాహు మరో రాజకీయ మైలురాయిని కూడా దాటేశారు. దేశానికి సుదీర్ఘకాలం సేవలందించిన నేతగా ఇజ్రాయెల్ పితామహుడు డేవిడ్ బెన్ పేరిట ఉన్న రికార్డును ఆయన బద్దలు కొట్టారు

ఇజ్రాయెల్ ప్రజలు నెతన్యాహును 'బిబి' అనే ముద్దుగా పిలుచుకుంటారు.

మధ్యప్రాచ్యం చుట్టూ ఉన్న శత్రువుల వల్ల ఎదురయ్యే ముప్పు నుంచి ఇజ్రాయెల్‌కు అత్యుత్తమ భద్రత అందించిన వ్యక్తిగా వచ్చిన ఇమేజే, ఆయన ఈ విజయాలకు ప్రధాన కారణంగా నిలిచింది.

నెతన్యాహు పాలస్తీనాతో కఠినంగా వ్యవహరించారు. శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ భద్రతకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు. ఇరాన్ నుంచి ముంచుకొచ్చే ముప్పు గురించి ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు.

Image copyright GPO VIA GETTY IMAGES
చిత్రం శీర్షిక కమాండో యూనిట్‌లో నెతన్యాహు(కుడి) కెప్టెన్‌గా పనిచేశారు

సోదరుడి వారసత్వం

బెంజమిన్ నెతన్యాహు 1949లో టెల్ అవీవ్‌లో జన్మించారు. ప్రముఖ చరిత్రకారుడు, జియోనిస్ట్ కార్యకర్త అయిన తండ్రి బెంజియన్‌‌కు ఉద్యోగం రావడంతో 1963లో నెతన్యాహు కుటుంబం అమెరికా వెళ్లింది.

18 ఏళ్ల వయసులో బెంజమిన్ నెతన్యాహు తిరిగి ఇజ్రాయెల్ వచ్చారు. అక్కడ ఐదేళ్లు సైన్యంలో సేవలు అందించారు.

సయెరెట్ మట్కల్ అనే ఎలైట్ కమాండో యూనిట్‌లో ఆయన కెప్టెన్‌గా పనిచేశారు. 1968లో బీరుట్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో పాల్గొన్న నెతన్యాహు, 1973 మధ్యప్రాచ్య యుద్ధంలో పోరాడారు.

సైన్యంలో సేవలు అందించిన తర్వాత నెతన్యాహు తిరిగి అమెరికా వెళ్లిపోయారు. అక్కడ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) నుంచి మాస్టర్ డిగ్రీ అందుకున్నారు.

1976లో ఉగాండాలోని ఎంటెబ్బీలో ఒక విమానం హైజాక్ అయినపుడు బంధీలను కాపాడే దాడులకు నేతృత్వం వహించిన నెతన్యాహు సోదరుడు జొనాథన్ ఆ ఆపరేషన్‌లో మరణించాడు.

ఆయన మరణం నెతన్యాహు కుటుంబాన్ని కుంగదీసింది. జొనాథన్ పేరు ఇజ్రాయెల్ చరిత్రలో నిలిచిపోయింది.

నెతన్యాహు తన సోదరుడి జ్ఞాపకార్థం ఒక యాంటీ-టెర్రరిజం ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేశారు. 1982లో వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్ మిషన్ డిప్యూటీ చీఫ్ అయ్యారు.

తర్వాత రాత్రికిరాత్రే నెతన్యాహు పాపులర్ అయిపోయారు. ప్రత్యేకమైన అమెరికన్ యాసతో ఇంగ్లిష్ మాట్లాడే ఆయన ముఖం అమెరికా టీవీ ప్రేక్షకులకు సుపరిచితమైంది.

ఇజ్రాయెల్‌కు ఆయన ఒక సమర్థుడైన అడ్వకేట్ కూడా అయ్యారు. దాంతో, 1984లో నెతన్యాహు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు.

Image copyright Getty Images

రాజకీయ ప్రవేశం

1988లో తిరిగి ఇజ్రాయెల్ వచ్చాక నెతన్యాహు దేశ రాజకీయాల్లో ప్రవేశించారు. కెనాసిట్(పార్లమెంటు) ఎన్నికల్లో లికుడ్ పార్టీ తరఫున గెలిచి ఉప విదేశాంగ మంత్రి అయ్యారు.

తర్వాత ఆయన పార్టీ ఛైర్మన్ అయ్యారు. 1996లో యిచ్హాక్ రాబిన్ హత్యకు గురైన తర్వాత వెంటనే జరిగిన ఎన్నికల్లో గెలిచి నేరుగా ఎన్నికైన ఇజ్రాయెల్ తొలి ప్రధాన మంత్రిగా నిలిచారు.

1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత ఆ దేశంలో పుట్టిన ఇజ్రాయెల్ మొట్టమొదటి యువ ప్రధాని కూడా నెతన్యాహునే.

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఓస్లో ఒప్పందంపై తీవ్ర వ్యతిరేకతలు వచ్చినా, 80 శాతం హెబ్రాన్‌ను పాలస్తీనా అథారిటీ నియంత్రణకు అప్పగించే ఒప్పందంపై నెతన్యాహు సంతకాలు చేశారు. తాము ఆక్రమించిన వెస్ట్‌బ్యాంక్ నుంచి మరింత ఉపసంహరణకు అంగీకరించారు.

1999లో 17 నెలల ముందే ఎన్నికలకు పిలుపునిచ్చిన నెతన్యాహు పరాజయం పాలయ్యారు. మాజీ కమాండర్, లేబర్ పార్టీ నేత ఎహుద్ బరాక్ చేతిలో ఓడిపోయారు.

Image copyright AFP

రాజకీయ పునరుజ్జీవం

నెతన్యాహు పదవి నుంచి తప్పుకోవడంతో, ఏరియల్ షరాన్ లికుడ్ పార్టీ నేత అయ్యారు.

2001లో షరాన్ ప్రధాని అయిన తర్వాత నెతన్యాహు మళ్లీ ప్రభుత్వంలోకి వచ్చారు. మొదట విదేశాంగ మంత్రిగా తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2005లో ఆక్రమణలో ఉన్న గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు.

2005లో నెతన్యాహుకు రెండోసారి ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. లికుడ్ పార్టీని వదిలిన ఏరియల్ షరాన్, కడిమా అనే కొత్త పార్టీలో చేరారు. తర్వాత ఏడాదికే తీవ్ర గుండెపోటుకు గురై కోమాలోకి వెళ్లిపోయారు. దీంతో నెతన్యాహుకు మళ్లీ లికుడ్ పార్టీ చైర్మన్ అయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ ప్రధాని అయ్యారు.


నెతన్యాహు జీవితం

 • 1949 - టెల్ అవీవ్‌లో జననం
 • 1967-73 - సైన్యంలో సైనికుడుగా, కమాండోగా కెప్టెన్‌గా సేవలు
 • 1984 - ఐక్యరాజ్యసమితి రాయబారి
 • 1988 - రాజకీయ ప్రవేశం
 • 1996 - మొదటిసారి ప్రధానిగా ఎన్నిక
 • 1999 - ఎన్నికల్లో ఓటమి
 • 2002-03 -విదేశాంగ మంత్రిగా సేవలు
 • 2003-05 - ఆర్థిక మంత్రిగా సేవలు, రాజీనామా
 • Dec 2005 -లికుడ్ పార్టీ నాయకుడుగా విజయం
 • 2009 - రెండోసారి ప్రధాని
 • 2013 - ప్రధానిగా తిరిగి ఎన్నిక
 • 2015 -నాలుగోసారి ప్రధాని
 • 2019 - మూడు కేసుల్లో అవినీతి ఆరోపణలు

నెతన్యాహు పాలస్తీనాతో శాంతి చర్చలకు వీలుగా వెస్ట్‌బ్యాంక్‌లో సెటిల్మెంట్ నిర్మాణాన్ని 10 నెలలు నిలిపివేయడానికి అంగీకరించారు. కానీ 2010లో ఆ చర్చలు విఫలం అయ్యాయి.

2009లో ఇజ్రాయెల్‌ పక్కనే పాలస్తీనా అనే ఒక దేశం ఉండేందుకు కొన్ని షరతులతో అంగీకరించిన నెతన్యాహు, తర్వాత దానిపై కఠిన వైఖరి అవలంబించారు. "పదేళ్ల తర్వాత ప్రజలు చెబుతున్న అలాంటి దేశాన్ని సృష్టించలేమని, అది జరగదని" అన్నారు.

Image copyright AFP

గాజాలో సంఘర్షణ

ఇజ్రాయెల్ సైనిక చర్యలకు గట్టిగా సమర్థించి, వాటికి పూర్తి మద్దతు ఇచ్చిన నెతన్యాహు, గాజా స్ట్రిప్‌లో హమాస్ నేతృత్వంలో పాలస్తీనా మిలిటెంట్లు చేసే దాడులను మాత్రం ఆపలేకపోయారు.

2012, 2014లో ఇజ్రాయెల్‌లోకి దూసుకొస్తున్న మిలిటెంట్ల రాకెట్ దాడులను ఆపడానికి ఆయన మళ్లీ సైనికులతో దాడులు చేయించారు.

ఐక్యరాజ్యసమితి, పాలస్తీనా అధికారుల లెక్కల ప్రకారం ఈ యుద్ధంలో 2100 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో పౌరులే ఎక్కువ. ఇజ్రాయెల్ వైపు 67 మంది సైనికులు, ఆరుగురు పౌరులు చనిపోయారు.

ఈ యుద్ధం సమయంలో ఇజ్రాయెల్‌కు మిత్రదేశమైన అమెరికా నుంచి మద్దతు ఉన్నప్పటికీ, అధ్యక్షుడు బరాక్ ఒబామా, నెతన్యాహు మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి.

2015 మార్చిలో అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించిన నెతన్యాహు అణు కార్యక్రమం గురించి అమెరికా ఇరాన్‌ మధ్య జరిగే చర్చలతో ఒక చెడు ఒప్పందం పుట్టుకొస్తుందని హెచ్చరించారు. దాంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఇరాన్, అమెరికా మధ్యలో జోక్యం చేసుకుని, నష్టం కలిగించారంటూ ఒబామా ప్రభుత్వం ఈ పర్యటనను ఖండించింది.

Image copyright AFP

ట్రంప్ ఒప్పందాలు

డోనల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావడం, అమెరికా, ఇజ్రాయెల్ రాజకీయాల విధానాల మధ్య సన్నిహత సంబంధాలకు కారణం అయ్యింది.

అధ్యక్షుడు అయిన ఏడాదిలోపే జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా తాము గుర్తిస్తున్నట్లు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

తర్వాత ఏడాదికే ఆక్రమిత సిరియన్ గోలన్ హైట్స్‌పై ఇజ్రాయెల్ సౌర్వభౌమత్వాన్ని గుర్తించామని ట్రంప్ చెప్పారు. దశాబ్దాల అమెరికా విధానాలను వెనక్కు నెట్టి, నెతన్యాహు ప్రశంసలు అందుకున్నారు.

తర్వాత ఈ ఇద్దరు నేతలు ఇరాన్‌పై కూడా ఒక కన్నేశారు.

అణ్వాయుధ సామర్థ్యం కూడగట్టుకునేలా ఇరాన్‌ను వదిలేయడం వల్ల అంతర్జాతీయ సమాజానికి పెను ముప్పు వాటిల్లుతుందని నెతన్యాహు పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు.

ఇరాన్ అణు ఒప్పందం నుంచి తప్పుకోవాలని, ఆర్థిక ఆంక్షలతో ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలన్న ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించారు.

వెంటాడే ఆరోపణలు

లంచం, మోసం, అవిశ్వాసం, అవినీతి ఆరోపణలు నీడలా వెంటాడుతున్న సమయంలో నెతన్యాహు ఐదోసారి ప్రధాని పదవికి పోటీపడుతున్నారు.

వీటిలో రెండు కేసులు ఉన్నాయి. ఒక కేసులో తనకు అనుకూలంగా కవరేజి ఇచ్చేందుకు మీడియా సంస్థలకు ముడుపులు ఇచ్చారనే వాదన ఉంది. మరో కేసులో రాజకీయ ప్రయోజనాలు కల్పించినందుకు ఒక హాలీవుడ్ ప్రముఖుడి నుంచి బహుమతులు అందుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నెతన్యాహు మాత్రం తాను ఎలాంటి తప్పూ చేయలేదంటున్నారు. వీటిని ప్రత్యర్థులు సృష్టిస్తున్న కట్టుకథలుగా కొట్టిపారేస్తున్నారు.

అయితే, ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని అటార్నీ జనరల్ సిఫారసు చేస్తే నెతన్యాహు రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడిపోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: ‘దిల్లీ హింసపై మాట్లాడను.. భారత్‌లో ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని మోదీ కోరుకుంటున్నారు’ - డోనల్డ్ ట్రంప్

కరోనావైరస్ - ‘మహమ్మారిగా మారకముందే ఎదుర్కోండి’ - ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

దిల్లీ హింస: సీఏఏ వ్యతిరేక హింసాత్మక ఘర్షణల్లో 10కి చేరిన మృతుల సంఖ్య

BBC Indian Sportswoman of the Year 2019: విజేత ఎవరో మార్చి 8న ప్రకటిస్తాం

దిల్లీ హింస: ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో హింసకు కారకులెవరు.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు

డయానా నుంచి ట్రంప్ వరకు: తాజ్‌‌మహల్‌ను సందర్శించిన విదేశీ ప్రముఖుల ఫొటోలు

దిల్లీ హింస: సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనలతో రాత్రంతా భయం గుప్పిట్లో...

హార్వే వైన్‌స్టీన్‌: అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యూయార్క్ కోర్టు