అఫ్గానిస్థాన్ యుద్ధంలో ప్రతిరోజూ ఎంతమంది చనిపోతున్నారో తెలుసా.... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు

  • 18 సెప్టెంబర్ 2019
తాలిబాన్లు Image copyright AFP/GETTY IMAGES

ఆగస్టు నెలలో అఫ్గానిస్థాన్‌లో రోజూ సగటున 74 మంది (పురుషులు, మహిళలు, చిన్నారులు) మరణించారని బీబీసీ పరిశోధనలో వెల్లడైంది.

18 ఏళ్ల యుద్ధం తర్వాత తాలిబాన్లతో శాంతి చర్చలకు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అర్ధంతరంగా ముగింపు పలకడం వల్ల, అఫ్గానిస్థాన్ మరింత హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని ఈ పరిశోధనా ఫలితాలు సూచిస్తున్నాయి.

అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోతే మిలిటెంట్ దాడులు మరింత పెరగొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఒక్క ఆగస్టు నెలలోనే అఫ్గాన్‌లో 611 దాడులు జరిగినట్లు బీబీసీ నిర్ధరించింది. ఆ దాడుల్లో 2,307 మంది మరణించారు. 1,948 మంది గాయపడ్డారు.

అయితే, బీబీసీ వెల్లడించిన మృతుల గణాంకాల ప్రామాణికతను తాలిబాన్ సంస్థ, అఫ్గాన్ ప్రభుత్వం రెండూ ప్రశ్నించాయి.

చనిపోయిన వారిలో ఎక్కువ మంది పోరాడేవారు ఉన్నారు. ఈ ఘర్షణల్లో ఊహించిన దానికంటే ఎక్కువ మంది తాలిబాన్లు మరణించారు. మొత్తం మృతుల్లో 5వ వంతు మంది సాధారణ పౌరులు ఉన్నారు.

అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి ఎంతగా దిగజారుతోందో ఈ సంఖ్యలు సూచిస్తున్నాయి.

తాలిబాన్లతో శాంతి చర్చలను రద్దు చేస్తున్నట్లు వారం క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

నిజానికి, ఇక్కడ కాల్పుల విరమణ ఏమీ అమలు కావడంలేదు. రోజూ ఎక్కడో ఒక చోట హింసాత్మక దాడులు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది చనిపోతూనే ఉన్నారు. ఈ నెలాఖరులో అధ్యక్ష ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆ హింస మరింత తీవ్రమవుతుందనే భయాలు ఉన్నాయి.

(ఆగస్టులో జరిగిన దాడులు, మృతుల వివరాలను బీబీసీ ఎలా సేకరించిందో తెలుసుకునేందుకు కింది వరకూ స్క్రోల్ చేయండి.)

31 రోజుల్లో మరణాలు

ఆగస్టు మొదటి వారం హింసాత్మకంగా ముగిసిన తర్వాత, ముస్లిం పండుగ ఈద్ అల్-అధా జరిగే మూడు రోజుల పాటు తాలిబాన్, ప్రభుత్వ దళాలు అనధికారికంగా కాల్పుల విరమణను పాటించాయి.

కానీ, ఆ సెలవు రోజుల్లో ఆగస్టు 10 సాయంత్రం నుంచి ఆగస్టు 13 సూర్యాస్తమయం వరకు జరిగిన హింసాత్మక ఘటనల్లో 90 మంది మరణించినట్లు బీబీసీ పరిశీలనలో వెల్లడైంది.

ఆగస్టు 27న అత్యధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఆ రోజు 162 మంది మరణించారు, 47 మంది గాయపడ్డారు. వైమానిక దాడులలో ఎక్కువగా తాలిబాన్ మిలిటెంట్లు చనిపోయారు.

చిత్రం శీర్షిక వివాహ కార్యక్రమంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 92 మంది ప్రాణాలు కోల్పోయారు, 142 మంది గాయపడ్డారు

పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి

ఆగస్టు 18న 112 మంది ప్రాణాలు కోల్పోయారు. కాబూల్‌లో ఓ వివాహ కార్యక్రమంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 92 మంది మృతి చెందగా, 142 మంది గాయపడ్డారు.

తన జీవితంలో అత్యంత సంతోషకరంగా గడవాల్సిన ఆ రోజున, వరుడు మిర్వాయిస్ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టాల్సి వచ్చింది.

ఆ దాడిలో ఆయన చాలా మంది ఆప్తులను కోల్పోయారు. నవ వధువు కజిన్‌, సోదరుడు చనిపోయారు.

"నా ఆశలు, ఆనందాలన్నీ ఒక్క సెకనులో నాశనమయ్యాయి. నా పెళ్లి దుస్తులను, ఫోటో ఆల్బమ్‌ను ఇప్పుడు కాల్చివేయాలని అనిపిస్తోంది" మిర్వాయిస్ అన్నారు.

ఆ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తెలిపింది.

చిత్రం శీర్షిక అఫ్గానిస్థాన్‌లో సామాన్య పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీబీసీ పరిశోధనలో తేలింది

ఎవరు ఎక్కువ ప్రభావితం అయ్యారు?

గతంతో పోలిస్తే, 2001 తర్వాత తాలిబాన్లు బలహీనపడ్డారు. కానీ, ఆగస్టులో బీబీసీ ధృవీకరించిన మరణాలలో దాదాపు సగం వరకు తాలిబాన్లే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం.

దీనికి అనేక కారణాలు ఉండవచ్చు.

శాంతి చర్చల సమయంలోనూ తాలిబాన్లు హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. అందుకు ప్రతిస్పందనగా అమెరికా నేతృత్వంలోని దళాలు వైమానిక దాడులు, లక్ష్యిత దాడులను పెంచాయి. ఆ దాడుల్లో అనేక మంది తాలిబాన్లతో పాటు సాధారణ పౌరులు కూడా మరణించారు.

ఇటీవలి ఏళ్లలో ఎంతమంది తాలిబాన్లు మరణించారో తెలిపే పూర్తి గణాంకాలు లేవు. ప్రస్తుతం ఆ సంస్థలో 30,000 మంది దాకా సాయుధులు ఉండవచ్చని అంచనా.

గత నెలలో 1,000 మంది తాలిబాన్లు చనిపోయారని చెప్పడం "నిరాధారం" అంటూ తాలిబాన్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. "అంత భారీ స్థాయిలో ప్రాణనష్టం" జరిగినట్లు నిరూపించే ఆధారం ఏదీ లేదని వ్యాఖ్యానించింది.

"అఫ్గానిస్థాన్ ప్రభుత్వ అంతర్గత, రక్షణ మంత్రిత్వ శాఖల రోజువారీ ప్రచారం ఆధారంగా" బీబీసీ ఈ నివేదికను తయారు చేసిందని తాలిబాన్ ఆరోపించింది.

అఫ్గానిస్థాన్ ప్రభుత్వ భద్రతా సిబ్బంది మరణాల వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. కాబట్టి ఆగస్టులో మేము ధృవీకరించిన మరణాల సంఖ్య, వాస్తవ సంఖ్య కంటే తక్కువగా ఉండవచ్చు.

2014 నుంచి 45,000 మంది భద్రతా సిబ్బంది చనిపోయారని ఈ ఏడాది జనవరిలో అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ చెప్పారు.

బీబీసీ వెల్లడించిన వివరాలపై అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. "ఈ విషయంలో మరింత కచ్చితమైన సమీక్ష అవసరమని, క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా లోతైన పరిశోధన జరగాలి" అని పేర్కొంది.

ఆగస్టులో 473 మంది పౌరులు మరణించారని, 786 మంది గాయపడ్డారని బీబీసీ ధృవీకరించింది.

"ఈ హింసాత్మక ఘర్షణలు పౌరుల జీవనంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి" అని అఫ్గానిస్థాన్‌లోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు ఫియోనా ఫ్రేజర్ అన్నారు.

"సాయుధ పోరాటంలో ఎక్కడా లేనంత భారీ సంఖ్యలో సామాన్య పౌరులు అఫ్గానిస్థాన్‌లో మరణించారు/ గాయపడ్డారు" అని ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.

అయితే, అఫ్గానిస్థాన్‌లో పౌరుల మరణాల వివరాలను అమెరికా, అఫ్గాన్ దళాలు వెల్లడించడంలేదు.

అఫ్గానిస్తాన్ అంతటా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. మొత్తం 34 ప్రావిన్సులు ఉండగా, మూడింటిలో మాత్రమే ఆగస్టు నెలలో మరణాల సంఖ్యను బీబీసీ నిర్ధరించలేకపోయింది.

ఏ ప్రావిన్సులో ఎంతమంది చనిపోయారు?

ప్రతి 10 మరణాలలో ఒకటి ఘాజ్నీ ప్రావిన్సులో నమోదైంది. ఇది తాలిబాన్లకు ప్రధాన కేంద్రం. అఫ్గాన్ దళాల ప్రధాన లక్ష్యాలలో ఈ ప్రాంతం ఒకటి.

ఘాజ్నీలో 66 దాడులు జరగ్గా, అందులో 20కి పైగా తాలిబాన్ల నుమానిత స్థావరాలను లక్ష్యంగా జరిగిన వైమానిక దాడులే.

అత్యంత భయానక వాతావరణంలో, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోందని అఫ్గాన్ పౌరులు అంటున్నారు.

కందహార్ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడు తన సోదరుడి భుజం నుంచి బుల్లెట్‌ను బయటకు తీసిన తరువాత బీబీసీతో మాట్లాడారు.

"మా ప్రాంతంలో సైనిక ఆపరేషన్ జరిగినప్పుడల్లా, సాధారణ ప్రజలు బయటకు వెళ్లలేరు. ఎవరైనా వెళ్తే అమెరికన్, అఫ్గాన్ దళాలు కాల్చి చంపేస్తాయి" అని ఆయన చెప్పారు.

"వారికి నచ్చిన చోట బాంబులు వేస్తారు. మా చుట్టూ ఉన్న ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి." అని ఆయన తెలిపారు.

ప్రపంచంలో అత్యంత భయానక యుద్ధం ఇదేనా?

నాలుగు దశాబ్దాలుగా అఫ్గానిస్థాన్ యుద్ధం కొనసాగుతోంది. దాని వల్ల అనేక ఏళ్లుగా ప్రతిష్టంభన నెలకొంది.

మరణాల విషయంలో చూస్తే, ప్రపంచంలో అత్యంత భయానకమైన సంఘర్షణ ఇదేనని గతేడాది ఆర్మ్‌డ్ కాన్‌ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ప్రాజెక్టు పేర్కొంది.

2019లో నమోదైన మరణాల సంఖ్యను చూస్తుంటే ఆ విషయం నిజమే అనిపిస్తోంది. ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆగస్టులో అఫ్గానిస్థాన్‌లో నమోదైన మరణాల సంఖ్య సిరియా, యెమెన్ దేశాల కంటే మూడు రెట్లు ఎక్కువ.

ప్రపంచంలో ప్రశాంతత అత్యల్పంగా ఉన్న దేశం ఇదేనని జూన్ 2019లో, గ్లోబల్ పీస్ ఇండెక్స్‌ నివేదిక పేర్కొంది.

బీబీసీ ఈ వివరాలను ఎలా సేకరించింది?

ఆగస్టు 1 నుంచి 31 వరకు అఫ్గానిస్థాన్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి 1,200కి పైగా నివేదికలను బీబీసీ సేకరించింది.

మీడియాలో రాని ఘటనలు మొదలుకుని, పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా వచ్చిన భీకర దాడుల వరకూ... అన్నింటినీ బీబీసీ అఫ్గాన్ ప్రతినిధులు గుర్తించారు.

వాటిని ధ్రువీకరించేందుకు, అనుమానాలను ఛేదించేందుకు ప్రభుత్వ అధికారులను, ఆరోగ్య కార్యకర్తలను, గిరిజన గ్రామాల పెద్దలను, స్థానికులను, ప్రత్యక్ష సాక్షులతో బీబీసీ రిపోర్టర్లు మాట్లాడారు. ఆస్పత్రుల రికార్డులను పరిశీలించారు. తాలిబాన్ విడుదల చేసిన సమాచారాన్ని సేకరించారు.

ఒక సంఘటనను నిర్ధరించేందుకు కనీసం రెండు నమ్మదగిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్నాం. ఆస్పత్రుల రికార్డుల ఆధారంగా కొంతమేరకు మృతుల సంఖ్యను రెండో ఆధారం లేకుండానే ధ్రువీకరించాం.

అయితే, మృతుల సంఖ్యలో కనీస సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాం. అంటే, ఉదాహరణకు ఒక దాడిలో 10 నుంచి 12 మంది చనిపోయారని నివేదికల్లో పేర్కొంటే, మేము 10ని మాత్రమే అత్యంత నమ్మదగిన సంఖ్యగా పరిగణించాం.

ఒక సంఘటనకు సంబంధించిన నివేదికల్లో వేర్వేరు ఆధారాలు, పరస్పర విరుద్ధమైన అంకెలు కనిపిస్తే, అందులో కనీస సంఖ్యను మాత్రమే విశ్వసనీయమైనదిగా పరిగణించాం.

మృతుల సంఖ్యలో అస్పష్టత, విరుద్ధ అంకెలు చూపించిన కొన్ని వందల నివేదికలను పరిగణనలోకి తీసుకోలేదు. కాబట్టి, మొత్తం దాడుల సంఖ్య, మృతుల సంఖ్య బీబీసీ వెల్లడించిన దానికంటే చాలా ఎక్కువగా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాంలో ఆందోళనలు, గువాహటిలో కర్ఫ్యూ, 10 జిల్లాల్లో ఇంటర్‌నెట్ నిలిపివేత

‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’

రోహింజ్యాల మారణహోమం ఆరోపణలు అవాస్తవం.. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆంగ్ సాన్ సూచీ

పౌరసత్వ సవరణ బిల్లు: రాజ్యసభలో బీజేపీ సమీకరణలను శివసేన మార్చగలదా?

అభిప్రాయం: 'పౌరసత్వ బిల్లును పార్టీలు జాతీయ భద్రత, మానవీయ కోణంలో చూడాలి'

బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ ప్రస్తావన ఎందుకు వస్తోంది... మతం ప్రధానాంశంగా ఎలా మారింది?

బాలికపై అత్యాచారం: డబ్బు కోసం కూతురిని రెండేళ్ళుగా రేప్ చేయించిన తండ్రి